[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]‘ఏ[/dropcap] నాగరికతనైనా దాని చరిత్రను వక్రీకరించడం ద్వారానే ఎప్పుడూ నాశనంచేస్తారు. బాధితులనే విలన్లుగానూ, వినాశకారులను హీరోలుగానూ మార్చడానికి పక్షపాతపు చరిత్రను సృష్టిస్తారు’ అన్నది ప్రఖ్యాత చరిత్రకారుడు ఎన్‌ఎస్ రాజారాం మాట. ఇది మనదేశానికి వర్తిస్తుందనటంలో అనుమానమేమీ లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన చరిత్ర, సంస్కృతి కోసం జాతీయ స్థాయిలో సంస్థలను నిర్మించుకోవడంలోనూ.. వాటి ద్వారా మన చరిత్రను పునర్మూల్యాంకనం చేయడంలోనూ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అసలు ఆ దిశగా దృష్టి పెట్టనేలేదు. ఎంతసేపూ ఏ మ్యాక్సు ముల్లరునో.. మరో వలసవాద చరిత్రకారుడి రాతలనో పట్టుకొని.. అదే వాస్తవ చరిత్ర అని పదే పదే చెప్పటంలో హిట్లర్ ఆస్థానంలోని గోబెల్స్‌ను మించిపోయారు. స్వాతంత్య్రానికి పూర్వమే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించుకొన్న వారు స్వాతంత్య్రానంతరం రాసుకొన్న చరిత్రనే మనం చదువుకొంటున్నాం. కాంగ్రెస్ మాత్రమే స్వాతంత్య్రం తెచ్చిందని, నెహ్రూ లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అన్నంత తీవ్రంగా చరిత్రను రాసుకొన్నారు. స్వాతంత్య్రం ఎట్లా వచ్చింది.. ఎవరి ప్రభావంతో వచ్చింది అనేది వేరే కథ. కానీ, దాదాపు మూడు శతాబ్దాల వలసపాలన నుంచి విముక్తి పొందిన అనంతరం.. మన చరిత్రను పునర్లిఖించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు.. మన మూలాలను తిరిగి అన్వేషించుకోవాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి? అందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసి, ఈ సమాజపు అస్తిత్వాన్ని పునర్జీవింపజేయడం ప్రథమ కర్తవ్యం. చరిత్ర నిర్మాణంలో తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఆయా పాలకులు కొంతమేర వక్రీకరించవచ్చు. ఇది అన్ని సమాజాల్లో జరిగిన పరిణామమే. అట్లాగే స్వాతంత్య్ర పోరాట సందర్భంలో నెహ్రూతోపాటు ఆయన అనుచరగణం అద్భుతంగా పనిచేశారని రాసుకొంటే రాసుకోవచ్చు. ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకోవాలని ఉన్నది.. అందుకు అనుగుణంగా బాలల చాచా నెహ్రూజీ అని పాటలు రాయించి రోజూ మైకుల ముందు పాడిస్తే పోయిందేమీ లేదు. కానీ.. కొన్ని వేల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా సాగివస్తున్న ఒక జాతి జీవన చిత్రాన్ని మరుగున పడేసేందుకు ఎందుకింత భయంకరంగా కుట్ర చేశారు? ఇది అర్థంకాని విషయం. చైనావాడో, రష్యావాడో, అమెరికావాడో, చివరకు ఈ దేశాన్ని పాలించిన తెల్లవాడో.. తమ దేశం పట్ల, తమ నాగరికత పట్ల అభిమానాన్ని చాటుకోవడంలో ఎన్నడూ దాపరికం చూపడు. కానీ, మనదేశంలో మాత్రం చైనాను