[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]సి[/dropcap]నిమా అనుకోగానే కథ ఓసారి చెప్పి, డైలాగ్స్ రాయడానికి సత్యానంద్ గారిని పిలుస్తారు నాయుడు గారు. కెమేరామేన్‌గా ఆయన మొదటగా తన అక్కగారి కుమారుడు రవి గారి పేరు సూచిస్తారు. కానీ డైరక్టర్‍కి పర్సనల్ ఛాయిస్ వుంటే వదిలేస్తారు. చంద్రసిద్ధార్థ పూనే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో (FTII) నుండి కెమెరామెన్‍గా డిప్లొమా పొందిన సుధాకర్ ఎక్కంటిని పెట్టుకుంటే – ‘మధుమాసం’ అప్పుడు కూడా, “నీ ఇష్టం” అన్నారు. ఆ సుధాకర్ ఎక్కంటి ‘నాల్’కి డెబ్యూ డైరక్టర్‍గా నేషనల్ అవార్డు, కెమెరామెన్‌గా సైరాట్‌కీ మరో నేషనల్ అవార్డు తీసుకుని, ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ సినిమా ‘ఝాండ్’కీ పని చేస్తున్నా, సహనిర్మాతగా మొన్న వచ్చిన తెలుగు సినిమా ‘జార్జి రెడ్డి’కీ… అలా అలా ఎదిగిపోయినా, మొన్న నేషనల్ అవార్డ్స్‌లో కలిసినప్పుడు ఎంతో అభిమానంగా నన్ను పలకరించాడు భార్య సంచారితో కలిసి.
ఇప్పుడు కూడా సునీల్ కుమార్ రెడ్డి గారు సాబూ జేమ్స్, ఈయనా పూనా ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్ నుండి వచ్చినవారే, ఆయన్ని కెమెరామెన్‌గా పెట్టుకుంటాను అన్నప్పుడు నాయుడుగారు ఏమీ అనలేదు! ఇంక సంగీతం విషయాని కొచ్చేసరికీ, నాయుడుగారు, ఇండస్ట్రీలో టెక్నీషియన్స్‌గా వున్న మహిళలని గుర్తించి గౌరవిస్తారు. ‘తాజ్‍మహల్’, ‘ధర్మయుద్ధం’ లాంటి సినిమాలు ఇస్తే శ్రీలేఖ మ్యూజిక్ డైరక్టర్‍గా ‘వెండి కొండ మీద చంద్రమా…. చందనాలు జల్లిపో’ లాంటి పాటలతో జనరంజకమైన సంగీతం చేసింది కూడా. అందుకే నాతో ‘శ్రీలేఖ’ పేరు చెప్పగానే, నేను ఆనందంగా ‘ఓకే’ అన్నాను.
ఆమె సాంప్రదాయ బద్ధంగా హార్మొనీ పెట్టె పెట్టుకుని మ్యూజిక్ కంపోజ్ చేసి, రైటర్ పాట తీసుకు రాగానే పాడి వినిపించి, ట్యూన్ చెయ్యడం నాకు ఎంతో ఆసక్తిగా వుండేది! పాట రాగానే, ఆమె పాడ్తుంటే, “నా సుగర్ పెరిగిపోయింది, నీ తియ్యటి పాటకి” అంటే ఎంతో ఆనందించేది. తను మా మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతుండగా, వేరే పని మీద మలేషియా వెళ్ళి, నా కోసం ఒక పైట పిన్ను (బ్రౌచ్) తెచ్చిపెట్టింది. కొన్ని చాక్లెట్లు కూడా. మంచి స్నేహశీలి. నిగర్వి. స్త్రీ కావడం వలన నాలాగే ఇండస్ట్రీలో రావలసినంత గుర్తింపు రాలేదు! అంటే పెద్ద హీరోల సినిమాలు. అందరూ రామానాయుడిగారిలా ఆలోచించి ‘వెంకటేష్ బాబు’ హీరోగా వున్న సినిమాలు ఇవ్వరుగా! ఆ వ్యత్యాసం, వివక్షా, మన తెలుగు ఇండస్ట్రీలోనే వున్నాయి. అసలు హిందీ, బెంగాలీ, తమిళ్, మలయాళ, మరాఠీ సినిమాలకి విమెన్ స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్స్, ఇంకా డైరక్టర్స్ దున్నేస్తున్నారు! నేను నేషనల్ ఫిల్మ్స్ జ్యూరీలో వున్నప్పుడు కన్నడలో కూడా ‘అమ్మాచీ ఎంబె నునుపె’ అన్న సినిమా చంపా పి. శెట్టి అనే స్త్రీ డైరక్ట్ చేస్తే, వైదేహి అనే ఆమె స్క్రీన్ ప్లే చేసింది. దానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. కాని నేషనల్ అవార్డు రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందులో ప్రధాన స్త్రీ పాత్ర వేసిన వ్యక్తి ఒక పురుషుడు అవడం, రాధాకృష్ణ వురల్, నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. నేను నేషనల్ అవార్డ్స్ గురించి రాసేటప్పుడు ఇంకా వివరంగా రాస్తాను ఆ సినిమా గురించి.
