శాంత సుందర సరోరుహం – అనువాద రాగోదయం

24
5

[box type=’note’ fontsize=’16’] నవంబర్ 11, 2020 వ తేదీన మృతి చెందిన ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి శాంత సుందరి గారికి ఈ వ్యాసం ద్వారా నివాళి అర్పిస్తున్నారు వారణాసి నాగలక్ష్మి. [/box]

దాదాపు పదిహేనేళ్ల క్రితం భూమిక సాహితీ సమావేశంలో శాంత గారిని మొదటిసారిగా కలవడం జరిగింది. కొండవీటి సత్యవతి అధ్యక్షతన భూమిక కార్యవర్గం, తెలుగు రచయిత్రుల స్త్రీవాద కథలతో ఒక కథా సంపుటిని హిందీలో వెలువరించాలని తలపెట్టిన సందర్భం అది. రచయిత్రులందరి నుంచి ఒక్కొక్క కథ చొప్పున తీసుకుని ఎవరో ఒక అనువాద రచయిత్రికి ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే శాంత సుందరి గారు తాను చేస్తానని ఆఫర్ చేశారు. అది వాళ్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన కొత్త. ఆమె విరివిగా హిందీ అనువాదాలు చేస్తారనీ, ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి కుమార్తె అనీ తెలిసి, అమెతో మాట్లాడుతూ ఒక సంభ్రమానికి లోనయ్యాం.

అప్పట్లో శాంతగారూ, గణేశ్వర రావు గారూ అమీర్ పేటలో తమ స్వగృహంలో ఉండేవారు. శ్రీనగర్ కాలనీలో ఉండే మాకు వాళ్లిల్లు చాలా దగ్గర. నా మొదటి కథా సంపుటి ఆలంబన అంతకు ముందే వెలువడింది. ఆలంబన కన్నా ముందు నా లలిత గీత మాలిక ‘వాన చినుకులు’ వెలువడింది. ఈ రెండు పుస్తకాలూ ఇవ్వాలని వాళ్లింటికి వెళ్లాను.

 ఇల్లు సారధీ స్టూడియోస్ దగ్గర్లో ఒక సందులో ఉంది. వీధఅంతా ఆకుపచ్చని పందిరి వేసినట్టు చెట్ల శాఖలు పైన అల్లుకుపోయి ఉన్నాయి. గేటు పక్కనే ప్రహరీ మీదికి పాకిపోయిన రాధామనోహరం. గేటు తీసుకుని లోపలికి వెళ్లేసరికి ఎరుపు, గులాబీ, తెలుపు కలగలిసిన ఆ సుకుమార సుమగుచ్ఛాలు మనోహరంగా ఊగుతూ పలకరించాయి.

గుమ్మంలో హుందాగా గణేశ్వరరావుగారు నిలబడి ఉన్నారు. సాదరంగా నన్నాహ్వానించారు. లోపలికి అడుగుపెడుతుంటే ఎదురుగా తలుపుల్లేని అలమరలో విలువైన సాహితీ సంపద కనబడి ఊరించింది. నిరాడంబరంగా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణం మనసుకి చల్లగా తోచింది. ఉదయాకాశంలో సూర్యబింబంలా విశాలమైన నుదుటిమీద ఎర్రని కుంకుమబొట్టు మెరుస్తుంటే, స్నేహపూర్వకమైన చిరునవ్వు, వాత్సల్యం నిండిన పలకరింపుతో శాంతసుందరి గారు ఎదురొచ్చి కూర్చోమని సోఫా చూపించారు. కమ్మని కాఫీ ఇచ్చారు. తర్వాత వారి అమ్మగారు వరూధిని గారు మాతో కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పారు. చురుకుగా కదిలే శరీరంతో, స్పష్టమైన మాటతో ఆరోగ్యంగా కనపడిన ఆవిడ శాంతగారికి తల్లిలా కాక ఒక అక్కలా అనిపించారు. 

