ఇట్లు కరోనా-10

0
5

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

10

[dropcap]పి[/dropcap]ల్ల గిచ్చుతుంటే పక్కకి తిరిగినా.. మాట్లాడేందుకు కూడా ఓపిక లేక పొట్ట పట్టుకుని సైగ చేసింది.. ఆకలని..

కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఈ పాడు నీళ్ళు తాగడానికి లేకపోయినా కళ్ళల్లో ఇంకా ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థం కావటంలా.. ఇప్పుడేం సేయ్యాలే..

బ్యాగ్లు వెతుక్కున్నా.. ఏం దొరకలేదు.. ఏదో పెడ్తానని ఆశగా చూస్తుంది నా బిడ్డ..

ఎవరో చెప్పకుంటే విన్నాను. ఇన్నా పొయ్యెలిగించి గిన్నెల రాళ్ళేసి వుడికిస్తూ ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించిందట ఓ తల్లి.. అది వుడుకుతయ్యి అప్పుడు మీకు పెడ్తానని.. నా దగ్గర ఆ రాళ్ళన్నా, పొయ్యి లేదాయే.. ఏం చేద్దును దేవుడా.. నెత్తి పట్టుకున్నా..

ఎవరో పరుగెడుతున్నట్లు అన్పించి కళ్ళు తెరిచా.. ఎవరో పొట్లాలు పంచుతుండ్రట.. అరుస్తూ పరుగెడుతున్నారు.. బిడ్డ వంక చూశా.. ఆశగా చూస్తుంది.. లేచా.. కుచ్చిళ్ళు దోపుకుని చెప్పులు పక్కన పారేసి పరుగందుకున్నా.. కాళ్ళ నుండి కారుతున్న రక్తం.. కళ్ళ నుండి జారుతున్న నీళ్ళు ఏదీ గుర్తురాలా.. ఆ గుంపులో దూరి అందర్ని తోస్తూ ముందుకు ఉరికా.. అడుగున 10 పులిహోర పొట్లాలు కన్పించాయి.. చాచే చేతులు వందలు..

‘అయ్యా! చిన్న పాపయ్య ఆకలితో చచ్చిపోద్ది.. ఒక్క పొట్లం ఇవ్వండయ్యా’ చేతులు జోడించి అడిగాను. అందరూ అలాగే వున్నారు. పాపం ప్రొద్దుట నుండి పంచుతూనే వున్నారు. ఎన్ని మాత్రం అందిస్తారు.. క్షణాల్లో అయిపోయాయి. నా చేతుల్లో ఒక్కటీ లేదూ.. కూలబడిపోయాను..

ఏడుపు తన్నుకొస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లే.. ఏదో చెయ్యి భుజం మీద పడింది.

కళ్ళెత్తాను.. ఓ బక్క పల్చని తాత.. ‘ఇదిగో అమ్మాయి.. తీసుకో… నిన్నటి నుండి చూస్తున్నా పాపకేం పెట్టలేదుగా తీసుకో’ అన్నాడు చేతిలో పులిహోర ప్యాకెట్ చూపిస్తూ..

‘మరి నీకు తాత’ అన్నాను…

‘మేం రాలిపోయే వాళ్లమే కదా.. పాపం పసిపాప.. ఈ ఎండకి ఎలా తట్టుకుంటుంది.. పెట్టమ్మా.. పో తీస్కపో..’ అంటూ నా చేతిలో పెట్టాడు.

వెకిలిగా నవ్వుతూ రంగడు వచ్చి దాన్ని లాక్కోబోయాడు. ‘ఏమిటి అందంగా ఉందని నువ్వు కన్నేసావా..’ అంటూ ముసలాయనను తోసాడు.

‘వెధవ అందరూ నీలాంటి కుక్కలే ఉంటారని అనుకుంటున్నావా పో..’ అంటూ కర్రతో ఒక్కటి వేశాడు తాత. తాతను గుర్రుగా చూస్తూ పక్కకు వెళ్లి పోయాడు రంగడు. నీరసంగా వెళ్లిపోతున్న తాతను చూస్తే జాలేసింది.

‘తాతా ఆగు’ అంటూ.. ప్యాకెట్ విప్పి సగం కొంగులో పోసుకుని ప్యాకెట్ తాతకు ఇచ్చేశాను. తాత కళ్ళల్లో నీళ్ళు మౌనంగా తీసుకొని వెనుదిరిగాడు.

కొంగులోకి చూసుకున్నాను. రెండు గుప్పెళ్ళ పులిహోర కనిపించింది. ఈ రోజుకి నా పాప బతికిపోయింది. ధైర్యంగా అడుగేశాను. కాలంతా ఒకటే నొప్పి.. నిలబడ్డ రాయి మీదంతా రక్తమే.. కాలు ఎత్తి చూసుకున్నాను. పెద్ద బొబ్బలు రెండు చిదిమిపోయి రక్తం కారుతుంది. నొప్పి కన్నా ఎక్కువగా ఒంటరిగా వదిలేసిన పాప గుర్తుకొచ్చి భయమేస్తుంది.

