[box type=’note’ fontsize=’16’] బాలబాలికల కోసం ‘బాటసారి’ అనే పెద్ద జానపద కథని మూడు భాగాలుగా అందిస్తున్నారు దాసరి శివకుమారి. ఇది రెండవ భాగం. [/box]
[dropcap]ల[/dropcap]క్ష్మణయ్య వంక తిరిగి “నువ్వు రాజధాని వైపుకు పోవాలన్నావు కదూ! అలాగే వెళ్దువుగాని, నేను ఉత్తరదిశగా వెళ్తున్నాను. ఈ ఊరు దాటేవరకూ నా గుర్రం మీదా నాతోపాటే రావచ్చు రా” అంటూ అతణ్ణి తన గుర్రమెక్కించుకున్నాడు. తాతదగ్గర, అవ్వదగ్గర మరోమారు సెలవుతీసుకుని కమలనాధుడూ, లక్ష్మణయ్య ఇద్దరూ బయలుదేరారు. గుర్రంకూడా తాతవంకా, అవ్వవంకా అభిమానంగా చూచి చెవులు ఆడించింది. ఆ తర్వాత నిదానంగా బయలుదేరింది.
“లక్ష్మణయ్య! నువ్వెందుకు రాజధానికి పోవాలనుకుంటున్నావు?” అనడిగాడు కమలనాధుడు.
“చెప్పానుగా. రాజుగారి కొలువులో చేరాలనుకుంటున్నాను. చిన్నప్పటినుండి కత్తి తిప్పటం కూడా నేర్చుకున్నాను. రాజుగారి కొలువులో చేరి రాజ్యానికి సేవ చేయాలని వున్నది. నేను నేర్చుకున్న కత్తి తిప్పే విద్యను ఉపయోగించాలని, రాజుగారి మెప్పు పొందాలనీ, రాజ్యంకోసం అవసరమైతే నా ప్రాణానైనా ఇవ్వాలనీ ఎంతో కోరిగ్గా వున్నది” అన్నాడు లక్ష్మణయ్య.
“నీదే వూరు?” అనడిగాడు కమలనాధుడు.
“ఇక్కడికి ఇరవైమైళ్ళ దూరంలో వున్న తండా మాది. మా నాన్న గొర్రెల్నీ, మేకల్నీ కాస్తాడు. మా నాన్నపేరు రామయ్య. మా అన్న పెదలక్ష్మణయ్య. నేను చినలక్ష్మణయ్యను” అంటూ వివరాలు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఊరిపొలిమేర రాగానే లక్ష్మణయ్య గుర్రం దిగి తూర్పు దిక్కుకు పోయాడు. కమలనాధుడు ఉత్తరదిక్కుకు వెళ్ళాడు. వెళ్ళేముందు ‘లక్ష్మణయ్యా! మనం మళ్ళీ త్వరలో కలుసుకుందాం. నాకు ఆ నమ్మకం వున్నద’న్నాడు కమలనాధుడు.
‘నువ్వెవరో, నేనెవరో, మళ్ళీ మనం కలుసుకునే దెక్కడలే’ అనుకున్నాడు లక్ష్మణయ్య.
కమలనాధుడు పరిసరాలను గమనించుకుంటూ ముందుకు పోతున్నాడు. నడిజామైంది. ఎక్కడైనా కాసేపు ఆగుదామనుకున్నాడు. పైగా ఈ రోజుకు తిండెవరైనా పెడతారేమో చూసుకోవాలి. తనకేకాదు తన గుర్రానికీ పచ్చగడ్డి కావాలి, నీళ్ళు కావాలి అని ఆలోచించాడు. ఒకచోట చెట్టుకింద నలుగురైదుగురు నిలబడి దేన్ని గురించో తీవ్రంగా మాట్లాడుకుంటూ కనపడ్డారు. తన గుర్రాన్ని అటు పోనిచ్చాడు. వాళ్ళంతా రైతులు వాళ్ళకు కొంచెం దూరంలో ఎడ్లబండ్లు ఆగి వున్నాయి. బండి చక్రాలకు కట్టివేసిన ఎడ్లు నెమరేస్తూ పడుకుని వున్నాయి. రైతులంతా తలగుడ్డ విప్పి భుజాన వేసుకున్నారు. బాసింపట్ట వేసుకుని చెట్టుకింద కూర్చున్నారు. వాళ్ళమధ్య తినటానికి తెచ్చుకున్న తిండిని వుంచిన గుడ్డమూటలు కనపడుతున్నవి.
“తిండి తినండి ముందు నడిజామైంది” అంటూ ఒక ముసలి రైతు మూట విప్పాడు. ఈలోగా అక్కడికొచ్చి ఆగిన కమలనాధుణ్ణి చూశారు. ఎవరో పరదేశి అనుకున్నారు.
