గొంతు విప్పిన గువ్వ – 15

34
9

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

మౌనాలాపన

[dropcap]O[/dropcap]h my angel, from a little girl so very small, how and when did you get so tall…

“ఏమిటి మమ్మీ, ఆ టీనేజి రొమాంటిక్ పోయెట్రీ అసహ్యంగా. నీ వయసుకి తగ్గట్లుగా రాయొచ్చుగా”

శరాఘాతంలా తగిలాయి ఫోనులో నా కూతురు దేవి వయసుకు తగని మాటలు.

నిర్జీవంగా సోఫాలో కూలబడ్డాను.

కవిత్వానికి ఏ వస్తువు అనర్హం కాదే. రవి గాంచని చోట కవి గాంచునని కదా ప్రశస్తి.

మరి నా కూతురేమిటి అలా మాట్లాడుతుంది.

యాభై ఏళ్ళ నేను పదహారేళ్ళ ప్రేమ కవిత్వం రాయకూడదా.

అసలు ప్రేమ అసహ్యం ఏమిటి.

ప్రేమ కవిత్వo రాయటానికో ప్రాయం వుంటుందా.

మధురమైన ప్రేమగీతాలు రాసే సీతారామశాస్త్రి వయసు పదహారేనా. ఏ ప్రాయంలో వున్నవారు ఆ ప్రాయానికి తగిన విధంగానే రచనలు చేయాలా. వారి వారి రచనలను బట్టి ఆయా రచయితల/కవుల వయసు బేరీజు వేయవచ్చా..?

కృష్ణా రామా అనుకోవలసిన వయసులో కవులంతా భావుకత్వం, ప్రేమ కవిత్వం మానేసి వేదాంతంపై రాయాలా.

చటుక్కున ఇరవై ఏళ్ళ క్రితం ఆయనతో నేను పడ్డ గొడవ గుర్తుకు వచ్చింది.

అప్పట్లో వారం వారం “కోయిలా…కోయిలా” శీర్షికలో అచ్చయ్యే నా కవిత్వానికి బాగా ఫాలోయింగ్ వుండేది. మ్యాగజైనులో నా బొమ్మతో పాటు ఇచ్చే ల్యాండ్ లైను ఫోను నంబరుకి అభిమానుల కాల్స్ వచ్చేవి. ఎవరితో మాటాడినా ఆయన సహించలేక పోయేవారు.

నాపైనున్న వల్లమాలిన ప్రేమతో రాను రాను ఆయనలో పోసెస్సివ్‌నెస్ ఎక్కువ అయి నాతో గిల్లికజ్జాలు పెట్టుకునేవారు.

చిన్ని చిన్ని గొడవలు చిలికి గాలి వానైనట్టు రాను రాను సంసారంలో పెద్ద తుఫానే రేగింది. ఆ సుడిగుండంలో నా సంసారం చిక్కుకు పోకుండా, మూడు ముళ్ళు చిక్కు ముళ్ళవకుండా ఇద్దరి మధ్యా మూడో మనిషి ప్రమేయం అవసరమయ్యింది.

తర్జన భర్జనల అనంతరం ఆఖరికి మా ఆడబడుచు శేషాయమ్మ రచ్చబండ తీర్మానం నా చేత కవితలు పత్రికలకు పంపకుండా శాసించింది. ఇక చేసేది లేక నేను నా అంతర్మథనాన్ని, నాలో జరిగే సంఘర్షణను నా డైరీలో పొందు పరుచుకుని తృప్తి పడేదాన్ని.

కవిత్వం కన్నా కుటుంబమే ముఖ్యమనుకునే అతి సాధారణ సాంప్రదాయ హిందూ స్త్రీని నేను.

నేను ఎంతగా ప్రేమించానో అంత దుఃఖసాగరంలో నన్ను వదిలి దురదృష్టవశాత్తూ ఆయన వెళ్ళిపోయారు.

తల్లీ తండ్రీ నేనై పిల్లల బాధ్యతలను మహా యజ్ఞంలా నిర్వహించాను.

బాధ్యతలన్నీ తీరి పిల్లలు రెక్కలొచ్చి గూడు వదిలే సరికి నా జీవితంలో అర్ధ శతాబ్దo ముగిసిపోయింది.

