[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ భాగం. [/box]
31
[dropcap]సు[/dropcap]జాత ఇల్లు వదిలి వచ్చిన తరువాత పని మనిషి పార్వతి ద్వారా ఆ ఇంటి విషయాలన్ని సుజాతకి తెలుస్తున్నాయి. శేషు ఆస్తినంతా తన పేరున వ్రాయించుకుని రాధను పెళ్ళి చేసుకోవడం, శేషు వ్యసనాల పాలవ్వడం, ఆస్తి తరిగిపోతూ ఉండడం. తండ్రి మనో వ్యాధితో మంచం ఎక్కడం ఇవన్నీ.
ఇంటికి వెళ్ళి తండ్రిని చూడాలి. అతనిని ఓదార్చాలి. అతనికి ఆత్మస్టైర్యం కలిగించాలి అని సుజాత అనుకునేది. అయితే తనని ఇంటికి రానిస్తారో లేదో అని మథనపడి ఆ కోరికను మనస్సులోనే దాచుకుంది.
అనుకోకుండా తండ్రి మరణ వార్త సుజాతకు తెల్సింది. సుజాతని ఆ వార్త మరింత కృంగదీసింది. తీవ్రమైన మనస్తాపానికి గురిచేసింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. చిన్న పిల్లలా భోరున ఏడుస్తున్న సుజాతను, పరంధామయ్యగారు, పార్వతమ్మ ఓదార్చేరు. ఓ పర్యాయం ఇంటికి వెళ్ళి తండ్రి పార్థివ శరీరాన్ని చూడమని సలహా ఇచ్చారు ఆ దంపతులు.
బాగా ఏడ్చిన తరువాత, పరంధామయ్య దంపతులు ఓదార్పుతో సుజాత మనస్సు కొద్దిగా తేలికపడింది. ‘తల్లిని తను ఎరగదు. తనని తండ్రి తానే తల్లీదండ్రి అయి తల్లిలేని లోటు మరిపించి పెంచాడు. రాధ పుట్టే వరకూ సీతమ్మ కూడా తనని బాగానే చూసేది. ఆ తరువాత తరువాతే ఆమెలో మార్పు వచ్చింది. ఆవిడ తనని సూటిపోటి మాటలు అంటే తనకి బాగా దుఃఖం వచ్చేది.
తను ఏడుస్తే తండ్రి అప్యాయతగా తన తల నిమిరి ఓదార్చేవాడు. తండ్రికి తనంటే ఎంతో అభిమానం. తను ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడే నా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా అతని కళ్ళల్లో అగుపడ్తున్న విషాదపు నీలి నీడల్ని తను చూడకపోలేదు. అతని కళ్ళల్లో అగుపడున్న కన్నీటి తెర తళుక్కుమనడం తను గ్రహించింది.
అలా కఠినంగా ప్రవర్తించడం అతనికిష్టం లేకపోయినా శేషు, సీతమ్మ వాళ్ళ ప్రోద్బలం వల్ల అతను అలా ప్రవర్తించేడు అని తను అనుకుంది. వాస్తవానికి తండ్రికి తన మీద కోపం లేదు.’ ఇలా ఆలోచిస్తున్న సుజాత గుండెలు బాధతో బరువెక్కాయి. బ్రతికి ఉండగా అతడ్ని చూసి అతడితో మాట్లాడే అవకాశం తనకి ఎలాగూ లభించలేదు. పోనీ తండ్రి చనిపోయిన తరువాతేనా అతని నిర్జీవ శరీరాన్నేనా ఓ పర్యాయం తనివిదీరా చూడాలి. తండ్రిని చివర చూపు చూడాలి. ఈ శరీరం కాలి బూడిద అయిపోతే తిరిగి తండ్రి రూపం చూసే అవకాశం తిరిగి తనకి లభించదు.