శాంత సుందరి గారు నిరంతరం తీరికలేని పనిలో ఉంటారని తెలుసు కనక ఎక్కువసేపు కూర్చోకుండా నా పుస్తకం ఇచ్చి వచ్చేశాను. భూమిక రచయిత్రుల కథలన్నీ చదివి నచ్చనివాటిని మార్చి వేరే కథ ఇవ్వమని ఆయా రచయిత్రులని అడిగి, చకచకా అనువాదాలు పూర్తిచేశారు శాంత గారు. ‘అప్నా సంఘర్ష్’  తెలుగు నారీ వాదీ కహానియా – పేర ఆ కథా సంపుటి 2007లో వెలువడింది. ఆ అనువాదాలు చేసినందుకు శాంత గారు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. తర్వాత అదే విధంగా శ్రీమతి వాసా ప్రభావతి గారి అధ్యక్షతన లేఖిని మహిళా రచయిత్రులు కూడా ఒక కథా సంపుటి హిందీలో వేయాలని తలపెట్టినపుడు శాంతగారినే అనువదించమని కోరడం జరిగింది. ఈసారి కూడా ఆవిడ అతిత్వరలో తనకిచ్చిన కథలను అనువదించి ఇచ్చారు. ఆమెకందిన కథల్లో తనకు అంతగా నచ్చని కథలను వెనక్కిచ్చి, వేరే కథలను ఆవిడ ఎన్నుకోవడం చూశాక మా అందరికీ శాంతగారు తను అనువదించే కథలలో నాణ్యత కోసం ఎంత శ్రద్ధ వహిస్తారో తెలిసింది. ‘గుల్ దస్తా’ మహిళా కథాకారోంకీ కహానియా – పేర మరో కథాసంపుటి ఆమె అనువాదంలో హిందీ పాఠకులకి అందుబాటులోకి వచ్చింది.

భూమిక, లేఖిని- రచయిత్రుల సంస్థలు ఈ రెండిటిలో జరిగే సమావేశాలకి చాలా సార్లు మేం కలిసి వెళ్లేవాళ్లం. మేమిద్దరమే వెళ్తే ఆటోలో వెళ్లేవాళ్లం. వెనక్కి వచ్చేటప్పటికి చీకటిపడేది. మా ఇల్లే ముందు వచ్చినా శాంతగారిని వాళ్లింట్లో దింపి నేను మా ఇంటికి వెళ్లేదాన్ని. ఆవిడ ‘అక్కర్లేదు నేవెళ్లిపోగల’నని వారించినా, దాదాపు మా అమ్మ వయసున్న ఆమెని చూస్తుంటే ఒక్కరినీ పంపడానికి నాకు మనసొప్పేది కాదు. దారంతా ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్లం.

ఒకోసారి గణేశ్వర రావుగారు కారులో తీసుకెళ్లేవారు. ముందు సీట్లో శాంత గారు కూర్చుంటే వెనక ఒక సీటు నాది. నా పక్క సీట్లో ఎన్నో పుస్తకాలుండేవి. డీటీపీ చేయించాల్సిన కాగితాల ఫైళ్లుండేవి. అనువాద రచనకి సంబంధించినంతవరకూ కాగితాల మీద చకచకా రాసుకుంటూ పోవడమే శాంత గారి పని. అవన్నీ చదివి, మార్పులవసరమైన చోట చెప్పి, అవి సరిచేయించి, ఆ కాగితాలు తీసుకెళ్లి డీటీపి చేయించి, పబ్లిషర్స్ కి అందించే పనంతా రావు గారిదే. ఆయనెపుడూ శాంత గారిని తనకు భిన్నమైన వ్యక్తిగా భావించినట్టు కనపడలేదు. హిందీ మాగజైన్స్, శాంతగారు అనువదించిన కొత్త పుస్తకాలు, అనువాదం కోసం కొత్తగా అందిన పుస్తకాలు, సాహితీ మిత్రులు వారికిచ్చిన తమ రచనలూ… ఇలా ఆ కారులో ప్రయాణిస్తూ ఉండేవి. కారెపుడూ కదులుతున్న మినీ లైబ్రరీలా కళకళలాడుతూ ఉండేది.

