[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 44వ భాగం. [/box]
మోహన్ చారిత్రక నవల-2.1
[dropcap]ఆ[/dropcap]కాశం నిర్మలంగా ఉంది.
సానపట్టిన వజ్రాలవలె నభోంతానంపై నక్షత్రాలు మెరుస్తున్నాయి.
మందంగా వీచే గాలిలో చల్లదనం తోస్తున్నది.
అలల చప్పుడు లయబద్ధంగా వినవస్తోంది. అతనికి తెలివి వచ్చింది.
బెండ్లు నింపిన తెప్పకి అతని శరీరం బంధింపబడి ఉంది. కట్టు విప్పుకోడానికి చేతులు అనుకూలంగా ఉన్నా, ఆ చేతులను కదపడానికి అతనికి శక్తి లేకుండా పోయింది.
కొద్దిసేపు అతను నక్షత్రాల వేపు చూశాడు.
అర్ధరాత్రి గడచింది.
తిరిగి అతనికి తెలివి తప్పిపోయింది.
తెరలు తెరలుగా అతనికి తెలివి వచ్చింది.
పగటి ఎండవెలుతురుకి అతని కళ్లు అలవాటు పడేసరికి కొంతకాలం పట్టింది.
ఎండిన అతని పెదవుల మీద అమృతబిందువులు వర్షించినట్లు లేత కొబ్బరికాయ నీళ్లు పడ్డాయి. పెదవులు తెరచుకున్నాయి. కొద్ది కొద్దిగా కొబ్బరినీరు ఎవరో నోట్లో పోస్తున్నారు. ఆ నీరు క్రమంగా గొంతుకులోంచి పోయింది. కొద్ది సేపటిలో అతనికి కొద్దిగా బలం వచ్చినట్లయింది. కళ్లు తెరచి తన చుట్టూ నిలుచున్న వారిని అతడు చూశాడు. వాళ్లు ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. వారి భాష ప్రాకృతం కాదు. పాళీ భాష. ఆ భాష ఎక్కడో అతను విన్నాడు. తక్షశిలలో సీహళ దేశపు ఛాత్రులిద్దరి సంభాషణ అదే విధంగా ఉంది. వారి ప్రశ్నలను అతడు అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు. తన రాక సువర్ణ భూమి నుండి అని, తాను శ్రమణుడనని అతడు చెప్పుకున్నాడు. బుద్ధ దేవుని దృష్టితో శ్రమణ, బ్రాహ్మణులు గౌరవించదగినవాళ్లు. అతని చుట్టూ మూగిన వాళ్లు అతనికి ప్రణామం చేశారు. త్రిరత్నాలను స్తుతించారు. అతనికి స్వాగతం పలికారు.
వాళ్లందరూ చాల సులువుగా ఉన్నారు. వారి ముఖాలు కోలగా ఉన్నాయి. వారి చెవులు దీర్ఘంగా ఉన్నాయి. చెవి తెమ్మలు బరువైన కర్ణాభరణాలతో సాగిపోయాయి. వాళ్లు నాగరికులు కారు. వారు ధరించిన వస్త్రాలు సాధారణంగా ఉన్నాయి. వృత్తితః వాళ్లు జాలర్లవలె కనిపించారు.
ఇపుడు అతనికి బాగా తెలివి వచ్చింది. కొద్దిగా సత్తువ వచ్చింది. తానిపుడు తెప్పకు కట్టిలేడు. కొబ్బరి త్రాళ్లతో నేసిన మంచం మీద, మెత్తటి బట్టల మీద పండుకొని ఉన్నాడు. అతనికి బాగా తెలివి వచ్చి కూర్చున్న తరువాత, అతని మృణ్మయ భిక్షాపాత్రను, భోజనం చేసే మట్టి మూకుడును తెచ్చి అతని పక్కనే ఉంచారు. అతని సంచిలో ఔషధాలున్నాయి. అవన్నీ సముద్రపు నీటిలో తడిసి చెడిపోయాయి.
ఎండ క్రమంగా హెచ్చింది.
గ్రామవాసులు చెట్టు నీడలో అతని మంచం ఉంచారు. కొబ్బరి ఆకులతో నేసిన బుట్టలలో పండ్లను తీసుకొని వచ్చారు. చిన్నమట్టి కుండలలో, కాచిన పాలు తెచ్చారు. ఒకరు అతని నోటికి పాలకుండను అందించారు. రెండు గుక్కలు తాగిన తరువాత అతను మరి తాగలేకపోయాడు. ఒక దినమంతా పూర్తిగా తిండిలేక అలల కుదుపులకు శరీరం బడలిపోయి, సముద్ర జలాలలో నానిపోయి, అతను చాల నీరసంగా ఉన్నాడు.
ఆనాటి సాయంకాలానికి అతనికి కొంచెం శక్తి వచ్చింది. గ్రామ వాసులలో ఇద్దరు సీహళ రాజధాని నగరం అనూరాధ పురానికి శ్రమణుడి గురించి చెప్పడానికి పోయారు.