ఒంటరితనంలో ముప్పయి ఏళ్ళ క్రితం వదిలేసిన రచనా వ్యాసంగాన్ని తిరిగి ఆశ్రయించాను. కలగా మిగిలిపోయిన జీవితాన్ని జాగృత పరిచి కవిత్వంలో కలలు కనటం ప్రారంభించాను.

నా కళ్ళ నిండా కలల సీతాకోకచిలుకలు. నిరర్ధకం అనుకున్న నా జీవితం నిస్సారం కాదనిపించింది. అక్షరాలు నన్ను మురిపెంగా లాలిస్తున్నాయో లేక నేను అక్షరాలను బుజ్జగిస్తున్నానో తెలియని అలౌక్య స్థితి.

దివ్యమైన అక్షరాలను ఆశ్రయిస్తే డిప్రెషన్‌కు దూరం అయి ఎంత అనిర్వచనీయానందం పొందవచ్చునో తెలుసుకున్నాను.

ఈ ఒంటరి ఎడారి జీవిత గమనంలో శీతల పరిమళాలు వెదజల్లే అక్షరాలే నాకు ఊరట.

నేనల్లుకునే అక్షరమాలలు నను పెనవేసుకు పోయిన దుఃఖంలో విరిసిన చిరు నగవులు.

నేను అపురూపంగా కూర్చుకొనే పద విన్యాసాలు జీవితేచ్ఛ నశించకుండా ముందుకు సాగేందుకు సహకరిస్తున్న ప్రాణ వాయువులు.

మసకబారి పోయిన నా జీవితానికి రవ్వంత వెలుగునిచ్చే దీపపు వత్తులు పదాలతో నేను చేసే కసరత్తులు.

భాష నా శ్వాస. పదాలు నా వేళ్ళ కొసలపై పూచే పుష్పాలు. వాక్యాలు నా వెంట సాగే జలపాతాలు. అసంపూర్ణంగా మిగిలిపోయిన కలలను కళాత్మకంగా కావ్యాల్లోకి ఒంపి ఆ తేనె తట్టుకి వెన్నెల అద్దాను. తేనె తియ్యదనాన్ని, వెన్నెల చల్లదనాన్ని, జలపాతపు ధారను, పూల పరిమళాన్ని కలబోసి కావ్య మాలలల్లాను.

నా రచనా సౌరభాలకు ముగ్ధురాలైన నా ప్రాణ స్నేహితురాలు రజిత గుభాళించే కవిత్వ అత్తరు పరిమళాలు పదిమంది ఆఘ్రాణించాలని పట్టుపట్టింది.

అలా లల్లాయి గీతాలతో నా ఫేస్ బుక్ అకౌంటు మొదలయ్యింది.

నా కవిత్వాన్ని ఆస్వాదించే అభిమానుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అభిమానుల లైకులు టానిక్కులా పని చేసేవి. మరింత ఉత్సాహంతో రాయటం ఎక్కువయ్యింది. రచనలకనుగుణంగా అడపా దడపా నా ఫోటోలు పెట్టేదాన్ని.

నా పోస్టుల పైన అభిమానుల కమ్మని కామెంట్లు, సరసమైన ఛలోక్తులు నన్ను అమితంగా ఉత్సాహ పరిచేవి.

అక్షరాలతో అనుబంధం జీవితాన్ని ఇంత నందనవనం చేస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు.

నాకు ఎంతో ఇష్టమైన ఈ వ్యాపకంలో తలమునకలై ఆనంద డోళికల్లో తేలియాడుతూ మానసికానందాన్ని పొందుతున్న సమయంలో నా కూతురి ఫోను పక్కలో బాంబు పేల్చింది.

ఎవరో నా బొందిలో నుండి ప్రాణం తోడేస్తున్న భావన.

నాలోంచి ఊపిరిని లాగేస్తున్న వేదన.