హిందీలో అయితే లేడీ స్క్రీన్ ప్లే రైటర్స్ అలనాడు హనీ ఇరానీలూ, ఇప్పుడు జోయా అఖ్తర్‍లూతో సహా ఎప్పుడూ రైటర్స్‌కీ, డైరక్టర్స్‌కీ కమర్షియల్‍గా కూడా పెద్ద పీట వేశారు. మరి తెలుగు వాళ్ళకి ఏమైంది? అస్సలు లేడీ రైటర్స్‌ని రానియ్యరు. వాళ్ళకి పని ఇవ్వరు. ఇది ఇరవై మూడు సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో లేడీ రైటర్‍గా వుండి 11 సినిమాలకి పని చేసి నంది అవార్డు ఉత్తమ కథా రచయిత్రిగా పొందిన తర్వాత ఎంతో అథారిటీతో చెపుతున్నాను. ఇక్కడ ‘స్త్రీలకి ప్రవేశం ఎంతో కష్టపడితేగాని దొరకదు’. అలనాడు లేడీ నిర్మాతలు వెండితెరని ఏలారు. ‘మన దేశం’ సినిమా తీసి మహిళా నిర్మాతగా కృష్ణవేణి గారు ‘NTR’ లాంటి మహానటుడిని తెలుగు తెరకి పరిచయం చేశారు.
కన్నాంబ గారూ, శాంతకుమారి గారూ, అంజలీదేవి గారూ, భానుమతి గారూ బహుముఖ ప్రజ్ఞతో తెలుగు తెరని నిర్మాతలుగా, నటీమణులుగా ఏలిన స్వర్ణయుగం 1940 – 1950లు… ఆ తర్వాత మహిళా దర్శకురాళ్ళు ఏమయ్యారు? విజయనిర్మలగారు విజయ బావుటా ఎగురవేసి ‘కవిత’, ‘మీనా’ లాంటి సినిమాలు తీసాకా, చివర్లో ఆవిడకీ కృష్ణగారి సినిమాలు తప్ప దక్కలేదు. జీవితా రాజశేఖర్ కూడా ప్రయత్నించారు. కలిదిండి జయ గారు ‘సూపర్ హిట్’ పత్రికతో పాటు సినిమాలు తీసి నిర్మించారు. నందినీ రెడ్డి గారు నాకు పాతిక ఏళ్ళుగా, కోడైరక్టర్‌గా వున్నప్పటి నుండీ తెలుసు! ‘అలా మొదలయింది’ మొదలవడానికి ఆవిడకీ చాలా ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ‘జబర్దస్త్’ సినిమా తీసి, చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుంటే తప్ప మళ్ళీ ‘ఓ బేబీ’ విజయం రాలేదు.
