99 సెకన్ల కథ-23

3
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. పద్దూ కమ్యూనికేషన్లు!

అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి.

ఈ సారి టోర్నమెంట్స్ ఫైనల్సుకి చాలా కతర్నాక్ అంపైర్లు వస్తున్నారని తెలిసింది.

అంతే! అప్పటికే ఆ ఏడాది జిల్లాలోనే రెండు టోర్నమెంట్స్‌లో దెబ్బ తిని వున్న సూర్యం టీం ఈ సారి ఎలాగైనా అంతర్ జిల్లాల కప్ కొట్టి తీరాలని బీర్ కొట్టినంత సులువుగా తీర్మానించుకున్నాయి.

ఆటగాళ్ళల్లో స్ఫూర్తి నింపాలనుకున్నాడు సూర్యం. తాను పశువుల డాక్టర్ కాబట్టి, ఆ ఆటగాళ్ళ కోసం డాక్టర్ బి.వి.పట్టాభిరాంని ఆహ్వానించాడు. ఆయన వచ్చి ఆటగాళ్ళకు వుండాల్సిన స్పిరిట్ కేవలం ‘సాయంత్రాల స్పిరిట్’ కాదనీ, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా సరైన క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారనీ.. ఇలా చాలా స్పిరిట్‌ని ఆ టీములో నింపారు. ముఖ్యంగా కమ్యూనికేషన్లు చాలా ముఖ్యం అనీ, అందులోనూ ఔచిత్యాన్ని పాటించటం ఇంకా ముఖ్యమనీ బాగా నూరిపోశారు.

టోర్నమెంట్ ఇంక మూడు రోజులే వుంది. … టీములో పన్నెండో ఆటగాడు పద్మనాభం. డబ్బులు బాగా వున్నాయని, ఆట రాకపోయినా పన్నెండో జాగా ఇచ్చాడు సూర్యం. ఆ పద్మనాభం పరుగెత్తుకొచ్చాడు.

“బాసు, నా తెలివితో – రేపు వచ్చే అంపైర్‌లకి మా ఇంట్లో విందు చేస్తున్నా. దీంతో మన గెలుపు ఖాయం. నువ్వొఖ్ఖడివే రావాలి. …” అంటూ తన ప్లాన్ చెప్పాడు. ప్లాన్ అంతా బాగుంది కాని, ఆ పద్దు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద సూర్యానికి మహోత్కృష్టమైన అనుమానం తగలడింది. ఆ భయంతో సూర్యం అన్నాడు: “నువ్వు ఏ కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడినా మొత్తం టీం మటాష్ అయిపోతాం సుమా!”

పద్దు విచిత్రంగా చూశాడు. “ఏంటి బాసు. మొన్న పట్టాభిరాం వచ్చినప్పుడు ‘అసలు కమ్యూనికేషన్లు ఎక్కడ పుట్టాయో తెలుసా?’ అని అడిగా. చెప్పలేకపోయాడు. అప్పుడు నేనే చెప్పా – పురాణ కాలంలో నారదుడి దగ్గర. ఆయన డంగై పోయాడు తెలుసా!..”

సూర్యం ఎటూ చెప్పలేక చూస్తుంటే పద్దు దూసుకుపోయాడు. మర్నాడు రాత్రి పద్దు ఇంట్లో కర్నాటక నుంచి వచ్చిన ఆ ఇద్దరు అంపైర్‌లకి విందు. సూర్యం ధైర్యం చేసి వెళ్ళాడు.

 ఆ విందులో…

“సర్, ఇది రొయ్యల సూపు… అది కొల్లేరు కొరమేనుల వేపుడు… చికెన్ 69, 79, 99… అన్నీ వున్నాయి సర్. మీరు ఏదీ వదలకూడదు… ఇంకా పులస చేపలు మా నర్సాపూర్ నుంచి తెప్పించా.. .. ” ఆ అంపైర్‌లు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు.

“సార్, అసలు అంపైర్ అంటే మీ లాగా వుండాలి . మీరు చూడండి – తెలుగు వారు కాకపోయినా తెలుగు వంటకాలని ఎంతబాగా ఆస్వాదిస్తున్నారో! అది సర్ సంస్కారం అంటే..” అంటున్నాడు పద్దు. అతని భార్య ఇంకా కొసరి కొసరి వేస్తోంది. మధ్యలో సూర్యం వంక చూశాడు పద్దు – ‘ఎలా వుంది నా మేనేజిమెంట్’ అన్నట్లుగా.

“జయసింహ, అంటే మా అంకుల్ సర్. మీ గురించి బాగా చెప్పాడు సర్…”

“ఓహ్, జయసింహ మీ అంకులా!” వాళ్ళు ఇంకాస్త ఎక్కువ ఆనందపడిపోతున్నారు.