పొగుడుతాం, క్యూబాను పొగుడుతాం, రష్యాను పొగుడుతాం, కొరియాను పొగుడుతాం, దక్షిణాఫ్రికాను పొగుడుతాం, పాలస్తీనాను పొగుడుతాం, చివరకు వియత్నాంను పొగుడుతాం. మనం మనదేశాన్ని తెగడటానికి మాత్రం కొంచెం కూడా వెనుకాడం. ఎందుకంటే బలపం పట్టుకోగానే మనకు ముందుగా నేర్పింది ‘అక్బర్ ది గ్రేట్’ ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ ‘అశోక ది గ్రేట్’ . ఇదిగో మీరు వేదాలు వేదాలు అని మొత్తుకొంటున్నారే.. అదిగో మ్యాక్సుముల్లర్ అనేవాడు సోకాల్డ్ వేదాల పిప్పితీసి చెప్పాడు. అదే నిజం. అదే మీ చరిత్ర.. మీకు తిప్పికొడితే మూడునాలుగువేల ఏండ్లకంటే మించి చరిత్రలేదు. ఆయినా ఆ వేదాల్లో ఉన్నది కూడా ఏమీలేదు. అంతా మీ చాదస్తం తప్ప.. పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా మిథ్య తప్ప చరిత్ర కానే కాదు.. అని ఊదరగొట్టి.. మనల్ని మనం చూసుకోవాలంటే.. తెలుసుకోవాలంటే యూరోప్ వైపు చూడాల్సిన దిక్కుమాలిన పరిస్థితిని కల్పించారు. దీనికి మూలం బ్రిటిష్ వాడే అయిఉండవచ్చు, మెకాలే, చార్లెస్ ట్రైవిల్యన్, మ్యాక్స్ ముల్లర్‌లు తమ ప్రయోజనాలకోసం, క్రైస్తవ ప్రపంచ స్థాపన కోసం చేసిన భారతీయ చారిత్రక, నాగరిక, సాంస్కృతిక విధ్వంసం నుంచి భారతదేశాన్ని తిరిగి బయటకు తీసుకొని రావాల్సిన బాధ్యత ఎవరిది? స్వతంత్ర భారత దేశ ప్రభుత్వానిది కాదా? కానీ ప్రభుత్వం ఆ పని ఎంతమాత్రం చేయలేదు. పైగా ఈ విధ్వంసాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించింది. ఇందుకు నెహ్రూకు ప్రధానంగా ఉపయోగపడిన పరికరాలు సోవియట్ కమ్యూనిజం, మార్క్సిజం, ఇస్లామిజం. అన్నింటినీ మించి ది గ్రేట్ లౌకికవాదం. ఆయన ముందుగా చేసిన పని వలస పాలకులు రచించిన కథనాలను బతికించి ఉంచడం.. వాటిని తరతరాలకు కొనసాగించడం స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి పని. అభారతీయ కమ్యూనిస్టు మేధావులు భారతీయ రాజకీయ, విద్యా రంగాలను దశాబ్దాల తరబడి శాసిస్తూ ఉండటం వల్ల తమ ఈ అజెండాను అమలుచేయడానికి వారికి చాలా సమయం, తీరుబడి చిక్కాయి. దీంతో వాళ్లు ఏదనుకుంటే దాన్ని చరిత్రగా మార్చేశారు. కాలాన్ని మార్చారు.
– మన చరిత్ర వక్రీకరణలో ముందుగా జరిగిన పని.. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. ఆర్యులు అనేవారు ఈ దేశం వారు కాదు. వేదాలు ఈ దేశానికి సంబంధించినవి కాదు. సంస్కృతం ఈ దేశానికి చెందినది కాదు. ఆర్యులు, సంస్కృతం యూరప్‌నుంచి భారతదేశానికి వచ్చినవి. మనదేశంలో వేదకాలం అన్నది యుద్ధాల కాలం అని నిరూపించడం.
– రెండవది ఈ దేశంపై దండెత్తి వచ్చిన ముస్లిం రాజుల అమానుష రికార్డులను మరుగున పరచడం, వాళ్లను మతసామరస్యవాదులుగా, ప్రేమకు పట్టం కట్టేవారిగా చూపించడం. గంగాజమునా తెహజీబ్ అనే పదం ఇలా పుట్టుకొచ్చిందేనేమో.