చాలామంది తమ కార్లలో ఖరీదైన పెర్ఫ్యూమ్స్ పెట్టుకుంటారు. వాటి తాలూకు సన్నని సువాసన ప్రయాణించినంతసేపూ కారులో ఉన్నవారిని అలరిస్తుంది. రావుగారి కారులో మాత్రం ఒక అద్భుతమైన సాహితీ సుగంధం పరిమళిస్తూ ఉండేది. సమకాలీన సాహిత్యం సంగీతమై, ప్రయాణం చేసినంతసేపూ వీనులవిందు చేసేది. ఆ దంపతులిద్దరూ తినేదీ, తాగేదీ, పీల్చేదీ అంతా సాహిత్యమేనేమో అనిపించేది. అలాంటి దంపతుల్ని నేనెపుడూ చూడలేదు. వారి అభ్యుదయ భావాలు, సంస్కృతీ సంస్కారాలు నన్ను ముగ్ధురాలిని చేసేవి. నేను వెనక కూర్చుని ఉన్నానని వాళ్లు తమ సంభాషణలోగాని, ప్రవర్తనలో గాని, ఏ మార్పూ చేసుకునేవారు కాదు. ఒకోసారి అభిప్రాయాలు కలవనపుడు నిర్మొహమాటంగా వాదించుకునేవాళ్లు. ఇద్దరిమధ్యా గౌరవాన్నీ, ప్రేమనూ ఇచ్చిపుచ్చుకునే పద్ధతి నాకు మహాద్భుతంగా తోచేది! ఒకోసారి వాళ్లు ఎడాపెడా వాదించేసుకుంటున్నపుడు కూడా, ఇద్దరు సమఉజ్జీల మధ్య చర్చ లాగే ఉండేది. బాగా కోపం వచ్చి దెబ్బలాడుకున్న సంఘటనలూ ఉండేవి. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి కూడా ఒక ఆదర్శ దాంపత్యానికి నిర్వచనంలా కనిపిస్తాయి. ఎపుడైనా ఒక అందమైన ప్రేమనవల  రాయాలనిపిస్తే నేను వారి గురించే రాస్తానేమో!

భార్య తల్లిదండ్రులని రావుగారు గౌరవించిన విధానం కూడా అపురూపమే. కొడవటిగంటి కుటుంబరావు గారంటే రావుగారికి అమితమైన ప్రేమా ఆరాధనా! శాంత గారి తల్లి వరూధిని గారు నిర్మొహమాటి. ఆమెది నిక్కచ్చి మనస్తత్వం. మాట సూటిగా, కొండొకచో కటువుగా ఉండేది. అయినా రావుగారు ఆమెని అత్తగారు గానూ, ఒక మహారచయిత భార్యగానూ ఎంతో గౌరవంతో, ఆదరంతో చూసుకునే వారు. ఆయన ఎదురుగా శాంతగారు పెద్దగా అనకపోయినా మేమిద్దరమే ఉన్నపుడు రావుగారి నిండైన వ్యక్తిత్వాన్నీ, విశాల దృక్పథాన్నీ మనసారా మెచ్చుకునేవారు. అలా అని ఎపుడూ పొగడ్తలే కాదు నచ్చని విషయాలు నచ్చలేదని సూటిగా చెప్పేవారు. అంత సూటి విమర్శని రావుగారు యథాతథంగా హుందాగా స్వీకరించగలిగేవారు. శాంతగారిదీ అదేలాంటి ఉన్నత వ్యక్తిత్వం.

ఒకరోజు రావుగారు ఫోన్ చేసి “నాగలక్ష్మీ, ఒక ఫేవర్ కావాలి” అన్నారు.

“అంతకంటేనా రావుగారూ! చెప్పండి” అన్నాను. ఏమడుగుతారా అని చూస్తుంటే “స్వప్నఅని ఒక మాస పత్రిక వస్తోంది కొత్తగా. చూశావా?’ అన్నారు.

“లేదండీ” అంటే “ఆ పత్రికాధిపతి నాకు మిత్రుడు. పత్రిక నిలబడడం కోసం పేరున్న రచయితల కథలు వేయాలనుందిగాని పారితోషికాలు ఇచ్చుకోలేనన్నాడు. అతని కోసం కొంతమందిని అడగాలని అనుకున్నాను. నువ్వొక కథ రాసి వారం రోజుల్లో ఇవ్వగలవా?” అన్నారు.

కొంత గాభరా పడ్డాను. పత్రికని నిలబెట్టే అంత సన్నివేశం సంగతలా ఉంచి, ‘రావుగారు నా రచనలకి అంత విలువిచ్చి అడిగారు, ఆయనకి నచ్చే కథ రాయగలనా’ అనుకున్నాను. సరే మాటిచ్చాను కనక ఏదో కుస్తీ పట్టి ‘ఒక ప్రేమలేఖ’ అనే శీర్షికతో ఒక కథ రాసి, రావు గారికి ఈ మెయిల్ చేశాను. ఆ మర్నాడు పొద్దున్నే శాంతగారి నుంచి ఫోను. ఏం చివాట్లు పెడతారో అనుకుంటూ తీసి “ఏదో రాశాను శాంతగారూ, అప్పటికప్పుడంటే నేను రాయలేను” అంటూ చెప్పబోయాను.

“ఏడిపించేశావు” అన్నారు.

అర్ధం కాలేదన్నాను.