“ఎవరు నాయనా నువ్వు? ఎటుపోవాలి?” అని అడిగారు.
“చాలాదూరం పోవాలి పెద్దాయినా, ఒకపనిమీద పోతున్నాను. నేనూ మీ రాజ్యంలోని వాడనే” అన్నాడు కమలనాధుడు.
“రాజ్యం, రాజు అనుకోవటమే గాని రాజుగారిని ఎన్నడైనా చూశామా? పెట్టామా?” అన్నాడొక రైతు.
“ఆయనెక్కడో రాజధాని పట్టణంలో వుంటాడు. పరిపాలన చేత్తాడు. మనకేడ అగుపడతాడు?” అన్నాడు మరొకరైతు.
“సరే నువ్వూ రా నాయనా! మాతోపాటు ఒకముద్ద తిని కూర్చో” అన్నారు వాళ్ళు.
“మేత దొరుకుతుందా?” అనడిగాడు కమలనాధుడు.
“మా ఎద్దులకని తెచ్చుకున్న మేత నుంచి కాస్తంత తీసి నీ గుర్రానికి విదిలించు, తింటుంది” అన్నాడొక రైతు.
“అలాగే పెద్దాయన” అంటూ కమలనాధుడు మేత తెచ్చి గుర్రం ముందు వేశాడు. ఆ తర్వాత తానొచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. రాగిసంకటి ముద్దనొకదాన్ని కమలనాధుడికిచ్చి తినమన్నారు. నంజుకోవడానికి ఉల్లిపాయ ఇచ్చారు. సంకటిముద్ద ఎండిపోయి జేగురురంగులో ఎండిపోయినట్లుగా కనపడింది. చేత్తోపట్టుకుని చిదిపితే లోపల మెత్తగానే వున్నది. వాళ్ళవంక చూశాడు కమలనాధుడు. ఉల్లిపాయ కొరుక్కుంటూ సంగటిముద్ద తీసుకుని తింటున్నారు. వాళ్ళను చూసి తానూ అలాగే తిన్నాడు. ప్రాంతానికొక రకం తిండి అనుకున్నాడు కమలనాధుడు. తినటం అయ్యాక తాబేటికాయలోని నీళ్ళిచ్చారు తాగటానికి. అవి చల్లగా తియ్యగా వున్నాయి.
“మీరంతా ఏ పనిమీద పోతున్నారు? ఆ బళ్ళమీదున్న మూటలేంటి?” అనడిగాడు కమలనాధుడు.
“మేం పండించిన రాగులు, సజ్జలూ, ఆంకెలూ. మా తిండి గింజలకు పోను మిగతావి అమ్ముకోవటానికొచ్చాం. వీటిని కనుగోలు చేసే ఆసామి ఏవో కొండరాళ్ళు వేసి మా గింజల్ని దగా తూకం తూస్తాడు. ఆ సంగతే మాట్టాడుకుంటున్నాం” అని చెప్పారు వాళ్ళు.
“ఎక్కడుంటాడు అతను?” కమలనాధుడు అడిగాడు.
“ఈ దగ్గర్లోనే వుంటాడు” అని చెప్పారు.
“నేనొస్తాను పదండి” అంటూ వాళ్ళ ఎడ్లబండ్ల వెనకాలే తానూ గుర్రమేసుకుని వెళ్ళాడు. గింజలు కొనే అంగడి వచ్చింది. తన గుర్రానికి కాస్త దూరంగానే ఆపి కట్టేశాడు.
“మా గింజలు తెచ్చాం. తీసుకుని మాక్కావలసిన పచారీ సరుకులు, ఇంకా కొన్ని దినుసులు ఇవ్వు షావుకారూ” అన్నారు వాళ్ళు.
షావుకారు మూటలు విప్పిచూస్తూ “గింజల్లో బాగా పొట్టూ పొలకా వున్నది. రాళ్ళుకూడా కనబడుతున్నది. బాగా తరుగుపోతాయి. ఒక్కోమూటకి రెండుకట్ల తరుగుతీసేస్తాను” అన్నాడు.
“రెండుకట్ల తరుగంటే అర్థమణుగు. ప్రతిమూటకూ ఇట్లా తరుగుతీసేస్తే లెక్క బాగా తక్కువైపోతుందయ్యా. మరీ అంత తియ్యొద్దు” అంటూ రైతులు బతిమాలసాగారు.
