గొంతు విప్పిన గువ్వ – 14

20
4

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

సా విరహే తవ దీనా…

[dropcap]E[/dropcap]very love story is beautiful and mesmerising but ours is eternal and my all-time favourite….

మేను వాల్చిన మరుక్షణం నా చేయి ఆయన వక్షం పైకి చేరి తన గుండెను సుతారంగా నిమిరేది. ఆయన కంపించే బలహీనమైన తన చేతితో నా చేతిని గట్టిగా పొదివి పట్టుకునేవారు.

నా చేయి ఆయనను పెనవేసుకున్నాకే ఆ మనసు సేద తీరేది.

నా హస్తం బరువు తన గుండెల మీద మోపాకే ఆయన బరువెక్కిన కన్రెప్పలు మూత పడేవి.

పక్కలో నేనున్నానన్న భరోసా కుదిరాకే ఏ మగత మందులు ఇవ్వని నిద్ర నిశ్చింతగా ఆయన దరి చేరేది.

నా చల్లని సమక్షమే డోలాయమానంగా ఊగిసలాడే ఆయన ప్రాణాన్ని కుదుట పరిచేది.

బాహువుల్లో బిడ్డ సురక్షితంగా ఒదిగితే అమ్మ మురిసినట్టు తను ప్రశాంతంగా పడుకుంటే నాకు మనశ్శాంతిగా వుండేది.

అసౌకర్యంగా ఇబ్బందిగా కదిలితే చిక్కిపోయిన ఆయన చంపలు తడిమి లాలనగా నిమురుతూ అడిగేదాన్ని “నిద్ర పట్టటం లేదా..”

“నువ్వొచ్చావుగా.. ఇక పట్టేస్తుంది” అప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకునేవారు.

“నీరసంగా వుందా” కన్నీటిని అదిమిపట్టి అడిగేదాన్ని.

“నువ్వున్నావుగా” శుష్కించిన కంఠంలో చిన్న ధీమా.

“ఒళ్ళు నొప్పిగా వుందా” నా గొంతులో జీర గుర్తించకుండా జాగ్రత్త పడేదాన్ని.

మళ్ళీ అదే జవాబు “నువ్వున్నావుగా”

కన్నీళ్ళ పర్యంతమయ్యేదాన్ని.

పక్కన నేనుంటే ఎంతటి నొప్పినయినా తట్టుకోగలనంటారు.

ఆయన నొప్పి నన్ను పెట్టే నొప్పిని తట్టుకోవటo నాకు మాత్రం కష్టంగా వుండేది.

నేనున్నానన్న ధీమాతో అన్నీ నేను చూసుకుంటానన్న నిశ్చింతలో ఆయనున్నారు.

ఏమి చేయాలో తెలియని, ఏమీ చేయలేని అసహాయతలో నేనున్నాను.

అమ్మతో కలిసి చేసిన ప్రయాణం పదహారేళ్ళయితే ఆయనతో చేసినది దానికి రెండింతల ప్రయాణం. ఆషామాషీ కాని ముప్పై మూడేళ్ళ సుదీర్ఘ జీవన సాహచర్యం.

ఎన్నెన్ని అనుభూతులు…

పాలు నీళ్ళలో లీనమైనట్టు మేమిద్దరం అభేదమై మమేకమైన అనేకానేక అద్వందాలు…

పొయ్యి మీద కూరలో పోసిన పాలు విరిగి ముక్కలైనట్టు మనసు చెక్కలై చెదిరిన సందర్భాలు కొన్ని…

విరిగిన పాలు తియ్యని కలాకంద్ అయి స్వీటుగా మారినట్టు విరిగిన మనసు మరుక్షణమే మైమరిచి తియ్యని తలపులతో ఉవ్విళ్ళూరిన సందర్భాలు ఇంకొన్ని…

పాలు తేయాకుతో కలిసినప్పుడు కలిగించే హుషారైన సందర్భాలు మరికొన్ని…

పాలకు పెరుగు బిళ్ళ తోడైనట్టు మనసు మొత్తంగా గడ్డకట్టుకుపోయి స్తబ్ధుగా మారిన సందర్భాలూ ఎన్నెన్నో…

నిజంగానే పాలంటి నేను ఎన్ని రూపులు దాల్చానో, ఎన్నెన్ని అనుభూతులు ఆస్వాదించానో…

జీవితం ఉగాది పచ్చడే. షడ్రుచుల మిళితం.

