[dropcap]ఆ[/dropcap]కలికి పగ్గం వేయలేనిది మగ్గం!
వెతలను తీర్చలేని చేనేత
చెమట గంజిలో తడిసి
పెళుసు దేరిన బతుకు బట్ట
బడుగు జీవితానికి వెలుగు చూపలేకపోయిన
పడుగు నూలు!
నిన్నొక రంగుల కలగానే మిగిల్చిన
రంగు రంగుల అద్దకాలు
నీ నరాలు దారాలై
నీ గుండె చప్పుడే కండె చప్పుడై
ఆకలితో అలమటిస్తూ
లాకలతో పడుగును సరి చేసి
అగ్గిపెట్టెలో చీర పెట్టి
బొటనవేలు కోల్పోయిన వస్త్రదాతా
ఏకలవ్యునిలా సంఘం మరుగున పడిపోయావా?
లడ్డీల మిషను మూతబడి వడ్డీలు పెరిగాయా?
యరాసులు తిరగక ఉరేసు కుందామను కుంటున్నావా?
నిజంగానే నీకు ఏకు మేకయ్యిందా?
నీవు పేనినే దారాలే ఉరితాడుగా మారాయా?
బ్రతికున్న వారికి బట్ట కట్టించే నీవు
బ్రతికి బట్ట కట్టలేక పోతున్నావా?
ఋషి భావనాంబరంలో ఐక్యమై పోతున్నావా?
(చేనేత కార్మికుల ఆకలి చావులకు ప్రతిస్పందనగా)