“చేలో పండించినవి పండించినట్లు పోగుచేసుకొచ్చారు. నేను వీటిని బాగుచేయించాలి. చాలా సరుకు పారుపోతది. అరమణుగు తరుగు తియ్యొద్దంటే కుదరదు. నేను చాలామందికి నజరానాలు ఇచ్చుకోవాలి. కొద్దిరోజుల్లో మన పెద్దరాజుగారు తన కొడుక్కి రాజ్యం అప్పగిస్తున్నరంట. ఆ ఉత్సవానికి చాలా ఖర్చు అవుతుందట. సిపాయిలు వచ్చి ఊరూరా తిరిగి చెప్తున్నారు. చింతపండూ, ధాన్యం గింజలు, ఇంకా నానారకాల దినుసులూ, దుడ్లూ కూడా పోగుచేసి తీసుకెళ్తామన్నారు. నేను చానా ఎక్కువమొత్తంలోనే వారికివ్వాల్సి వున్నది. మీరింకేం మాట్లాడొద్దు” అంటూ మూటల్ని లెక్కపెట్టుకోసాగాడు.
“తూకం వెయ్యక్కర్లా. ఉజ్జీలుంపుగానే చూచి నేను పద్దు చెప్పేయ్యగలను. తరుగంతా తీసేసి మిగతా రానికి లెక్కకట్టి ఇస్తాను. మీక్కావలసిన సరుకు కొనుక్కెళ్ళండి” అన్నాడు.
రైతులంతా ఒకరిముఖం మరొకరు చూసుకున్నారు. అది గమనించి కమలనాధుడు ముందుకు వచ్చాడు.
“అయ్యా! సరియైన పద్దు వెయ్యండి. ఈ రైతులు బండల్ని పిండిచేసి పండించిన పంట ఇది. పొట్టూ, నులక ఉన్నదని చాలా తరుగు తీస్తున్నారు. ఎంత పొట్టూ పొలకా అయితే అర్థమణుగు బరువు తూగుతాయి? వీళ్ళీ గింజలమ్ముకునే సాలుపొడుక్కూ సరిపోయే దినుసులూ, బట్టా, పాతా కొనుక్కుంటారు. మీకు తెలియని ఏముంది?” అన్నాడు కమలనాధుడు నిదానంగా.
“నువ్వెవరివోయ్? వీళ్ళలో ఎవరి చుట్టానివి? ఎప్పుడూ ఈ ప్రక్కల చూడలేదు” అన్నాడు ముఖమంతా గంటుపెట్టుకుని వ్యాపారి.
“ఇప్పుడే వచ్చానులెండి. అయినా దుడ్లూ, ఇతర దినుసులూ కావాలని ఏ సిపాయిలు వచ్చి చెప్పారు? అదంతా వట్టిదే అయివుంటుంది” అన్నాడు గట్టిగా కమలనాధుడు.
“సిపాయిలొచ్చి చెప్పకపోయే ఇసయం నాదాకా ఎట్టా వచ్చిద్ది? ఊరికే తేరగా ఇవ్వటానికి నేనేమన్నా దుకాణం తెరిచిపెట్టుకుని కూర్చున్నానా? రైతుల దగ్గరనుండి తీసుకున్న దాంట్లోదే వాళ్ళకు ఇస్తాను. అందరి దగ్గరా పోగుచేసుకుని పోవటానికి రేపో, మాపో సిపాయిలు వస్తారు” అన్నాడూ వ్యాపారి.
“ఆ సిపాయిలెవరో మీకు అబద్దం చెప్పారు. మనరాజు గారు అట్లా తీసుకునే రకం కాదు. నేను అప్పుడప్పుడూ రాజధానికి పోతాను. అక్కడి సంగతులు నాకు తెలుసు. ఈ విషయం నేనసలు వినలేదు. మీరు సిపాయిలకేం ఇవ్వద్దు. ఈ రైతులకే తగినన్ని దినుసులూ, బట్టలూ ఇవ్వండి” అన్నాడు కమలనాధుడు కూడా మొండిగా.
“అట్టా ఎట్టా కుదురుద్దయ్యా? వాళ్ళొచ్చి నా పీకలమీద కూర్చుంటారు. ఈ రైతులకూ, నాకూ మధ్యలో నువ్వు రావద్దు. వాళ్ళు సరుకిస్తున్నారు. నేను దినుసులు ఇస్తున్నాను. వాళ్ళకిష్టమై ఇస్తున్నారు. ఇష్టం లేకపోతే వచ్చినదారినే పొయ్యేవాళ్ళుగా” అన్నాడు కటువుగా వ్యాపారి.
“నేను రాజధానికి పోయి నీమీద రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. ఆ సిపాయిలెవరో కూడా ఆరా తీస్తాను” అన్నాడు కమలనాధుడు కూడా గట్టిగా.