తండ్రి చనిపోయిన వార్త నాకు తెలియనీయలేదు. నేను తన వాళ్ళకి అంత పగది అయిపోయిందా? అంత పరాయిది అయిపోయిందా? కబురు పంపలేదు. అంత కాని పని తను చేసిందా? ఇలా మథనపడుతోంది. సుజాత, తొందరగా వెళ్ళమని పరంధామయ్యగారు, పార్వతమ్మ హెచ్చరించిన మీదట బయలుదేరింది తను పుట్టి పెరిగిన ఇంటికి సుజాత.
‘ఎప్పటికైనా తండ్రి కోపం తగ్గుతుంది. తనని తిరిగి ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తారు. తను పుట్టి పెరిగిన తన ఇంటికి తిరిగి వెళ్తాను అని ఇన్నాళ్ళూ తను అనుకునేది. ఇప్పుడా ఆశ ఆవిరి అయిపోయింది. తండ్రి చావుతో ఆ ఇంటితో తనకున్న అనుబంధం తెగిపోయింది. ఇప్పుడు తను ఆ ఇంటికి వెళ్ళడానికి ఎవరున్నారు కనుక?’ ఇలా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది, సుజాత.
తండ్రి నిర్జీవ శరీరాన్ని చూడగానే దుఃఖం ఆపుకోలేక బోరున ఏడుస్తూ తండ్రి శవం వేపు అడుగులు వేస్తోంది. సీతమ్మని, రాధని చూసి ఏడుస్తూ ముందుకు వెళ్తున్న సుజాత “ఆగు” అన్న గర్జన విని టక్కున ఆగిపోయింది.
నిశ్చేష్టురాలయింది. అది సీతమ్మ గర్జన.
“నాన్నగారి శవాన్నేనా ముట్టుకునే అర్హత, హక్కు నీకు లేవు. అవి నీవు పోగొట్టుకున్నావు.” రాధ తీక్షణంగా సుజాత వేపు చూస్తూ అంది.
“రాధా!!!” బాధగా అరిచింది.
“నిజమే! నీవు ముట్టుకుంటే అతని శవం కూడా అపవిత్రం అయిపోతుంది. అతని ఆత్మ క్షోభిస్తుంది. అతనికి కూడా పాపం అంటుకుంటుంది. నీవు ఎలాగూ పాపాత్మురాలివే.”
“అంత మాటలు నన్ను అంటున్నారు. నేను ఏం చేశాను అమ్మా!!!” బాధగా అంది సుజాత.
“ఇంకేం చేయాలి. నాన్నగారు చివరి సారిగా నిన్ను చూడాలనుకున్నారు. నీతో మాట్లాడాలని ఎంతో ఆరాటపడ్డారు. నీవు రానేరానని నిక్కచ్చిగా చెప్పి మమ్మల్ని అందర్నీ, నాన్నగారిని కూడా నీవు నానా మాటలూ అన్నావని తెలిసి ఎంత తల్లడిల్లిపోయారు. ఎంత క్షోభతో కన్నుమూసారు. నీ ప్రవర్తన వల్ల నాన్నగారి ఆత్మకి శాంతి లేకుండా పోయింది.” రాధ మాటలకి దెబ్బతిన్న లేడి పిల్లలా విలవిల్లాడిపోయింది సుజాత.
తన ఏది ఆశించి తను ఇక్కడికి వచ్చిందో అది లభించలేదు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుండి తను ఆశించిన ఆదరణ లభించలేదు. ముఖాలు కోపంతో తిప్పేసుకున్నారు. సీతమ్మ, రాధ ప్రవర్తన సుజాతను మరింత మనస్తాపానికి గురి చేసింది.
ఈ కష్ట కాలంలో కూడా తనని చూసి వీళ్ళు ఎడమొగాలు, పెడమొగాలు పెడున్నారేంటి? ఆస్తిలో తను వాటా అడిగిందా? కన్న తండ్రితో చివరసారిగా మాట్లాడే అవకాశం తనకి లభించలేదు. ఆ అమృతమూర్తి ఆప్యాయతానురాగాలే తనకి లభించని నాడు తనకి ఈ ఆస్తిపాస్తులెందుకు? వాళ్ళు తనని తప్పుగా అనుకుంటున్నారు. ఈ ఆస్తి ఏనాడో శేషు చేతిలోపడి హారతి కర్పూరంలా హరించుకుని పోయిందని తనకి తెలుసు.
