మెలకువ వచ్చింది

2
3

[dropcap]మె[/dropcap]లకువ వచ్చిందిa, అవును మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి అటూ ఇటూ చూశాను. కనుచూపు మేరా చీకటీ వెలుగుల కలయిక.

చీకటి మూడు పాళ్ళు, మిగిలిన మేరకు వెలుగు. మరి వెలుగు పెరుగుతోందో లేక చీకటి పెరుగుతోందో ఇదమిత్థంగా తెలీని పరిస్థితి.

లేవాలో, మళ్ళా పడుకోవాలో ఎవరైనా చెప్తే బాగుండు. ఎవరు చెబ్తారు. ఇక్కడ మేమిద్దరమే ఉంది, కాని మేము మాట్లాడుకొని ఎన్నో ఏళ్ళు అయ్యింది. ఎప్పుడు మాట్లాడుకొన్నామో సరిగ్గా గుర్తు కూడా లేదు.

ఇపుడు తప్పదు, వేరే దారి లేదు…

“ఇదిగో నిన్నే…”

“ఆ చెప్పు…” నిరాసక్తంగా

“ఇప్పుడు ఏమి చెయ్యాలి “

“నన్నా అడిగేది??”

“ఇక్కడ ఇంకెవరున్నారు…?.”

“ఎవరూ లేరు…!”

“అప్పుడు నిన్నేగా అడిగేది…?”

“అయితే అడుగు…”

“ఇప్పుడు ఏమి చెయ్యాలి…?”

“చేసేది ఏమి వుంటుంది?? లేచి ప్రయాణం మొదలు పెట్టడమే…”

“అదే ఎటు వెళ్ళాలి అనీ…? “

“వెనక్కు వెళ్ళే పరిస్థితి లేదు…కాబట్టి ముందుకు వెళ్ళడమే…! “

“అవుననుకో, కాని దారి స్పష్టంగా కనిపించడం లేదు కదా అందుకని…”

“ఏ దారి కనిపించడం లేదని…?”

“ఏ దారీ సరిగా కనిపించడం లేదు…”

“ఇది బాగుంది,.. దారిలో నడుస్తుంటే మెల్లిగా అదే కనపడుతుంది…”

“వెలుగు… పెరుగుతుందా లేక చీకటి పెరుగుతుందా అని చిన్న అనుమానం…”

“ఏది పెరిగినా ఏది తగ్గినా ఇక్కడే కూర్చుని ఉండలేవు కదా…ప్రయాణం మొదలెట్టాలి…”

“ఇంత ప్రయాణం చేసి చేసి అలసట వచ్చింది…”

“…”

“ఏమిటి మాట్లాడవు…?”

“ఏమి మాట్లాడాలి…?“

“ఇంత ప్రయాణం చేసి చేసి అలసట వచ్చింది…ఇంకా ప్రయాణం చెయ్యాలా అని…?”

“ఏమో నాకు తెలీదు… ఇంత వరకు ప్రయాణం చేసి అలసిపోయినా తప్పదు… ప్రయాణం సాగాల్సిందే…”

“ఎక్కడి దాకా ఈ ప్రయాణం? ఎప్పటి దాకా ఈ ప్రయాణం?? అంతే లేకుండా ఉందే…?”

“పోనీ అంత ప్రయాణం చెయ్యలేక పోతే కాసేపు విశ్రాంతి తీసుకో… ఎవరు ఒద్దన్నారు??”

“కానీ మెలకువ వచ్చేసిందే?? ఇప్పుడు ఏమి చెయ్యను??”

“నిజంగా మెలకువ వస్తే…ఇక ఈ చర్చలు ఎందుకు? లే లేచి ప్రయాణం మొదలు పెట్టు…”

“నిజం చెప్పనా…వింటావా ”

“చెప్పు వింటాను…”

“నాకు ఈ ప్రయాణం విసుగు పుట్టింది..”

“నేనొక నిజం చెప్పనా??? వింటావా??”

“చెప్పు…”

“నీకు ఈ ప్రయాణం కాదు, ఈ దారి విసుగు పుట్టింది…”

“…నీ…నీ…నీకు ఎలా తెలుసు…”

“ఎలా తెలుసు అని అడగాల్సిన అవసరమే లేదు…అది కాదు సమస్య…నేను చెప్పింది నిజమా??…కాదా??…”

“…”

“చెప్పు నేను చెప్పింది నిజమా కాదా??”

