[dropcap]కొ[/dropcap]న్ని రాత్రులూ
కొన్ని ఉదయాలూ కూడా
ఎందుకిలా ప్రశ్నలు గా మారిపోతాయి
రాత్రులెందుకు నిజాలై దుఃఖిస్తాయి
పగళ్ళెందుకు అబద్ధాలై నవ్వుతాయి
వుండుండి గుండె ఎందుకు
భూకంపమై వులికి పడుతుంది
అలరించి ఓలలాడించిన
సముద్రమెందుకు కలవరపడి
కల్లోలమై భయపెడుతుంది
ఓదార్చాల్సిన మాట
కఠిన కరవాలమై
గాయమెందుకు చేస్తుంది
వెనకాతల వక్రించిన నవ్వు
కాళీయుడై విషాన్నెందుకు చిమ్ముతుంది
చుట్టపుచూపుగా వచ్చిన శ్వాస
ఆకాశమై ఎందుకు మరలిపోతుంది
కొన్ని సాధారణ విషయాలూ
ఇలా ప్రశ్నలు గానే ఎలా మిగిలిపోతాయి