అలనాటి అపురూపాలు-37

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

దిలీప్ కుమార్, సైరా బాను – మళ్ళీ మళ్ళీ చెప్పుకునే ప్రేమ కథ!:

“నేను జీవితంలో రెండే కలలు కన్నాను. ఒకటి మా అమ్మలా పేరు తెచ్చుకోవడం; రెండు దిలీప్ కుమార్‌ని పెళ్ళి చేసుకోవడం. అల్లా ఈ రెంటినీ నాకు ప్రసాదించారు. ఇంతకంటే ఇంకేం అడగను?” అన్న సైరా బాను మాటల్లోనే ఆమె ప్రేమ కథని తెలుసుకుందాం.

ఆమె వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం ఆమె కోరుకున్నట్టుగానే తృప్తిగా గడిచాయి. వేషం కోసం ఓ దర్శకుడి దగ్గరకో, నిర్మాత దగ్గరకో వెళ్ళాల్సిన అగత్యం పట్టని భాగ్యశాలి ఆమె. అయితే నటుడు దిలీప్ కుమార్ భర్తగా లభించినందుకు ప్రతీ రోజూ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారామె. తన భర్తను ప్రేమగా ‘నా కోహినూర్’ అని చెప్పుకుంటారు.

దిలీప్ – సైరా ప్రేమ కథ:

తనకి పన్నెండేళ్ళ వయసులో ఆయన పట్ల ఆకర్షితురాలయ్యారు, అప్పుడాయన వయసు 34 ఏళ్ళు. తమ తొలి కలయికలో, ఆయన తానెంత అందగత్తో గ్రహించారని సైరా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పటికే ఆమె తన హృదయంలో ఆయనని భర్తగా ప్రతిష్ఠించుకున్నారట. కొన్ని ప్రత్యేక ప్రేమ కథలలో అద్భుతాలు జరుగుతాయి, దైవ ప్రేరితంగా బంధాలు కలుస్తాయి. అటువంటిదే సైరా బాను, దిలీప్ కుమార్‌ల గాథ!

‘మొఘల్-ఏ-ఆజామ్’ ప్రీమియర్ షో వేస్తున్నప్పుడు ఆయనని దూరం నుంచైనా చూడవచ్చని ఆశగా ఎదురుచూశారు సైరా. కానీ దిలీప్ వెళ్ళలేదు. ఆ తర్వాత తాను కూడా ఓ నటిగా మారినప్పుడు, తొలి సినిమాగా షమ్మీ కపూర్‌తో ‘జంగ్లీ’ షూటింగ్‌లో ఉండగా, ఆమె తల్లి నసీం బాను – దిలీప్ కుమార్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దిలీప్ అప్పట్లో కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నా, వ్యక్తిగతంగా క్రుంగిపోయి, భగ్నహృదయుడై ఒంటరిగా ఉన్నారు. సైరాతో పరిచయమయ్యే సమయానికి ఆయన నటి మధుబాలతో విడిపోయారు. ఓ టాబ్లాయిడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “దిలీప్ కుమార్ పట్ల మోహపరవశురాలినైన మరో అమ్మాయిని కాను నేను. నా విషయంలో అది గాల్లో మేడలు కట్టడం కాదు. ఎందుకంటే నా కలలకి నేను గట్టి పునాది వేశాను. అది విశ్వాసమనే పునాది. నాపై నాకు విశ్వాసం, ఆ భగవంతుడిపై విశ్వాసం” అని చెప్పారు.

తన ఆత్మకథలో తాను సైరాతో ప్రేమలో పడ్డ క్షణం గురించి చెప్పుకొచ్చారు దిలీప్. అది 23 ఆగస్టు 1966. ఆమె పుట్టిన రోజు పార్టీ. “నేను కారు దిగి, ఆమె ఇంటికి దారితీసే తోటలో అడుగుపెట్టిన క్షణం నా దృష్టి – ఎంట్రన్స్ హాల్ వద్ద – అందమైన జరీ చీరలో ఉన్న సైరాపై పడింది.  ఒక్కసారి నేను విస్తుపోయాను. ఇంతకాలం నా పక్కన చిన్నగా ఉంటుందని హీరోయిన్‌గా వద్దన్న ఆమె చిన్నపిల్లగా అనిపించలేదు. నిజంగా పెద్దదైంది, పరిపూర్ణ స్త్రీగా మారింది. నేనూ ఊహించినదానికంటే ఎంతో అందంగా ఉంది. నేను ముందుకు అడుగేసి, ఆమెతో కరచాలనం చేశాను. కాలం స్థంభించిపోయింది.” సైరాబాను తల్లి నసీం బానో కూడా అందగత్తె. ఆకాలంలో ఆమెను హుస్ను పరీ అనేవారు. దేవదూత అంత అందమయినది అన్నమాట. అందుకే, సైరా బాను నాయికగా నటించిన అమన్ అన్న సినిమాలో హస్రత్ జైపురి, సైరాబాను పాత్రును ఉద్దేశ్యించి..ఏయ్ హుస్ను పరీ చెహెరా…దేవదూత అంత అందమయిన వదనం కలదానా…అన్న పాటను రాశాడు. అంత అందం చూసి దిలీప్ కుమార్ పడిపోయాడంటే పడడూ మరి!!!!