కాని కొత్తగా ఆయనలో నాపై పొంగి పొర్లే ప్రేమలో నిండా తడిచి ముద్దయ్యాక ఈ అనుభూతి రుచి అద్భుతంగా వుంది. ప్రేమించబడటంలోని అపురూప మాధుర్యం చవి చూసాక దానిని శాశ్వతం చేసుకోవాలన్న తపన, స్వార్ధం ఎక్కువయ్యాయి.

పసిబిడ్డగా మారిన తను మరీ అపురూపమై పోయారు.

బెడ్ రూం నుండి బాత్‌రూంలోకి నాలుగడుగులు వేయటానికి నా భుజాల పైన చేతులేసి తన బరువంతా నాపై మోపితే ఆ బరువు నేను కాపాడు కోవలసిన నా అమానత్ (ఆస్తి) అనే ఉద్వేగానికి లోనయ్యేదానిని.

జుట్టంతా రాలిపోయి నాలుగు వెంట్రుకలు మిగిలిన తలకు ఆప్యాయంగా నూనె రాస్తూ ఆ తలను గుండెలకదుముకుని విచలితురాలినయ్యేదాన్ని.

 “ఏలియన్‌లా విచిత్రంగా కనిపిస్తున్నాను కదూ” అనడిగేవారు.

“ఊహూ… నా బంగారు కొండలా వున్నారు. అయినా ఈ ఆఖరి సైకిల్‌తో కీమో పూర్తయి పోతుంది. ఒకసారి కీమో ఆపేసాక జుట్టు మామూలుగా వచ్చేస్తుంది. అంతే. మన తిరుపతి వెంకన్నకు ఇచ్చాననుకోండి తలనీలాలు” నవ్వాలనుకునే నా ప్రయత్నం విఫలమయ్యేది.

తన ప్రతిబింబం తను చూసుకునే అవకాశం లేకుండా వెంటనే ఇంట్లో అద్దాలన్నీ తీసేసాను.

స్టూల్ మీద కూర్చోబెట్టి ఒళ్ళు రుద్ది తువ్వాలుతో అద్ది కీమో వేడికి పొరలు పొరలుగా విడిపోతున్న చర్మానికి మోయిశ్చరైజర్ రాసి న్యాపీ తొడిగేప్పుడు అనిపించేది భార్యను ‘భోజ్యేషు మాతా’ అంటారే గాని ఎన్ని చర్యల్లో సతి పతికి అమ్మవుతుందో కదా…

దురదృష్టవశాత్తు అమ్మలా గోరుముద్దలు తినిపించే అవకాశం కోల్పోయాను. ఆయన కొద్ది రోజులుగా లిక్విడ్ ఫుడ్ మీదే ఆధార పడ్డారు. అది కూడా ముక్కు ద్వారా పైపు గుండా..

అదీ నేను స్వయంగా నా చేత్తో పోస్తేనే తనకిష్టం. నా ఉద్యోగ నిర్వహణలో తప్పని రోజున ఒక్కోసారి తమ్ముడు రమణ పోయక తప్పేది కాదు. నన్ను మెప్పించటం కోసం అయిష్టంగా అయినా తాగేసే వారు.

నేను ఆఫీసు నుండి రాగానే చిన్న పాపాయిలా సూపు, ఎన్సూర్, బాదంపాలు అన్నీ తాగేసానని కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చేవారు.

నేను ‘గుడ్ బాయ్’ అంటే ఆడపిల్లలా సిగ్గుపడేవారు.

దాదాపు మూడు సంవత్సరాలు రేడియోథెరపీ, కీమోథెరపీ, స్కానింగ్స్, రొటీన్ చెక్ అప్స్ కోసం రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెడుతూ వుండేదాన్ని.

ఒకప్పుడు నేను కారు డ్రైవ్ చేస్తానంటే “ఆడదాయి డ్రైవ్ చేస్తే ఆడంగి వెధవలా పక్కన కూర్చోవాలా” అనే పితృస్వామ్య పరాయణుడు పసిపిల్లాడిలా బుద్దిగా పక్కన కూర్చొంటే నా గుండె పిండేసినట్టుగా వుండేది.

ఎందుకో ఆయన అసహాయతలో లొంగుబాటుతనం కన్నా లెక్కచేయనితనంలో పొగరుబోతుతనమే నాకు నచ్చేది.

ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై తలబిరుసుతో తలెగరేసుకు తిరిగే రోజు కోసం శత విధాల శుశ్రూషలు చేస్తూ సహస్ర దేవుళ్ళను ప్రార్థించేదాన్ని.

ప్రేమ పిచ్చిది. నాకు ఆయనపై ప్రేమ మరీ పిచ్చిది. పూలెలా పరిమళాలు వెదజల్లుతాయో, చంద్రుడెలా వెన్నెల రువ్వుతాడో, సెలయేరు ఎలా నిర్విరామంగా ప్రవహిస్తుందో అలాగే అంతే సహజంగా నిరంతరం సతులు పతులను ప్రేమిస్తారనుకుంటా.. ఆ పతి ఎట్టివాడగునేని. మూడు ముళ్ళ బంధం ఆషామాషీ కాదు మరి.

ఆయన తను రిటైర్ అయ్యాక యూరోప్ ట్రిప్ చేద్దామన్నారు. నేను పెద్దగా ట్రావెల్ లవర్‌ని కాదు కాని లవర్‌తో ట్రావెల్ అంటే మోహమే. ఇష్టసఖునితో పయనం ఎవరిష్టపడరు. అప్పటివరకూ ఇద్దరం విడివిడిగా ప్రయాణించాము. జీవితం వెనుక నేను పరుగులు పెడితే జీవితంలో రుచుల వెనుక ఆయన పరుగులెట్టారు. ఇద్దరం కలిసి ప్రయాణించే సమయం వచ్చేసరికి ఆయన జీవితం కుంటుపడింది. ఏడడుగుల అనుబంధాన్ని బలోపేతం చేసి మరి కొన్ని అడుగులు కలిసి వేయాలని ఆశతో చాలా ఆరాట పడ్డాను.

కుంటుపడ్డ ఆయన జీవితాన్ని సరిచేసుకోవాలి. సరిచేసుకోగలను. సరిచేసుకుంటాను.

కీమో ట్రీట్మెంట్ ఆఖరి సైకిల్ పూర్తయ్యింది. ఇంక శరీరంలో రక్త కణాలు నాశనమయ్యేది లేదు. మనిషి నీరసించేది లేదు.. రోజింత రేణింపుతో ఆరోగ్యం పుంజుకోవటమే తరువాయి.

నేను తన పక్కన వుండగా అసాధ్యమేమీ లేదు. ఆ యముడితోనైనా హోరాహోరీ యుద్ధం చేసే ధైర్యశాలిని నేను.

ఆ రోజున ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి తమ్ముడు రమణ ఫిర్యాదుగా అన్నాడు.

“బావ ఇప్పటివరకూ బాదం పాలు తాగలేదక్కా. ఇప్పుడే నువ్వొచ్చే వేళయిందని నువ్వు కోప్పడతావని కష్టబడి తాగేశారు…” కోపం నటిస్తూ ఆయన వంక చూసాను.

దొంగ దొరికిపోయినట్టుగా చూస్తూ సంజాయిషీగా ముసిముసిగా నవ్వారు.

తన చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ “త్వరగా కోలుకుని, ముక్కులో పైపు తీయించేసుకుని లేచి తిరగాలని లేదా. టైం ప్రకారం ఆహారం కడుపులో పడితేనే కదా త్వరగా కోలుకునేది. నేనేమో పిచ్చిదానిలా మన యూరప్ ట్రిప్పు కోసం ఎదురు చూస్తూ కలలు కంటున్నాను..” నా మాట కంపించింది.

తనూ చలించిపోయి “ఇవాళ ఏమిటో నాకు బాలేదురా.. ఏమీ తాగాలనిపించటం లేదు” అన్నారు దిగులుగా.

నేను కంగారుగా “అయ్యో, ఏమయ్యింది” అంటూ హత్తుకున్నాను.

“నువ్వొచ్చేసావుగా, ఇంక బావుంటుందిలే. నువ్వు పక్కనే వుండు. నాకేమీ కాదు” అంటూ కళ్ళు మూసుకున్నారు.

ఓ అరగంట అయ్యాక కళ్ళు తెరిచి ఏదో బాధను దిగమింగుతూ తనను ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారు.