– మూడోది అతి ముఖ్యమైనది స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా రాసుకోవడం.
ఈ మూడింటిలో రెండవ పనిని తండ్రీ కొడుకులైన హబీబ్‌లు, వారిని అనుసరించి వచ్చిన జవహర్‌లాల్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి ఎలీట్ సంస్థల నుంచి వచ్చిన మేధావులమనుకొనే వర్గం విజయవంతంగా పూర్తిచేసింది.
ఇక మూడవ దాని విషయంలో నెహ్రూకు అడ్డంకులు ఏర్పడ్డాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన చరిత్ర రాయడానికి పూనుకొన్న రమేశ్‌చంద్ర మజుందార్‌చేత తమకు అనుకూలంగా రాయించుకోవడానికి నెహ్రూ తీవ్రంగా ప్రయత్నించాడు. స్వాతంత్య్ర సంగ్రామం నెహ్రూలతో మొదలై, నెహ్రూలతోనే ముగిసేలా ఉండాలని ఆకాంక్షించారు. మజుందార్ తీవ్రంగా వ్యతిరేకించేసరికి ఆయనకు ప్రభుత్వ ప్రాపకం లేకుండా చేశారు. కానీ ఆయన స్వతంత్రంగానే అసాధారణ కృషిచేశాడు. 11 వాల్యూంల భారత దేశ చరిత్ర నిజంగా భారతీయులు తమ ఆత్మ దర్శనం చేసుకోగలగడానికి ఉపకరణంగా పనికివచ్చే అమూల్యసంపద. 1954 జూలైలో ప్రఖ్యాత కన్నడ రచయిత, వరిష్ట పాత్రికేయుడు డీవీ గుండప్ప ఈ సంపుటాల్లోని మూడవ సంపుటమైన ది క్లాసికల్ ఏజ్‌ను ఆకాశవాణి ద్వారా సమీక్షించారు. ‘ఇది భారతీయులు రాసిన భారతదేశ చరిత్ర’ అని ఆయన ఆ ఆకాశవాణి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. ఇది చిన్ననాటినుంచే భారతీయులకు బోధించాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు. కానీ ఆయన మాటల్ని పట్టించుకున్న వారెవరు? దీంతోపాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంపైనా ఆర్సీ మజుందార్ ప్రచురించిన గ్రంథాలు (హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా) మన స్వాతంత్య్ర పోరాటపు వాస్తవాలను విప్పిచెప్తాయి. కాంగ్రెస్ మీద అక్కడక్కడ విమర్శలు ఉన్నందుకు వాటిని తొక్కిపెట్టారు. అప్పుడు ఈ దేశానికి విద్యామంత్రిగా ఉన్నవారు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. ఆర్సీ మజుందార్ రాసిన చరిత్రను అణచివేసి మొఘలులు, ఇతర తురుష్కరాజుల కిరాతక కృత్యాలను కప్పిపుచ్చుతూ.. ఇస్లాంను సర్వ సమానత్వం ఉన్న మతంగా వర్ణిస్తూ భారతీయ వ్యతిరేక చరిత్రను తిరగరాయడం ప్రారంభించారు. ఇస్లాం సర్వ సమానత్వ మతమైతే కావచ్చు. ఇందులో అభ్యంతరాలు ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశానికి దండెత్తివచ్చిన మొఘలుల చరిత్రను తిరగరాసి అద్భుతమని కీర్తిస్తూ.. పైగా మతసామరస్యానికి పెద్దపీట వేసిన సమన్వయ యుగంగా ఆకాశానికి