భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 24

0
3

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 24” వ్యాసంలో కసాపురం లోని ‘నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కసాపురము:

2007 జులై 3వ తారీకు నుంచి జులై 6వ తారీకు వరకు నాలుగు రోజులు నేను, మా వారు వెంకటేశ్వర్లుగారు అనంతపురం జిల్లాలో కొన్ని ప్రదేశాలు తిరిగాము.  కొత్త ప్రదేశాలు చూడాలనే సరదా తప్పితే అప్పుడు ఇవ్వన్నీ రాయాలనే ఆలోచనగానీ, రాసే ఉద్దేశంగానీ లేదు.  అయినా నేను చూసిన ప్రదేశాల గురించి రాసి పెట్టుకునేదానిని కొంత సమాచారమైనా.  అదిప్పుడు వుపయోగపడింది.  13 సంవత్సరాల క్రితం చూసినవాటి గురించి ఇప్పుడు రాస్తున్నాను.  ఇంకో విషయం, అప్పుడు నా దగ్గర డిజిటల్ కెమేరా లేదు.  యాషికా అనుకుంటా వున్నది.  దానితో హడావిడిగా తీసినట్లున్నాను.  ఫోటోలు సరిగా రాలేదు.

3వ తారీకు పొద్దున్న 6-30 గంటలకి ఇంటినుంచి బయల్దేరాము.  7-30కి బస్ స్టాండ్‌లో బెంగళూరు వెళ్ళే బస్ ఎక్కాము గుత్తికొండ వెళ్ళటానికి. అప్పుడు బస్‌ల కోసం ముందుగా రిజర్వు చేసుకునే అవసరం వుండేది కాదు.  అప్పటికప్పుడు టికెట్లు దొరికేవి.  మా ప్రయాణాలు చాలామటుకు అనుకున్న వెంటనే బయల్దేరేవే వుండేవి.  2-50కల్లా గుత్తి చేరాము. 3-30కల్లా హోటల్ రవితేజ (బస్‌స్టాండ్‌కి దగ్గరలోనే అనుకుంటా) లో డబల్ రూమ్ అప్పట్లో 200 రూ. ఎ.సి. రూమ్ లు అప్పుడు ఎక్కువగా వుండేవి కాదు. 

ఫ్రెష్ అయి సాయంకాలం 4 గంటల కల్లా బయల్దేరి బస్‌లో గుంతకల్ వెళ్ళాము. 5-05 కల్లా గుంతకల్లు చేరి బస్‌స్టాండ్ నుంచే ఏడుగురు కూర్చునే ఆటో ఎక్కాము కసాపురం ఆంజనేయస్వామి దర్శనానికి. 5-30కల్లా గుడికి చేరాము.

ఈ ఆంజనేయస్వామిని నెట్టికంటి ఆంజనేయస్వామి అంటారు.  కసాపురం ఊరు పేరు. కన్నడంలో నెట్టి అంటే నేరుగా అని అర్థంట. నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం.  ఈ  స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువల్లే మనం కుడి కన్నును మాత్రం చూడగలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టికంటి ఆంజనేయస్వామి అని అంటారు. ప్రతి ఏడాది నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి అవసరమైన వసతి సౌకర్యాలు ఉన్నాయి.

ఆలయ చరిత్ర ప్రశస్తి:

విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీ.శ.1521లో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. వ్యాసరాయలవారు చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరొకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.

ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి, “నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు” అని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాస రాయలు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు -“దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన  వేప చెట్టు కనిపిస్తుంది, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుంది, అక్కడ భూమిలో తాను ఉంటాను”. మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఆ ఎండిన వేపచెట్టును కనుగొంటాడు వ్యాసరాయలు. రాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మిస్తాడు.

ప్రతి ఏటా వైశాఖ, శ్ర్రావణ, కార్తీక, మాఘ, మాసాలలోనూ, శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.

భక్తులకు ఈయనే “కల్పతరువు” మరియు “వరప్రదాత” కూడానూ. ప్రతిరోజు అనేక మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.

ఆలయ ప్రాంగణం పెద్దదే.  మేము వెళ్ళినప్పుడు ఆకు పూజ చేస్తారన్నారు. బయట షాపులో పూజకంటే 500 తమలపాకులిచ్చారు.  గుళ్ళో ఇద్దరు ఆడవాళ్ళు వాటినిమ్మని తీసుకున్నారు.  ముందు ఎందుకు తీసుకున్నారో మాకు అర్థం కాలేదు.  వాళ్ళు వాటిని త్రిభుజాకారంలో వున్న వెదురు చట్రంలో గుచ్చి ఇచ్చారు.  పూజారిగారు పూజ చేసేటప్పుడు దానిని స్వామి దగ్గర పెట్టి మనకిచ్చారు. గుళ్ళో, హోటల్ వాళ్ళకీ పంచి పెట్టాము.

అక్కడ కోతులెక్కువగా వున్నాయి. మేము పులిహోర కొనుక్కుని ఒక చోట కూర్చుని తింటుంటే ఒక కోతి వచ్చి పక్కన కూర్చుంది.  కొంచెం పులిహోర పెడితే తిన్నది.  తిన్నది గదాని కవర్ మీద పోసి పెడితే చక్కగా దానిలో వేరుశనగ పప్పులు ఏరుకుని తిని, పులిహోర అక్కడే వదిలి వెళ్ళింది.  గుడి వాతావరణం నా మూలంగా పాడయిందికదాని శుభ్రం చేసి వచ్చాను.

రాత్రి 7-10కి బయల్దేరి ఆటోలో గుంతకల్ బస్‌స్టాండ్‌కి వచ్చాము. మనిషికి 15 రూ.  8గంటలకి గుత్తి బస్ దొరికింది.  దానిలో హోటల్‌కి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here