శక్తినంతా కూడదీసుకొని మళ్ళీ అడుగేశాను.. కూలపడిపోయాను..

‘అమ్మా ఆగు’ అంటూ వినపడిందొక గొంతు. వెనక్కి తిరిగి చూశాను.

పొట్లాలు పంచిన ఓ అమ్మాయి పిలుస్తుంది. నా స్థితి గమనించిందేమో.. పక్కనున్న బండి పట్టుకుని వచ్చింది.

‘రా అమ్మ.. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు.. దించుతాను’ అంది.

‘నా పాపను అక్కడ వదిలేసి వచ్చానమ్మా.. చిన్నపిల్ల.. నిన్నటి నుండి ఏమీ తినలేదు’ అన్నాను. నన్ను బండి మీద కూర్చోబెట్టుకుని రయ్యిమంటూ తీసుకొచ్చింది.

దూరంగా పాప దగ్గర రెండు కుక్కలు తచ్చాడుతున్నాయి. నా గుండె గుభిల్లుమంది. ‘అదిగో.. ఆ కుక్కలు కన్పిస్తున్నాయి, అక్కడ’ అన్నాను భయంగా.. బండి వేగం పెంచింది. పాప కాలి దగ్గర తచ్చాడుతున్న కుక్కని విసురుగా తన్ని పాపనెత్తుకున్నాను. ఈ హడావుడిలో నా కొంగులో వున్న పులిహోర చెల్లాచెదురుగా క్రిందపడిపోయింది.

కుక్కల బారి నుండి పాపని కాపాడుకున్నానా.. ఇంత కష్టపడి తెచ్చుకున్న అన్నం చేజార్చుకున్నానా అన్నది అర్థం కాక ఏడుపందుకున్నాను.

ఆ అమ్మాయికి నా పరిస్థితి అర్థం అయినట్లు వుంది. ‘ఇక్కడే వుండమ్మ’ అంటూనే ‘చిన్న పాపని ఎలా వదిలి వచ్చా’వంటూ మళ్ళీ వెనక్కు వెళ్ళింది.

కాసేపటికి టిఫిన్ డబ్బాతో వచ్చింది. ‘ఇక్కడ పొట్లాలు పంచేందుకు వచ్చిన వారెవరో ఉప్మా తెచ్చుకున్నారట.. తినమ్మా’ అంటూ ముందు పెట్టింది ఆర్తిగా.. చిన్నపిల్లయినా ఆ బిడ్డ కాళ్ళు మొక్కాలన్పించింది. మంచినీళ్ళ బాటిల్ కూడా అందించింది. పాపకు ముఖం కడిగి నా వొళ్ళో కూర్చొబెట్టుకుని తిన్పించాను.. ఎంత ఆకలిగా వుందో.. సగం డబ్బా ఖాళీ చేసింది బిడ్డ..

నడక మొదలెట్టాక కడుపునిండా ఇంత ఆత్మీయంగా దగ్గర కూర్చుని పెట్టిన ఆ అమ్మాయికి చేతులెత్తి మొక్కి ఆ డబ్బా కడిగి ఇచ్చేద్దామని నీళ్ళ వంక చూశాను. అవి కూడా కొన్నే వున్నాయి.

అర్థం చేసుకుని నవ్వి వున్న కాసిన్ని నీళ్ళూ నా బాటిల్లో పోసి ‘నీ దగ్గరే వుంచుకొమ్మా ఈ టిఫిన్ డబ్బా కూడా’ అంటూనే ‘కాళ్ళు ఇట్ల పెట్టుకుని ఎట్ల వెళ్తావు.. రేపు వెళుదువులే.. మా డేరాలో వుండు రాత్రికి’ అంది ఆ అమ్మాయి.

మళ్ళీ నన్ను నా బిడ్డని బండి మీద కూర్చోబెట్టుకని డేరా దగ్గరకి తీసుకొచ్చింది. అక్కడనే పాత రైస్మిల్ వుంది. అక్కడికి తీసుకొచ్చి ఎవరికో చెప్పి బాత్రూం చూపించింది. శానా రోజులైంది స్నానం చేసి ఆ నీళ్ళు చూశాక నా బిడ్డకి స్నానం చేయించి.. నేనూ స్నానం చేశాను.. ప్రాణం కాస్త కుదుటపడింది.

జాగ్రత్తగా వుండమని చెప్పి తన దగ్గరున్న బిస్కెట్ ప్యాకెట్ పాప చేతిలో పెట్టి ఆ అమ్మాయి వెనుతిరిగింది. కడుపు నిండ తిండి దొరికి స్నానం చేశానేమో.. అలా నిద్ర పట్టేసింది. తాను నిద్రపోయింది కానీ, నీకూ నాకూ నిద్రెలా పడుతుంది. తర్వాత జరిగే పరిణామాల్ని ఊహించనైనా లేం కదా మరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here