[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
[dropcap]అ[/dropcap]రవయేళ్ళు పూర్తయిన సందర్భంగా 1960లో ప్రచురణ అయిన ‘జగజ్జాణ’ మిస్టరీ నవల గురించి చెప్పుకోవాలంటే అసలు అది ఎంత మంది చదివారు, ఎంతమందికి గుర్తు ఉన్నది అన్న సందేహం వస్తోంది. ఎం.వి.ఎస్. పబ్లికేషన్స్, ఎం. వి. ఎస్. ప్రెస్, మద్రాసు వారిచే ‘భయంకర్’ అనే కలం పేరుతో కొవ్వలి లక్ష్మీనరసింహారావు రాసిన 25 భాగాల మిస్టరీ నవల ఇది. 1002 నవలలు రాసి ఆయన సృష్టించిన రికార్డు నాకు తెలిసి ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు తెలుగులో. ఆ రోజుల్లో అత్యధిక ప్రజామోదాన్ని పొందిన నవలలు ఆయనవే. అంతేకాక చదవటం అనే (రీడింగ్ హాబిట్) అభ్యాసాన్ని (వ్యసనాన్ని) విపరీతంగా పెంచింది ఆయనే. ఉత్కంఠ, సస్పెన్స్, ఉత్సుకతతో పాఠకులు ఊపిరి బిగబట్టి చదివే శైలి ఆయన సొంతం. పబ్లిషర్స్ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఒక్కోసారి 24 గంటల్లో నవల రాసి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మగవాళ్ళే కాదు ఆడపిల్లలు కూడా క్లాసు పుస్తకాల మధ్య జాగ్రత్తగా కొవ్వలి నవలల్ని దాచుకొని, గుండెలకి పదిలంగా హత్తుకొని కాలేజీకి వెళ్ళేవారట. అందుకే “కొవ్వలి కౌగిట్లో కరగని ఆడపిల్ల ఆంధ్రలో లేదు” అని మహాకవి చలం అన్నారు అని అనుకునేవారు. చలం నవలలు, కొవ్వలి నవలలు చదివితే ఆడవారు చెడిపోతారు, పాపం వస్తుంది అని పెద్దలు అనటం ఆ రోజుల్లో మామూలు. కానీ వారే తర్వాత ‘మేమే పొరపాటు పడ్డాం’ అని కూడా అన్నారని విన్నాం. చలం స్త్రీలను ప్రత్యక్షంగా సమర్థిస్తూ వారిని ఉన్నతులుగా చిత్రిస్తే – పరోక్షంగా స్త్రీలని ఉన్నతులుగా చిత్రించారు కొవ్వలి. ఆ పాత్ర వేశ్య అయినా సరే ఎక్కడా ఔన్నత్యాన్ని చెడకుండా రాయటం స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవ భావం తెలుస్తుంది. ఆయన కొచ్చే అభిమానుల ఉత్తరాల్లో ఎక్కువభాగం స్త్రీ లనుండే ఉండేవట. వాటినిండా వారి బాధలు కన్నీళ్లు.
రైల్వే స్టేషన్స్‌లో బళ్ళ మీద ఎక్కువగా కొవ్వలి నవలలే ఉండేవట. ప్రయాణికులు ఎక్కువగా అవే కొనుక్కొని చదువుకుంటూ ఎంత లీనమై పోయే వారంటే వారు దిగాల్సిన స్టేషన్ దాటిపోయినా పట్టించుకునే వారు కాదట. ఇంతటి విజయం ఒకసారి ఆయనకి ఊడిపడలేదు. శ్రీపాద వారి వంటి మహామహులు అద్భుతమైన రచనలు చేస్తున్న రోజుల్లో ఈయన రచనల్ని వేసుకోవడానికి ఏ పబ్లిషరు సాహసించలేదు. ఒకపబ్లిషర్ టేబుల్ మీద కొవ్వలి రాతప్రతి ఎవారూ పట్టించుకోకుండా పడివుందట. అప్పుడే అక్కడికి వచ్చిన పోస్ట్‌మాన్ ఏమీ తోచక ఆ టేబుల్ మీద ఉన్న కొవ్వలి గారి రాత ప్రతిని చదవటం మొదలు పెట్టి, పరిసరాల్ని కూడ మరిచిపోయి పబ్లిషర్ కం ప్రెస్ ఆయన పలకరించినా పట్టించుకోకుండా చదవటంలో మునిగిపోయాడుట. “ఏమిటి అంత చదువుతున్నావ్” అంటే “అమ్మో, ఏం పుస్తకమండీ, అస్సలు పూర్తయ్యేదాకా వదలలేక పోయాను” అన్నాడట. గొప్ప వ్యాపారవేత్త అయిన ఆ పబ్లిషర్ ‘ఒక సాధారణ పాఠకుడికి ఇంతగా నచ్చిందంటే ఇది ప్రజల్లోకి ఎంతలా వెళ్తుందో’ అని అంచనా వేసుకొని వెంటనే అచ్చువేశారు. అప్పటి నుంచి కొవ్వలి నవలల వెల్లువ ప్రారంభం అయింది.