“నువ్వెక్కడి మడిసివయ్యా? నా బేరం చెడగొట్టడానికి ఊడిపడ్డావు” అంటూ మరోసారి మూటలలో చెయ్యిపెట్టి గింజల్ని పైకెత్తి చూశాడు వ్యాపారి. రాగులు ఎర్రగా నిగనిగ మెరుస్తూ వున్నాయి. సజ్జలూ, అరికెలు కూడా సుద్దంగా కనపడుతున్నాయి. వ్యాపారికి ఆ సరుకుని వదిలిపెట్టాలని లేదు. అలాగని తన లాభం తగ్గించుకుని ఎక్కువ దినుసులు ఇవ్వాలనీ లేదు. మధ్యలో ఇతనెవరో పెత్తనం చేస్తున్నాడు అనుకుంటూ లోపల్లోపల చాలా చిరాకుపడుతున్నాడు.
“ఆఖరుమాట చెప్తున్నాను. మూటకు అర్థమణుగు తరుగుకాదు. పావుమణుగు తరుగుకట్టుకుంటాను. ఇంకేం మాట్లాడవద్దు” అన్నాడు వ్యాపారి.
“పావుమణుగు కానే కాదు. అర్థవీశెడు మాత్రం తరుగు కట్టుకో. అంతకుమించి వీళ్ళు ఇవ్వరు. నువ్వొప్పుకోకపోతే మరోచోటుకు పోతారు. ఒప్పుకుంటే న్యాయంగా దినుసులివ్వు. అన్యాయం చేస్తే ఇప్పుడే నేను పక్కనున్న నగరానికి వెళ్ళి అక్కడున్న కొత్వాలుకు ఫిర్వాదు చేసి వెడతాను. నీ తప్పుడు వ్యాపారం బయటపెడతాను” అంటూ బెదిరించాడు.
ఇప్పుడు అతను చెప్పినదానికి ఒప్పుకోకపోతే నిజంగా వెళ్ళి ఫిర్యాదుచేస్తాడని వ్యాపారి బాగా భయపడ్డారు.
“నిద్రలేవగానే ఇవాళ జ్యేష్టాదేవి ముఖం చూసుంటాను” అని సణుక్కుంటూ రైతుల్ని మూటలు లోపలికి చేర్చమన్నాడు. వాళ్ళకు రావలసిన దినుసులన్నీ ఇచ్చి పంపాడు. రైతులందరూ ఆశ్చర్యపోయారు.
“ఎక్కడివాడవు నాయనా నీవు? సమాయానికి దేవుడల్లే వచ్చావు. పతేడూ ఇట్టాగే పంటను నష్టానికే ఇచ్చిపోతున్నాం. బండినిండా సరుకేసుకొచ్చి ఒకటి రెండుమూటల్లో దినులేసుకుపోతున్నాం. ఇయ్యేడు ఒక్కొక్కళ్ళకూ పావుబండి దినుసులొచ్చాయి” అన్నారు సంబరంగా.
“నాయనా! వీటిల్లో నీకు కావలసినవి తీసుకో అయ్యా” అన్నారు ఎంతో అభిమానంగా.
“నాకేమీ అక్కర్లేదు నాకూ, నా గుర్రానికీ తిండిపెట్టి ఆదరించారు అదిచాలు. ఇంక నే వస్తాను” అంటూ వాళ్ళ దగ్గర సెలవుతీసుకుని కమలనాధుడు తన దారిన తాను ప్రయాణమయ్యాడు. కొంతమంది దొంగసిపాయిలు, వ్యాపారులు కలిసి రైతుల్ని దోచుకుంటున్నారా? అని ఆశ్చర్యపోయాడు. ఎవరో అదనుచూసి, అబద్దాలు చెప్తూ సిపాయిల ముసుగులో మోసం చేస్తున్నారని కమలనాధుడు బాధపడ్డాడు.
కొంచెందూరం పోగానే ఒక పెద్ద గ్రామం వచ్చింది. ఆ గ్రామానికొక అధికారి వున్నాడని తెలిసింది. ఆయన్నందరూ గ్రామాధికారి అని పిలుస్తారు. గ్రామంలో ఎవరికే సమస్య వచ్చినా ఆయన తీరుస్తూ వుంటాడు. ఆయన దగ్గరకు ఇప్పుడు ఇద్దరు మేకలకాపర్లు వచ్చారు. అందులో మొదటివ్యక్తి చెప్పటం మొదలుపెట్టాడు.