శ్రమణుడి వస్త్రాలు బాగా తడిసి పోవడం చేత గ్రామవాసులిచ్చిన బట్టలు ఒంటికి చుట్టుబెట్టుకున్నాడతడు. పగలు ఎండ కాసినా సాయంకాలం సరికి చల్లబడింది. ఆ మామిడి తోటలోనే వాళ్లు కొబ్బరి ఆకుల చాపలతో ఒక పందిరవేశారు.
దానికిందకి అతని మంచం మార్చారు. ఆ విధంగా శ్రమణుడు నాలుగు దినాలు మామిడి తోటలో గడిపాడు. క్రమంగా అతని బలం తిరిగి వచ్చింది. అయిదవ నాటి ఉదయానికి అనూరాధ పురం నుండి మహారాజు బేట్ఠ తిస్సుడు పంపిన పెద్ద ఏనుగు, అంబారీతో అలంకరింపబడి, వచ్చింది. దానితో మహారాజు పంపిన రాజోద్యోగి, పదిమంది భటులు వచ్చారు. రాజ ప్రతినిధి పాళీ భాషలో శ్రమణుడితో మాట్లాడి సగౌరవంగా అతనిని అనూరాధ పురం తీసుకొని రమ్మని చెప్పిన రాజుగారి సందేశం అందజేశాడు.
శ్రవణుడు నడుస్తానన్నా రాజ ప్రతినిధి అంగీకరించలేదు. శ్రమణుడికి అన్ని విధాల సదుపాయాలు చేసిన గ్రామవాసులను రాజప్రతినిధి ప్రశంసించి వారికి బహుమతులను అందజేశాడు.
శ్రమణుడు అందరి దగ్గర సెలవు తీసుకొని గజారోహణం చేశాడు. త్రిరత్నాలను స్తుతించాడు.
మూడవనాటి సాయంకాలానికి వాళ్లు అనూరాధ పురం పరిసరాలకు చేరుకున్నారు. ముందుగనే శ్రమణుడి రాకను తెలియబరచడం చేత నగర ద్వారం తెరచి ఉంచారు.
అనూరాధ పురంలో రాజప్రసాదాలు నగరమధ్యంలో ఉన్నాయి. నగరంలో పడమటి దిక్కున, రాజుగారి కోటకు మీదుగా సంఘారామాలున్నాయి. కోటకు దక్షిణపు దెసలో నదీ ఒకటి పారుతున్నది. నదికి తూర్పు దిక్కున, పౌర గృహాలున్నాయి. వాటికి తూర్పున నువార సరస్సు ఉంది.
మహాపథం దక్షిణం నుండి ఉత్తరానికి పోతుంది. కోట, మహా పథానికి మధ్యను ఉంది.
శ్రమణుడు అనూరాధ పురం చేరేసరికి సూర్యుడు పడమటి దిక్కువేపు చేరుకుంటున్నాడు. అగడ్త మీద కఱ్ఱవంతెన ఉంది. అంబారీ ఏనుగు దానిమీద నడుస్తూ ఉంటే బల్లలు కిర్రుమన్నాయి.
రాజప్రతినిధి ఏనుగును మహా పథం మీద నడిపించాడు. మార్గానికి ఇరుప్రక్కల నిలబడి ప్రజలు శ్రమణుడికి స్వాగతం పలికారు.
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
త్రిరత్నాల పఠనంతో పరిసరాలు దద్దరిల్లాయి. శ్రమణుడు చేతులు మోడ్చి అందరికీ వందనం చేశాడు.
అనూరాధపురం మధ్యను రాజభవనాలున్నాయి. వాటికి పడమరను, కోట ఆవరణలో విశ్రాంతి గృహముంది. దానిని రాజులకు రాజ బంధువులకు విడిదిగా ఇస్తారు.
విశ్రాంతి గృహంలో శ్రమణుడు ప్రవేశించే సరికి సూర్యాస్తమయమయింది. చీకట్లు అలముకొంటున్నాయి. విశ్రాంతి గృహాన్ని దీపాలంకృతం చేశారు.
కవోష్ణంగా నున్న సుగంధ జలాలు శ్రమణుడి స్నానం కోసం సిద్ధంగా ఉంచారు. కచూరం, చందనపు పొడి మొదలైన వాటితో తయారయిన సున్నిపిండి అతిథి కోసం అందుబాటులో ఉంచారు. తుడుచుకోవలసిన ఉత్తరీయాన్ని దండెం మీద ఉంచారు.
రాజ ప్రతినిధి ఒక మాట చెప్పాడు.
“ఇది రాజ బంధువులకు విడిదినిచ్చే విశ్రాంతి గృహం. ఇక్కడి మర్యాదలను కాదంటే మహారాజుగారి ఆతిథ్యం నిరాకరించినట్లే అవుతుంది. రాజదర్శనమైన తరువాత, వారు సూచించిన విహారం మీరు చేరే వరకు, ఇక్కడి రాజోద్యోగులు మీకు చేసే సపర్యలను ఆమోదించవలసింది.”
శ్రమణుడు మరి మాట్లాడడానికి అవకాశం కలుగలేదు.
