కథాంశం ముఖ్యమే కానీ కథ వ్యాసం కాదు : “మసాలా స్టెప్స్”

1
3

ఈ సంవత్సరమే తీసిన ఓ లఘు చిత్రం masaalaa steps. ముంబై లాంటి పట్టణంలో వో జంట గురించిన కథ. పరేష్ (విక్రం కొచ్చార్), అనురాధ (ప్రకృతి మిశ్రా) లు భార్యా భర్తలు. పరేష్ తెల్లారే మెట్రో లో బయలుదేరుతాడు. ఉదాసీనంగా ముఖం. ఫోన్ వస్తుంది. ఏదో సర్ది చెబుతాడు, కొంత సమయం ఇవ్వగలిగితే మంచిదంటాడు. రాత్రి ఖాళీ మెట్రోలో, అంటే చాలా ఆలస్యంగా అయివుండాలి, ఇంటికి వెళ్తాడు. తలుపు తీయగానే చికెన్ తెచ్చారా అని అడుగుతుంది. సంచి బల్ల మీద పెడతాడు. ఆమె వంటకాల గురించి మాట్లాడుతోంది. అతను ఆసక్తి చూపడు. మర్నాడు లేవగానే పేపర్ తీస్తాడు. మొదటి పేజీలోని ముఖ్య వార్త స్టాక్ మార్కెట్ పతనం గురించి. పేపర్ ను గిరాటేసి లేస్తాడు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఆమె అంటుంది, బయటికెళ్ళి చాన్నాళ్ళయ్యింది, ఈ వారాంతానికి ఎక్కడికన్నా వెళ్దామా అని. అతను చప్పున లేచి బయలుదేరుతాడు. టిఫిన్ చేయమంటే, బయట ఏమన్నా తింటానంటాడు. రోడ్డు మలుపులో బండి దగ్గర వడా పావ్ తీసుకుంటాడు. డబ్బులు చెల్లించాక కెమెరా పర్సు ఖాళీగా వున్నట్టు చూపుతుంది. వడా పావ్ కూడా అందరికీ అందుబాటులో వుండే టిఫిన్. ఖాళీ పర్సు, ఉదాసీనంగా ముఖం, పేపర్ లో వార్త అన్నీ అతని పరిస్థితి ని సూచిస్తాయి. తింటున్నప్పుడే ఆమె ఫోన్ చేస్తుంది. సాయంత్రం బంగాళ దుంపలూ, బన్నులూ తెమ్మంటుంది. ఎందుకంటాడు. సరిగ్గా అయిదేళ్ళ క్రితం వారు కలిసినపుడు అతను ఆమెకు తొలిసారిగా తినిపించింది వడా పావ్ నే. అప్పుడు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు కాని చాలా ఆత్మ విశ్వాసం వుంది. అయిదేళ్ళ తర్వాత అతని దగ్గర కావలసినవి అన్నీ వున్నాయి అంటుంది. వడా పావ్ ని సగం తిని వదిలేస్తాడు. రాత్రి ఇల్లు చేరేసరికి ఆమె అడుగుతుంది చెప్పినవి తెచ్చారా అని. సంచిని గిరాటేసి కసురుకుంటాడు : ఎప్పుడూ తిండి గురించేనా, నాకు తినాలని లేదు, నువ్వే తిను అని గదిలోకెళ్ళి తలుపేసుకుంటాడు. మర్నాడు తొందరగా ఇల్లు వదిలి వెళ్తాడు. ఆమె ఫోన్ చేసి కొన్ని మసాలాలు కావాలి, ఫోన్ లో లిస్ట్ పంపిస్తాను తెస్తారా అంటుంది. నువ్వే తెచ్చుకో, నాకు రావడానికి ఆలస్యమవుతుంది అంటాడు.