“మమ్మీ, మా ఆయన, మా మామయ్యగారు, మా మరిదిగారు అంతా చదువుతుంటారు నీ పోస్టులు. అంత విశృంఖలంగా రాయకు. నీ వయసుకి తగినట్టుగా సామాజిక స్పృహ కలిగిoచే విషయాలపైన రాయొచ్చుగా. ప్రేమేమిటి అసహ్యంగా…”

నాకు నవ్వు వచ్చింది. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందట. నేను ఏమి రాయాలో నాకు నా కూతురు చెప్పటం. అది చెప్పిన విషయాలపై నేను రాయటం. అసలు రచనలంటే ఏమనుకుంటుంది. అదేమైనా ఒకరు నిర్దేశిస్తే వచ్చేదా? మనసు అంతర్మథనపు నలుగుడులో నుండి స్పాన్టేనియస్‌గా పుట్టుకొచ్చే పుష్పగుచ్చాలు. హృదయ స్పందనల ప్రకంపనల నుండి జనించే భావ పరంపరలు.

అసలు నిత్య నూతనమైన ప్రేమను మించినది ఈ ప్రపంచంలో మరేదయినా వుoటుందా.

తల్లికి బిడ్డ పైన ప్రేమ, బిడ్డకు అమ్మ పైన ప్రేమ, ప్రియుడికి ప్రియురాలి పైన ప్రేమ, భర్తకు భార్య పైన ప్రేమ. గురువుకి శిష్యుడి పైన ప్రేమ, శిష్యుడికి గురువు పైన ప్రేమ. ప్రకృతి ప్రేమ. నేను నా కవిత్వంలో పలు రకాల ప్రేమ కోణాలన్నీ స్ఫ్రుశించానే. మరి దేవికి నచ్చనిదేమిటి.

అసలు దానికి నేను కవిత్వం రాయటం నచ్చలేదనుకుంటా.

నేను పది మంది దృష్టిలో పడటం నచ్చలేదనుకుంటా.

ఆ తండ్రి కూతురే కదా. అన్నీ తండ్రి పోలికలే.

నిస్సత్తువగా సోఫాలో జారిగిలపడ్డాను.

“దిస్ ఈజ్ టూ మచ్. అసలు నీ కూతురు ఏమనుకుంటుంది? అయినా కవిత్వం రాయటం ఒక కళ. అందరికీ అబ్బేది కాదు. తనను రాయమను ఓ కవిత. నాలుగు తెలుగు లైన్లు స్పష్టంగా చదవలేదు గాని నీకు చెప్పొచ్చిందా.” రజిత నా కూతురి పైన కోపంతో రగిలిపోయింది.

నిర్వేదంగా చూసాను రజిత వంక.

“పోనీలేవే, నీకెందుకంత కోపం. దాని భర్త, అత్తారితో దానికేమి సమస్యలు వున్నాయో. నన్ను కవిత్వం మానేయమన్నదంటే అదెంత క్షోభ పడి ఆ మాట నాతో అన్నదో. వయసుతో పాటు పరిపక్వత చెందిన మనం అన్ని విధాలుగా ఆలోచించాలి కదా. అప్పుడు నా సంసారం కోసం మానేసాను. ఇప్పుడు నా కూతురి సంసారం కోసం మానేస్తాను. తప్పేదేముంది. అయినా నేను రాయకపోతే వచ్చే ప్రళయమేమీ లేదు.” అన్నాను బాధను దిగమింగుకుంటూ.

రజితను శాంత పరచటానికి అలా అన్నానే కాని నేను నవనాడులా కృంగి పోయాను.

నేను నన్ను స్పందింప చేయలేని విషయాల పైన రాయలేను.

దాదాపుగా కవిత్వ సన్యాసం చేసి, ఏవో నవలలు, వారపత్రికలు తిరగేయటం మొదలెట్టాను. మనసు వాటి పైన కేంద్రీకరించే కొద్దీ కథలు నవలలు రాయాలనే దుగ్ధ మొదలయ్యింది.

తరుచూ రజితతో కలిసి బయటకు వెళ్ళటం మొదలెట్టాను.

సినిమాలు, షాప్పింగులు, బ్యూటీ పార్లర్లు, ఏదో విధంగా రోజులు నెట్టుకొస్తున్నాను. కలం పట్టకపోతే అమాంతం జీవితం వృధా అయిపోయిన భావన కలిగింది. ఆ వేదనను మరిచిపోవటానికి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం, ఎక్కడయినా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే రజితతో కలిసి హాజరవటం.

ఆ రోజు దసరా సందర్భంగా నిజామ్స్ క్లబ్బులో ఏర్పాటు చేసిన దాండియా ఆడడానికి రజితతో వస్తానన్నాను.

