[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 43వ భాగం. [/box]
మోహన్ చారిత్రక నవల-1.4
[dropcap]శ్ర[/dropcap]మణుడు నవ్వాడు. అతను రుద్రభట్టును మరోదారి పట్టించాలని ప్రయత్నించాడు.
“వైద్యశాస్త్రం పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది. కాని, నేను ఆరు సంవత్సరాలు అధ్యయనం చేసిన తరువాత మరి బోధించవలసింది లేదని ఆచార్యులు పలికారు.”
“ఈ శ్రమణుడు ఎంత గర్విష్టి! ఆచార్యులకు బోధించడానికి విషయం లేదని చెప్తున్నాడు.” అన్నాడు రుద్రభట్టు.
“నేననడం లేదు. ఆచార్యులే అన్నారు. అపుడు వారి శుశ్రూష చేస్తూ మిగిలిన శాస్త్రాలను అధ్యయనం చేశాను.”
“ఓహో! చాల గొప్పవాడివన్న మాటే!” అన్నాడు శాండిల్యుడు.
“ఇక చెప్పు, నౌకా భంగమెందుకవుతుంది?” రుద్రభట్టు మళ్లా మొదటికే వచ్చాడు.
శ్రమణుడు మహానావికుని అనుమతిని కోరుతూ అతని ముఖంలోకి చూశాడు.
మహానావికుడు ముఖంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. చాల నిర్లిప్తుడుగా అతనున్నాడు.
శ్రమణుడు చెప్పడం మొదలు పెట్టాడు.
“మహా జనకుడు మిథిలారాజు పుత్రుడు. అతనికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చింది. ఆ సరికి అతడు మూడు వేదాలు అధ్యయనం చేశాడు. అతను చాలా చక్కగా ఉండేవాడు. అప్పుడతడు అనుకున్నాడు ‘శత్రువులు ఆక్రమించిన నా తండ్రి రాజ్యం తిరిగి నేను వశపరచుకుంటాను’. అతను తల్లినడిగాడు ‘నీదగ్గిర ఏమైనా ధనముందా? ఉన్న దానిలో సగం మాత్రమే నేను తీసుకుంటాను. నేను సువర్ణ భూమికి పోయి మహా సంపదలు సంపాదించి మా తండ్రిగారికి చెందని రాజ్యాన్ని వశం చేసుకుంటాను’ అని. ఆమె తెచ్చిన ధనంలో సగం భాగం అతను స్వీకరించి, సువర్ణ భూమికి తీసుకుపోవలసిన సరుకులను సమకూర్చుకున్నాడు. తల్లికి వీడ్కోలు చెప్పి కొంత మంది వర్తకులతో బాటు ఒక నౌకలో సువర్ణ భూమికి ప్రయాణమయాడు.
“ఏడు దినాలలో నౌక ఏడు వందల క్రోశాలు ప్రయాణం చేసింది. గమనం తీవ్రమవడం నుంచి, నౌక యొక్క బల్లలన్నీ విడిపోయాయి. జలాలు మీదికి లేచాయి. మహాసాగరం మధ్యలో నౌక మునిగి పోవడం మొదలు పెట్టింది.”
“అపుడు నౌకను నడిపేవారు రోదించారు. తలలు మోదుకున్నారు. నౌక మునిగి పోతుంటే, దాని స్తంభం నిటారుగా నిలబడింది. నౌక అంతటికీ వెనుక భాగమే కనిపిస్తుంది. మిగిలి భాగాన్ని పెద్ద పెద్ద చేపలు, భీకరమైన సాగర జంతువులు దాడి చేస్తున్నాయి. మహా జనకుడు భయంతో రెండు చేతులూ ప్రార్థనా పూర్వకంగా పైకెత్తాడు. మకర మొకటి ఒక ప్రయాణికుడిని ఎత్తుకుపోయింది. అతడు దాని నుండి విడిపించుకోడానికి దాని దౌడలను లాగి, నోటిని తెరువడానికి ప్రయత్నించాడు. సముద్రం పైన, భూమిమీద సంచరించే జలచరమొకటి, మార్జాల కర్ణాలు కల జలచరం మరొకటి, ప్రయాణీకుల మీద పడుతున్నాయి. ఈ విధంగా నౌకలోనివారు మత్స్యాలకు, కమఠాలకి ఆహారమయారు. నౌక చుట్టూ ఉన్న జలాలు రక్త వర్ణాలయాయి.
“ఆ సమయంలో దేవపుత్రి మణి మేఖల, మహా పురుషుడైన మహా జనకుడు మునిగిపోతుంటే చూసింది. ఆమెను నలుగురు దిక్పాలురు సాగరాల రక్షకురాలిగా నియమించారు. ఆమె అనుకుంది, ‘సముద్రంలో రాజపుత్రుడు మహా జనకుడు మునిగిపోతే, నాకు దేవ సభలో ప్రవేశించే అర్హత పోతుంది.’ ఆమె మహా జనకుడిని రక్షించింది. మిథిలలో రాజ్యం చేస్తున్న అతని తండ్రి దగ్గరికి చేర్చింది.”