“నాకు ఎవరూ కబురు చెప్పలేదు. నాన్నగారే కబురు పెట్టే నేను రానా? ఎవరో అబద్ధం చెప్పి ఉంటారు.” గట్టిగా బాధగా అరుస్తూ అంది సుజాత. సీతమ్మకి రాధకి అంత విచారం. దుఃఖంలోనూ కూడా విస్మయం కలిగింది. సుజాత వేపు చూశారు. ఆమె కన్నుల్లో అగుపడున్న నిజాయితీని బట్టి సుజాత చెప్పింది నిజమే అనిపించింది ఆ ఆడవాళ్ళిద్దరికీ.
“అయితే నీకు ఏవీ తెలియదా? శేషు నీకు కబురు పంపలేదా?” సీతమ్మ సుజాతను అడిగింది.
“నాకసలు ఈ విషయా లేవీ తెలియవు. ఎవరూ నాకు ఏ కబురూ చెప్పలేదు.” తిరిగి అంది సుజాత.
“నీకు శేషు కబురు పంపిస్తానన్నాడే,” సందేహ నివృత్తి కోసం తిరిగి రెట్టించింది సీతమ్మ.
“నాకు ఎవరూ కబురు పంపలేదు. కబురే తెలుస్తే, తండ్రితో మాట్లాడానికిరానా?” తిరిగి సుజాత అంది.
సీతమ్మకి శేషు మీద మొదటి సారిగా చాలా అసహ్యం వేసింది. సుజాత మీద తనింత వరకు వ్యవహరించిన తీరుపై పశ్చత్తాపం కలిగింది.
“నీ మీద ద్వేషాన్ని పెంచుకుని అనేక విధాలుగా నీకు మనస్తాపం కలిగించాను. ఇబ్బందులుకి గురి చేశాను. నిందలు వేశాను. చిన్నదానివైనా నన్ను క్షమించు.” వెక్కిళ్ళ మధ్య సీతమ్మ అంది సుజాతతో.
సుజాతకి కూడా దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది.
“ఏంటా ఏడ్పులు?” శేషు విసుక్కున్నాడు.
‘ఇక్కడ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. రాధ సీతమ్మ పరిస్థితి చక్కబర్చడానికి తనేం చేయలేదా?’ మనస్సులో ప్రశ్నించుకుంది. ‘తన జీవితమే సవ్యంగా లేనప్పుడు తను వీళ్ళకి ఎలా ఆదుకోగలదు?’ ఇలా అనుకుంటూ అంత దుఃఖంలోనూ గాఢంగా నిట్టూర్పు విడిచింది సుజాత.
32
కాలం నత్త నడక వదిలిపెట్టి లేడిలా త్వరతిగతిని పరుగులు తీస్తోంది. ఆ కాలంతోపాటే మానవుల మనుగడలో కూడా అనేక మార్పులు. అతి శీఘ్రంగా చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితులు కాలంతో పాటే పోటీపడుతున్నాయి.
పరంధామయ్య గారి భార్య పార్వతమ్మగారు మరణించడం, అతను ఏకాకిగా మిగిలిపోవడం అన్నీ ఈ కాలమహిమే. అతనికి పిల్లలు లేని కారణం చేత ఉన్న కొద్దిపాటి ఆస్తిని అతను సుజాత స్థాపించిన ఆశ్రమానికి వ్రాసాడు.
సుజాత పని పరంధామయ్యగారికి చేదోడుగా నిలవడం, ఆశ్రమ కార్యక్రమాల్ని చూడ్డంతోపాటు కళ్యాణిని పర్యవేక్షణం చేయడం. ఇలా ఆమె కాలం గడిచిపోతోంది. పరంధామయ్య గారు తన పలుకుబడికి శ్రమను జోడించి దాతల నుండి ఆశ్రమానికి చందాలు వసూలు చేసి ఆశ్రమ నిర్వాహణకి తోడ్పడేవారు.