ఎత్తారంటే.. దాని వెనుక కుట్రలేదని ఏ ప్రాతిపదికన భావించాలి? ఎందుకంటే.. అష్ట వర్షాత్ భవేత్ కన్యా.. అన్న మాట.. ముస్లింలు దండయాత్రలు చేస్తూ ఈ దేశాన్ని దోచుకోవడం, మానవ హననానికి పాల్పడటం, మహిళలపై అమానుష అత్యాచారాలకు పాల్పడటం వల్ల.. చిన్నప్పుడే అమ్మాయికి పెండ్లి చేసేస్తే వాళ్ల జోలికి రారన్న భయంతో పుట్టుకొచ్చిందే. బాల్యవివాహాలు అన్న ఆచారానికి ఇదిగో ఇదీ మూలం. ముస్లింల దండయాత్రల కంటే ముందు స్త్రీలు సర్వ స్వతంత్రులుగా ఉన్నారన్నది వాస్తవం. మన దేశంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి స్త్రీలు మగవాళ్లతో సమానంగా వ్యవసాయ పనులు చేశారు. యుద్ధ తంత్రాలు నేర్చుకున్నారు. యుద్ధాల్లో పాల్గొన్నారు. వాళ్లకు తెలిసినన్ని బ్యూటీ టిప్స్ మరెవరికీ తెలియవు. ఇందుకు అనేక తార్కాణాలు ఇప్పటికీ మనకు ప్రబలంగా కనిపిస్తాయి. ముస్లింలు మనదేశంపై 11వ శతాబ్దంనుండీ వరుసగా దండెత్తటం ఆరంభమయింది. . అంతకుముందు శాతవాహనుల శిల్పాల్లో స్త్రీలు వ్యవసాయ పనులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. కాకతీయుల శిల్పాల్లో ఎత్తు మడమల చెప్పులు వేసుకున్న మదనికలు కనిపిస్తారు. బేలూరు, హలేబీడు లోని హోయసల శిల్పాల్లో అత్యాధునిక స్త్రీలు మనకు దర్శనమిస్తారు. కంచిలోని వరదరాజస్వామి దేవాలయంలోని అద్దాలమండపంలోని వేలాది శిల్పాల్లో ప్రగతిశీల మహిళలు గోచరిస్తారు. ఆనాడు శిల్పులు ఉబుసుపోక చెక్కిన శిల్పాలు కావివి. సమాజంలో తాము చూసి.. తెలుసుకొని.. అనూభూతి చెంది చెక్కిన శిల్పాలు. ఇంత స్వేచ్ఛగా ఉండిన మహిళలు ఆ తర్వాత ఇంటికే పరిమితం కావడం.. దాని పర్యవసానంగా పురుషస్వామ్య సమాజం పుట్టుకురావడం జరిగిందంటే.. ముస్లింలు, యురోపియన్ల దండయాత్రల వల్లే కదా.. వీన్నింటినీ మరుగున పడేసి ముస్లిం రాజుల చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేసిన ఘనత నెహ్రూ.. ఆయన నెత్తిన తెచ్చి పెట్టుకొన్న హబీబ్‌లు, థాపర్‌లకే చెల్లుతుంది. ఇందుకు నెహ్రూ గారు ఎంచుకున్న ఆయుధం లౌకికవాదం.
ఇప్పుడు మొదటి కారణం.. ఈ దేశ చరిత్ర సమూల విచ్ఛేదనానికి మూలమైన విషయానికి వద్దాం. మన దేశంలో బ్రిటిష్‌వాడు మొదట సూత్రీకరించిన సిద్ధాంతమిది. దానిపేరు ఆర్యుల దండయాత్ర. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆర్యులు అనబడేవారు, భారతదేశానికి దండెత్తి వచ్చి.. ఇక్కడ ఆదివాసులుగా ఉన్న ద్రావిడులపై దండెత్తి.. వారిని దక్షిణభారతదేశానికి పారదోలి.. ఉత్తర భారతదేశంలో సెటిల్ అయ్యారన్నది ఒక సూపర్ డూపర్ థియరీ.