బ్రాహ్మణులందరూ చాల శ్రద్ధతో వింటున్నారు.
మహా నావికుడు చాల దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
“మరో కథ చెప్పు” యజ్ఞదత్తశర్మ అన్నాడు.
ఆ బ్రాహ్మణులందరూ చాలా హాయిగా కూర్చొని, కాలక్షేపం కోసం కథలు చెప్పమంటున్నారని శ్రమణుడు ముందే గ్రహించాడు. వాళ్లు కథలు మరచిపోవచ్చు కాని, నౌకా దుర్ఘటన గురించి మరిచిపోలేరు. కథల ప్రభావమే అటువంటిది. ఏదో సందేశం మనసుకు హత్తుకునేటట్లు చేయడానికి కథకన్న ఉత్తమమైన సాదనం వేరొకటి లేదు. దేవతలు కరుణించి, ప్రకృతి అనుకూలించి, ప్రయాణం భద్రంగా సాగితే ఈ కథలు వినోదాన్ని సమకూర్చుతవి. కాని, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, కథలోని సందేశం ముల్లువలె పొడుస్తుంది. కథ అందించే ఈ దుష్ఫలితాన్ని బ్రాహ్మణులు గుర్తించలేకపోయినందుకు శ్రమణుడు క్షణం విచారించాడు.
శ్రమణుడికి మరో ఉదంతం చెప్పక తప్పలేదు.
“శూర్పరకలో ఒక ధనికుడైన వర్తకుడుండేవాడు. అతనికి నలుగురు కుమారులు. వారిలో ఆఖరివాడు పూర్ణుడు. అతను దాసీ కన్యకు పుట్టినవాడు. పూర్ణుడంటే ఆ వర్తకునికి తగని అభిమానం. కొన్నాళ్లకు వర్తకుడు చనిపోయాడు. అతని పెద్ద కుమారుడు భావిలుడు. పూర్ణుడికి, భావిలుడికి ఆస్తి చిక్కకుండా మిగిలిన సోదరులిద్దరూ కాజేశారు.”
“కాని, పూర్ణుడు చాలా తెలివి తేటలతో గంధపు చెక్కల వ్యాపారం చేశాడు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని దేశమంతటికి ముఖ్య వణిజుడయాడు. అతడు ఆరుసార్లు సముద్రయానం విజయవంతంగా చేశాడు. అక్కడితో తృప్తి చెంది అతను విశ్రమించాడు.”
“కాని, శ్రావస్తిలోని కొందరు అతనికి నచ్చజెప్పి ఏడవసారి కూడా సముద్ర యానానికి ఒప్పించారు. దారిలో అతడు బుద్ధుడిని స్తుతించే గీతాలను విన్నాడు. బౌద్ధమతాన్ని స్వీకరించాలని అతనికి అభిలాష కలిగింది.”
“ఏడవ సాగరయాత్ర కూడా పూర్తయిన తరువాత పూర్ణుడు లౌకిక జీవితాన్ని విడిచిపెట్టడానికి నిశ్చయించాడు. తన అన్న భావిలుని అనుమతి పొంది బుద్ధుని నుండి ఉపదేశాలను పొందాడు.”
“శోణ పరాంతక దేశాలలో చాల ముష్కరులూ, దుర్మార్గులూ అయిన ప్రజలుండేవారు. పూర్ణుడు ఆ దేశాలలో నివసించి చాలామందిని బౌద్ధులుగా మార్చాడు.”
“ఈ లోపుగా భావిలుడు సముద్రం పైని ప్రయాణంచేసి ఒకానొక తీరాన్ని చేరుకున్నాడు. ఆ తీర భూమి మీద గోశీర్ష చందన వృక్షాలున్న అరణ్యమొకటి ఉంది. భావిలుని మనుష్యులు ఆ చందన వృక్షాలను నరకడం మొదలు పెట్టారు. యక్ష మహేశ్వరుడు ఆ చందన వృక్షాలకు అధిపతి. అతడు తన వృక్షాలను భావిలుని పరివారం నరకడం చూసి, తీవ్రమైన గాలి వానను సృష్టించాడు. ఆ గాలివాన ఎంత తీవ్రమైనదంటే, దాని ధాటికి ఎటువంటి నౌక కూడా నిలబడలేదు. భావిలుడు నిస్సహాయుడయాడు. కాని, అతని అనుచరులు మాత్రం పూర్ణుడిని ధ్యానించి అతని సహాయం అర్థించాడు. పూర్ణుడు తన మానవతీత శక్తి వలన ఆ నౌకమీద ప్రత్యక్షమయాడు. అతని రాకతో గాలివాన శాంతించింది. యక్షుడు కూడా అతని శక్తికి తలవంచక తప్పలేదు. అపుడు పూర్ణుడు తన అన్నతో అన్నాడు “చందన దారువులతో విహార మొకటి నిర్మించి దానిని బుద్ధునికి అంకితం చేయవలసింది” దానికి భావిలుడు అంగీకరించాడు. సుప్పరక దేశం చేరుకున్న తరువాత గంధకుటి విహారమొకటి భావిలుడు కట్టించాడు. పూర్ణుడు, భావిలుడు బుద్ధ దేవుని వినుతించారు. బుద్ధుడు తన అనుయాయులతో వారిముందు ప్రత్యక్షమయ్యాడు.”
