[dropcap]పు[/dropcap]డుతూనే పాలకోసం ఏడ్పు
అమ్మప్రక్కనేపాన్పు-
జంపాలతోపడక మార్పు-
బోసినవ్వుల ప్రపంచం-
కల్లాకపటం తెలియని చిరునవ్వు-
ఇదే జీవనయాన
మొదటి ప్రయాణం!!
బుడిబుడి అడుగులు
వడివడిగావేయాలనే తపన-
ముద్దులొలికె మాటలతో-
బడిలో కిప్రవేశం-
అమ్మ ఒడికి కాస్తవిరామం-
ఆపై విద్యార్ధిగా మరో సోపాన అధిరోహణం!!
కదలే కాలంతో- ఎదుగుదల-
పోటీ ప్రపంచాన ఎదురీత-
జీవితమెళకువల ఆకళింపయ్యే సమయం-
విద్యార్ధిగ జీవితం సమాప్తం.
ఉద్యోగ బాధ్యతలతో
సంపాదనా పరుడనే
మరో క్రొత్త బిరుదు,
అదనపు బాద్యత-
స్వీకారంతో-
జీవితంలో మూడవ దశకు ప్రవేశం!!
వివాహంతో క్రొత్త
బంధాలకు శ్రీకారం-
ఎన్నో అనుబంధాలు ఆవిష్కారం-
బాధ్యతలు కనులముందు సాక్షాత్కారం!!
సంసార బాధ్యతలతో
కుటుంబ సమస్యలతో
సతమతమయ్యే
మధ్యవయస్సుతో
కాలప్రవాహంలో
అలుపెరగని పయనం!!
బాధ్యతల నెరవేర్చి
సంతాన సౌరభాలను
సంతోష సందడి మధ్య అనుభవించి
ముదిమికి చేరిక-
జీవన యానంలో
చివరి ప్రయాణానికి
సిధ్ధమయ్యే ఆఖరిమజిలీ!!