“నా దొడ్లో పెద్ద మేకల్తోపాటు చిన్న నల్లమచ్చల మేకపిల్ల కూడా వున్నదండయ్యా. అలాంటి మచ్చల మేకపిల్లలు ఎప్పుడోదప్పితే పుట్టవు. అదంటే మా బుడ్డోడికి పాణం. దాన్నిప్పుడు ఇదుగో ఇతడు కాజేశాడయ్య. అది నీదికాదు నాదే. నా యింటపుట్టిన మేకపిల్ల అది. నీ మేకపిల్ల ఏమయిందో నాకు తెలవదంటున్నాడయ్యా. అన్నీ అబద్ధాలయ్యా. అది తప్పిపోయిందని మా బుడ్డోడు తిండీ తిప్పలు మానేసి మారాం పెడుతున్నాడయ్యా. మీరే నాయం చెయ్యాలి. నా మేకపిల్లను నాకిప్పించాలయ్యా” అంటూ తన ఫిర్యాదు వినిపించాడు.
ఆ తర్వాత రెండవ వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడు. “కాదు సామీ! అది నాదే. నా ఇంటే పుట్టింది. సానా సక్కగుంటది. చెంగుచెంగున ఎగురుద్ది. దాని సక్కదనం, దాని గంతులు సూసి ఈళ్ళ బుడ్డోడు కావాలని మారాం చేత్తున్నాడు. దాంతో అబద్ధాలు చెపుతూ, ఇక్కడికొచ్చి ఫిర్యాదీ చేత్తున్నాడు. నా మాటలు నిజం నన్ను నమ్మండి సామీ. మా మేకపిల్ల ఊసు ఆమాత్రం నాకు తెలీదా? పైగా ఈడి మేకపిల్లకు రెండే మచ్చలంట. నా మేకపిల్ల మూడుమచ్చల్తోటి పుట్టింది. ఈడిదెలా అవుతుంది? మీరే న్యాయం సెయ్యాల” అన్నాడు రెండవ అతను చేతులు జోడిస్తూ.
“సరే. మీ ఇద్దరూ ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పారు. ఆ మేకపిల్లను ఇక్కడికి తీసుకురండి. దాని యజమాని ఎవరైతే వాళ్ళదగ్గరకే అది వెళుతుంది నేనూ చూసి తేలుస్తానని” చెప్పి గ్రామాధికారి ఆ మేకల కాపరిని పంపించాడు.
ఆ గ్రామాధికారి ఇంకా కొంతమందికి తీర్పులు చెప్తున్నాడు. వాటినన్నిటిని కమలనాధుడు జాగ్రత్తగా వింటున్నాడు. తండ్రి ఇచ్చిన పొలం పంచుకునే దగ్గర గొడవ ఒకరిదైతే, తీసుకున్న అప్పు ఎగ్గొడుతున్నాడని మరొకరు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతలో ఒకతను వచ్చాడు. వస్తూనే పెద్దగొంతుతో “చూడండి గ్రామాధికారి గారూ! ఇతగాడు ఎన్ని అబద్దాలు చెపుతున్నాడో? మీరే నా పనిముట్లు ఇప్పించాలండయ్యా” అంటూ వచ్చాడు.
విషయమేంటని అడిగాడు గ్రామాధికారి.
“మేం పనిమీద పొరుగూరు వెళుతూ రెండు రాగి గంగాళాలు దాచమని ఇతనింటిలో వుంచాను. ఊళ్ళో దొంగల భయంవలన అలా చేశాను. ఊరినుంచి రాగానే అడిగితే ఒకదాంట్లో మినుములూ, మరోదాంట్లో జనుములూ పోశాం. తర్వాత ఖాళీ చేసి ఇస్తామని చెప్పాడు. నెలరోజులయింది. తిరిగి ఇవ్వటం లేదు” అన్నాడు సుబ్బయ్య.
“నిన్న నా పాడిగేదెలు రెండూ పొలంలో మేస్తున్నాయి. వాటిని వీళ్ళబ్బాయి తోలుకొచ్చాడు. అవే దారినబడి మా ఇంటికి వచ్చేస్తాయిలే అనుకున్నాం. రాత్రయినా రాలేదు. వీళ్ళను అడిగితే ఏవేవో కట్టుకధలు చెప్తున్నారు. ఆ గేదెలు లేకపోతే మా ఇంట్లో పాడి వుండదు. పాలుతాగే చిన్నపిల్లలున్నారు. ఇంటిల్లిపాదిమి ఇబ్బందిపడిపోతాం సామీ. నా గేదెల్ని నాకిప్పించండి” అన్నాడు రామయ్య.
’ఏం రామయ్యా! ముందు నువ్వు చెప్పు. సుబ్బయ్య రాగి గంగాళాలు మీ ఇంట్లో దాచాడా?” అని ప్రశ్నించాడు గ్రామాధికారి.
“దాచాడండీ” అని ఒప్పుకున్నాడు రామయ్య.
“మరెందుకు సుబ్బయ్య గంగాళాలు తిరిగి అతనికివ్వటంలేదు” అని ప్రశ్నించాడు గ్రామాధికారి.