ఒక క్షణం ఆయనను తేరిపార చూసి “లెండి, బయిలుదేరదాం” అని ఆసరాగా చేయి అందించాను. లేవలేకపోయారు.

నేను కంగారుగా “రమణా, బావ లేవలేకపోతున్నారు చూడు..” అని తమ్ముడిని కేకేసాను. ఆ ఊహించని హటాత్పరిమాణానికి నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. రమణ ఆయన నడుం కింద చెయ్యి పెట్టి లేపి మంచం పైన కూర్చోబెట్టి పట్టుకున్నాడు.

ఆయన చక్రాలున్న కంప్యూటర్ రివాల్వింగ్ కుర్చీ తెమ్మన్నారు. నేను పరిగెత్తుకు వెళ్ళి కుర్చీ లాక్కొచ్చాను. కుర్చీని మంచానికి దగ్గరగా పెట్టి పట్టుకుంటే, రమణ ఆయనను జాగ్రత్తగా ఎత్తి కుర్చీలోకి లాగాడు. కుర్చీని వీధి గుమ్మం దాకా లాక్కొచ్చి, కారుని గుమ్మం ముందుకు తెచ్చి పెట్టాను. మరో మనిషి సాయంతో తనను రమణ కారు వెనుక సీట్లో పడుకోపెట్టాడు.

ట్రీట్మెంట్ అంతా అయిపోయిందని రిలీఫ్ గా వుండగా అనుకోని దుర్ఘటనకు షాకుతో నా ఒంట్లో సన్నటి కంపనతో నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అదుపు తప్పే స్పీడులో పది నిముషాల్లో యశోదా హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర కారాపి లోపలికి పరుగెత్తుకు వెళ్ళి స్ట్రెచర్ సిబ్బందితో వచ్చాను.

వెంటనే ఎమర్జన్సీలో అడ్మిషన్ చేసేసి స్పెషల్ రూములో ఏవేవో ఆధునిక పరికరాలు ముక్కుకి, చేతులకు, కాళ్ళకు తగిలించి పడుకోపెట్టారు.

ఆయన నా చేతిని గట్టిగా తన చేతుల్లో బిగించి పట్టుకున్నారు.

అరక్షణం కనుమరుగయితే మరింక ఎప్పటికీ నన్ను చూడలేనేమోనన్నంత ఆపేక్షగా నా కళ్ళల్లోకి చూస్తున్నారు.

తననొదిలి ఎక్కడికీ వెళ్ళొద్దన్నారు. నేను లేని క్షణంలో ఎక్కడ తన ప్రాణం చేజారి పోతుందోనన్న భయం.

ఒంట్లో తెలియని బాధగా వుందన్నారు. దొడ్లోకి వస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. నేనే కష్టబడి లేవనెత్తి కింద ట్రే పెట్టాను. ఆయన భ్రమే తప్ప విరోచనం కాలేదు.

అంతవరకూ పైకున్న మడిచిన మోకాళ్ళు పట్టు తప్పి రెండు పక్కలకూ పడిపోయాయి. నాకు భయం వేసింది. నా చేతిని పట్టుకున్న ఆయన చేయి పట్టు సడలింది. వెంటనే నా గుప్పిటలోకి తన చేతిని తీసుకున్నా.

గబుక్కున నర్సు కోసం లేవబోయాను. ఆర్ద్రమైన ఆ కళ్ళల్లో తననొదిలి వెళ్ళొద్దన్న అభ్యర్ధన.

ఠక్కున ఆగిపోయి బటన్ నొక్కాను. నర్సు పరిగెత్తుకొచ్చింది.

“ఆయనకేదో అయిపోతోంది. మాటాడలేకపోతున్నారు. తొడలు పక్కకు నిస్త్రాణంగా పడిపోయాయి” అంటూ ఘొల్లుమన్నాను.

పడిపోతున్న పల్స్ చెక్ చేసి ఐసీయూలోకి మార్చాలంటూ స్టాండుకు తగిలించి వున్న సెలైన్ బాటిలు తీసి బెడ్ మీద పెట్టి, ముక్కుకి ఆక్సిజన్ సప్లై తగిలించి బెడ్ కున్న వీల్స్ అన్లాక్ చేసి ఆ మంచాన్ని అలాగే ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు.

ఐసీయూ గుమ్మం దగ్గర నన్ను ఆపేశారు.

“తనతో నేనుండాల్సిందే” అన్నాను.

