[dropcap]అం[/dropcap]దరిలో ఉన్నా
ఎడారి నడక
ఏకాంత వాసంలో
సంతృప్తి కొందరికే యెఱుక
పొర్లు దండాలు పేరు ప్రతిష్ఠలు
ఉన్నోడికే అన్నీ కానుకలు
ధారణ ధనం డంభం
తెలిసినోడింటికే అన్నీ తోవలు
ఎంత గానుగలో తిప్పినా
నూనె నెయ్యి అవునా
ఎంత కష్టపడినా
పేదోడింటి గడపలో దీపం వెలుగునా
నా సిరాకి రాయడం తెలుసు
నా అక్షరాలకి భావావేశం తెలుసు
గజ్జెలకి మువ్వలు అందం
నా మాటలకి ఈ పదాలు చందం
ఎర్ర సిరా చిలికిన నాడు
ఎర్ర చందురూడు వచ్చిన నాడు
సూరీడే అందరినీ ఆవరించడా
పేదా గొప్ప వ్యవస్థల్ని మటుమాయం చేయడా!