“వాటిల్లో మినుములూ, జనుములూ పోశామండీ. ఖాళీ చేసి ఇద్దామనుకున్నాను. ఈలోగా గింజలకు బాగా పురుగుపట్టింది. గింజల్ని బాగా పురుగులు తినేసి డొల్లలు చేశాయి. దాంతోపాటు గంగాళాలనూ కొరికితినేశాయి. చెదలుపెట్టిన గుడ్డపేలికల్లాగా గంగాళాలూ గింజతో కలిసి నుసినుసి అయిపోతే మా ఆడాళ్ళు ఊడ్చి పెంటపోగులో పారబోశారు. పోయినవాటిని నేనెలా తెచ్చి ఇచ్చేది?” అన్నాడు రామయ్య.
“అలాగా!” అంటూ “ఏం సుబ్బయ్యా! నీ కొడుకు వాళ్ళ పాడిగేదెల్ని తోలుకొచ్చాడా? నిజం చెప్పు” అనడిగాడు గ్రామాధికారి.
“మా గేదెల్తోపాటు కలిసి ఇంటిదగ్గర మలుపు దాకా వచ్చాయండీ. అక్కడికొచ్చేసరికి పెద్దగాలి బలంగా వచ్చిందంటండీ. ఆ సుడిగాలి నుండి మా గేదెలు పరుగెత్తుకొచ్చి సావిట్లోకొచ్చి పడ్డాయండీ. వీళ్ళగేదెలేమో ఆ సుడిగాలికి కొట్టుకుపోయాయటండీ. ఎక్కడకు వెళ్ళిపడ్డాయో ఏమో? వాటినెక్కడని వెతికి తెచ్చేదండీ? మీరే న్యాయం చెప్పండి?” అన్నాడు సుబ్బయ్య.
“న్యాయం చెప్పాల్సింది నాకు. గాలికి ఎక్కడన్నా గేదెలు కొట్టుకుపోతాయా? చెప్పండి గ్రామాధికారిగారూ!” అన్నాడు రామయ్య.
“అవును రామయ్యా! రాగిగంగాళాలు రెండూ పురుగుపట్టి నుసినుసి అయిపోంగా, గాలికి గేదెలు కొట్టుకుపోవా? నువ్వే ఆలోచించు రామయ్య” అన్నాడు గ్రామాధికారి.
దాంతో రామయ్య తలవంచుకున్నాడు. “నువ్వు ముందుగా అబద్దం చెప్పావు. సుబ్బయ్య గంగాళాలు మోసంతో కాజెయ్యాలని చూశావు. ఇప్పటికైనా గంగాళాలు తిరిగిఇస్తే నీపాడి గేదెలు తిరిగివస్తాయి లేకపోతే లేదు” అన్నాడు గ్రామాధికారి.
“పొరపాటైంది. గంగాళాలు తిరిగి ఇస్తాను. నా గేదెల్ని తోలమని చెప్పండి. పాలుపితుక్కునే సమయం దాటిపోతుంది” అన్నాడు రామయ్య.
“రెండురోజుల క్రితం ఇక్కడికి సుబ్బయ్య వచ్చి సంగతంతా చెప్పాడు. నేనే గేదెల్ని తోలుకుపొమ్మని సలహాఇచ్చాను. ఇంకెప్పుడూ ఎవర్నీ మోసం చెయ్యాలనుకోను. నీ గేదెలు భద్రంగా మా చావిట్లోనే కట్టేసి వున్నాయి. తోలుకుపో. ఇంటికి వెడుతూనే సుబ్బయ్య గంగాళాలు తిరిగి అప్పగించు” అని తీర్పు చెప్పాడు గ్రామాధికారి.
రామయ్యా, సుబ్బయ్యా ఇద్దరూ దణ్ణంపెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.
ఇందాకటి మచ్చల మేకపిల్ల ఫిర్యాధిదారు మేకపిల్లతో సహా వచ్చాడు. దాన్ని చంకలో నుండి కిందికి దించాడు. కాని మెడలో తాడుకట్టి చేతిలో పట్టుకున్నాడు. అది అతని చేతిలోనుండి గుంజుకుపోవాలని చూస్తున్నది.
అతను వస్తూనే “ఇదుగో చూడండి. అతను నా మేకపిల్లకు రెండు నల్లమచ్చలున్నాయి అని చెప్పాడుగందా. మరి ఇదేమో నా మూడు మచ్చల మేకపిల్ల. అతగాడిదెట్లా అవుతుందంట. మీరే సెప్పండి” అన్నాడు.
మొదటి అతను నోరు తెరుచుకుని వుండిపోయాడు.
“ఏమయ్యా! దీనికి మూడు మచ్చలున్నాయిగా. నీదెలా అవుతుంది” అని మొదటివాడితో అని ఆ తర్వాత ఆ పనివాడిని పిలిచి నెమ్మదిగా ఏదో చెప్పాడు గ్రామాధికారి.
