జ్ఞాపకాల పందిరి-31

77
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అది.. విచిత్రంగా జరిగిపోయింది..!!

[dropcap]జీ[/dropcap]వితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. జాతకాలు, హస్త సాముద్రికాలూ, జ్యోతిష్యాలు, ఎప్పుడూ నూటికి నూరు పాళ్ళు నిజాన్ని విప్పి చెప్పలేవు. వాటిని నమ్మేవాళ్ళు గురించి, నమ్మని వాళ్ళ గురించి ఇక్కడ చర్చించే ఉద్దేశం లేదు కానీ, జీవితాన్ని బట్టి, జీవితంలో ఎదురైన అనుభవాలిని బట్టి కేవలం ఈ వ్యాసం రచయిత ఉద్దేశం ఇది.

అనుకున్నవి కొన్ని ఎంత శ్రమించినా కార్య రూపం దాల్చవు. పైగా నిరాశా నిస్పృహలతో జతకట్టి బ్రతుకును మరింత వ్యధాభరితం కావిస్తాయ్! జీవితంలో అది సురపలేనంత మచ్చగా మిగిలిపోతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతే, అంతకు మించిన జీవితం మరేమి ఉంటుంది? అంతకు మించిన స్వర్గం మరెక్కడో ఉండదు, కానీ సమస్య వచ్చేడల్లా అనుకున్నది, అనుకున్నట్టుగా జరగక పోవడమే..!

ఎన్నడూ, ఏ విధంగానూ, ఊహల్లో కూడా, వూహించనివి, జరిగితే అంతకు మించిన సంతోషం మరేమి ఉంటుంది? మొత్తం జీవితానందానికి, అది కేటలిస్టుగా పనిచేసి, యావత్ జీవితాన్ని ఆనందభరితం చేస్తుంది. చెప్పుకోరుగానీ చాలామంది జీవితాల్లో, ఈ రెండు రకాల అనుభవాలు చాలామందికి ఎదురౌతాయి. కొందరు విషయం ఎలాంటిదైనా సర్దుకుపోయే గుణాన్ని కలిగి వుంటారు. కానీ అనుకున్నవి జరగనప్పుడు కొంతమంది తొందరపడి మిగిలిన జీవితాన్ని వృథా చేసుకుంటారు. ఎవరి గురించో ఎందుకు? నా విషయంలో నేను ఊహించని కొన్ని మంచి విషయాలు, జీవన శైలినే మార్చేసిందంటే, చాలామందికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏమిటంటే అంశం అలాంటిది మరి!

నా ఉద్యోగ జీవితం నాటి మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో 1982 జూన్‍లో ప్రారంభమైంది. నేను కథా రచయితగా ఆరంగేట్రం చేసింది అక్కడే! ‘దంత సంరక్షణ’, ‘చిన్న పిల్లలు – దంతసమస్యలు’ పుస్తకాలు (నవభారత్ బుక్ హౌస్ / పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ) ముద్రణకు నోచుకున్నది ఇక్కడే! ‘సారస్వత మేఖల’ అనే సాహిత్య సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసి చేతనయినంత సాహిత్య సేవచేసే అవకాశం దక్కింది ఇక్కడే! ‘వార్తాలహరి’ అనే ప్రాంతీయ పత్రికలో పిల్లల దంత సమస్యల గురించి సీరియల్‌గా రాసింది ఇక్కడే! రెండుసార్లు భారత్ వికాస్ పరిషత్ అనే సేవా సంస్థకు అధ్యక్షుడిగా వుండి, ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఇక్కడే!ఆకాశవాణి -వరంగల్ కేంద్రం నిర్వహించిన రెండురోజుల ఆహుతుల సమక్షంలో రేడియో కార్యక్రమాలకు, చాతనయినంత సహాయం చేసే అవకాశం కూడా ఇక్కడే వచ్చింది. అదిగో.. ఆ నేపథ్యంలో ఆకాశవాణి అధికారులు మహబూబాబాద్‌కు విచ్చేసారు. అందులో అప్పటి స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యుటివ్ శ్రీనివాస్ రెడ్డి, మంత్రవాది సుధాకర్, అనౌన్సర్ మడిపల్లి దక్షిణామూర్తి,ఇతర సాంకేతిక సిబ్బంది వచ్చారు.

అప్పుడు నాకు చేతనైనంత సహకారం నేను వారికి అందించాను. మంత్రవాది సుధాకర్ అప్పటికే నాకు పరిచయం. ఆయన దక్షిణామూర్తిని పరిచయం చేయడంతో, ఆయనతో నాకు మైత్రి చాలా బలపడింది. అది ఇప్పటికి చక్కగా కొనసాగడం నాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే అంశం. ఈ పరిచయాల నేపథ్యంతో నేను 1994లో మహబూబాబాద్ నుండి జనగాంకు బదిలీ కావడంతో, నా శ్రీమతి బ్యాంకు ఉద్యోగిగా వరంగల్‌కు బదిలీ చేయించుకోవడం మూలాన నివాసం హనంకొండకు మార్చవలసి వచ్చింది. ఆ సందర్భంలో, మిత్రుడైన దక్షిణామూర్తి, శ్రీ డి. వి.శేషాచార్య గారిని పరిచయం చేసారు. వీరిద్దరూ కలిసి ప్రొఫెసర్ కోవెల సంపత్కుమారాచార్య గారిని, కోవెల సుప్రసన్నాచార్యులవారిని పరిచయం చేయడం జరిగింది (వీరిద్దరికి కృత్రిమ దంతాలు అమర్చే మహదావకాశం నాకు కలిగినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను).

శ్రీ డి. వి.శేషాచార్య

శేషాచార్య పరిచయం నా జీవితంలో మరచిపోలేని మధుర ఘట్టం. నా బతుకు పుస్తకంలో అది గుర్తుంచుకోదగ్గ అధ్యాయం. దానికి ముఖ్య కారణం ఏమిటంటే,శేషాచార్య నన్ను -ప్రత్యక్షంగా ‘ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ’కు, పరోక్షంగా వరంగల్ సాహితీ రంగానికి (శ్రీరంగస్వామి వగైరా పెద్దలు) పరిచయం చేసి పుణ్యం గట్టుకున్న మహానుభావుడు. అలా సహృదయ సంస్థకు అతి చేరువ అయ్యే అదృష్టం నాకు దక్కింది. సహృదయ సంస్థలో చేరి అందులో పనిచేయడం నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తాను. కారణం ‘సహృదయ సాహిత్య -సాంస్కృతిక సంస్థ’ ఒక ప్రతిష్ఠాకరమైన సంస్థ కావడమే. సాహిత్యానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తున్న సంస్థ ఇది. నాకు తెలిసీ వరంగల్ లోని కొద్దిమంది ఉత్సాహవంతులైన పెద్దల ఆలోచనతో ఈ సంస్థ పురుడుపోసుకుంది. ఆ సమయానికి వరంగల్లులో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రసిద్ధ సహజ కవి, అవధాని, సహృదయ మిత్రులు డా. కవితా ప్రసాద్ గారు పనిచేయడం ‘సహృదయ’ కు కలిసి వచ్చింది. ఆయన ఆలోచనలతో, సహకారంతో, పెద్దలు శ్రీ గన్నమరాజు గిరిజమానోహర్, డా, ఏ. వి. నరసింహారావు, శ్రీ వనం లక్ష్మీ కాంతారావు, శ్రీ దర్భశయనం శేషాచార్య మొదలైన వారి విశేష కృషితో సంస్థ ఆవిర్భావం జరిగినట్టు తెలిసింది. ప్రస్తావనకు రాని పెద్దలు ఇంకా చాలా మంది ఉండవచ్చు. సంస్థ ‘చిహ్నం’రూప కల్పన చేసిన స్వర్గీయ రాళ్లబండి కవిత ప్రసాద్ గారు, సహృదయకు ‘మేనమామ’ గా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

సహృదయ సాంస్కృతిక సంస్థ బృందం

ఇక అసలు విషయానికి వస్తే, నాకు 1994లో సహృదయ సభ్యుడిగా సంస్థతో అనుబంధం ఏర్పడేనాటికి, డా. ప్రసాద రావు గారు సంస్థకు అధ్యక్షుడిగా వున్నారు. ఆయన హయాంలోనే నా ‘దంతాలు- ఆరోగ్యం’ అనే పుస్తకం ఆవిష్కరణ, వరంగల్ జడ్.పి.హాల్‌లో అత్యంత వైభవంగా జరిగినట్టు నాకు బాగా గుర్తు. ఆవిష్కరణ కోసం ప్రత్యేకంగా దంతవైద్యులు (నిలోఫర్ హాస్పిటల్) డా. ఎ.ఎస్. నారాయణ గారు, నా కోరిక మన్నించి రావడం మరచిపోలేని విషయం. డా. లక్ష్మణ మూర్తి గారూ, డా. అంజనీ దేవి గారు, డా. సుధాకర్ రెడ్డి గారు (సభాధ్యక్షులు), జనగాం నుంచి ప్రొఫెసర్ అంజయ్యగారు ,తదితరులు వేదికను అలంకరించినట్టు గుర్తు.