పరోపకారి బుద్ధితో అనాథలకి సేవ చేయాలన్నా తలంపుతో ఆశ్రమం నెలకొల్పబడటం వల్ల దాతలకి కూడా ఆనంద దాయకమయింది. వారు కూడా విరివిగా విరాళాలు ఈయడం ఆరంభించారు.
ఆశ్రమంలో రకరకాల మనుష్యులు. ముసలి వయస్సులో కన్న పిల్లల ఆదరణ కోల్పోయి వారిచే గెంటింపబడ్డ వృద్ధులు, అవిటివాళ్ళు, అనాథలు, బాట తప్పిన బ్రతుకు వెళ్ళబోసుకుంటూ సమాజంచేత చీత్కారం కొట్టించుకున్న అభాగినిలకి, అత్తింటి వల్ల బాధలు పడలేక ఆత్మహత్య చేసుకోడానికి ధైర్యం చాలక నరకం లాంటి జీవితం గడిపి విసిగి వేసారి పోయిన దురదృష్టవంతులకి, కాలుజారి తిరిగి కన్న వారి పంచ చేరలేక ఎటు వెళ్ళాలో తెలియక తిరిగి సాలెగూట్లో చిక్కుకు పోకుండా ఉండాలని తాపత్రయ పడున్న అభాగినులకి ఒకరేమిటి ఇలాంటి ఎంతోమందికో ఆ ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తోంది. విత్తనం మొక్కగా మారి మొక్క విశాలమైన వృక్షంబు శాఖోపశాఖలుగా విస్తరించినట్టు అశ్రమం దిన దిన ప్రవర్ధమానం అవుతోంది.
పాఠశాల కూడా కొద్దిమంది పిల్లల్లో ఆరంభమయి సుమారు వంద మంది పిల్లల్లో విరాజిల్లుతోంది. ఆ పాఠశాలలో చదువు చెప్పడానికి జీతం తీసుకోకుండానే చదువు చెప్తామంటూ కొంతమంది చదువుకున్న ఉత్సాహవంతులు పోటీపడ్తున్నారు. సుజాతే కాకుండా పరంధామయ్య గారు కూడా విద్యార్థులకి చదువు చెప్పే పనితోపాటు ఆశ్రమం మిగతా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉండేవారు.
ఓ మంచి పని ఉందంటే ఆ పనిని అందరూ ప్రోత్సహిస్తారు. అదే చెడ్డ పని అయితే ఎవ్వరూ సహకరించరు. ఇంటికో పుష్పం ఈశ్వరుడికి ఓ మాల అన్నట్లు సుజాతకు ఆమె కార్యసిద్ధికి, సంకల్ప బలానికి అందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతో ఆ ఆశ్రమం వృద్ధి చెందుతోంది. మంచి పేరును కూడా సంపాదించుకుంది. ఆమె సేవా తత్పరత వల్ల ఆమె పేరు కూడా అందరి నోళ్ళల్లో నాన్తోంది. అందరూ ఆమెను, ఆమె గుణాలను పొగుడుతున్నవాళ్ళే.
మెల్లగా కళ్యాణి ఎలిమెంటరీ చదువు పూర్తి చేసి హైస్కూలు చదువులోకి అడుగు పెట్టింది. ఆమెను పెద్ద చదువులు చదివించి తను శేఖరానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కళ్యాణిని వృద్ధిలోకి తీసుకురావాలి. అన్నదే సుజాత ఆలోచన. ఆ తలంపుల్లోనే ఓ రోజున ఆమె మునిగితేలుతోంది.
“సుజాతమ్మా!” పనిమనిషి నర్సమ్మ పిలిచింది. ఆ మాటలు వినగానే ఆలోచనా తరంగాల్లో తేలియాడుతున్న సుజాత తన ఆలోచనని తాత్కాలికంగా నిలుపుదల చేసి “ఏమిటి నర్సమ్మా!” అని ప్రశ్నించింది.
“మీ కోసం ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారమ్మా!” నర్సమ్మ మాటలకి విస్మితురాలయింది సుజాత. “నా కోసమా? అదీ ఇద్దరు ఆడవాళ్ళా?” అని విస్మయంగా అడిగింది.
‘అలా వచ్చిన వాళ్ళు అనాథలై ఉంటారు. లేకపోతే దురదృష్టవంతులో, బాట తప్ని బ్రతుకు వెళ్ళదీస్తున్న అభాగినులై ఉంటారు. అలాంటి వాళ్ళ తప్ప తన దగ్గరకు మరెవరు వస్తారు కనుక?’ అనుకుంటూ నిట్టూర్పు విడిచింది సుజాత.
“లోపలికి తీసుకురా, నర్సమ్మ” అంది సుజాత. వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళని చూసిన సుజాత నిశ్చేష్టురాలయింది. ఒక్కసారి విస్మయం నుండి తేరుకున్న ఆమె వారి ఆకారాల్ని చూసి చాలా కలత చెందింది. ఆమె అంతగా ఖిన్నురాలవడానికి కారణం ఆ వచ్చిన ఆడవాళ్ళిద్దరూ మరెవరో కాదు తన చెల్లెలు రాధ, ఆమె తల్లి సీతమ్మ.
“అమ్మా!” అంది సుజాత గద్దద కంఠంతో.
ఆ వచ్చిన ఆడవాళ్ళిద్దరూ పశ్చతాపంతో, బాధతో తలలు వొంచుకుని నిలబడ్డారు. కాని ఆమె వేపు సూటిగా చూడలేకపోతున్నారు. వొంచిన తల ఎత్తకుండా దారాపాతంగా కన్నీళ్ళు కురిపిస్తోంది సీతమ్మ. రాధ వదనంపై కూడా పశ్చత్తాప బాధలే.
“రాధా!” ఆత్రంగా పిల్చింది సుజాత అలా పిలవడమే కాకుండా అప్యాయతగా చేతులు జాచింది.
“అక్కా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు.” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. అలా ఏడుస్తున్న రాధను పొదివి పట్టుకుని ఆప్యాయతగా ఆమె తలపై నెమ్మదిగా రాస్తూ దుఃఖాన్ని ఆమె నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తోంది సుజాత.
“నీకు అన్ని విధాలా అన్యాయం చేశాము మమ్మల్ని క్షమించక్కా! మమ్మల్ని క్షమించు,” వెక్కిళ్ళ మధ్య గొణుక్కుంటోంది రాధ.
“మీ నాకేం అన్యాయం చేయలేదు. నేను కూడా అలా అనుకోవటం లేదు. అలా ఎందుకు బాధపడ్డావు రాధా! మొదట ఏం జరిగిందో చెప్పు.” అంది సుజాత.
చూచాయగా సుజాతకి వాళ్ళ విషయాలు తెలస్తున్నాయి. శేషు వీళ్ళని యాతనలకి గురి చేస్తున్నాడని, బాగా చూచుకోడం లేదని కూడా వింది.
ఆడవాళ్ళిద్దరూ ఏఁ చెప్పకుండా ఏడుస్తున్నారు. వాళ్ళ రోదనలో వాళ్ళ నుండి సమాధానం రాబట్టలేకపోయింది.
“నీవేనా చెప్పమ్మా!” సీతమ్మను ఆత్రుతగా అడిగింది సుజాత.
“ఏఁ చెప్పమంటావే తల్లీ! అయిపోయింది. అంతా అనర్థం జరిగిపోయింది. నిన్ను మేము ఉసురు పెట్టినందుకు రాధ జీవితమే కాదు నా జీవితం కూడా ఇలా వీధిన పడింది.
నేను చేసిన పాపం పనులకి ఆ భగవంతుడు పరలోకంలో కాదు ఈ లోకంలోనే ఈ జీవితంలోనే తగిన శిక్ష విధించాడు. నేను చేసిన పాపానికి నివృత్తి లేదు.” చెప్తూనే దుఃఖం ఆపుకోలేక సన్నగా రోదిస్తోంది సీతమ్మ.