పనివాడు వెళ్ళి కుంకుడుకాయల రసం, నీళ్ళు తెచ్చాడు. కుంకుడురసంతో మేకపిల్ల ఒళ్ళంతా రుద్ది, నీళ్ళతో కడిగాడు. నీళ్ళవెంబడి మచ్చకూడా కరిగిపోయింది.
“ఏమయ్యా! నువ్వు కాటుకలో ఆముదం కలిపి పల్చగా చేసి మేకపిల్ల ఒంటిమీద మూడోమచ్చను పెట్టుకొచ్చావు. పైగా మమ్మల్ని నమ్మించాలని చూచావు. నీ మోసం తెలియకుండా ఉంటుందనుకున్నావా? చూశావా! నువ్వు పెట్టిన మచ్చ కుంకుడురసంతో రుద్ది కడగగానే ఎలా కరిగిపోయిందో? ఇలా అబద్ధాలు చెప్పి మోసం చెయ్యాలనుకోకూడదు. అతని మేకపిల్లను అతనికిచ్చేయ్. దాంతోపాటు నీ మేకపిల్లనూ ఒకదానినివ్వు. అతని కొడుకును, చిన్నపిల్లవాడిని ఏడిపించినందులకు జరిమానా వేశాను. ఇప్పటికైనా ఆ మేకపిల్ల తాడునొదులు” అన్నాడు గ్రామాధికారి.
ఆ మేకపిల్ల రివ్వున పరుగెత్తుకుంటూ తన యజమాని దగ్గరకొచ్చి చుట్టూ తిరుగుతూ, మే…మే… అని అరవసాగింది.
కమలనాధుడు ఆ తీర్పులన్నీ విన్నాడు. గ్రామాధికారి తెలివితేటలు ముచ్చట గొలిపాయి. పెద్దపెద్ద ఫిర్యాదులు, చిన్న చిన్న ఫిర్యాదులు అన్నీ అవలీలగా గ్రహించి నిజాలు తేలుస్తాడనుకున్నాడు. ఆ తర్వాత గ్రామాధికారితో కొంచెంసేపు మాట్లాడి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
మరికొంతదూరం ప్రయాణం చేశాడు. సాయంకాలమైంది. ఈ రాత్రికిక్కడే విశ్రాంతి తీసుకుని రేపుదయమే బయలుదేరదామనుకున్నాడు. అదొక మాదిరి నగరం. ఆ రాత్రికి వుండటానికి బస ఎక్కడ దొరుకుతుందో కనుక్కున్నాడు. బసకు వెళ్ళేదారి కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళాడు. గుర్రాన్ని కట్టేసి వచ్చేసరికి చీకటి పడింది. ఆ బసకు తానుగాక, మరో ఇద్దరు వచ్చారు. కొద్దిసేపటికి మరో ఇద్దరు వచ్చారు. వస్తూనే “నీ కబురు అంది బయల్దేరి వచ్చాం. మిమ్మల్ని వెదికిపట్టుకునేసరికి ఈ వేళైంది” అని చెప్పారు.
వాళ్ళంతా ఏదో తొందరపనిలో వున్నట్లుగా అనిపించింది. నలుగురూ ఒకచోట చేరారు. వాళ్ళకు కొంచెందూరంలో వున్న కమలనాధుడ్ని అనుమానంగా చూశారు. వారిలో ఒకతను కమలనాధుని దగ్గరకొచ్చాడు.
“ఏయ్! ఎవరునువ్వు? నిన్నెప్పుడూ ఈ చుట్టూపక్కల చూసిన గుర్తులేదు. ఇక్కడికెందుకొచ్చావు?” అన్నాడు దబాయింపుగా.
“అయ్యా! నేనొక బాటసారిని ఎక్కడైనా ఏదైనా పనిదొరుకుతుందేమోనని వెదుక్కుంటూ వస్తున్నాను” అని చెప్పాడు కమలనాధుడు వినయంగా.
“ఈ చిన్ననగరంలో ఏం పనులు దొరుకుతాయి? అయినా కొత్వాలు దగ్గరకు పో లేదా మరేదైనా పెద్ద నగరానికో, పెద్ద గ్రామానికో పో” అంటూ అతను వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అందరూ అన్నాలు తిని పడుకున్నారు. వాళ్ళు నలుగురూ ఒకచోట చేరి గుసగుసలాడుకుంటున్నారు. వారిలో ఒకతని గొంతు కాస్త పెద్దది. అతని మాటలు ఒకటీ అరా కమలనాధునికి కూడా వినబడుతున్నాయి.