“… నిజమే…”

“అప్పుడు ప్రయాణం కాదు…దారి మార్చుకో…ఇందులో కష్టం ఏముంది??…”

“ఏమీ తెలియనట్టు నటించకు…ఇన్నీ తెలిసి నప్పుడు…”

“ఆ అన్నీ తెలిసినప్పుడు…”

“ఎందుకు ఇట్లా బాధ పెడతావు..నీకు తెలీదా ఇప్పుడు దారి మారిస్తే ఎంత కష్టమో…”

“చూడూ నీకు ఇంతకు మించి వేరే అవకాశం లేదు…, ప్రయాణం కొనసాగించాలి తప్పదు… అది ఈ దారా వేరే దారా అనేది మాత్రమే నువ్వు నిర్ణయించాలి…”

“ఈ దారి లో ఇంత దూరం వచ్చేశాను…”

“అట్లాంటప్పుడు ఇదే దారిలో ప్రయాణం మొదలు పెట్టు…లే…కదులు…”

“కానీ…”

“ఇప్పుడు కానీ లు అర్ధణా లు లేవు…ప్రయాణం ఆపటానికి లేదు “

***

అది నిజమే ఇంత దూరం వచ్చేశాను మజిలీలు దాటుతూ, తెలియని గమ్యం వైపు అడుగులు వేస్తూ నిరాసక్తంగా, నిర్లిప్తతగా, నన్ను నేను వదిలేసి, గాలి వాటంగా ప్రయాణం చేస్తూనే ఉన్నాను, ఎన్నో బాధ్యతలు, బాదర బందీలు, ప్రేమలు, ఆప్యాయతలు, పరిచయాలు, స్నేహాలు. శత్రుత్వాలు, ఆనందాలు, బాధలు, నవ్వులు, ఏడ్పులు, కోరికలు, అలకలు…… అన్నింటినీ అనుభవిస్తూ, స్రవిస్తూ, అడుగుకు అడుగు కలిపి, అడుగు తరవాత అడుగు వేస్తూ ఇదిగో ఇక్కడికి చేరాను. వెనక్కి తిరిగి పోలేను, అది అసాధ్యం. నాకు ఒక స్థాయి ఉంది. బంధాలు ఉన్నాయి అటునుంచి ఇటు, ఇటు నుంచీ అటు అవి చుట్టుకు పోయాయి, అడుగు అంత సులభంగా వెయ్యలేను., ఇది సరైనదేనా అని ప్రతీ అడుగు నన్ను ప్రశ్నిస్తుంది. తల బద్దలై పోతోంది. ఈ మెలకువ రాకుండా ఉంటే బాగుండేది. ఇన్నాళ్ళు తనతో మాట్లాడక పోవటం నా తప్పే, ఎప్పుడు ఏది మాట్లాడాలని ప్రయత్నం చేసినా వినలేదు. అది అప్రయత్నంగా నే జరిగిందేమో నాకు తెలియదు. కాదు కాదు అది అప్రయత్నంగా జరగలేదు నేనే వినలేదు. యిప్పుడైనా వినాలీ అని నాకు తెలుసు మెలకువ వచ్చినా మళ్ళా నిద్ర లోకి దూరి దాక్కుంటున్నాను. మళ్ళా ఎప్పుడో మెలకువ వస్తోంది ఇప్పుడు కూడా వెలుగు నీడల కలగలుపు కాకుంటే వెలుగు సగం చీకటి సగం. ఇంకా ఓర్పుగా కూర్చున్న తనతో మళ్ళా మాట కలపాలి ఇప్పటికైనా మా మాటలు కలవక పోతే అంతా చీకటే.

…అబ్బా…ఒకటే బరువు… ఈ బరువుని వదుల్చుకోవాలి, లేకపోతే ఈ ప్రయాణం ఎలా సాగుతుంది. అసలు ఈ బరువు ఎలా ఎత్తుకున్నానో. వదలలేకున్నాను అందరితో పాటు నేనూ ఎత్తుకున్నాను, అటు ఇటు కాపలాగా ఆ నలుగురు నించుని చూస్తుంటే వాళ్లకి భయపడి, కాదు కాదు వాళ్ళని చూసి మొహమాట పడి, కాదు కాదు సిగ్గు పడి,… కాదు కాదు ఎందుకో మరి బరువుని ఎత్తుకున్నాను. ప్రతీ మజిలీని గమ్యం అనుకోని, అలసట లేని ఎన్నో అడుగులు వేశాను. అప్పుడు మరి ఎందుకో తెలియదు బాగా అలసట, అలసట లేనప్పుడు తన మాట వినలేదు ఇప్పుడు వినే పరిస్థితి లేదు. ఈ మెలకువ రాకుండా ఉంటె బాగుండేది కాని మెలకువ వస్తోంది పోతోంది.

“ఏమిటి మెలకువ వచ్సినట్టేనా…?”