సుజాతకి పరిస్థితి కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. శేషు ఆడవాళ్ళిద్దర్నీ తగిలేసేడు. వాళ్ళు రోడ్డున పడ్డారు. అన్న విషయం మాత్రం రూడీగా తెలిసింది.
“ఆ ఏడుపు ఆపు చేసి వివరంగా చెప్పండి.” అంది సుజాత.
కన్నీళ్ళు పైట చెంగుతో వొత్తుకుంది సీతమ్మ. దుఃఖంతో, విచారంతో ఆమె ముఖమంతా వాడిపోయిన మందారంలా ఉంది. ఏడ్చిన కారణం చేత ఆడవాళ్ళిద్దరి కళ్ళూ ఎర్రకలవల్లా ఎర్రగా ఉన్నాయి. ముక్కు చీదుతూ విషయాన్నంతా విడమర్చి సుజాతకి వివరించింది సీతమ్మ.
‘శేషు తాగి తందనాలాడి ఆస్తినంతా హారతి కర్పూరంలా హరింప చేశాడా? ఆస్తి అంతా తగలబెట్టాడా? పరాయి ఆడదాని మోజులో పడి రాధను ఇలా రోడ్డు పాల్టేసాడా? మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి విడాకులు తీసుకోడానికి ప్రయత్నిస్తున్నాడా? విడాకులు తీసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం అని అనుకుంటున్నాడా? అంత తేలిక అనుకుంటున్నాడా? తను చూస్తూ ఊరుకోకూడదు. తనకి కొంతమంది పెద్ద వాళ్ళ దగ్గర మంచి పేరు ఉంది. పరపతి ఉంది. దాన్ని ఉపయోగించి చితికిన రాధ సంసారాన్ని చక్కబర్చాలి. ఛిన్నాభిన్నమయిన ఆ కుటుంబ పరిస్థితిని సరిదిద్దాలి. శేషుకి తగిన గుణపాఠం చెప్పి తన తప్పు తాను తెలుసుకునేలా చేయాలి’ ఇలా ఆలోచిస్తోంది సుజాత.
“ఇంత నరకంగా తయారయ్యాయా పరిస్థితులు? ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడా శేషు మీ యడల?”
“అలా అడుగుతావేంటే అమ్మాయ్! మా బ్రతుకుల ఘోరాతి ఘోరంగా, నరకంగా తయారయ్యాయి. దిక్కులేని వాళ్ళల్లా ఇలా వీధిన పడ్డాము. అనాథలెంత మందికో నీవు ఆశ్రయం కల్పిస్తున్నావు. వాళ్ళకి ఆశ్రమంలో స్థానం ఇస్తున్నావు. ప్రస్తుతం మేము కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే. నీ ఆశ్రమంలో మాకు కూడా ఇంత చోటివ్వు అమ్మాయ్!” ప్రాధేయపూర్వకంగా అడుగుతున్న సీతమ్మ అభ్యర్థనకి సుజాత వదనం వివర్ణమయింది. కళ్ళల్లో కన్నీటి తెర తకుక్కున మెరిసింది.
“ఎంత మాటమ్మా! మీరు అనాథలేంటి? మీరు నా వాళ్ళు. నా వాళ్ళకి ఆశ్రమంలో ఏంటమ్మా? నా ఇంట్లోనే స్థానం ఉంటుంది. నిన్ను తల్లిగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను.”
“అమ్మాయ్! నీవు అంత ఆప్యాయతగా అంటూ ఉంటే సిగ్గుతో చితికిపోతున్నాను. నీ యడల ఎంత నికృష్టంగా ప్రవర్తించాను? అవన్ని తలుచుకుంటూ ఉంటే భరించలేని బాధ.” సీతమ్మ అంది.
“అటువంటి మాటలు మరోమారు అంటే నేను ఒప్పుకోను.” మారాం చేస్తున్నట్లు అంది సుజాత. ఆమె తమ తప్పుల్ని క్షమించే విధానం ఆ ఆడవాళ్ళిద్దరికీ ఊరట కలిగించింది.
(ఇంకా ఉంది)