పి. కృష్ణవేణి గారి అమ్మాయి ‘అనూరాధ’ గారు చాలా సినిమాలు తీసారు. తర్వాత నిర్మాతలు భార్యల పేర్లు పెట్టడం, కాస్ట్యూమ్స్ డిజైనర్స్‌గా కొన్నిసార్లు ‘కథ’ అని పేర్లు వెయ్యడం లాంటివి ఇన్‍కమ్ టాక్స్ ప్రోబ్లమ్స్ తప్పించుకోవడం కోసం చేసిన పనులు తప్ప ‘మీర్జాపురం రాజా’ వారి భార్య కృష్ణవేణి గారి లాంటి నిర్మాతలూ, కన్నాంబా, అంజలీదేవి, శాంతకుమారీ, భానుమతి గార్ల లాంటి నిర్మాతలు మళ్ళీ రాలేదు! స్త్రీ శక్తిని మొత్తం సినిమా ఇండస్ట్రీ, మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా వినియోగించుకోవడం లేదు! చలా తక్కువ శాతం మహిళలకి కమర్షియల్ సక్సెస్‌లూ, పురుషులతో సమానంగా అవకాశాలూ, ఆర్థిక లాభం వస్తాయి. అంత మేల్ ‘డోమినేటెడ్ ఎరీనా’ ఇది! అశ్వనీదత్ గారి అమ్మాయిలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ ‘మహానటి’ లాంటి సినిమాలు నిర్మించి ఆ వెలితి పూడ్చారు.
‘నేనేం చిన్నపిల్లనా’కి శ్రీలేఖ ‘ఆకాశం ఆపలేదుగా… దూకుతున్న వాన మబ్బునీ’ అన్న పాట సరిగ్గా మా లేడీ సాంకేతిక నిపుణుల గురించే అన్నట్టు వుంటుంది! అద్భుతమైన పాటలు సినిమా ఆడకపోతే జన ప్రాచుర్యానికి నోచుకోకపోవడం ‘ఎవరే అతగాడు’ సినిమాకి కూడా అనుభవమే నాకు! అప్పుడు శ్రీలేఖ అన్న ఎమ్.ఎమ్. కీరవాణిగారు చేశారు.
(‘నేనేం చిన్నపిల్లనా’ పాటలను యూట్యూబ్‌లో ఈ లింక్‍లో వినవచ్చు – https://youtu.be/2Pk21-5GLk4)
ఈ పాటలు భాస్కరభట్లా, అనంత శ్రీరామ్, సుద్దాల అశోక్ తేజా, వనమాలి రాసినట్టు గుర్తు! రికార్డింగ్ అప్పుడు నాకు అనంత శ్రీరామ్ పరిచయం. తర్వాత మేమిద్దరం ‘వెల్‌కమ్ ఒబామా’లో కలిసి నటించాం. నేను భువనచంద్ర గారి వైఫ్‍గా, పిచ్చి వేషం వేస్తే, ఆ పిచ్చి కుదిరే డాక్టర్‍గా అనంత శ్రీరామ్ ఏక్ట్ చేసాడు! ఎంతో మేధావి అయిన ఆ అబ్బాయి చాలా నిగర్వి. తర్వాత చిత్రపురీ హిల్స్‌లో మా బ్లాక్ లోనే అపార్ట్‌మెంట్ కొనడం వలన చాలా ఆత్మీయుడయ్యాడు. పోయిన ఏడు, అంటే ఈ కరోనా భూతం రాకముందు భువనచంద్ర గారు మా చిత్రపురి ఇంటికి వస్తే, అనంత శ్రీరామ్ కూడా వచ్చి మాతో మంచి క్వాలిటీ టైం గడిపాడు. అతని భార్య స్వాతి కూడా మంచి అమ్మాయి. వారికి విరించీ, శైలీ అని ఒక బాబూ, పాపా! ‘నేనేం చిన్నపిల్లనా’ చేస్తున్నప్పుడే మా అన్నయ్యగారి అబ్బాయి మేజర్ రవిచంద్రా, తేజస్వీల చిరంజీవి రిషికి ఏడాది పుట్టినరోజైతే, నేను ఫోన్ చేసి పిలవగానే భార్యా, తల్లిదండ్రులతో సహా వచ్చి పాటలు కూడా పాడి అందరినీ ఆనందపరిచాడు అనంత శ్రీరామ్.