‘ఝుక్ గయా ఆస్మాన్’ చిత్రం షూటింగ్‍ సందర్భంగా సైరాతో ఆయన పెళ్ళి ప్రస్తావన తెచ్చారు. “సైరా, బయటకు తీసుకువెళ్ళి, కారులో అలా అలా తిప్పుకుని వచ్చే అమ్మాయివి కాదు నువ్వు లేదా పక్కన తిప్పుకునే అమ్మాయివీ కాదు. నిన్ను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. నా భార్యవి అవుతావా?” అని అడిగారు. “ఈమాట ఎంతమంది అమ్మాయిలతో చెప్పారు?” ఠకీమని అన్నారట సైరా. అయితే పెళ్ళికి అంగీకారం తెలిపారు. అప్పడామె వయసు 22, ఆయన వయసు 44. అదే సంవత్సరం వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత ‘గోపి’ (1970), ‘సగీనా’ (1974), ‘బైరాగ్’ (1976) సినిమాలలో కలిసి నటించారు. వారిద్దరి మధ్య ఉన్న ఉల్లాసం కారణంగా తెర మీద కూడా ఈ సీనియర్ నటుడు, యువనటిల జంట ఆకట్టుకునేది. “నటనలో పరిణతి సాధించాలనే తపనని ఆమెలో చూశాను” అన్నారాయన. అయితే అందమైన ఈ ప్రేమ కథలోనూ సంక్షోభం ఎదురయ్యింది. 1981లో హైదరాబాద్‌కి చెందిన ఆస్మా రెహ్మాన్‌ని దిలీప్ రెండో పెళ్ళి చేసుకోవడంతో సైరా క్రుంగిపోయారు. “నా ప్రేమ, నా మనస్థితి, నా ఆరాధన ఇందుకు అంగీకరించలేదు. నా ఆత్మగౌరవానికి భంగమని భావించాను” అన్నారామె ఒక ఇంటర్వ్యూలో. అయితే సంయమనం పాటించమని ఆమె తల్లి, నటి నసీం కోరారు. “అమ్మ చెప్పింది – ‘నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనే సేవ చేశారు. జీవితంలో ఎన్నో జరుగుతాయి, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు’ అని” అంటూ గతాన్ని మరచిపోడానికి తానెలా ప్రయత్నించింది చెప్పారు సైరా. అయితే, తర్వాతి కాలంలో దిలీప్ తనతో చెప్పిన మాటలు మనసులో నింపుకున్నానని చెప్పారు. “నువ్వు నన్ను చూసుకున్నట్టుగా, నన్ను మా అమ్మ కూడా చూసుకోలేదు” అన్నారట దిలీప్. “ఆయనని ప్రేమించడానికే బ్రతికి ఉన్నాను” అన్నారామె.

ఈ దంపతులపై శరత్కాలపు కాంతి నెమ్మదిగా ప్రసరించింది. ఆ ప్రేమ అజరామరం!


హాలీవుడ్ నటుడు గ్రెగరీ పెక్ బాలీవుడ్ స్టార్ సురయ్యాని కలిసిన వేళ:

తారలని చూడాలనీ, అవకాశమొస్తే వారితో ముచ్చటించాలని అభిమానులు కలలు కంటారు. అయితే తన కాలంలో బాలీవుడ్‌ని ఏలిన సురయ్యా కూడా ఓ హాలీవుడ్ నటుడ్ని కలుసుకోవాలని, మాట్లాడాలనీ తపించిపోయారంటే అది తెలుసుకోవడం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వారి ఆ సమావేశం గురించి తెలుసుకుందాం.

అది 1954 వ సంవత్సరం. బొంబాయిలోని మెరైన్ డ్రైవ్‌లో ఉన్న సురయ్యా ఇంటికి గ్రెగరీ పెక్ వచ్చారు. “మేం ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. ఆ రాత్రి నేనసలు నిద్రపోలేకపోయాను. నేను ఆయన్ని కలిసానంటే ఎవరూ నమ్మలేదు. దాదాపు రెండు నెలలు పాటు న్యూస్ పేపర్లు మా ‘ప్రేమ కథల’ గురించి రాశాయి. వాటిని బాగా ఆస్వాదించాను” చెప్పారు సురయ్యా! అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం…

