మన’సు’కవి ఆచార్య ఆత్రేయ – వేదిక నుండి వెండితెరకు

0
4

[box type=’note’ fontsize=’16’] క్లుప్తత, గుప్తత, ఆర్ద్రత తన సంభాషణలలో ఒలికించిన పద బ్రహ్మ, మనసు కవి ఆత్రేయని స్మరించుకుంటూ ఈ చిరు వ్యాసాన్ని అందిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box] 

[dropcap]ఆ[/dropcap]శయం,పట్టుదల, కృషి మనిషిని మహాన్నతుడిని చేస్తుంది.

అందరికి సినీ కవిగా, మనసుకవిగా తెలిసిన ఆత్రేయ 1921 మే 7 న నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట తాలూకా ‘మంగళంపాడు’లో చిన్నాన్న వరుసైన యజమానం రాఘవాచార్యులు ఇంట జన్మించారు. వీరి స్వస్ధలం ఉచ్చూరు. జననీ జనకులు సీతమ్మ, కృష్టమాచార్యులు. వీరి అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. ఉన్నత పాఠశాలలోనే పద్య రచనకు శ్రీకారం చుట్టారు. చిన్నవయసులో తల్లిని కోల్పోయి తన చిన్నమేనమామ ఇంట చిత్తూరు చేరారు. ఆయన నాటక రంగప్రియులు కావడంవలన బళ్ళారి రాఘవ, చిత్తూరు నాగయ్య గార్లు మిత్రులు. ఆత్రేయ రాయవేలూరు ‘ఊరీస్’ కళాశాలలో ఇంటర్ పూర్తి చేయకుండా చదువు మానారు.

అనంతరం చిత్తూరులో ‘టీచర్ ట్రయినింగ్’ పూర్తి చేసారు. అప్పుడే క్విట్ ఇండియా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఆరుమాసాలు చెరసాల శిక్ష అనుభవించారు. చిత్తూరులోని యువజన సంఘంలో సభ్యులుగా చేరి  పలు నాటకాలు ప్రదర్శిస్తూ, వెంకటగిరి అమెచ్యూర్ అసోసియేషన్ సంస్ధ దర్శకులు అయ్యారు. 1944 లో గుడివాడలో ఆంధ్రనాటక కళాపరిషత్తు వారి నాటకపోటీలలో ‘ఎదురీత’ నాటకాన్ని ఆత్రేయ ప్రదర్శించారు. అలా ఆ నాటక పరిషత్తులో వేతన కార్యదర్శిగా ఉన్నారు. దానిలో దుక్కిపాటి మధుసూధనరావు గారు సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో ఆత్రేయగారు రాసిన ‘పరివర్తన’ నాటకాన్ని డా.గరికపాటి రాజారావుగారు ప్రజానాట్యమండలి ద్వారా ప్రదర్శించారు. అనంతరం ‘ఎన్.జీ.వో.’, ‘ఈనాడు’ వంటి పలు నాటికలు రచించారు. రచించి నాటక రచయితగా గుర్తింపు పొందారు. నటి గరికపాటి వరలక్ష్మితో పలు నాటక ప్రదర్శనలు ఇచ్చారు.

అలా సినిమా రంగంలో ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి ‘దీక్ష’ (1951) చిత్రంతో ‘పోరా బాబు పో’ పాటతో ప్రవేశించి, ‘ప్రేమయుధ్ధం’ (1990) చిత్రంలో ‘ఈ మువ్వల గానం’ పాటతో నిష్కమించారు. దాదాపు 1,400 పాటలకు జీవం పోసిన వీరు నలభై సంవత్సరాలు సినీ పరిశ్రమలో తమవంతు సాహితీ సేవలు అందించారు. వ్యవహారిక శైలిలో, అందరికి అర్థమైయే రీతిలో పుట్టిన పాటకు పల్లవి పేరు ఆత్రేయ. దాదాపు రెండు వందల చిత్రాలకు తన సాహిత్యాన్ని అందించారు. అర్ధాంగి (1955). తోటికోడళ్ళు(1957) వంటి చిత్రాలకు మాటల పాటల రచయితగా, పెళ్ళికానుక-(1960), ఆత్మబలం-(1964), డా.చక్రవర్తి-(1964), మురళీకృష్ణ-(1964), మూగమనసులు-(1964), తేనెమనసులు-(1965), కన్నెమనసులు-(1966), కలసిన మనసులు-(1968) చిత్రాలకు తన సాహిత్య సౌరభాన్ని పంచి ‘మనసు’కవిగా మారారు. దసరాబుల్లోడు-(1971), ప్రేమ్‌నగర్ -బంగారుబాబు-(1973), మంచిమనసులు(1974) ‘ముద్దులమొగుడు’ (1983) వంటి వందలాది చిత్రాలకు సాహిత్య ఊపిరి ఊదిన ఆత్రేయ చివరి చిత్రం ‘లైలా’ (1989). ‘వాగ్దానం’ (1961) చిత్రానికి దర్శక,నిర్మాతగా వ్యవహరించారు. ‘కోడెనాగు’ చిత్రంలో అతిథి నటుడుగా కనిపిస్తారు. రాసి ప్రేక్షకులను, రాయకుండా నిర్మాతలను ఏడిపించేవారని ఈయనగారిపై చెప్పుకునేవారు. వీరికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలం గౌరవ డాక్టరేట్ ప్రదానంచేసింది. క్లుప్తత, గుప్తత, ఆర్ద్రత తన సంభాషణలలో ఒలికించిన పద బ్రహ్మ, మనసు కవిగా సినీ పరిశ్రమలోనే కాకుండా మనందరి మనసుల్లో స్ధానం పొందిన ఈ కవి 1989 సెప్టెంబర్ 13 న కళామతల్లి పదసేవకై తరలి వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here