ఇప్పుడతని ఫోన్ స్విచాఫ్ లో వుంది. అప్పులవాళ్ళ గోల. బెదిరింపులు. భార్య ఫోన్ చేసినా స్విచాఫ్ రావడం తో ఆమె కంగారు పడుతుంది. అతని స్నేహితులతో ఫోన్ చేసి మాట్లాడుతుంది, చూసారా అని. అటు అతను డాబా మీంచి దూకాలనీ, ట్రైన్ నుంచి దూకాలనీ రకరకాలు గా ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తుంటాడు. మూడోసారి మరీనా బీచ్ దగ్గర ఆత్మహత్యా ప్రయత్నం చేయబోతే వెనక నుంచి వినిపిస్తుంది: ముందు అడుగు వేయకు, జాగ్రత్త అని. వెనుతిరిగి చూస్తే ఓ దొమ్మరి పిల్ల తాడు మీద నడుస్తూ వుంటే, కింద నిలబడ్డ అతను ఆమెనుద్దేశించి అన్న మాటలవి. ఇక్కడి దాకా కథ వుంది.
దీని తర్వాత అంతా వ్యాసం. ఆ దొమ్మరి అతను జనాంతికంగా చెప్పడం మొదలు పెడతాడు. జీవితం మీద లెక్చర్లు దంచుతాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇంటి దగ్గర మన వాళ్ళు ఉన్నారు వాళ్ళను గమనలో ఉంచుకుని నడవాలి వగైరా. అంతే కనువిప్పు కలిగి పరేష్ అతన్ని కౌగిలించుకుని కృతజ్ఞతలు చెబుతాడు. ఇంటికి చేరగానే బెంగగా అతని గురించే ఎదురు చూస్తున్న అనూ అతన్ని కౌగిలించుకుంటుంది. ఆ మర్నాడు ఇద్దరూ ఆ రోప్ వాక్ చూడటానికి వెళ్తారు. అక్కడ తమ మధ్య వున్న communication gap గురించీ మాట్లాడుకుంటారు. ఆ వ్యాసంలో ఒక్క మాట నచ్చింది. ఎప్పుడు చూడు తిండి గురించి, ఆ మసాలా తీసుకురా ఇది తీసుకురా అని ఫోన్ చేస్తావని అతనంటే, మసాలాలు కేవలం వంక మాత్రమే నీతో మాట్లాడాలని కాదా ఫోన్ చేసింది,నువ్వు మాత్రం ఏం మాట్లాడవు అంటుంది ఆమె.

సరే, నీతి బాగుంది. చిన్నపిల్లలకు చెప్పే కథ కాదు కదా. సినిమా అంటే దృశ్యపరంగా కథను చెప్పాలి, మనకొక సినేమేటిక్ అనుభూతినివ్వాలి. లెక్చర్లు పెట్టేస్తే ఎట్లా. అది బధ్ధకమైనా అయి వుండాలి, లేదా సృజనాత్మకత దర్శకుడిలో లోపించి వుండాలి. మొదటి అయిదు నిముషాలు మాత్రం బాగుంది. తర్వాతి పావు గంటే! తెర మీద దృశ్యాలతో ఒక మూడ్ ను క్రియేట్ చేయాలి. అతను ఆత్మ హత్య గురించి ఆలోచిస్తూ వుంటాడు, ఆమె అతని గురించి బెంగ పెట్టుకుంటూ వుంటుంది అప్పుడు నేపథ్యంలో లెక్చర్ల పాట. అదీ బాగుండదు. చివర్లో కూడా మారో పాట. ఎందుకు? రెండు పొడవైన లెక్చర్లతో బుధ్ధి వచ్చేసిందిగా చూసేవాడికి!
చిత్రంలో బాగున్నదల్లా విక్రం కొచ్చార్ నటన. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ రోహిత్ గుప్తా వే. చెప్పడానికి ఏమీ లేదు. ఈ చిత్రం ఎందుకు చూడాలంటే, లఘు చిత్రం తీస్తే ఇలా తీయకూడదు అని తెలుసుకోవడానికి.


లింక్:
https://youtu.be/24Db-vgCsDE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here