‘సురయ్యా’గా అందరికీ తెలిసిన సురయ్యా జమాల్ షేక్ ప్రముఖ హిందీ నటి, గాయని. ఆధునిక భారతదేశపు ‘సింగింగ్ సూపర్‌స్టార్’ అన్నా అతిశయోక్తి లేదు. 1941 నాటి చిత్రం ‘తాజ్‌మహల్’తో ఆమె నటిగా మారారు. ఆ సినిమాలో ఆమె ముంతాజ్ మహల్‍గా నటించారు. అయితే దేవ్ ఆనంద్‍తో జత కట్టాకా, వాళ్ళ జోడీకి చక్కని పేరొచ్చింది. దేవ్ ఆనంద్ సరసన ‘విద్య’ (1948) సినిమాలో నటించాకా, వారి మధ్య ఆకర్షణ పెరిగింది. వారిద్దరూ కలిసి మొత్తం ఏడు సినిమాలలో జంటగా నటించారు. అవి ‘విద్య’ (1948), ‘జీత్’ (1949), ‘షైర్’ (1949), ‘అఫ్సర్’ (1950), ‘నీలీ’ (1950), ‘దో సితారే’ (1951), ‘సనమ్’ (1951). నిజానికి దేవ్ ఆనంద్ అప్పుడప్పుడే సినీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు, అప్పటికే సురయ్యా సూపర్‌స్టార్! దేవ్ ఆనంద్ సురయ్యా ప్రేమలో పడి ఉండవచ్చు, కానీ ఆమెకి హాలీవుడ్ అందాల నటుడు గ్రెగరీ పెక్ అంటే ఎంతో అభిమానం, ఆరాధన! ఆ అందాల నటుడి సరసన నటించేందుకు సురయ్యాకు ఆఫర్లు వచ్చాయని అంటారు. తను ఇండియాకి వచ్చినప్పుడు గ్రెగరీ పెక్ ఆమెతో కలిసి టీ తాగారు. అది వార్తల్లో నిలిచింది. తన పట్ల సురయ్యాకి ఇష్టం కలిగించుకునేందుకు దేవ్ ఆనంద్ గ్రెగరీ పెక్‌ని అనుకరించేవారని అంటారు.

1952లో భారతదేశంలో జరిగిన తొలి ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకల్లో హాలీవుడ్ డైరక్టర్ ఫ్రాంక్ కాప్రాని కలిసిన సురయ్యా, తాను ఆటోగ్రాఫ్ చేసిన తన ఫోటోని గ్రెగరీ పెక్‌కి అందివ్వవలసిందిగా ఆయన్ని కోరారుట. ఆ ఫోటో అందిందని పెక్ తర్వాత ధృవీకరించారట.

‘ది పర్పుల్ రైన్’ (1954) చిత్రం షూటింగ్‌కి పెక్ శ్రీలంక వచ్చారు. అప్పుడాయనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఉత్సవంలో పాల్గొనమని ఆహ్వానం అందిందట. అయితే ఆయన విమానం ఆలస్యం కావడంతో, ఆ వేడుకకి హాజరు కాలేకపోయారట. అయితే ఆ తర్వాత జరిగిన పార్టీకి హాజరై, స్టార్స్‌తో సందడి చేశారట. ఇక్కడే వార్తల్లో కాస్త గందరగోళం. పార్టీకి ఉండకపోవడం వల్ల సురయ్యా ఆయనను అక్కడ కలుసుకోలేకపోయారని కొన్ని వార్తలు చెప్పాయి. అయితే ఆమె సన్నిహితులు చెప్పినదాని ప్రకారం ఆమె పెక్‌ని మెరైన్ డ్రైవ్ లోని తన ఇంటికి ఆహ్వానించారని, అక్కడే ఒక గంట సేపు మాట్లాడుకున్నరని తెలుస్తుంది.

అయితే తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ‘గ్రెగరీ పెక్ వెళ్ళిపోయాకా, ఆ ఉత్సాహంలో ఏం చేయాలో తోచలేదనీ, రాత్రంతా నిద్రపోలేద’ని సురయ్యా చెప్పారు. పెక్ సురయ్యా ఇంటికి వెళ్ళడం గురించి ఫిల్మ్‌ఫేర్ పత్రిక ఇలా రాసింది: “జనవరి 5, మంగళవారం, సమయం రాత్రి పదకొండు దాటింది. సురయ్యా ఇంటి తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే ఎదురుగా గ్రెగరీ పెక్… తలుపు తీసిన సురయ్యా అమ్మగారు విస్తుపోయి చూస్తుండిపోయారట. పెక్ నమస్కరించి, “సురయ్యా ఎక్కడ, మేడమ్?” అని అడిగారట. అంతే… సంకోచిస్తూనే ఆవిడ సురయ్యాని లేపితే, తన ఆరాధ్య నటుడిని స్వాగతించడానికి కళ్ళు విప్పార్చుకుని వచ్చారట సురయ్యా. అతిథిగా వచ్చిన పెక్ అర్ధరాత్రి దాటేవరకు మాట్లాడారట. సిలోన్‌లో వాతావరణం బాలేకపోవడంతో బొంబాయిలో విమానం బయల్దేరడం ఆలస్యం కావడంతో వీరి కలయికకి అవకాశం దొరికింది. ఆ తర్వాత ఆయన విమానం అందుకోవాలని బయల్దేరిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here