పద్దు మళ్ళీ సూర్యం వంక చూశాడు. సూర్యం వెర్రి మొహం వేసుకు చూస్తున్నాడు – వీడికెలా జయసింహ బంధువా అని. మంచి మీనాక్షి పాన్ తెప్పించాడు పద్దు. వాళ్ళు పద్దుని అభినంచించారు.

సూర్యానికి ‘గుడ్ లక్’ అని చెప్పి కారు ఎక్కేస్తున్నారు. పద్దు సూర్యం చెవిలో గొణిగాడు – “చూశావా నా కమ్యూనికేషన్ స్కిల్స్!”

అంపైర్‌లు కారెక్కారు. పద్దు చివరి మాటలు చెప్పాడు.

“మీలాంటి పెద్దమనుషులు అంపైర్‌లుగా వుండాలి సరి. అప్పుడే న్యాయం జరుగుతుంది… క్రిందటేడు ఇద్దరు అంపైర్‌లు వచ్చారు సర్. వాళ్ళకి అంపైరింగ్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడో గాని, శుద్ధ వేస్టు. కనీసం విజిల్ వేయటం రాదు సర్…” కారు డోర్లు మూసుకున్నాయి.

మర్నాడు టోర్నమెంటులో నాలుగు ఎల్.పి.డబ్ల్యులు, అయిదు వికెట్లు…! సూర్యం టీం మటాష్ అయిపోయింది.

పద్దు సూర్యం దగ్గరకొచ్చి ఆ అంపైర్‌ల్ని తిడుతున్నాడు. “బాగా తిని …”

సూర్యంకి మండిపోయింది.

“పద్దు, ఇంక ముయ్… క్రిందటేడు కూడా అంపైర్ లు వీళ్ళేనట…!!”

అంతే! పద్దు కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు.

2. రైలు పట్టాల మీద…

“మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవం కలిగింది చెప్పండి?”

రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమీషనర్ వెంకటేశం తన ప్రసంగం మధ్యలో ఆ ఇంటర్మీడియట్ పిల్లల్ని అడిగారు.

మొదట ఒక కుర్రాడు ఎత్తాడు. తరువాత ఇద్దరు… వెంట వెంటనే ఒక అమ్మాయి… మళ్ళీ అబ్బాయిలు… రెండు మూడు నిమిషాల్లోనే ఆ ఆడిటోరియంలో వున్న ఇంటర్ విద్యార్ధుల్లో మూడొంతులు మంది చేతులు ఎత్తారు.

ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. వేదికపై వున్న ఆ సంస్థ ప్రిన్సిపాల్, డైరక్టరు, మిగతా లెక్చరర్లు అంతా సంభ్రమంలో మునిగిపోయారు… అప్పుడే ఆ సంస్థ చైర్మన్ కూడా వచ్చి కూర్చున్నారు.

ఆ జంట నగరాల్లో అతి పెద్ద విద్యా సంస్థ సరస్వతి విద్యాలయ. చాలా మంచి పేరున్న విద్యా సంస్థ అది.

వెంకటేశం సివిల్ సర్వీసుల్లో దేశంలోకెల్లా మొదటి పదిమందిలో ఒకడుగా వచ్చాడని ఇరవై ఏళ్ళ క్రితం అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. వెంకటేశం పనిచేసిన ప్రతిపోస్టులోనూ తనదంటూ ఒక విశిష్ట ముద్ర వేసిన వ్యక్తి. గురుపూజ దినోత్సవం నాడు ముఖ్యతిథిగా వచ్చాడు. అతని ప్రసంగాన్ని విద్యార్ధులంతా ఆసక్తిగా వింటున్నారు..

వెంకటేశం వేదిక దిగి, తనే విద్యార్ధుల మధ్యలోకి వెళ్ళాడు. “నాకూ ఒకసారి అలాగే అనిపించింది…”

విద్యార్ధులంతా “ఆ…” అంటూ నోరు తెరిచారు..

“నేను ఇంటర్ పరీక్షలు అయ్యాక, ‘ఎంసెట్’ రాశాను… అప్పటికింకా ఆన్‌లైన్ రోజులు కావు. పేపర్లో ఫలితాలు వస్తాయని ఫ్రెండ్స్ అందరం పొద్దుటే ఆరుగంటలకల్లా కాలేజి దగ్గర చేరాం. మా లెక్చరర్లు కూడా కొందరు వచ్చారు. స్కూల్లో వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ నేనే ఫస్ట్ గానీ, సెకండ్ గానీ వచ్చే వాణ్ణి…  కొన్ని క్విజ్ పోటీల్లో కూడా … మరి నాకు ఎంత మంచి ర్యాంకు రావాలి?”