చిన్నప్పుడు ఆర్యద్రావిడ ఘర్షణ సిద్ధాంతం గురించి విన్నప్పుడు రామాయణంలో రాముడు ఆర్యుడని.. రావణుడు ద్రావిడుడని.. ఆర్యుడైన రాముడు.. అమాయకుడు, బుద్ధిమంతుడు అయిన ద్రవిడ రావణుడిని అన్యాయంగా హతమార్చాడని కథలు విన్నాను. కానీ రామాయణం చదివిన తరువాత.. యుద్ధకాండలోని 110 సర్గలో సదరు రావణుడు చనిపోయిన తర్వాత యుద్ధరంగానికి వచ్చిన మండోదరి.. తన భర్త భౌతికదేహాన్ని చూసి ‘అయ్యో! ఆర్యపుత్రా! నాథా! నాథా! అని భోరున విలపిస్తుంది. ఇక్కడ రావణుడు ఆర్యుడెలా అయ్యాడు. మనకు వాల్మీకి రామాయణం ప్రమాణమే కదా.. అందులో ఉన్నమాటే ఇది. పోనీ ఆర్యుడు అంటే అర్థం ఏమిటి? ఈ పదానికి కనిపిస్తున్న అర్థం.. సంస్కారం కలిగినవాడు అని. ‘మహాకుల, కులీనార్య, సభ్య, సజ్జన, సాధవ:’ అని అమరకోశం సహా పలు నిఘంటువులు అర్థాల్ని చెప్తున్నాయి. ఆర్యుడు అంటే మంచి కులంలో పుట్టినవాడు, కులీనుడు, సభ్యత తెలిసినవాడు, సజ్జనుడు, సాధువు.. అని అర్థం. ఇక్కడ జాతి అర్థం ఎక్కడ్నించి పుట్టుకొచ్చింది. సామాజికంగా, ఆర్థికంగా, నాగరికంగా తిరుగులేని ఆధిక్యంతో ఉన్న భారత్‌ను సమూల చ్ఛేదనచేసి క్రైస్తవ మత రాజ్యంగా మార్చడానికి జరిగిన కుట్రలో వేసిన తొలి అడుగు ఆర్య సిద్ధాంతం పుట్టుక.
ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని పదే పదే నిరూపించే ప్రయత్నం ఎందుకు జరిగిందంటే, మన ప్రాచీన సమాజపు నాగరికతను వాఙ్మయాన్ని మూలచ్ఛేదం చేయడం లక్ష్యం కాబట్టి. ఇందుకు ప్రధాన కారకుడు జర్మన్‌కు చెందిన మాక్సుముల్లర్. 1861 లో Lectures on the Science of Language ఉపన్యాసాలిస్తూ ఆర్యన్ రేస్ అన్న పదాన్ని ఆంగ్లంలో ప్రథమంగా వాడేడు మాక్స్ ముల్లర్. ఈ ముల్లర్ చేసిన వ్యవహారం ఇంతకుముందు చాలామంది చెప్పుకొచ్చారు. కానీ.. ఇక్కడ సందర్భం కాబట్టి పునరుద్ఘాటించాల్సి వస్తున్నది. ఇతను గొప్ప విద్వాంసుడని అంతా అంటారు. కాదనాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లలాగా మనం వక్రీకరించాల్సిన పనిలేదు కాబట్టి. ఈయనగారు వేదాలకు భాష్యం చెప్పాడు. ఆర్య సిద్ధాంతాన్ని ఈయనే ప్రతిపాదించి నిప్పంటించాడు. వేదసంస్కృతి పట్ల అభిమానంతోనో, భారతదేశంమీద ప్రేమతోనే ఈయన వేద వాఙ్మయాన్ని అందుబాటులోకి తెచ్చాడని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు ఏమీలేదు. ఇతను బ్రిటిష్‌వాడికి పక్కా ఏజెంట్‌గా పనిచేశాడు. ఇతను డబ్బులకోసం భారతదేశ చరిత్రను తాకట్టుపెట్టాడు. మనదేశంలో క్రైస్తవ మత ప్రచారంకోసం అనువుగా ఋగ్వేదాన్ని అనువదించాలని 1847 ఏప్రిల్ 14 న ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ముల్లరుకు పని అప్పగించింది. అప్పటికి ఇతనికి సంస్కృతంలో ఉన్నది శృత పాండిత్యమే. అతను సంస్కృతం నేర్చుకోబట్టి సుమారు ఆరేండ్లు మాత్రమే అవుతున్నది. అసలు వయసే 24 ఏండ్లు. ఇంత పాండిత్యమున్న మేధావి ఋగ్వేదాన్ని అనువదించడానికి పూనుకున్నాడు. ఇతని టార్గెట్ అంతా.. వేదకాలాన్ని ముందుకు జరపాలి. వేదాల నుంచి ఈ సంక్రమించిన విజ్ఞానాన్ని భారత సమాజం నుంచి వేరుచేసి చూపడమే. ఈ విషయాన్ని నిస్సిగ్గుగా ముల్లరే ఒప్పుకున్నాడు. 1866లో తన భార్యకు రాసిన ఈ ఉత్తరం.. ఆయన మాటల్లోనే…
“I feel convinced though I shall not live to see it that this edition of mine and the translation of the veda will hereafter tell to a great extent on fate of India.. It is the root of their religion. and to show them what that root is, I feel sure, is the only way of uprooting all that has sprung up from it during the last 3000 years.” తాను రాసే ఈ వేదభాష్యం ఇండియా తలరాతను మార్చేస్తుందని, మన మతానికి అదే తల్లివేరు కాబట్టి, ఆ తల్లివేరును పెకిలించి చూపించడమే తన లక్ష్యమని చెప్పుకొన్న వాడు. ఇదే మ్యాక్సు ముల్లర్ అంతకుముందు కార్ల్ జోసియాస్ వాన్ బున్సెన్‌కు రాసిన ఓ లేఖలో భారతదేశంలో క్రైస్తవమతం గ్రీకు, రోమన్ దేశాలకంటే కూడా పరిపక్వ దశకు చేరుకున్నదని, వాళ్ల ప్రాచీన మతం చెదలుపట్టి ఏ క్షణాన్నైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని, ఏదో కృత్రిమమైన ఊత కర్రల సహాయంతో మనుగడ సాగిస్తున్నదని.. దీన్ని ఇంగ్లిష్‌వారు గ్రహిస్తే చాలు.. భారత్ పని అయిపోయినట్టే నని రాసుకొచ్చాడు. ఆ తరువాత కూడా మరో లేఖలో (ఇండియాకు విదేశాంగమంత్రిగా వచ్చిన ఆర్గిల్ డ్యూక్‌కు రాసినది) ఇండియాలోని ప్రాచీన మతం వినాశనానికి సిద్ధంగా ఉన్నది. క్రైస్తవం అక్కడ అడుగుపెట్టకపోతే తప్పు ఎవరిది? అంటూ ప్రశ్నించాడు కూడా. క్రైస్తవ మిషనరీలకు సహాయపడటమే తన ధ్యేయమని కూడా చెప్పుకున్నాడు.