సహృదయ సంస్థలో అనేకమంది పండితులు, విద్యావంతులు, సాహిత్యకారులు ఉన్నప్పటికీ, నన్ను సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇప్పటికీ నాకు అర్థం కానీ అంశమే! అంతమాత్రమే కాదు, సుమారు 13 సంవత్సరాలు నన్ను అధ్యక్షుడిగా కొనసాగించడమూ ఆశ్చర్యం గొలిపించే విషయమే! ఈ సమయం సమాజంలో మరోమనిషిగా నన్ను మార్చివేసింది. సహృదయ సంస్థ అన్నా, సంస్థ బాధ్యులు అన్నా, సభ్యులు అన్నా, సమాజం లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. నాకు తెలియని ఎందరో వ్యక్తులు ఎక్కడో ఒకచోట నన్ను గుర్తుపట్టి, ‘మీరు ఫలానా సంస్థ అధ్యక్షులు కదా!’ అని పలకరించినప్పుడు నా మనసు ఎంతగానో పులకించి పోయేది. ప్రధానంగా సాహిత్య -సాంస్కృతిక కార్య క్రమాలతో ముడిపడి వున్నసంస్థ ‘సహృదయ ‘కావడం మూలాన, నేను ఊహించని వ్యక్తులతో, కళాకారులతో, పండితులతో, అవధానులతో, వైద్యులతో, గాయకులతో, సాహిత్యకారులతో, సినిమా పెద్దలతో, వివిధ రంగాలకు చెందిన అధికారులతో, దాతలతో పరిచయాలు ఏర్పడడం, వారితో కలసి వేదిక పంచుకోవడం వంటివి మరచిపోలేని మధురఘట్టాలు. వరంగల్‌కు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ల వేణు మాధవ్ గారిని, మైమ్ కళాకారుడు కందకట్ల కళాధర్, డా. అంపశయ్య నవీన్, డా. లక్ష్మణ మూర్తి, ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తి, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య, శ్రీ కోవెల సుప్రసన్నాచార్య, శ్రీ పేర్వారం జగన్నాధం వంటి వారిని చూస్తానని, వారితో పరిచయాలు ఏర్పడతాయని నేను ఎన్నడూ ఊహించలేదు. ఇది సుమారు 90 శాతం సహృదయ వల్ల మాత్రమే సాధ్యపడిందని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను, అది అతిశయోక్తి కూడా కాదని చెప్పగలను.

డా. మైలవరపు శ్రీనివాసరావు గారికి సన్మానం
శ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ గారితో

స్వయంగా సాహిత్యాభిలాషిని గనుక సంస్థ చేపట్టిన అనేక సాహిత్య కార్యక్రమాల ద్వారా నన్ను నేను ఆ మార్గంలో సరిదిద్దుకోగలిగాను. అంతేకాదు, సహృదయ చేపట్టిన మరొక ముఖ్యమైన కార్యక్రమం, మూడు రోజుల నాటకోత్సవాలు (పోటీలు). నాకు నాటకం అన్నా, ముఖ్యంగా హాస్యనాటకం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ మూడు రోజుల కార్యక్రమం నాలో ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్ని రేకెత్తించేది.

చివర బహుమతుల ప్రధానం రోజున సమావేశం చాలా బాగుండేది. ఇలాంటి సందర్భాలలో, సర్వశ్రీ గొల్లపూడి మారుతీరావు, రావి కొండల రావు, రాళ్లబండి, నేరెళ్ల వేణుమాధవ్, రావూరి భరద్వాజ, జీడిగుంట రామచంద్రమూర్తి, కవితా ప్రసాద్, నవీన్ వంటి పెద్దల సరసన వేదికను పంచుకునే అదృష్టం నాకు కలిగింది. నాటక ప్రక్రియ పట్ల నాకున్న అభిరుచి, మా అక్క స్వర్గీయ కుమారి కానేటి మహనీయమ్మ మీద వున్నఅమితమైన ప్రేమను బట్టి, నాటకోత్సవాలకోసం మా అక్క పేరున ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు విరాళం ఇచ్చే అవకాశం నాకు సహృదయ కల్పించింది. ఇది నాకెంతో తృప్తి నిచ్చే అంశం. ఇది సహృదయ ఉన్నంత కాలం,నేను బ్రతికి ఉన్నంత కాలం కొనసాగుతూనే ఉంటుంది.