ఉగ్గపట్టుకొని వింటున్న పిల్లలంతా “టాపర్ సార్” అంటూ అరిచారు.

“కదా!… కాని నాకు 15 వేలకు పైగా ర్యాంకు వచ్చింది…” వెంకటేశం ఆపాడు.

పిల్లలంతా “అయ్యో” అంటూ ఉండిపోయారు.

కాని అందరికీ ఉత్కంఠగా వుంది. వెంకటేశం వేసిన ప్రశ్న అలాంటిది.

ఒక తెలివైన కుర్రాడు మాత్రం, “అయినా సీటు వస్తుంది కదా సార్!” అని అడిగాడు.

వెంకటేశం అతన్ని చూసి నవ్వాడు.

“అవును రావాలి. ఇప్పుడంటే ఇంజనీరింగ్ లో సీట్లు 60-70 వేలు వున్నాయి. అప్పుడు మొత్తం సీట్లే 15 వేలు. అప్పుడు?”

విద్యార్ధులంతా జాలి పడ్డారు.

“అప్పుడు నాతో పాటు ఎంసెట్ రాసిన ఫ్రెండ్స్‌లో నాకు తప్ప అందరికీ 12 వేల లోపు ర్యాంకులు వచ్చాయి. అప్పుడే…”

మళ్ళీ ఆగాడు. పిల్లల్లో మళ్ళీ ఉత్కంఠ.

“అందరూ నన్ను చూసి నవ్వారు. పెద్ద తెలివైన వాడివి కదరా, నీకు ర్యాంకు రాలేదేం – అంటూ వెక్కిరించారు. నా ఫేవరైట్ లెక్చరర్లు కూడా ‘యూజ్ లెస్ ఫెలో’ అనేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా అనేశారు… అప్పుడే నాకూ ఏడుపొచ్చేసింది… అందరిలో అవమానంగా అనిపించింది. తట్టుకోలేకపోయాను…”

ఆ కాలేజి లెక్చరర్లు అందరికీ చెమటలు పట్టేస్తున్నాయి.

“అప్పుడేమైంది సార్.. చెప్పండి సార్..”

“చచ్చిపోదామని రైలు పట్టాలెక్కాను… రైలు వస్తుంటే…”

అందరికీ ఆదుర్దా !!!

“గేటులోంచి చూసి ఒకాయన పరుగెత్తుకొచ్చి నన్ను పక్కకి లాగేశారు…. నన్ను తన ఇంటికి తీసుకెళ్ళారు. విషయం అంతా విన్నాక, ఒక మాట అడిగారు…”

విద్యార్ధులు ఉండబట్టలేకపోతున్నారు.

“నిన్ను చదివించగల శక్తి, చదివించి పెద్దవాణ్ణి చేయాలన్న ఆసక్తి నీ లెక్చరర్లకిగానీ, ఇప్పుడు నవ్విన వాళ్ళల్లో ఎవరికిగానీ వున్నాయా – అని అడిగారు. ‘లేవు’ అన్నాను. ‘మరి ఎవరికి వున్నాయి?’ అని అడిగారు. కొంచెం ఆలోచించి చెప్పాను – ‘మా నాన్నకి.’… ‘మరి నిన్ను ఉద్ధరించ గలిగిన శక్తి, ఆసక్తి వున్న మీ నాన్న ఏమీ అనకుండా, బయట వాళ్ళు ఎవరెవరో ఏదో అనేస్తే ఇలా చేస్తావా? వీళ్ళు నవ్వినందుకు గాను – నిన్ను ప్రేమించే మీ అమ్మా, నాన్నల్ని జీవితమంతా ఏడవమని శిక్షిస్తావా? ఎంత తెలివైన వాడివి? …అన్నారు. ఆయన చెప్పింది న్యాయమా, అన్యాయమా?”

పిల్లలంతా ముక్తకంఠంతో అరిచారు.

“చాలా కరెక్టు సార్.”

“అప్పట్నుంచీ మా అమ్మా, నాన్నలకోసం కూడా చదివాను. కలెక్టరూ అయ్యానూ, మీకు కమీషనరూ అయ్యాను…”

ఇందాకటి తెలివైన కుర్రాడు మళ్ళీ అడిగాడు.

“మిమ్మల్ని కాపాడినాయన బాగున్నారా సార్?”

వెంకటేశం వేదిక మీదున్న ఆ సంస్థ చైర్మన్ శేషయ్య కేసి చూపించారు.

అంతే! ఆడిటోరియం అంతా ప్రతిధ్వనించాయి వాళ్ళ కరతాళ ధ్వనులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here