“సారీ.. యు కాంట్ బి ఇన్ ఐసీయూ” అన్నారు.

తనను నా చూపుకందనంత దూరం పెట్టేసారు. విలవిలలాడి పోయాను. అక్కడున్న ఇంచార్జీని వేడుకున్నాను. నేను ఆయన పక్కన వుండటం అవసరం అని ప్రాధేయపడ్డాను. వాళ్ళు కనికరించలేదు.

భోరున ఏడుస్తూ రేపో మాపో కనటానికి సిద్దంగా వున్న ఆస్ట్రేలియా అమ్మాయికి ఫోను చేసి చిన్నపిల్లలా ఫిర్యాదు చేసాను.

అమ్మాయి ఇంచార్జీకి తనను పరిచయం చేసుకుని ఆయన పరిస్థితిని తెలుసుకుని డాక్టరుతో వెంటిలేటర్ పెట్టే ఆప్షన్ గురించి మాటాడింది.

“అవన్నీ కాదు, ముందు నేను డాడీ పక్కన వుండాలి అని వాళ్ళకు చెప్పు” అని వెక్కి వెక్కి ఏడ్చాను.

“అనారోగ్యంలో మనిషికి కావాల్సింది ఏమిటి. తన అనుకున్న వాళ్ళు తన పక్కన వుండటం.. తను ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడటం నేను బయట వుండటం అమానవీయం… అన్యాయం… హాస్పిటల్ రూల్స్ మార్చండి… ఆ క్షణంలో మనిషి కోరుకునేదేమిటి…?” అంటూ విద్యాహీనురాలిలా అరుస్తూ సంస్కారం మరిచి అక్కడ ఎంత రభస చేయాలో అంత రచ్చా చేసేసాను.

నా ఆక్రందనలకు గుమి గూడిన జనాన్ని చూసి నన్ను అక్కడి నుండి ఇంకా దూరం తరిమేశారు.

ఇంతలో ఆఘమేఘాల మీద డాక్టరైన నా స్నేహితురాలు డాక్టర్ సంతోష్ వచ్చింది. అమ్మాయి ఆస్ట్రేలియా నుండి తనకు కాల్ చేసిందట. నన్ను సముదాయించి అక్కడి ఇంచార్జీతో మాటాడింది.

నా అవసరం వున్నప్పుడు లోపలికి పిలుస్తామన్నారు. వెంటనే నా స్నేహితురాలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పని చేస్తున్న వాళ్ళ అన్నయ్యకు కాల్ చేసింది. బాగా సీనియర్ డాక్టర్ అయిన వాళ్ళన్నయ్య రిక్వెస్ట్ మీద ఒక్కసారి మాత్రమే నన్ను లోపలికి పంపారు.

పెద్ద బెలూన్‌లా ఏదో సంచి ఆయన ముక్కూ నోటికి కలిపి తగిలించి వుంది. దానిలో బ్లడ్ కనిపిస్తోంది. ఆయన బ్లీడ్ అవుతున్నారు. లోపల మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యిందట. కాని నన్ను చూసిన ఆ కళ్ళల్లో ఎన్ని కాంతులో.. ఆ కళ్ళు ఎన్ని ఊసులు వినిపించాయో, ఎన్నెన్ని జాగ్రత్తలు చెప్పాయో, నా మిగిలిన జీవితానికి ఎంత భద్రతను చేరవేసాయో..

ఎన్ని నివేదనలో, ఎన్ని మన్నింపులో, ఎంత ప్రేమో…

తిరుమలలో అరక్షణంలో శ్రీనివాసుని విగ్రహం ముందు నుండి భక్తులను తరిమేసినట్టు నన్ను నా శ్రీనివాసును పక్క నుండి అర క్షణంలో బయటకు పంపేశారు.

బయట కూర్చుని నా స్నేహితురాలి చెయ్యి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని నా సాయి ప్రార్థనలు మొదలెట్టాను…

ఆ భగవంతుడేదో మిరాకల్ చేస్తాడని ఏదో విశ్వాసం. ఆ ప్రార్థనలేవో ఆయన పక్కనే కూర్చుని చేయాలని భగవంతుని అక్కడే సాక్షాత్కరింప చేసి ఆయన దీన స్థితిని చూపించాలని పిచ్చి ఆరాటం.

