[box type=’note’ fontsize=’16’] భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానికాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]అ[/dropcap]మరావతి నగరంలోని స్వాతంత్ర్య సమరయోధుడు రాఘవయ్య తాత ఇంటికి వేసవి సెలవులకు ఆయన మనవడు విహాన్ వస్తూ కొందరు తన మిత్రులను కూడా తీసుకు వచ్చాడు. అందరికి తన తాతయ్యవాళ్ల ఇల్లు అంతా చూపిస్తున్నాడు. తాతయ్య గారి గ్రంథాలయంలోనికి వెళ్లారు అందరూ.
గది అలమారల నిండుగా ఎన్నో పుస్తకాలు, గోడలపై పలురకాల స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు అలంకరించి ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలలోని వారిని పిల్లలు గుర్తించగలిగినా పలుచిత్రాలు గుర్తించలేక పోయారు. పొలం వెళ్లిన తాతయ్య సాయంత్రం రావడంతో “తాతయ్య నీ గదిలో ఎన్నో రకాల స్వాతంత్ర్య పోరాట వీరుల ఫోటోలు ఉన్నాయి, వాళ్లలో చాలామంది పేర్లు మాకు తెలియలేదు, ఎవరు వీళ్లంతా” అన్నాడు విహాన్.
“బాలలూ, ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. ప్రతి ప్రయత్నానికి ఒక ఫలితం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది. లక్ష్యం లేదంటే మనిషి జీవితం వ్యర్థం, తెగిన గాలిపటంలా గమ్యం తెలియని పయనం అవుతుంది. నేడు మనం అనుభవిస్తున్నస్వేచ్ఛా, స్వాతంత్ర్యాల వెనక వేలాది మంది మహనీయుల ఆశయపోరాటం, నిస్వార్థ దేశభక్తి, ధృడ సంకల్పం, త్యాగనిరతి కలిగి తమ జీవిత సర్వస్వాన్ని తృణప్రాయంగా, భరతమాత దాస్యశృంఖలాలు ఛేదించడానికి, రేయింబవళ్లు పోరాటం చేసి, ఉరికొయ్యలపై చిరునవ్వులు చిందిస్తూ దేశం అంతటా దాదాపు ఇరవై లక్షలమంది దేశ స్వాతంత్ర్యం కోసం పలు రకాలుగా అసువులు బాసారు.
ఆ అమరులు భావితరాలు సమానత్వం,సౌభ్రాతృత్వం, స్వాలంబనతో తులతూగాలని ఆశించారు. ఆ వీరుల ఆశయాలను నెరవేర్చవలసిని బాధ్యత నేటితరంపై ఉంది. దేశం కోసం ప్రాణాలు ఒడ్డిన వారి గురించి తెలిపే ‘వందేమాతరం’ అనే స్వాతంత్ర్య సమరయోధుల కథ తెలియజేస్తూ మధ్యలో మన భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర మీకు అవగాహన కలిగేలా క్లుప్తంగా చెపుతాను.” అన్నారు తాతయ్య.
“తాతగారు నాకు ముందుగా నాటి రూపాయి దిగువ నాణాలు, ఎగువ సంఖ్యామానాలు, కొలతలు తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి” అన్నాడు ఓ విద్యార్థి.
ఎనభై ఏళ్ల వయసు తాతయ్య గుబురు మీసాలు దువ్వుకుంటూ “మంచి సందేహం రా అబ్బాయి నీది, చెపుతాను జాగ్రత్తగా వినండి.
ఒక రూపాయికి—2 అర్ధరూపాయలు.
ఒకరూపాయకు—4పావులాలు.
ఒకరూపాయికి— 8 బేడలు.
ఒకరూపాయికి—16అణాలు.
ఒకరూపాయికి—32 అర్ధణాలు.
ఒకరూపాయికి—64కానీలు.
ఒకరూపాయికి— 128ఏగానీలు.
ఒకరూపాయికి— 192దమ్మిడీలు.
ఒకరూపాయికి— 384 ఠోలీలు.
ఒకరూపాయికి—768 గవ్వలు.
(అప్పట్లో వెండిరూపాయలు ఉండేవి వాటిని తులం అనేవారు).
ఇవి రూపాయికి దిగువ నాణాలు. మరి నాటి కొలతలు కూడా తెలుసుకోండి.
భారతదేశంలో మెట్రిక్ పద్ధతిని 1957లో ప్రవేశపెట్టారు. ఇది దశాంశ పద్దతిపై ఆధారపడి ఉంది.
మన పూర్వీకులు కొలతలు ఎలా లెక్కించే వారో తెలుసుకొండి.
‘శేరు’ అంటే దాదాపు నేటి కిలో బరువు ఉండేది. దీనికి రెండు ‘అచ్చేర్లు’. అచ్చేరుకు రెండు పావుశేర్లు, పావు శేరుకి రెండు ‘చిట్లు’. రెండు ‘బళిగలు’ కలిస్తే ‘చిట్టె’. బళిగకన్నా చిన్నది ‘ఇబ్బళిగ’. దీనికన్నచిన్నది ‘మబ్బళిగ’. అంతకన్నా చిన్నది ‘పాలాడ’. ఇవి శేరుకి దిగువ కొలతలు.
శేరుకు ఎగువకొలతలు తెలుసుకుందాం!