“చాలా హృద్యంగా ఉంది కథ. Very touching! ఎక్కడా ఒక్క అనవసరపు మాట లేదు” అన్నారు. తర్వాత రావుగారు తీసుకుని “కథ చాలా బాగా వచ్చింది నాగలక్ష్మీ! అతను వీధి గుమ్మంలో మెట్లమీద కూర్చుంటే తల్లి అతని తల మీద చేతితో రాస్తూ చెప్పిన మాటలు చదువుతుంటే కళ్లు చెమర్చాయి. ఇంకా అతని భార్య ఉక్రోషంతో ‘గంపెడు పూలు తెండి… వాటిల్లో కూర్చోపెడతా మీ అమ్మని’ అని వెటకరించడం, కథానేపథ్యంలో పల్లెటూరి బ్రాహ్మణ కుటుంబ వాతావరణం… అంతా చాలా చక్కగా ఇంత చిన్నకథలో చూపించావు” అంటూ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా అధ్యాపక వృత్తిలో తలపండిన రావు గారు కథని విశ్లేషించి ప్రశంసిస్తూ మాట్లాడుతుంటే నాకు కలిగిన సంతోషం, దొరికిన ప్రోత్సాహం ఇంతా అంతా కాదు.

ఆ తర్వాత కథో కవితో రాసినపుడు వాళ్లకి పంపుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు శాంత గారు బానేవుందని చెప్పి వదిలేసినా, రావుగారు నిక్కచ్చిగా విమర్శించేవారు. బావుంటే ఇద్దరూ మనసారా మెచ్చుకునే వారు. కవిత్వం, కథ, నవల, నాటికలే కాక మంచి సాహిత్యం ఎందులో ఉన్నా దాన్ని వాళ్లు ఎంతో ఆస్వాదించేవారు. ముఖ్యంగా పాత హిందీ సినిమా పాటలు శాంత గారికి ఎంతో ఇష్టం. ఆవిడకి సంగీతం వచ్చు, బాగా పాడగలిగే వారు కూడా. కానీ పూర్వంలా గొంతు రావడం లేదని పాడేవారు కాదు.

ఆరేళ్ళ క్రితం అనుకుంటా గణేశ్వర రావు గారికి కొంత అనారోగ్యం చేసి నీరసపడ్డారు. నాతో ఈ విషయం చెప్పగానే ఒకసారి ఫిజిషియన్ దగ్గరకి వెడితే మంచిదని శర్మ గారి స్నేహితుడి నంబర్ ఇచ్చాను. రావుగారు పెద్దగా పట్టించుకోకపోయినా, వెంటపడి, కోప్పడి, మేము చెప్పిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. అవసరమైన పరీక్షలన్నీ చేయించి, లంగ్ బయాప్సీ చేయాలన్నపుడు మాత్రం ‘భయంగా ఉంది నాగలక్ష్మీ, ఆ టెస్ట్ గురించి వింటుంటే’ అని నాకు ఫోన్ చేశారు. శర్మగారితో మాట్లాడి ఆ బయాప్సీ వెంటనే అక్కర్లేదనీ, ముందు అనుమానిస్తున్న వాటిలో టీబీ ఉంది కనుక టీబీకి ట్ర్రీట్మెంట్ మొదలుపెట్టమని శర్మ గారు డాక్టర్ తో చెప్పి, ‘దానికి గుణం కనిపిస్తే అదే కొనసాగిద్దామనీ, కనిపించని పక్షంలో ఈ టెస్ట్ గురించి ఆలోచిద్దా’మనీ అన్నారు. అలాగే టీబీ చికిత్స మొదలు పెట్టిన కొద్దిరోజుల్లోనే రావుగారు మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ దూరంగా ఉన్నా, తొంభైల్లో ప్రవేశించిన తల్లి వరూధినిగారి బాధ్యత తమ మీద ఉన్నా, దిగులుని జయించి, ధీరగంభీరంగా నిలబడి, ట్రీట్మెంట్ పూర్తై, సంపూర్ణంగా కోలుకునే దాకా తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఆ మందులకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇద్దరూ ఓపికతో మానేజ్ చేసుకున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా శాంతగారి అనువాద సృజన ఆగిపోలేదు, వేగం తగ్గలేదు!