సహృదయకు కేంద్రబిందువు శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరాబాబు. నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్య దర్శిగా కలిసి పనిచేసిన రోజులు గుర్తుంచుకోదగ్గవి. ఆయన సహృదయ సంస్థ సజావుగా నడవడానికి, తెలుగు ప్రజల్లో పేరు ప్రతిష్ఠలు రావడానికి కారణం అయింది. స్వయంగా సాహిత్యకారుడూ తెలుగు పండితుడు కావడం మూలాన, సాహిత్యకార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ఆయన అందెవేసిన చేయి. అందుకే మహామహులు సహృదయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గరికపాటి, మైలవరపు శ్రీనివాస రావు, ఎల్.బి. శ్రీరామ్ వంటి పెద్దలు వీరి పరిచయం తోనే సహృదయకు దగ్గరయ్యారు. అందరితోనూ చక్కని స్నేహ సంబంధాలు కొనసాగించిన గొప్ప సహృదయత ఆయనది. నిరంతర సాహిత్య కృషీవలుడు ఆయన. గిరిజామనోహర్ బాబు మనసు ఎంత స్వఛ్చమో, ఆయన చేతివ్రాత అంత ముత్యాల్లా గుండ్రంగా ఉంటాయి. ఆయన ప్రార్థనా శ్లోకంతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యేవి. ఆయన ఉపన్యాసం వినసొంపుగా ఉంటుంది. ఆయనతో స్నేహం మరువలేనిది. స్వయంగా నటుడు,నాటక ప్రియుడు అయిన శ్రీ వనం లక్ష్మీ కాంతారావు, సాంస్కృతిక కార్యదర్శిగా ఉండేవారు. సహృదయ సంస్థకు ఆయన ఒక గట్టి స్తంభం లాంటివాడు. క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత నిచ్చేవాడు. ఇంచుమించు తెలుగు రాష్ట్రాలలో వున్నఅన్ని నాటక సమాజాలతో ఆయనకు సంబంధాలు వున్నాయి. అందుచేత నాటక పోటీల కోసం

మంచి నాటకాలు ఎంపికచేసి బాధ్యత ఆయన తీసుకునేవారు. నటులైన సి.హెచ్.ఎస్.ఎన్. మూర్తి, పాల్వాయి ఆదిరెడ్డి, ఎన్.వి.ఎన్. చారి, శేషాచార్య వంటి వారు ఆయనకు సహకరించేవారు.

ఎలాంటి భేషజాలూ లేకుండా, ఎలాంటి పనినైనా తన భుజస్కంధాల మీద వేసుకుని నూటికి నూరు శాతం బాధ్యతగల వ్యక్తిగా, కళాభిమానిగా, కళామ తల్లి సేవకుడిగా, మొదటి సాహిత్యకార్యదర్శిగా ఆయన తన సేవలు అందించారు. సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి గారు ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నా, ఇక్కడి సహృదయ సభ్యులు, అభిమానులూ ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. దానికి కారణం ఆయన మంచి నటుడు మాత్రమే గాక, సభ్యులను చేర్చడంలో, వారి అభిమానం పొందడంలో, మూర్తి గారు బహు నేర్పరి. సభ్యులను చేర్చడంలోనూ, కార్యక్రమాలలో సహాయం అందించడంలోనూ శ్రీ కుందావజ్జుల కృష్ణమూర్తిగారు తమ విలువైన సేవలను అందించారు. ఎప్పుడూ వీరు చేర్పించిన సభ్యుల సంఖ్య అధికంగా ఉండేది.

ఇంకా డా. నాంపల్లి, డా.రంగారావు, రమాకాంత రెడ్డి, డా.ఏ.వి.నరసింహరావు, డా.లక్ష్మణరావు, శ్రీ ఆనందకుమార్, ఇంకా నా దృష్టికి రాని, జ్ఞాపకానికి రాని అనేకమంది ఔత్సాహిక పెద్దల సహకారంతో, సహృదయను దిగ్విజయంగా నడపగలిగాం. నిజం చెప్పాలంటే సంస్థకు అందరికంటే అతి తక్కువ శ్రమించింది నేనే! అందరూ అంత గొప్ప అభిమానం నాపై చూపించారు. వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై వుంటాను.

ఇప్పుడు సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థలో శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, ఎన్.వి.ఎన్.చారి, కుందావజ్జుల కృష్ణమూర్తి, శ్రీ వనం లక్ష్మీకాంతారావు, ఒద్దిరాజు వేణుగోపాలరావు వంటి పెద్దల ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాలు రూపొందించ బడుతున్నాయి. మరి, సహృదయ ‘కరోనా’కు అతీతం కాదు కదా! ప్రస్తుత పరిస్థితి ఇదీ..!!

నా జీవితం అనే పుస్తకంలో ‘సహృదయ’ ఒక ప్రత్యేకమైన అధ్యాయం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here