[box type=’note’ fontsize=’16’] నవంబరు 19వ తేదీ ఝాన్సీ రాణి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]
[dropcap]బ్రి[/dropcap]టీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు 100 సంవత్సరాలు పరిపాలించింది. వారిని ఎంతోమంది సంస్థానాధీశులు, రాజులు, రాణులు ఎదిరించారు. తిరుగుబాట్లు చేశారు. యుద్ధాలు చేశారు. రాణులలో రాణి వేలు నాచియార్, రాణి చెన్నమ్మల తరువాత కాలంలో పేరు పొందిన వారు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి.
ఈమె అసలు పేరు ‘మణికర్ణికా తంబే’. ఈమె 1835 నవంబర్ 19వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు భాగీరథీబాయి, మోరోపంత్‌లు. మోరోపంత్ బితూర్ జిల్లాకు చెందిన పీష్వా ఆస్థానంలో ఉద్యోగి. మణికర్ణిక నాలుగేళ్ళ వయసులో తల్లి మరణించారు. ఇంట్లోనే చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. పీష్వాల దత్తపుత్రుడు నానా సాహెబ్‌తో కలిసి పెరిగారు. బాల్యం నుండే కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి యుద్ధవిద్యలను కూడా అభ్యసించారు.
పదమూడేళ్ళ వయసులో ఝాన్సీ రాజు గంగాధరరావు నెవాల్కర్‍తో ఈమె వివాహం జరిగింది. వివాహానంతరం ఆనాటి ఆచారాల ప్రకారం లక్ష్మీబాయిగా పేరు మారింది. ఈ దంపతులకు ఒక మగపిల్లవాడు పుట్టి నాలుగు మాసాలలోనే మరణించాడు. ఆ తరువాత దామోదరరావుని దత్తత తీసుకున్నారు. అయితే కంపెనీ ప్రభుత్వ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రులకు సింహాసన వారసత్వం లభించదు. అందువలన దామోదరరావును రాజుగా గుర్తించలేదు కంపెనీ ప్రభుత్వం.
లక్ష్మీబాయి ఈ విషయాన్ని సహించలేదు. కంపెనీ వారి మీద లండన్ కోర్టులో కేసు వేశారు. దానితో కోపగించిన బ్రిటీషువారు కక్ష పెంచుకున్నారు. ఝాన్సీ రాజాభరణాలను, ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫించన్ తీసుకుని ఝాన్సీ కోటను వదిలి వెళ్ళమని ఆదేశించారు. ఆమె ఖాతరు చేయలేదు.
బ్రిటీషు వారికి లొంగకూడదని నిర్ణయించుకున్నారు. గొప్ప సైన్యాన్ని తయారు చేశారు. ఝుల్కారిబాయి వంటి మహిళలతో మహిళా సైన్యాన్ని కూడా తయరు చేయడం గొప్ప విశేషం. రెండు సైన్యాల మధ్య భీకర పోరాటం జరిగింది.
1857 మే 10వ తేదీన మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు పాకింది. అదే విధంగా ఝాన్సీరాణి స్పందించింది. నానా సాహెబ్, తాంతియా తోపే వంటి వీరులు తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటీషువారు ‘సిపాయిల తిరుగుబాటు’ అని పిలిచారు. కాని భారతీయ చరిత్రకారులు ‘ప్రథమ స్వాతంత్ర్య సమరం’ అని నొక్కి వక్కాణించారు.
ఈ పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పాలు పంచుకున్నారు. 1858వ సంవత్సరం మార్చి 23వ తేదీన బ్రిటీష్ సైన్యాధికారి సర్ హ్యూరోజ్ ఝాన్సీని ఆక్రమించారు. పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని భీకర పోరాటం సలిపినా ఝాన్సీ సైన్యం బ్రిటీష్ సైన్యానికి ధీటుగా స్పందించలేకపోయింది. కారణం – రాశిలో తక్కువయినా సుశిక్షితులయిన సైన్యానికి తోడు అత్యాధునిక ఆయుధ సంపత్తిని వారు కలిగి ఉండడమే!
లక్ష్మీబాయి బ్రిటీషు వారికి లొంగలేదు. కోట చుట్టూ ఆమె అనుచరులయిన నగర రక్షకులు కాపలా ఉన్నారు. వారందరి సహాయంతో కుమారునితో సహా తప్పించుకున్నారు.
ఆ తరువత కల్పి అనే ప్రదేశంలో తాంతియా తోపేని కలిశారు. ఈలోగా బ్రిటీషువారు గ్వాలియర్ కోటని ముట్టడించారు. గ్వాలియర్ కోటని రక్షించడం కోసం యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో 1858వ సంవత్సరం జూన్ 18వ తేదీన మరణించారు.
ఈ యుధ్ధంలో ఈమె ధైర్య సాహసాలని సర్ హ్యూరోజ్ ఈ విధంగా కీర్తించారు “1857 విప్లవకారులందరి లోనూ అత్యంత ధైర్య సాహసాలతో యుద్ధం చేసిన మహిళ” అని అభివర్ణించారు. ఏమైనా ‘1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం అంటేనే అందరికీ స్ఫురణకి వచ్చేది ఝాన్సీ లక్ష్మీబాయి’ అనడం అతిశయోక్తి కాదు.
ఈ అసమాన ధీశాలి, అపూర్వ యుద్ధనీతిజ్ఞురాలు, వీరనారి రాణి లక్ష్మీబాయి పరిపాలనా కాలం 1857 – 1858 లో ఝాన్సీ ప్రజలు శాంతిగా, సుఖ జీవనం కొనసాగించారు.
ఈమె జ్ఞాపకార్థం భారత తపాలశాఖ రెండు స్టాంపులను విడుడల చేసింది. ముఖ్యంగా 9-5-1988వ తేదీన ‘Martyrs of First War of Independence 1857’ శీర్షికతో విడుదలయింది ఒక ప్రత్యేక స్టాంపు.
ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రించిన చిత్రాన్ని ఈ స్టాంపు మీద ముద్రించడమే ఆ స్టాంపు విశేషం.
తలచకుంటేనే దేశభక్తితో మనస్సులను ఉప్పొంగించే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి నవంబరు 19 సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet