[dropcap]అ[/dropcap]సమాన క్రీడాపటిమ,
అనుపమ దార్శనికత;
అపరిమిత మేధోశక్తి,
అనుద్విగ్న మానసికత
కలబోత మా ధోనీ
పరిణితి లో మౌని
***
స్వతంత్రించి 73 ఏళ్లు,
బడులలో ఇప్పటికీ
మహిళా శౌచాలయాల
దయనీయ అనుపస్థితి
సిగ్గు పడే లోటు
లోతైన కత్తి పోటు
***
మైమరపు ఆటలు,
ఆరబయట నేలపై;
రాజకీయాల్లేని
విద్వేష రహిత క్రీడలు
బాల్య స్మృతులు
చిరస్మరణీయాలు
***
పంచమవేద లేఖకా,
సబల గణాధిపతి,
సకల విఘ్నాధిపతి
సర్వ విద్యాధిపతి
మనసులో తిష్ట
గౌరీసుత గజానన
***
రేఖల్లో సౌందర్యం
భావంలో కొంటెతనం
అక్షరాలకు నవరూపం
రంగుల హరివిలుకాడు
చిత్రాల బ్రహ్మ బాపు,
మనోవ్యధలని మాపు
***
మానవత్వం లేని,
స్వార్ధ పూరితము,
కనికరము లేని
అనంతమైన తృష్ణ
ధనదాహపు పరుగు,
ఉన్మాదభరిత ఉరుకు.