ఇవి ఇంతగా ప్రజాదరణ పొందటానికి కారణం ఇందలి భాష. జానపదం, మిస్టరీ, రాజుల కథలు- ఏదైనా కావచ్చు, కానీ అందలి భాష మాత్రం మామూలు ప్రజలు మాట్లాడుకునే,అందరికీ అర్థమయ్యే, హాయిగా చదువుకునే వ్యవహారిక భాష.
ఒక్కోసారి నలుగురు పబ్లిషర్స్‌కి నాలుగు నవలలు ప్రారంభించే వారట. విభిన్నమైన కథలు, కథాగమనం… అయినా ఎక్కడా కన్ఫ్యూషన్ లేకుండా 25 ఏళ్ళ వయసుకే నాలుగు వందల, 35 ఏళ్ల వయసుకే 600 నవలలు పైగా రాసిన గొప్ప రచయిత ఆయన. సినీ నటి కన్నాంబ, భర్త కడారు నాగభూషణం గారి ప్రోత్సాహంతో సినీ రంగానికి వచ్చారు ఆయన. జమున నటించిన ‘సిపాయి కూతురు’ సినిమా కథ ఆయనదే. ఇంకా చాలా సినిమాలకు కథ, మాటలు రాశారు. ఆయన కథ, మాటలు, పాత్రచిత్రణ ఎంత అందంగా సున్నితంగా ఉంటాయో ఆయన కూడా అంతే అందంగా ఉండేవారట. రచయితగా ఆయన కున్న ‘క్రేజ్’కి ఆయన వస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారట. మాలతీ చందూర్ అంతటి గొప్ప రచయిత్రి ఎవరితో అన్నారట “కొవ్వలిగారు వస్తున్నారంటే అబ్బురంగా చూసేవాళ్ళం” అని. ఇలా ఆయన జీవితం గురించి విపులంగా చెప్పాలంటే దాదాపు 200 పేజీల నవలే అవుతుందేమో!
వారి పిల్లలు ఇంకా తండ్రి పేరు మీద అనేక సాహిత్య కార్యక్రమాలు, అవార్డులు ఇస్తున్నారు అని విన్నాను. ఆ మధ్య 25 భాగాలు కలిపి ఎమెస్కో వారు ఒక పెద్ద నవలగా వచ్చింది. కానీ నా చిన్నతనంలో మా ఇంట్లో ఉన్న ఇరవై ఐదు భాగాల చిన్న పుస్తకాలు అంటే, వాటిని ఉత్సుకతతో చదివిన ఆ రోజులు అంటే నాకు ఎంతో అపురూపం. ఆ జ్ఞాపకాలు పంచుకోవాలనే ఈ వ్యాసం.
ఈ ఒక్క ‘జగజ్జాణ’ నవలతో ఎన్ని విఠలాచార్య సినిమాలు తీయవచ్చో! ఎన్ని బాహుబలి లు తీయవచ్చో! ఆ రోజుల్లో ఈ పుస్తకాలు చదివిన వారు తమ జ్ఞాపకాల్ని పంచుకొంటారు అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ కథలో ప్రవేశించేముందు కొవ్వలి జీవితవిశేషాలను టూకీగా తెలుసుకుందాం!!!
(సశేషం)