అద్దం ముందు కూర్చుని కళ్ళకు కాటుక దిద్దుకుంటుంటే అకస్మాత్తుగా ఆయనతో ఒకసారి ఏదో సందర్భంలో నేనన్న మాటలు గుర్తొచ్చాయి..

“నేను ఏదయినా పాత నైటీలో వుండగా హటాత్తుగా పోతే, మీరు నన్ను అందమయిన చీరలోకి మార్చాకే నలుగురినీ పిలవండి..”

చీరకట్టులో వుండే హొయలు మరే ఇతర వస్త్రధారణలో వుండదు.

ఎంత నొచ్చుకున్నారో ఆయన ఆ మాటలకు.

నా మాటలకు ఆయన కళ్ళల్లో లీలగా మెదిలిన బాధ, అమాంతం కమ్ముకున్న కన్నీటి పొర, నాకింకా తడిగా తగులుతూనే వుంటుంది ఇప్పటికీ.

వెంటనే ఆయన తనను తాను సంభాళించుకుని “చీర కట్టటమేనా, ఎవరయినా బ్యుటిషియన్‌ని పిలిపించి మేకప్ కూడా చేయించాలా” అని ఆట పట్టిస్తూ లైట్ టోన్లో అడిగారు.

నేను ఆయన మెడ చుట్టూ చేతులు పెనవేసి బుగ్గ మీద సుతారంగా ముద్దు పెట్టి “మేకప్ కూడా వేయిస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ హబ్బీ డార్లింగ్” అన్నాను నవ్వుతూ.

ఆయన లాలనగా నన్ను తన కౌగిట్లోకి తీసుకున్నారు.

నా పురా పరిమళాలకు తెర దించుతూ రజిత గదిలోకి సుడిగాలిలా దూసుకొచ్చింది.

రజిత దాండియా ఆటకు ముక్కుకి నత్తు, పాపిట బిళ్ళ పెట్టుకుందామంది.

ఎందుకో నాకు అంతగా అలంకరించుకోవాలంటే సిగ్గనిపించింది.

సందర్భానికి తగినట్లుగా అద్దాల చీర కట్టుకుని లోలకులు పెట్టుకున్నాను. అద్దంలో చూసుకున్నాను. లోలకులతో నా వయసు పదిహేనేళ్ళు వెనక్కి వెళ్ళినట్లుoది.

మళ్ళీ ఆయన గుర్తొచ్చారు. నిట్టూర్చాను.

“ఇంకా రెడీ కాలేదా” రజిత హడావిడి పడుతూ నన్ను తేరిపార చూసింది.

రజితకి చురుకెక్కువ. నా వయసే అయినా దాని కదలికలు చాలా చలాకీగా వుంటాయి.

“భలే కనిపిస్తున్నావే. ముక్కుకి నత్తు, పాపిట బిళ్ళ పెట్టుకోమన్నానుగా, ఏవి” అడుగుతూ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు వెతికింది.

“అవి పెట్టుకుంటే మరీ టూ మచ్ గా వుంటుంది, వద్దులేవే” అని వారించ బోయాను.

నేను వారించే లోపే రజిత నా పాపిటలో పాపిట బిళ్ళ, ముక్కుకి నత్తు తగిలించేసింది.

“అబ్బ, ఎంతందంగా వున్నావో, కళకళలాడే పదహారేళ్ళ నవ వధువులా తళతళ లాడిపోతున్నావు. నా దిష్టే తగిలేట్టుంది” అంటూ రజిత నా బుగ్గన ముద్దు పెట్టింది.

అద్దంలో చూసుకున్నాను. నిజంగా ముక్కు పుడక ఎంత అందం తెచ్చింది మొహానికి.

కాళ్ళకు పారాణి పట్టాగొలుసుల కన్నా, చేతులకు గాజులు గోరింటాకులకన్నా ముక్కుకి చిన్న నత్తు లేదా ఒంటి రాయి ముక్కు పుడక స్త్రీకి ఎంత స్త్రీత్వాన్ని, శృంగారాన్ని తెచ్చి పెడతాయో కదా…

ఆయన వుండి వుంటే తన షష్టి పూర్తిలో నన్ను ఇలా నవ వధువు అలంకారంలో చూసి ఎంత మురిసి పోయేవారో.