ఇవన్నీ బహిరంగమే కదా.. ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్ అన్న గ్రంథంలో ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ డాక్యుమెంట్లు. ఇందులోనే మరికొన్ని విషయాలు చూడండి.. దాదాపు 19 ఏండ్లపాటు వేదాలకు అడ్డగోలుగా అనువాదాలుచేసి, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని వేదికనెక్కిన ప్రతిచోటా వాగిన మాక్సుముల్లర్ నాలుక మడతపడింది. అర్యులు అన్నది జాతి కాదు.. భాష అని ప్రచారంచేయడం మొదలుపెట్టాడు. ‘నేను ఆర్యులు అంటే రక్తం, ఎముకలు, పుర్రె, జుట్టు అనే అర్థంలో చెప్పలేదు. ఆర్యులు అంటే ఆర్య భాష మాట్లాడేవారు అనే అర్థంలోనే చెప్పాను’ అని నెత్తీనోరూ బాదుకున్నాడు. ఇందుకు కారణాలు సవాలక్ష ఉండవచ్చు. జర్మన్‌లలో ఆర్యజాతి భావన ప్రబలడం, జాతీయత బలోపేతం చేయడం, సంస్కృతాన్ని సొంతంచేసుకొనే ప్రయత్నంచేయడం.. ఆ తర్వాత యుద్ధంలో ఫ్రాన్సును ఓడించడం వంటి పరిణామాలు అనేకం ముల్లర్ మాట మార్చడానికి కారణాలు అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ, ఏ ముల్లరు అయితే తాను చేసినవన్నీ ప్రేలాపనలే అని పదే పదే ఒప్పుకున్న తర్వాత కూడా మన దేశీయ మేధావులు అంతకుముందు చెప్పిన ఆర్య సిద్ధాంతాన్ని ఎందుకు పట్టుకొని వ్రేలాడినట్టు????.. ఇది కుట్ర కాక మరేమీ లేదు. తాను చేసింది తప్పు అన్న తర్వాత కూడా భారతీయ చరిత్ర నిర్మాతలకు దీన్ని సరిచేయాల్సిన కనీస బాధ్యత లేదా? రాసినవాడే.. తాను రాసింది కరెక్టు కాదన్నాక.. వాస్తవం ఏమిటన్నది తవ్వి తీయాల్సిన విధిని మన పద్మభూషణులైన చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే నిర్వర్తించలేదు. వాళ్లకు కావలసింది ఆ తప్పును ఒప్పుచేయడమే.
విచిత్రమేమంటే సదరు మాక్సుముల్లర్‌తోపాటు మిగతా పాశ్చాత్య చరిత్రకారులు చేసిన తప్పులైనా సమర్థించుకొనేలా ఉన్నాయా అంటే అదీ లేవు కదా? వీళ్లు చెప్పే హేతువాదానికీ చిక్కడంలేదు కదా..
ఉదాహరణకు మాక్సుముల్లర్ కట్టిన లెక్కలే చూద్దాం..
It may sound prejudiced. But taking all in all, I say the new testament. After that I should place koran.. then would follow, according to my opinion, the old testament, the southern buddhist tripitaka, the taote, king of leo-tze, the kings of Confucius, the veda, and the avesta..
(the life and letters of Max Muller vol.2 page 322-23)
దీన్ని చూస్తే విడ్డూరంగా కనిపించదా? ముందుగా న్యూ టెస్టమెంట్ అంట.. ఆ తర్వాత ఖురాను, అనంతరం ఓల్డ్ టెస్ట్‌మెంట్, తర్వాత బుద్ధుల త్రిపీటికలు, టావోటే, లియో జె రాజులు, కన్ఫ్యూషియస్ రాజులు, వేదాలు, అవేస్తలు.. ఇలా వాటి కాల పరిణామ క్రమాన్ని ముల్లర్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతకంటే దారుణమైన అబద్ధమేముంటుంది? బౌద్ధం పుట్టిందే ఉపనిషత్తుల ఆధారభూమికపై. బుద్ధుడు ఉపనిషత్తులను తిరస్కరించనే లేదు. ఈ ఉపనిషత్తులకు ఆధారభూతం వేదాలు. అలాంటిది.. బుద్ధుడి త్రిపీటికల తర్వాత ఎంతోకాలానికి వేదాలు పుట్టుకొచ్చాయని రాయడంలో లాజిక్ ఏమిటో ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది. బైబిల్‌లో క్రీస్తుకు పూర్వం 4004లో ప్రళయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నంబర్‌ను పట్టుకొని.. కాకి లెక్కలు కట్టి క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల్లో ఋగ్వేదం రాశారని చెప్పాడు. బుద్ధుడి తర్వాత వేదాలొచ్చాయని ఆయనే చెప్తాడు.. క్రీపూ 1500 లో ఋగ్వేదం రాశారనీ ఆయనే చెప్తాడు. ఆ తర్వాత ఇదే పెద్దమనిషి మాటమార్చాడు. “whether the vedic hymns were composed 1000, 1500, 2000, 3000 bc.., no power on earth will ever determine” ఇది మన రోమిలాథాపర్‌లు, హబీబ్‌లు, జేఎన్‌యూ, ఏఎంయూ స్వయం ప్రకటిత చరిత్రకారుల మెదళ్లలోకి ఎక్కలేదు. కమ్యూనిస్టులనైతే అడుగనే అక్కర్లేదు. కానీ, తనకు తాను ఆధునిక భారతదేశ నిర్మాత అని పదే పదే ప్రకటించుకొన్న నెహ్రూ గారు.. పైగా డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి అత్యద్భుతమైన చారిత్రక గ్రంథం రాసిన చరిత్ర అభిమాని.. అష్టవంకరలు తిప్పబడిన భారతదేశ చరిత్రను చక్కదిద్దాలని ఎందుకు అనుకోలేదు? పోనీ బ్రిటిష్‌వాడు తాను దేశంలో ఉన్నంతకాలం మాక్స్ ముల్లర్‌ను వాడుకొన్నంత వాడుకొని ఆ తరువాత పట్టించుకోకుండా వదిలేశాడు. నెహ్రూకు 11 ఏండ్ల వయసు వచ్చేసరికే ముల్లరు దొరవారు పరమపదించారు. అప్పటికే తాను రాసిందంతా అబద్ధమని.. తల బద్దలు కొట్టుకొని చెప్పుకొన్నాడు.. పోనీ.. ఒకవేళ ముల్లరు తాను ముందు రాసినదానికే కట్టుబడి ఉంటే.. అదే నిజమని ప్రచారం చేసుకొని ఉంటే.. దాన్నే మన మేధావులు ఇదిగో మీ తోక అని చూపించినా అర్థముండేది. కానీ.. తాను రాసింది శుద్ధ అబద్ధమని చెప్పిన తరువాతనైనా వాస్తవ చరిత్ర ఏమిటని అన్వేషించాల్సిన బాధ్యత, కర్తవ్యం నెహ్రూకు కనిపించలేదా? రాసినోడేమో తాను రాసింది తప్పంటే.. నువ్వెవడివి తప్పు అనడానికి.. మేం చెప్తున్నాం… నువ్వు రాసిందే కరెక్టు అంటూ సోకాల్డ్ మార్క్సిస్టు మేధావులు ఆ ముల్లరు నోరు బలవంతంగా మూయించి.. తప్పుల తడకను కొన్ని తరాల మెదళ్లలోకి ఎక్కించిపారేశారు. ఈ చరిత్ర ఇక్కడితో ఆగిపోలేదు. దేశానికి చెందిన కాలమాన పరిస్థితులన్నింటినీ ఇదేవిధంగా తారుమారుచేసారు. ఉదాహరణకు నారదీయ పురాణం అనే పుస్తకం ఒకటి ఉన్నది. దాని ముగింపులో గోవులను చంపువారు, దేవదూషణ చేయువారి ఎదుట ఈ పురాణము చదువరాదు’ అని రాసి ఉన్నది. దీన్ని పట్టుకొని హెచ్ హెచ్ విల్సన్ అనేవాడు దాని కాలనిర్ణయం చేసేశాడు. గోవులను చంపువారు అని ఉన్నది కాబట్టి మన దేశానికి ముస్లింలు దండయాత్రకు వచ్చిన తరువాత 16, 17 శతాబ్దంలో రాసి ఉంటారని ఖరారుచేసేశాడు. ఇతని హేతువాదం ఎంత బలహీనమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గోవధ నిషేధం.. గోవులను చంపేవారిని నిందిస్తూ వేదాల్లో చాలా చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అసలు గోవులను చంపేవారి ముందు చదువొద్దు అన్న పదాన్ని పట్టుకొని కాలం ఖరారుచేయడం కంటే విడ్డూరం ఏముంటుంది? ఇట్లా ప్రతి పుస్తకానికీ టైంలైన్ ఇస్తూ పోయారు. ఆ వివరాలు వచ్చేవారం…