సత్యానంద్ గారితో నేను పని చేసిన రెండో సినిమా ‘నేనేం చిన్నపిల్లనా’. గురువుగా ఆయనతో ఎంతవరకూ మాట్లాడాలో, ఎలా పని వేళలు నిర్ణయించుకోవాలో, స్నేహాలు ఎలా మెయిన్‌టెయిన్ చేసుకోవాలో లాంటి విషయాలు నేర్చుకున్నాను! ఆయన మన కథనీ, సన్నివేశాలనీ ప్రశ్నించే తీరులోంచి, మనకి కొత్త సన్నివేశాలు పుడ్తాయి. సిట్టింగ్స్‌లో అందరూ ‘లైక్ మైండెడ్’ అంటే, ఎస్ అంటే ఎస్ అనేవాళ్ళే వుండకూడదు! ఒకరు ప్రశ్నించేవారు వుండాలి, ఆ ఒక్కరూ సత్యానంద్ గారిలా బాగా తెలిసిన విషయ పరిజ్ఞానం వున్న మనిషై వుండాలి! సత్యానంద్ గారితో రెండు సినిమాలకే పని చేసినా, చాలా సినిమాలు ‘పుబ్బలో పుట్టి మఖ’లో ఆగిపోయిన వాటికీ రామానాయుడి గారి కాంపౌండ్‌లో మేం ఇద్దరం రకరకాల దర్శకులతో కూర్చున్నాం. అందులో ఈశ్వర్ రెడ్డి గారు ఒకరైతే, ‘కౌసల్యా సుప్రజా రామా’ తీసిన ప్రసాద్ గారు ఒకరు!
దాదాపు ఎనిమిది నెలలు నేనూ, సత్యానంద్ గారూ కలిసి సిట్టింగ్స్ చేసిన మరో ప్రముఖ దర్శకుడు శ్రో కోడి రామకృష్ణ గారు! మా ఇద్దరికీ ఆప్తుడాయన. ఇప్పటికీ ఆయన పేరు నేను ఫోన్ లోంచి తియ్యలేదు. చాలా చాలా ఆప్తుడాయన. నా నవల ‘మొగుడే రెండో ప్రియుడు’ సినిమాగా తియ్యాలనీ, రామానాయుడి గారి స్టూడియోలో తన ఫోటో మాత్రం పని చేసిన దర్శకులలో లేకపోవడం చాలా వెలితిగా ఫీలయి, ఎంతో ప్రయత్నించిన వ్యక్తి ఆయన. వాళ్ళావిడ పద్మ గారు, మా ఫ్రెండ్ ఉమాసుందరీ, వాళ్ళక్క పార్వతీ, చెల్లెలు విజయా (పి.వి.సింధూ తల్లి) లతో చదువుకుని, చిన్నప్పటి నుంచి తెలిసిన ఆవిడ కావడంతో నాతో కూడా స్నేహంగా వున్నారు. నేను వాళ్ళ గృహప్రవేశానికి కానీ మరేదైనా ఫంక్షన్‍కి కానీ వెళ్ళినప్పుడు ‘మీ ఫ్రెండ్ అక్కడున్నారు’ అనేదావిడ. వేడి వేడి గారెలూ, వడలూ లాంటి టిఫెన్‌లూ, కాఫీలు పంపేవారు ఏ టైంలో వెళ్ళినా. ఇంద్రభవనం లాంటి వారి కొత్త ఇల్లు మొత్తం ఆవిడ టేస్ట్‌తో, ఆవిడే కట్టించారు. ‘మా సార్ చెక్కుల మీద సంతకాలు మాత్రమే పెట్టి తన పార్ట్ పూర్తి చేసార’ని చెప్పారు. ఆయనకి మా సినిమా మొదలుపెడదాం అనుకుంటుండగా చెన్నైలో స్ట్రోక్ వచ్చిందీ, దానితో బాటు హార్ట్ ఎటాక్ కూడా వచ్చి చాలా సిక్ అయ్యారు. నేను ఆయనని చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా జోక్స్ వేశారు ఆయన.
నేను మా డాక్టర్ ఆర్.టి.ఎస్. నాయక్ గారి దగ్గరకి అల్లు అరవింద్ గారిని తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళి వైద్యం చేయించేదాన్ని అపోలో హైదర్‌గుడాకి!
(సశేషం)