“చాల బాగుందయ్యా కథ! ఇది బౌద్ధ ధర్మ ప్రచారానికి ఉపయుక్తమవుతుంది. మావంటి వేద పండితులను ఈ కట్టుకథలు మార్చలేవు తెలుసా!” రుద్రభట్టు ఉరిమాడు.
శ్రమణుడు నవ్వాడు. వారి ఆగ్రహానికి అతడు అంతకన్న చేయగలిగినదేమీ లేదు.
మహానావికుడు కూడా కల్పించుకోలేదు.
ఆ విధంగా ఆనాటి సమావేశం ముగిసింది.
మరునాటి మధ్యాహ్నం నుండీ వాతావరణంలో మార్పులు వచ్చాయి. సాయంకాలమయే సరికి పరిస్థితులు విషమించాయి.
మహానావికుడు ఘటికా యంత్రం చూశాడు. ఒక్క ఘడియ మాత్రం మిగిలింది అర్ధరాత్రికి.
గాలి వానలో నౌక చిక్కుకున్నదని, బ్రాహ్మణులు కదలకుండా ఉండవలసిందని హెచ్చరించడానికి అతను వెళ్లినపుడు రుద్రభట్టు తన మనసులో అభిప్రాయం స్పష్టంగా వ్యక్తం చేశాడు.
“ఓ మహానావికా! శాండిల్యుడు ప్రశ్న శాస్త్రం చదువుకున్నవాడు. అతను ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఇంతవరకు వమ్ముకాలేదు. కొద్ది సేపటి కింద మేము మహాసాగరంలో ఎందుకీ గాలివాన వచ్చి సంక్షభం ఏర్పడిందని ప్రశ్నవేశాము. రాజహంసను ముంచివేయడానికి వరుణాది దేవతలు నిశ్చయించారని దానికి సమాధానం వచ్చింది. శాంతి మంత్రాలు, దిక్పాలుర స్తుతులు ఫలించలేదు.
దానికి కారణమడిగాము. యజ్ఞ విధులను నిందించే నాస్తికుడొకడు నౌకలో ఉండడమే దీనికి కారణమని తేలింది. నౌకను రక్షించడానికి మరేదీ మార్గం లేదని, శ్రమణుడిని తొలగిస్తే నూరుమంది బ్రాహ్మణులు, మహా నావికుడు, అతని పరివారం రక్షింపబడతారని మరొక సమాధానం వచ్చింది.
“ఓ మహానావికా! ఈ శ్రమణుడు శకునపక్షి! మంత్ర తంత్రాలు నేర్చినవాడు. తన మహిమ చేతనే ఈ సంక్షభాన్ని సృష్టించాడు.
క్షత్రియజాతి కాష్ఠంతో మరొక జాతి బల్ల అతకదన్నాడు. నౌకకు వేసిన రంగు సరికాదన్నాడు. నిశ్చలజలాలలో ప్రయాణం చేస్తేనే నౌక గమ్యం చేరుతుందన్నాడు. నౌక భగ్నమయితే చేపలు, జల జంతువులు మమ్మల్ని అందరినీ చీల్చి తింటాయన్నాడు. సాగరసలిలాలు రక్తవర్ణాలై… మరి నేను చెప్పలేను. అర్ధరాత్రి సరికి శ్రమణుడిని తొలగించవలసింది. నూరుమంది బ్రాహ్మణుల ప్రాణాలు నిలవాలంటే నువ్వు ఒక శ్రమణుడిని త్యాగం చేయాలి.”
మహానావికుడు ఉప నావికునికి ఏవో ఆజ్ఞలిచ్చి, తీవ్రమైన జంఝువును ఎదుర్కొని, సూదులవలె గుచ్చుకుంటున్న వర్షపు జల్లులలో ఈ వార్త తెలియ జేయడానికి శ్రమణుడి మందిరం చేరుకున్నాడు.
(సశేషం)