ఎందుకో తెలియని దిగులు ఆవహించింది.

అప్పటికే ఆలస్యమయ్యిందని రజిత నా చేయి పట్టుకుని గబగబా క్లబ్బుకి లాక్కెళ్ళింది.

మ్యూజిక్కుకి అనుగుణంగా అడుగులు వేస్తూ దాండియా ఆడుతున్నానే కాని నా మనసు అక్కడ లేదు. ఆయన తలపుల్లో అందమైన ప్రేమ కావ్యాలల్లుతోంది. ఆయన ఊహాత్మక పరిష్వంగంలో మైమరిచిపోతోంది. ఏదో ట్రాన్స్ లో వున్నట్టుగా హొయలుగా లయబద్దంగా మమేకమై స్టెప్పులేసాను.

రజిత నన్ను కొన్ని భంగిమల్లో ఫోటోలు తీసింది.

కార్యక్రమం పూర్తి అయ్యాక, డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరాము.

రజిత తను తీసిన ఫోటోల్లో ఒక ఫోటోని నా ఫేస్ బుక్కు ప్రొఫైల్ పిక్ గా పెట్టింది.

బట్టలు కూడా మార్చుకోకుండా, అలాగే అలసటగా మంచంపై నడుం వాల్చి చేతిలోకి మొబైల్ తీసుకున్నాను.

నా కూతురి నుండి అప్పటికే వెంట వెంటనే ఐదు వాట్సప్ మేస్సేజిలు.

గబగబా తీసి చూసాను.

“మమ్మీ, ఏమిటా వేషం”

“అసలు వయసుకి తగ్గట్లుగా గ్రేస్‌ఫుల్‌గా వుండవుగా”

“అర్జెంటుగా ఆ ప్రొఫైల్ పిక్ మార్చు”

“నన్ను నలుగురిలో తలెత్తుకుని తిరగమంటావా, వద్దoటావా”

“అసలు నువ్వు మిడిల్ ఏజ్ క్రైసిస్‌తో బాధపడుతున్నావు”

ఒక్క క్షణం అది దేని గురించి మాటాడుతుందో అర్థం కాలేదు. తల దిమ్మెక్కిపోయింది.

క్రమంగా రజిత మార్చిన నా ఫేస్ బుక్కు ప్రొఫైల్ పిక్ విషయమని అర్ధమయ్యింది.

ట్రైనింగ్ లేని టైలరింగ్ తో నాకు అమ్మ నుండి సంక్రమించిన మెరిట్ కుట్టు మిషనుతో దాని చిన్నతనంలో రాత్రింబవళ్ళు నేను కుట్టిన రకరకాల బుట్ట గౌనుల్లో నన్ను మురిపించిన నా చిట్టి తల్లేనా ఈ తల్లిని అన్నేసి మాటలంటోoది.

ఇప్పటికీ ఎక్కడ ఏ బొటీక్‌లో అందమైన డ్రెస్సు కనిపించినా అందులో నా బంగారు బొమ్మను ఊహించుకుంటూ వెంటనే కొని వాటిలో దాని అందాలను చూసి మురిసే నన్ను అలా ఎలా అనగలుగుతోంది…

ఆయనే బ్రతికి వుండి వుంటే ఇన్ని మాటలనేదా…

ఎదిగిన ఆడపిల్లల వితంతు తల్లికి వేషధారణ విషయంలో స్వేచ్ఛ వుండదేమో..

తల్లులు తన పిల్లలు అందంగా కనిపించాలని తపన పడతారే మరి పిల్లలెందుకు తల్లి అందంగా కనిపిస్తే సహించరు..

అమ్మ మనసు వెన్న బిడ్డ హృదయం పాషాణం అంటారు… అందుకు తార్కాణం ఇదేనా…

నా కళ్ళు చెరువులయ్యాయి. కంటి కాటుక కన్నీటితో పాటు చంపల మీదుగా జారుతోంది.

ముక్కుకున్న నత్తుని అభిషేకిస్తూ నాసిక నుండీ నీరు స్రవిస్తోంది.

నా గుండెల్లో సన్నగా నొప్పి మెలిపెడుతోంది.

Life is tough my darling, but so are you…

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here