అయినా సర్వాంతర్యామికి నేను చూపేదేమిటి…

అర్ధరాత్రి వేళ నేను దేముడితో లాలూచీ పడుతున్న సమయంలో “మిసెస్ శ్రీనివాస్ ఎవరు ఇక్కడ.. ఒకసారి లోపలికి రావాలి” అని పిలిచారు.

ఒక్క అంగలో లోపలికి ఉరికాను.

అప్పటివరకూ నా కోసమే ప్రాణాన్ని నిలుపుకున్నట్టు అలా నా కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలను అనంత వాయువుల్లోకి వదిలేసారు.

తెరిచి వున్న ఆ కంటిపాపల్లో ముద్రించుకున్న నా చిత్రాన్ని చూస్తూ చిత్తరువునై పోయాను.

ఆయన మరణించారని నిర్ధారణ చేసారు.

మరణమంటే…?

ఎప్పటికీ మేల్కోని నిద్రా…

ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారా

మరింకెప్పటికీ లేవరా.. ఇక నాకు తోడుగా వుండరా..

మొన్న రాత్రి ఆయన పక్కనే పడుకున్నాను కదూ.

నిన్న ఒక్క రాత్రేగా ఐసీయూలో నేను లేకుండా పడుకున్నది.

ఇక ఎప్పటికీ నా పక్కన వుండరా…

నిన్నటి వరకు వున్న నా ప్రియ బాంధవుడు ఈ రోజున లేకపోవటమే మరణమా…

చెరో దేశంలో వుండి కన్నీరు మున్నీరవుతున్నఆయన ఇద్దరు కూతుళ్ళు రాలేని దుస్థితి..

ఒకరు అప్పుడే బిడ్డను కని.. మరొకరు కనటానికి సిద్దంగా వుండి…

అందరూ తర్జనభర్జనలు పడుతున్నారు. ఆయన దేహానికి అంతిమ సంస్కారం ఎవరు చేస్తారని. బంధువుల్లో ఎవరితోనయినా దహనసంస్కారం చేయిద్దామని మా వాళ్ళ ఆలోచన.

నా ఆఫీసులో సగం స్టాఫు, ఆయన ఆఫీసు మొత్తం ఆయన పార్థివ దేహం చుట్టూ చేరిపోయారు.

ఆఫీసు నుండి కమాండెంట్, మా అడ్జుటెంట్ కెప్టెన్ లావణ్య త్రిపాటిని నాకు ఆసరాగా వుండమని అన్ని అవసరాలు దగ్గరుండి చూడమని పంపారు. మూర్తీభవించిన శోకoలాంటి నన్ను చూసి బిరుసైన ఖాకీ బట్టల్లో ఆ పాతికేళ్ళ అమ్మాయి చమ్మబారిన మనసుతో కలత బారిపోయింది.

మాలో ఆడవాళ్ళు స్మశానవాటికలో అడుగుపెట్టే ఆనవాయితీ లేదు… ఆడాళ్ళు ఎంతటి ప్రియులకైనా ఇంటి గుమ్మం దగ్గరే వీడ్కోలు చెబుతారు. కాని నా ప్రాణానికి సర్వం నేనే చేయాలి. నా ముప్పై మూడేళ్ళ సహచరుడి చితికి ఎవరో నిప్పంటించటమేమిటి.

నో వే…

అప్పటికి ఎవరో ఒకరిద్దరు స్త్రీలు తల్లికి స్వయంగా అంత్యక్రియలు చేసారన్న వార్తలు చాలా హల్చల్ చేస్తూ పెద్ద విశేషంలా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేనేదో భర్త చితికి నిప్పంటించిన భార్యగా వార్తల్లోకి ఎక్కాలని లేదు…

ఏదో రికార్డు సృష్టించాలని కాదు..

నా పతికి ఆఖరి వీడ్కోలు నా చేతుల మీదుగా ఇవ్వాలన్న తపన మాత్రమే…

తడి చీరలో, తడిచిన గుండెతో, తడారని కళ్ళతో ఆయనకు బిదా పలుకుతూ ఆ శుక్రవారం సాయంత్రం భోరున ఏడుస్తూ స్మశానంలో నేను…

ఎప్పుడూ స్మశానం మొహం చూసి ఎరుగని నా ప్రియమైన స్నేహితురాళ్ళoదరూ అక్కడే నాతో పాటే ఆ పూట…

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here