[box type=’note’ fontsize=’16’] “ఎక్కడేం జరిగినా స్పందించకుండా మౌనంగా ఊరుకుంటే జరుగుతున్న అక్రమాలు ఆగిపోతాయా? అలా అంతా అనుకుంటే మన సామజిక బాధ్యత ఏమయినట్టు?” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి “రంగుల హేల” కాలమ్‌లో. [/box]
చెడు అనవద్దు… చెడు వినవద్దు… చెడు కనవద్దు.
పై మాట విన్నప్పుడు ఆశ్చర్యం వేసేది. చెడు చెయ్యొద్దు అంటే అర్థం ఉంది కానీ, అనకూడదు, వినకూడదు, చూడకూడదు అంటే ఎలా కుదురుతుంది? టూ మచ్. గాంధీ గారిది బొత్తిగా చాదస్తం! ఆయన భావం మనకి అందదు లెద్దూ! అని ఊరుకున్నా. ఆ కొటేషన్ రాసి ఉన్న బోర్డు ఎలాగో దేవుడి పూజ గదిలో చేరింది నా ప్రమేయం లేకుండానే. మహానుభావులు చెప్పే విషయాలు సామాన్య నేత్రాలు గల సగటు మానవులకు అందదు. మహాత్ములైనవారు అనుభవసారంతో రంగరించి సుభాషితాలు చెబుతారు. మనకి కూడా ఒక రోజొస్తుంది. అనుభవంతో వివరం వచ్చే రోజు. లేదా కనీసం మీమాంస ఏర్పడే రోజు. ఎలాగంటారా? ఇదిగో ఇలాగ.
దేశకాల పరిస్థితుల్ని గమనిస్తూ, ఆడపిల్లలకి రక్షణ లేదు, అంచేత జాగ్రత్తగా ఉండాలి అని రోజూ మనల్ని మనం అలెర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇంతలోనే మరొక దారుణం జరిగింది. దిశ హత్యోదంతం. వినగానే గజ గజ వణికిపోయాం మనమందరం. గుండెలు పిండేసినట్టయ్యింది. ఆ తర్వాత విపరీతమైన బాధ, ఎవరో పేగులు మెలిపెట్టినట్టు. దుఃఖం ఆగలేదు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. మర్నాటినుంచీ ఆ సంఘటనకు సంబంధించిన వార్తలు అన్ని ఛానళ్లలో వింటున్న నా మనసులో ఒక బాధ, నిస్సహాయత ముప్పిరిగొన్నాయి. ఆ అమ్మాయికి జరిగిన అవమానం, నష్టం ఆమెది మాత్రమే కాదు. మొత్తం మానవ జాతికే అవమానం జరిగింది. ఆ పిల్ల వెంటనే చనిపోయింది. జీవితమే పోగొట్టుకుంది. ఇప్పుడు వేదన మనది. ఆ రాక్షసులకు వెంటనే శిక్ష పడాలి. అసలు ఆ నలుగురు కుర్రాళ్ళు దొరుకుతారా? వాళ్లపై కేసు పెడితే ఎప్పటికి తేలేను? ఈ పోలీస్‌లు వాళ్ళు చేసిన నేరం అసలు నిరూపించగలరా? అన్న తీవ్ర ఆవేదన నాలో.
రోజూ టీవీ ముందు కూర్చుని ఈ దుర్ఘటనకి సంబంధించిన వార్తలు చూసీ చూసీ మనసులో ఒక కసి, ప్రతీకారేచ్ఛ బయలు దేరింది. నిర్భయ చట్టం తెచ్చి ఏం లాభం? అలాంటి కేసు మళ్ళీ జరిగిందే! అన్న దుఃఖం ఆగట్లేదు. ఏ దేవుడైనా వచ్చి ఆ దుర్మార్గులను హతమారిస్తే ఎంత బావుండునో కదా అన్న ఆక్రోశం నిరంతరం వెంటాడేది. ఒక వారం రోజులు దాటింది. ఈ సంఘటనా గాయం అందరి మనసుల్లో నిత్యాగ్నిలా రగులుతూనే ఉంది.