“యుద్ధం వస్తుందంటావా?” అనడిగాడు పెద్దగొంతున్న వ్యక్తి.
“అరవకు. తప్పకుండా వుంటుంది” అంటూ నెమ్మదిగా ఏదో చెప్పసాగాడు ఒక వ్యక్తి.
“పొరుగురాజు అంతా సిద్ధం చేసుకున్నాడా? నమ్మకమేనా?” అన్నాడు మరలా ఆ పెద్దగొంతు వ్యక్తి.
“నాకొచ్చిన సమాచారం నమ్మకమే” అంటూ మరలా నెమ్మదిగా మాట్లాడుకోసాగారు.
“మన రాజ్యంలోని సైనికాధికారులు, మంత్రులు, రాజుతో సహా అందరూ యువరాజుకు రాజ్యం అప్పగించే పండుగను చాలా అడంబరంగా జరిపే ఏర్పాట్లలో మునిగిపోయి వున్నారు. వారి ధ్యాస అంతా అటే ఉన్నది. ఇదే అదనుచూసి మన పొరుగురాజు దండెత్తి వచ్చి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడా?” అంటూ ఆ పెద్ద గొంతుకతను అడగసాగాడు.
“ముందు నిన్ను నోరుముయ్యమంటాను. ఇంకొక్కమాట కూడా మాట్లాడకు. నిన్ను రమ్మని చాలా పొరపాటు చేశాం” అంటూ కసిరాడు ఆ వ్యక్తి.
మరలా నెమ్మదిగా మాటల్లో పడ్డారు. “మన యువరాజు ఇప్పుడిప్పుడే గురుకులంలో శిక్షణపూర్తి చేసుకుని రాజధానికి తిరిగి వచ్చాడని చెప్పుకుంటున్నారు. రాజధానిలో మా దగ్గరిచుట్టం, సైన్యంలో దళపతిగా పనిచేస్తున్నాడు. అతని ద్వారా నాకు సంగతులు తెలుస్తున్నాయి. అతడే సైన్యం గురించిన రహస్యాలను చెప్తున్నాడు. వాటిని నేను మన పొరుగురాజ్యసేనాధిపతికి చేరవేస్తున్నాను. ఇప్పుడదే పనిమీద వెళ్ళివస్తున్నాను. దారిలో మీరు కలిస్తే మిమ్మల్నీ కలుపుకున్నాను. ఈ పని చేస్తున్నందుకు నాకు చాలా ధనం ముడుతుంది. దాంట్లో నుంచి కొంత మీకూ ఇస్తాను. మీవంతు సాయం మీరు చేయండి” అని చెప్తున్నాడు అతను.
యువరాజు, దళపతి, ధనం అన్నమాటలు మాత్రం కమలనాధుడు విన్నాడు.
“ధనంకోసమే గదా నీతో చేతులు కలుపుతామన్నది. మేమేం చేయాలో చెప్పు” అన్నారు మిగతావాళ్ళు.
“మనం తలో దిక్కునుండి రాజధానికి పోదాం. కొత్త సంగతులేమైనా వుంటే నాకు చేరవేయండి. మనకింకా సైన్యం వివరాలు, రాజుగారి కోట వివరాలు ఇంకేం కావాలి. అవి మనకు చాలా ముఖ్యం” అని నెమ్మదిగా అంటూ మాటలాపేసి అతను లేచి నిలబడి చుట్టూ చూశాడు. ఎవరైన తమని గమనిస్తున్నారేమోనని ఆ చీకట్లోనే చుట్టూ చూశాడు. కమలనాథుడి వంక చూశాడు. అతను మంచినిద్రలో ఉన్నట్టు అనిపించింది. శ్వాస గట్టిగా తీసుకునే శబ్దం కూడా వినబడుతున్నది. అతను మరలా వెళ్ళి కూర్చుని మాటలు కొనసాగించాడు.
“ముఖ్యంగా ఏ వైపు నుండి రాజ్యంలో ప్రవేశించటం తేలికవుతుందో, ఎక్కడ కాపలా తక్కువుందో దళపతి చెప్తానన్నాడు. నిజంగానే మన రాజు అజాగ్రత్తగా ఉన్నాడు. కనుక మన పొరుగురాజు వచ్చి ఈ రాజ్యం కూడా ఆక్రమించుకోవడం మనకళ్ళకే కనపడుతుంది. ఇకనుంచీ పొరుగురాజే మనకూ రాజు అవుతాడు. మనమిప్పుడు ఈ సాయం చేస్తే మనకెంతో పెద్ద బహుమతి దొరుకుతుంది. ఆపైన మనకూ కొలువు దొరుకుతుంది” అంటూ ఎవరే దిక్కుకు పోవాలో చెప్పసాగాడు.
(సశేషం)