నాలుగు ‘గిద్దలు’ ‘సోల’. రెండు సోలలు ‘శేరు’. మూడున్నర శేర్లు ‘ముంత’. నాలుగు ముంతలు ‘కుంచెము’. రెండు కుంచాలు ‘ఇరస’. రెండు ఇరసలు ‘తూము’. పది తూములైతే ‘పందుము’. ఇరవై తూములైతే ‘పుట్టి’,
ఇలా ఉండేవి నాటి కొలతలు.
నాటి సంఖ్యామానాలు.
ఏకము, దశము, శతము, సహస్రము, దశసహస్రము, లక్షా, దశలక్షా, కోటి, దశకోటి, శతకోటి, అర్బుదము, న్యర్బుదము, ఖర్వము, మహాఖర్వము, పద్మము, మహాపద్మము, క్షోణి, మహాక్షోణి, శంఖము, మహాశంఖము, క్షితి, మహాక్షితి, క్షోబము, మహోక్షోబము, నిథి,మహోనిధి, పర్వతము, అత్యంతము, పదార్ధము, అనంతము, సాగరము, అవ్యము, అచింత్యము, అమేయము, భూరి, మహాభూరి, ఇలా నాటి సంఖ్యామానం ఉండేది.
“తాతగారు వృక్షోరక్షతి రక్షితః అంటారు కదా! ఆ మాటలకు అర్థం ఏమిటి? తెలియజేయండి” అన్నాడు ఓ విద్యార్థి.
“అంటే బాలలూ, వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి అన్నమాట! అది ఎలా సాధ్యమో మీకు వివరిస్తాను.”
యాభై సంవత్సరాల వయసున్న చెట్టు తన జీవితకాలంలో పదిహేను లక్షల డెబ్భై వేల రూపాయల వస్తు సేవలను మానవాళికి అందజేస్తాయని అంచనా! పువ్వులు, కాయలు, పండ్లు, ఔషదాలు అందిస్తూ, మన శ్వాస ద్వార వదిలేటి వంటి బొగ్గుపులుసు వాయువును ప్రాణవాయువుగా (ఆక్సిజన్) మారుస్తాయి.
ముప్ఫై నుండి నలభై చదరపుమీటర్ల వైశాల్యం గల ప్రాంతంలో ఒకరోజుకు తయారైన ప్రాణవాయువు మనిషికి ఒకరోజుకు సరిపోతుంది. అలాగే ఒక మోటారుసైకిల్ లీటరు పెట్రోలు వాడాలంటే ముప్ఫైఐదు కిలోల ప్రాణవాయువు కావాలి. బాగా ఎదిగిన చెట్టు ఒక సంవత్సర కాలంలో మూడువందల ముఫై కిలోల ప్రాణవాయువును ఇవ్వగలదు.
ఒక సంవత్సర కాలంలో చెట్టు 260 పౌండ్ల ప్రాణవాయువు విడుదల చేస్తుంది. ఈ ప్రాణవాయువు నలుగురికి సరిపోతుంది.
పల్లెటూర్లలలో వేసవికాలంలో చెట్టుకింద మంచం వేసుకుని, లేదా రచ్చబండపైన సేద తీరుతుంటారు. దానికి కారణం ఆ పెద్ద చెట్టు ఇచ్చే చల్లదనమే! మన పూర్వీకులు తమ ఇళ్ళముందు వేపచెట్లు, గానుగచెట్లు, గంగరేగి వంటి చెట్లను పెంచేవారు చల్లదనంకోసం.
ఒక హెక్టారు (2.5 ఎకరాల) భూమిలో చెట్టుకాని మొక్కగాని అసలు లేకుంటే ఇరవైనాలుగు కిలోల సారవంతమైన మట్టి, గాలి, నీరు ద్వారా కొట్టుకుపోతుంది. చెట్లు మొక్కలు తాము ఉండే వాతవరణంలో పదిశాతం వేడిని తగ్గిస్తాయి. ఎండలో చెట్టుకింద చల్లగా ఉండటానికి ఇదేకారణం. అంతేకాదు చెట్లు శబ్ధకాలుష్యాన్ని నియంత్రిస్తాయి. ముప్ఫై చదరపు మీటర్ల వైశాల్యంలోని చెట్లు ఆరు నుండి ఎనిమిది డెసిబుల్స్ వరకు తగ్గిస్తాయి. ఇంటిముందు లాన్ పెంచడానికి ఇది ఒక కారణం కూడా. నేడు మనం వాడుతున్న కాగితం చెట్ల గుజ్జునుండే తయారు అవుతున్నది అన్నవిషయం మీకు తెలిసిందే! ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో సగటున మనిషికి ఎన్ని చెట్లవంతున ఉన్నాయో తెలుసుకుందాం! కెనడాలో మనిషి ఒక్కింటికి 10,163. గ్రీన్‌లాండ్ 4,965.ఆస్ట్రేలియా 3,266. యునెటెడ్ స్టేట్స్ 699. ప్రెంచ్ 203. ఇథియోపియా 143. చైనా 130. యూ.కే 47. భారత్ 28. ప్రతిమనిషికి తలసరి 422 చెట్లు ఉండాలి అప్పుడే మానం క్షేమం లేకుంటే అంతా క్షామం.
చెట్లు ఎప్పుడు మనకు ప్రాణ దాతలే!
(సశేషం)