ఏమో… మెలకువ వస్తే బాగుండు, నా ప్రయత్న పూర్వకంగా మెలకువ వస్తే అదీ మెలకువ కాని ఇప్పుడు అలా కాదు పీడ కలలు వచ్చి మెలకువ వస్తోంది. భయంతో మెలకువ వస్తోంది. భయం మెలకువ తెప్పిస్తోంది. ఇది మంచిదో చెడ్డదో నాకు తెలియదు. మాటలు కలపాల్సిన స్థితి కలుగుతోంది. మాటలు కలపాలి అని నేను అనుకున్నా, ఎందుకో మాట్లాడలేను. నిరంకుశంగా విమర్శిస్తే నేను తట్టుకోలేను. నిజానికి ఎవరూ తట్టుకోలేరు. కాని తప్పదు మాట్లాడాలి. కళ్ళలో తడి ఊరుతోంది, గతమైన అడుగుల సడి తెలుస్తోందేమో. ఎవరు కట్టి పడేశారో ఏమో అడుగు ముందుకు పడగానే వెనక వైపు గోడ కట్టేయ్యబడుతోంది.

అడుగు ముందుకు పడాల్సిందే వేరే అవకాశం లేదు.

“ఏమిటి లేస్తున్నావా ప్రయాణం మొదలెడదామా…” అధికారంగా పిలుపు

“ఉ…మొదలెడదాం… తప్పదు కదా”

“సరే పద…మరి ఏ దారి ఎంచుకున్నావు??…”

“చేసేదేముంది అదే దారిలో వెళ్ళాలి గా…”

“అట్లా ఏమీ లేదు అదేమీ రాళ్ళ మీద రాసిన వ్రాత కాదు…”

“అయితే ఇప్పుడు ఏమి చెయ్యమంటావు”

“నీకు నచ్చిన దారిలో ప్రయాణం మొదలు పెట్టు…”

“మరి ఇప్పటిదాకా జరిగిన ప్రయాణం??”

“దాన్ని నువ్వు మార్చలేవుగా??”

“మరీ తరువాతి మజిలీలో ఎదురు చూస్తున్న…”

“బాధ్యతలా??”

“ఆ…”

“బాధ్యతలు అని నువ్వు అనుకుంటున్నావు గాని అవి నీ ప్రయాణంలో భాగాలే…”

“యెట్లా అవుతాయి…బాధ్యతలు…భాగాలు ఎట్లా అవుతాయి?? “

“ఎందుకు కావు…ప్రయత్నం చేస్తే అవుతాయి…నీ కలలని వాళ్ళ పై రుద్ది వాటికి బాధ్యతలు అని పేరు పెట్టుకున్నావు…చర్చిస్తే… బాధ్యతలు భాగాలవుతాయి…”

“కాని ఆ నలుగురు…”

“ఏ నలుగురు?…ఉరికే పిచ్చి మాటలు చెప్పకు…”

“…కాని ఈ దారిలో నేను ఒంటరిని…”

“ఏ నేను లేనా…? “

జలదరింపు, ఎందుకు ఇన్ని రోజులు ఇలా చేశాను. నిజమే తను ఉన్నాడు కదా ఇక నాకు దేనికి భయం. అక్కర్లేని భయం, ఏ ఇప్పుడు వచ్చిన దారి మాత్రం తెలిసే వచ్చానా అడుగు అడుగు వేసుకుంటూ చూసుకుంటూ రాలా? కొత్త దారి, ఇష్టమైన దారి లో అడుగు అడుగు కలుపు కుంటూ ప్రయాణం మొదలెడదాం. ఏమి జరుగుతుంది? మహా అయితే ఆలశ్యం అవుతుంది. ఆలశ్యం అయినా పర్వాలేదు, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతీ అడుగులో కొత్త అనుభూతి ఉంటుంది. ప్రయాణాన్ని ఆపేసేకంటే మెల్లగానైనా ఏదొక మజిలీకి చేరతానుగా. ఏమో ఆ మజిలీలో కొత్త అనుభవం, ఆనందం ఉంటాయేమో. ఒక వేళ బాధలు, బాధ్యతలు ఉంటె?… మరేమీ ఫర్వాలేదు ఇది మనకు కొత్త కాదుగా. సరే ఇక నిర్ణయం జరిగి పోయినట్టే.

“సరే పద ఈ కొత్త దారిలో కదులుదాం…”

అమ్మయ్య పూర్తిగా మెలకువ వచ్చేసింది, అంతా వెలుగే చీకటి చ్ఛాయ అక్కడక్కడా ఉంది. మరేం ఫర్వాలేదు నా మనస్సుతో నా మాటలు మొదలయ్యాయిగా. కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరం తోడుగా అడుగుల పరుగులు తీసేస్తాం. ఇంద్రధనస్సు రంగుల బొమ్మలు గీసేస్తాం. పూర్తిగా మెలకువ వచ్చేసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here