శ్రమణుడు స్నానగృహంలో ప్రవేశించాడు. అక్కడ గంధపు పొడితో పాటు మృతిక కూడా ఉంచారు. సుగంధ జలాలలో పాటు నిర్మలమైన నదీజలాలు చల్లనివి ఉంచారు. ఉత్తరీయంతో పాటు, స్నానానంతరం ధరించడానికి అంతర్ వసనం, ఉపిరి వసనం, శాటి, దండెం మీద ఉంచారు.
శ్రమణుడు మృత్తిక రాసుకొని స్నానం చేశాడు. తడిబట్టలను ఉతుక్కొని దండెం మీద ఆరవేశాడు. కొత్త బట్టలను ధరించి తనకోసం ఏర్పాటు చేసిన గదిలోకి ప్రవేశించాడు.
గోడకు సమీపంగా ధర్మాసనం పరచుకొని అతడు దానిమీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. త్రిరత్నాలను స్తుతించాడు. ధమ్మపథంలోని సూక్తులను, త్రిపిటకాలలోని వాక్యాలను చదివాడు.
ఇంతలో భోజనం సిద్ధంగా ఉందని పాచకుడు పిలుపు నిచ్చాడు. శ్రమణుడు, నిత్యం భోజనం చేసే మృణ్మయ పాత్రను, తనతో తెచ్చిన సంచీనుండి వెలపలికి తీసి, భోజనశాలలోకి ప్రవేశించాడు.
తామరాకులో వ్యంజనాలు, అన్నం మొదలైనవి వడ్డించారు. వాటిని మృణ్మయ పాత్రలో ఉంచి, భిక్షాన్నంతో సమానంగా భావించి, శ్రమణుడు బోజనం ముగించాడు. ఆహారం సాత్వికమైనది. పక్కనే కొమ్ము బూరలో లవణముంచారు, అవసరమైతే ఉపయోగించడానికి చివరను పాయసం కూడా వచ్చించారు. బుద్ధ దేవుడు ఆమోదించిన పదార్థాలే ఇవి.
భోజనశాల నుండి వచ్చిన తరువాత, శ్రమణుడు కొంత సేపు వాకిటిలో నడిచాడు. ముందు చాల పెద్ద ఆవరణ ఉంది. అందులో మామిడి మొదలైన ఫల వృక్షాలున్నాయి. మామిడి చెట్లు నిండా పిందెలు, చిన్న చిన్న కాయలూ ఉన్నాయి. చెట్ల మీద నుండి వస్తున్న గాలిలో చల్లదనంతోచి, గ్రీష్మంలో శరీరానికి హాయినిచ్చింది. కొద్ది సేపు అక్కడ పచారు చేసి, శ్రమణుడు తన గదిని చేరుకున్నాడు. బల్లమంచం మీద, కఠినమైన శయ్య మీద, జమిలి దుప్పటి పరుచుకొని, బుద్ధుడిని మతించి, శ్రమణుడు నిద్రకు ఉపక్రమించాడు.
శ్రమణుడు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. చన్నీట స్నామాడాడు. ఆరవేసిన బట్టలు ధరించాడు.
త్రిరత్నస్తుతి, బుద్ధభగవానుని నుతి, త్రిపిటకాలను స్మరించడం చేశాడు. అప్పటికి వెలుగు బాగా వచ్చింది.
శ్రమణుడు ఏమీ ఆలోచించడం లేదు. సంఘటనలు ఒకదానికొకటి పొందడం లేదు.
విశ్రాంతి గృహరక్షకుడు కొద్దిసేపటిలో వచ్చి శ్రమణుడిని పలుకరించి నమస్కారం చేశాడు. ఆ వచ్చిన అతడు ఆజాను బాహువు. ఏభై ఏళ్లకు లోపునే అతని వయసుంది. అతడు ద్వీప వాసుల వర్ణానికి భిన్నంగా పండు తమలపాకు రంగులో ఉన్నాడు. శ్రమణుడితో అతడు పొలీభాషలో మాట్లాడాడు.
“శ్రమణా! రాత్రి సుఖంగా నిద్రపోయారా? ప్రయాణపు బడిలిక తీరిందా?”
శ్రమణుడు అతనిని చూసి ఆశ్చర్యపోయాడు.
“మీకు నమస్కారం – మీరెవరో నాకు తెలియదు. నా కుశలమడిగిన మీకు నా కృతజ్ఞతలు.”
వచ్చిన ఆజానుబాహువు చిన్న నవ్వు నవ్వి అన్నాడు.
“నా పేరు కళింగ భూపతి, నేను మహారాజుగారి విశ్రాంతి గృహానికి రక్షకుడిని. నిన్నది దినం మీరు వచ్చే వేళకు నేను ఉద్యోగం నుండి ఇంటికి వెళ్లపోయాను. మీకు అన్ని ఏర్పాటులు చేసిన తరువాత అత్యవసరం కార్యం మీద గృహానికి మరలిపోయాను. అందుచేత నేను స్వయంగా మీకు స్వాగతం చెప్పలేకపోయాను.”
(సశేషం)