ఒక రోజు ఉదయమే వార్త తెచ్చింది హెల్పర్. ఆ తెల్లవారు జామునే ఆ రాక్షసుల్ని నలుగురినీ సంఘటనా స్థలం లోనే ఎన్‌కౌంటర్ చేసారని. భగవంతుడు నా మొర ఆలకించి తక్షణమే దుష్ట శిక్షణ చేసినట్టనిపించింది. ఆనందంతో నేను సేమ్యా పాయసం చేసాను. ఎందరితోనో ఫోన్లు చేసి సంతోషం పంచుకున్నాను. అవునా? అంటూ వాళ్ళు కూడా సంతోషపడ్డారు. తర్వాత స్నానం చేసి దేవుని ముందు కూర్చుని పూజ చేస్తుంటే అక్కడ ఉన్న చెడును గురించిన మూడు వాక్యాలూ చదవగానే ఏదో తెలీని భావం కలిగింది. అదేమిటో అర్థం కాలేదు. మనసులోంచి జారిపోయింది. నోటిలో స్తోత్రాలు ఉండడంతో.
ఆ రోజు రాత్రి ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం నుంచీ నేను ఆనందంగా ఉన్న కారణం ఓ నలుగురు యువకులు ఆ పిల్లపై దారుణం చేసిన సంఘటనా స్థలంలోనే చంపబడడమా? వాళ్ళెంతో ఘోర కృత్యం చేసి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి తగులబెట్టి ఆ పిల్ల తల్లితండ్రులకు తీరని దుఃఖం మిగిల్చిన మాట నిజమయినా, పాపం! ఆ కుర్రాళ్ళు కూడా ఒక అమ్మ కన్నబిడ్డలే కదా! వారి తల్లితండ్రులు, పెళ్ళయితే, భార్యా పిల్లలూ ఎంత బాధ పడుతున్నారో! నేను చెడును చూసి, విని వ్యథ చెంది మనసులో చెడును కోరానా? నేనలా అనుకోవడం సహజమే! తప్పేం కాదులే అనుకుంటూ నిద్రపోయా.
నిత్యం మనం ఉదయ కాఫీ తాగి చదివే వార్తాపత్రికల్లోని సిటీ ఎడిషన్‌లో తప్పకుండా మందు మైకంలో ఉన్న భర్త చేత చంపబడిన లేదా హింస పడుతున్నస్త్రీల కష్టాలుంటాయి. రెండో పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసిన భర్తలూ, తాగి పడుకుని సంసారాన్ని పోషించడం మానేసి ఆమె ఎక్కడో ఇళ్లలో పనిచేసి తెస్తుంటే డబ్బుకి వేధిస్తూ ఆమెను తిట్టి కొడుతున్న వాళ్ళూ తప్పకుండా ఉంటారు. ఇలాంటి మగవాళ్ళందర్నీ వరసపెట్టి అరెస్ట్ చేసి ఓ పేద్ద జైలు కట్టించి అందులో పడేసి వాళ్ళ చేత నిత్యం రాళ్లు కొట్టించాలి అనుకుంటాన్నేను.
ఓ మంచి రోజున పొద్దున్నే దిన పత్రిక చదువుతున్న నాకు ఓ తియ్యని వార్త కనబడింది. భర్తను కిరోసిన్ పోసి తగులబెట్టిన భార్య. అది చదవగానే వెర్రి ఆనందం కలిగింది. మంచి పని చేసింది. ఇలా ఓ నలుగురు చేస్తే తాగి ఇంటికొచ్చే మగాళ్ళకి భయం వస్తుంది. ఈ వార్త మా ఫ్రెండ్‌కి చెప్పి మురిసిపోయాను. ఆవిడ కాస్త పెద్దావిడ. భక్తురాలు. నా మాటల కామె సంతోష పడలేదు. నేనింకా వార్తల వివరాలలోకి వెళ్లిపోతుంటే ఆవిడ ఆపి “నేనిచ్చిన ఆ గీతాసారం పుస్తకం ఎన్ని పేజీలు చదివారు?” అంటూ మాట తప్పించింది. “ఆ! సగం చదివానండీ! మీరెలా ఉన్నారు? అంకుల్ ఎలా ఎన్నారు?” అని ఓ రెండు కబుర్లు చెప్పి పెట్టేసాను ఫోన్.
తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది నేనేదో చెబుతుంటే ఆవిడ టాపిక్ మార్చిందేవిటి? ‘అవునుమరి. ఆవిడకి దేవుడి దయ ఉంది. మృదు హృదయ. ఈ చంపడాలూ, చచ్చడాలూ వింటే ఆవిడ చెవులు నొచ్చుకుంటాయి. భర్తను చంపిన భార్య ఉదంతం మీద ఆవిడకు ఆసక్తి లేదు. ఎందుకుంటుంది? బుద్దుడిలాంటి మొగుడున్నాడు ఆవిడకి. లోకంలో భర్తలంతా అలాగే ఉన్నారనుకుంటుంది. పేపర్ చదవదు. టీవీ చూడదు’ అనుకుంటూ పనిలో పడ్డాను కానీ మనసు చిన్నబోతూనే ఉంది నేనావిడకి ఆనందంగా ఫోన్ చెయ్యడం ఆవిడ దాన్ని గురించి స్పందించకపోవడమూ గుర్తొచ్చినప్పుడల్లా.
ఒక రాష్ట్ర మంత్రిగారు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకుడిపై కోపం ఆపుకోలేక “అతనికి కరోనా రావాలని కోరుకుంటున్నా” అన్నాడు ఆవేశంగా. ఈ వార్త ఓ వందసార్లు రిపీట్ అయ్యింది అన్ని ఛానళ్లలోనూ. నూట ఒకటో సారి వింటూనే నాకు వళ్ళుమండి “నీకు రావాలయ్యా మంత్రి గారూ ఆ కరోనా ఏదో! ప్రతిపక్షం వారు విమర్శించకుండా నిన్ను పొగడాలా? నువ్వు ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షాన్ని ఒక్కసారైనా పొగిడావా?” అన్నాను ఆవేశంగా, అందరికీ డైనింగ్ టేబుల్ మీద భోజనాలు వడ్డిస్తూ. నా రియాక్షన్ చూసి ఇంట్లో వాళ్ళు విచిత్రంగా చూసారు నా వైపు. నేను పక్క చూపు చూసి ఊరుకున్నాను, నేను తప్పేమీ మాట్లాడలేదే ? అనుకుంటూ.
మర్నాడే నేను దీవించినట్టుగానే ఆ రాష్ట్ర మంత్రి గారికి కరోనా అని హెడ్ లైన్స్‌లో వార్త వచ్చింది. నేను చిన్న పిల్లలా గెంతి “చూసారా ? నేను పెట్టిన శాపం ఫలించింది.” అన్నా ఆనందంగా. ఎవ్వరూ మాట్లాడలేదు ఇంట్లో. మౌనస్వాముల్లా నావైపు చూసి ఊరుకున్నారు. ‘వాళ్ళ మొహం! నేను రోజంతా ఇంట్లో ఉండి రాజకీయ వార్తలు విని, విని నాకు కడుపు రగులుతుంది. వాళ్ళకేమిటి? రోజంతా బైట తిరిగి వచ్చి ఏ భోజనం చేసేప్పుడో ఓ చెవి వేసి వింటారు.అందుకే వార్తల తీవ్రత వీళ్ళకి అర్థం కాదు. మరందుకే ఫీల్ కూడా అవ్వరు’ అనుకుని సరిపెట్టుకుని ఊరుకున్నాను.
రోజంతా మనసును బాధపెట్టే వార్తలు టీవీలో చూసి, పేపర్లలో చదివి, బంధుమిత్రుల నుంచి వినడం వల్ల అసహనం కలుగుతోంది. అది క్రమక్రమంగా ప్రతీకారం దిశగా ఆలోచిస్తోంది. ఇతరులకి అన్యాయం చేసిన వాళ్ళకి ఏదైనా జరిగితే “ జైసే కో తైసా” అనుకుని ఆనంద పడడం, అప్పుడప్పుడూ ఏం కర్మ, తరచుగానే ఏవో పరుష వాక్యాలు కూడా మాట్లాడడం నాకు ఒకింత ఊరటగా ఉంటోంది.
ఒకోసారి ఈ థియరీ వికటిస్తొంది. మా వీధిలోనే ఒక భూకబ్జా దారుడయిన ఒక రౌడీ రాజకీయ నాయకుడు ఉన్నాడు. కోట్లు సంపాదించాడు. ఎందరికో ఎన్నో విషయాల్లో అన్యాయం చేసాడు. తనని విమర్శించిన వాళ్లపై కేసులు పెట్టించి జైల్లో పడేయించాడు. విర్రవీగాడు. ఉన్నట్టుండి అతనికి పెద్ద అనారోగ్యం వచ్చింది. ఇండియాలో వైద్యం లేదన్నారు. మా వీధిలో వాళ్లమంతా కెవ్వు కేక అనేస్కుని కేకులు పంచుకున్నాం.
‘బాగా అయ్యింది. అతనికంత దౌర్జన్యం, అహంకారం, గర్వం ఎందుకు? దేవుడెక్కడో లేదు అన్నీ చూస్తూనే ఉంటాడు.తగిన శిక్ష పడింది’ అనుకున్నామందరం. అయితే ఆయన అమెరికా వెళ్లి వైద్యం చేయించుకుని వచ్చాడు. తనకొచ్చిన అనారోగ్యకష్టం నుంచి హాయిగా బైటపడిపోయాడు. చాలా అమాయకుడయిన మా ఎదురింటి మాస్టారి ఇంట్లో దొంగలు పడి కొత్తగా పెళ్లయిన కూతురి మెడలో ఉన్న కొద్ది బంగారం, వెండీ ఎత్తుకుపోయారు. అందరమూ అవాక్కయ్యాం. మా పక్క ఫ్లాట్ ఓనర్ తల్లిగారు “భగవంతుని లీల మనకి అందదర్రా!మనం వ్యాఖ్యానం చెయ్యతగం. జరుగుతున్నది చూస్తూ ఉండడమే మనం చెయ్యగల పని” అని వాక్రుచ్చారు. మేమంతా కోపంతో మౌనం పాటించాం.
చెడు వినడం వల్ల మన మనసు దుఃఖపడి, ఇతరులకి అపకారం చేసిన వాళ్ళకి తిరిగి అదే చెడు జరగాలని కోరుతున్నాం. చెడు చూడడం వల్ల బాధ కలిగి ఆ హాని జరిగిన బాధితులపై సానుభూతి పెరిగి వారిని హింసించిన వారికి హాని జరగాలని కోరుతున్నాం. ఈవిషయాలు పదే పదే మనం పలకడంతో చెడు అన్నివైపులకూ ఒక వ్యతిరేక శక్తిగా వ్యాపిస్తుంది తప్ప అనుకున్న ఫలితం ఉండదేమో! మనం వింటున్న, చూస్తున్న దుర్మార్గం మన నోటివెంట తిరిగి దుర్మార్గంగా బైటికి వస్తోంది. మూడు కోతుల నీతిసూత్రం ఇదేనా? ఏమిటి కొంపతీసి !
అలా అని ఎక్కడేం జరిగినా స్పందించకుండా మౌనంగా ఊరుకుంటే జరుగుతున్న అక్రమాలు ఆగిపోతాయా? అలా అంతా అనుకుంటే మన సామజిక బాధ్యత ఏమయినట్టు? మనం సంఘజీవులం కాదా? తోటివారికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి దాన్ని ఎదిరించవలసిన అవసరం లేదా? కవిత్వాలూ, శాపనార్థాలూ కూడా పోరాటంలో భాగమే కదా! దుష్ట సంహారం చేసిందనే కదా దుర్గాదేవిని విజయదశమి రోజు కొలుచుకుంటున్నది? మరి మన కర్తవ్యం ఏమిటి?
ఈ కలియుగంలో ఒక గొప్ప వెసులుబాటు ఉందట. నేను ఓ ఛానల్ లో ఓ పండితుడు చెబుతుంటే విన్నాను. ఈ యుగంలో ఇప్పుడు, ఇక్కడ ధర్మం ఒక్క పాదం తోనే నడుస్తోంది కాబట్టి కొంచెం మంచి చేసినా మన ఖాతాలో ఎక్కువ పుణ్యం పడుతుందట. అసలు మంచి చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే చాలట, చెయ్యకపోయినా చేసినంత పుణ్యమట. మరి చుట్టుపక్కల జరిగే ఘాతుకాలు చూడలేక మనం నోటితో అందరికీ చెడు జరగాలని శాపనార్ధాలు పెడుతుంటే కొంపతీసి మన ఖాతాలో పాపం పడిపోతుందేమో ఆలోచించండి మిత్రులారా! తస్మాత్ జాగ్రత్త !ఈసారి పురాణ ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆ పెద్దాయన్నిఈ మాట అడుగుతా. అందాకా లెటజ్ కంట్రోల్…కంట్రోల్…కంట్రోల్…అవర్ టంగ్స్! సమ్‌ఝే!