ఒకసారి ‘సారంగ’ జాల పత్రిక కోసం శాంతగారిని ఇంటర్వ్యూ చేయమని అఫ్సర్ గారు అడిగారు. అంతకు ముందే మేం లేఖిని బృందంతో వనపర్తి, ఇంకా ఆ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలకి కండక్టెడ్ టూర్ వెళ్లివచ్చాం. వనపర్తిలో ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారి ఇంటికి వెళ్ళినపుడు, వారి పెంపుడుపిల్లి పిల్లలు శాంతగారి దగ్గరికి చనువుగా వచ్చి, ఆవిడ ఒళ్ళోకెక్కి గారాలు పోయాయి. అది నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. అదే విషయం శాంతగారిని అడిగితే, తను చాలా కాలం పిల్లుల్ని పెంచాననీ, ‘అలా పెంపుడు జంతువులని ప్రేమతో సాకేవారిని అవి గుర్తు పడతాయనీ, దగ్గరికి భయం లేకుండా వస్తా’యనీ చెప్పారు. సారంగ ఇంటర్వ్యూ లో ఈ విషయం కూడా ప్రస్తావిస్తూ కొన్ని ఫొటోలు జతచేసి, అఫ్సర్ గారికి పంపాను. అది అచ్చయ్యాక శాంత గారు చదివి ఎంతో మురిసిపోయారు. ముఖ్యంగా ఆవిడ భుజాల మీద వాలిపోయి సేదతీరుతున్న పిల్లిపిల్ల ఫొటో ఆవిడకెంతో నచ్చింది.

‘ఈ ఫొటో ఎప్పుడు తీశావూ?’ అని అడిగి, ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చిందని సంతోషించారు. ఇంటర్వ్యూ చివర్లో ‘ఆమెకి త్వరలోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం రావా’లని కోరుకుంటూ ఇంటర్వ్యూ ముగించడం, అలాగే మరికొద్ది నెలల్లోనే ఆమెకి ఆ పురస్కారం లభించిందన్న వార్త రావడమూ జరిగింది. అంతకు ముందే 2005 లో ఆమెకి ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ గార్గీ గుప్తా ద్వివాగీశ్ పురస్కారం’ లభించింది. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ అనువాద పురస్కారం, సలీమ్ గారి కాలుతున్న పూలతోట అనువదించినందుకు National Human Rights Commission వారి పురస్కారం కూడా ఆమెని వరించాయి. ఈ మధ్య అమృతలత అపురూప పురస్కారం, లేఖిని అనువాద పురస్కారం ఆమె అందుకున్నారు.

ఏ పురస్కారాలూ అశించకపోయినా, అనుకోకుండా వచ్చినవాటికి పెద్దగా పొంగిపోకపోయినా, జ్ఞానపీఠ్ కన్నా ఒక్క మెట్టు మాత్రమే కిందనున్న ఈ పురస్కారం వచ్చినందుకు ఆమె చాలా సంతోషించారు. రావుగారైతే చెప్పనక్కర్లేదు. అ అవార్డ్ తనకే వచ్చినా ఆయనంత ఆనందించేవారు కాదు. వార్త తెలిసిన వెంటనే సలీమ్ గారు, లక్డీకా పూల్ లో ఒక స్టార్ హొటల్ లో, అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆమెకి సన్నిహితులైన కొద్దిమంది మిత్రుల సమక్షంలో ఆ కార్యక్రమం క్లుప్తంగా, ఎంతో ఆత్మీయంగా జరిగింది. అది మొదలుగా ఇంకా ఎన్నో అలాంటి సభలు జరుగుతాయని నేననుకున్నాను, అంతకు ముందు అబ్బూరి ఛాయాదేవిగారికి అకాడెమీ పురస్కారం లభించినప్పటి సంరంభం గుర్తొచ్చి. 

దాదాపు 45 ఏళ్ల అవిరామ కృషికి లభించిన ఆ పురస్కారం అందుకోవడానికి ఆమె వెళ్లలేకపోయారు. అప్పటికింకా రావు గారు పూర్తిగా కోలుకోలేదు. అయితే హైదరాబాద్ లోనే ప్రముఖ కవి డాక్టర్ ఎన్. గోపీ గారు ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. ‘అందులో నువ్వు నా గురించి మాట్లాడతావా?’  అని శాంతగారు అడిగారు. ‘తప్పకుండా’ అన్నాను. అయితే ‘అవార్డ్ వాపసీ’ నిరసనల వల్ల ఆ కార్యక్రమం ఆఖరి నిముషంలో రద్దు చేయాల్సి వచ్చింది. అంతే…అదలా ముగిసిపోయింది. ఇంక ఆ పురస్కారం లభించిన సందర్భాన్ని ఒక ఉత్సవంలా జరుపుకోలేక పోయాం. అది శాంత గారిని కొంత నిరుత్సాహపరచిందని చెప్పాలి.

ఆ దంపతులిద్దరూ అనేకసార్లు మాఇంటికి వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళేవారు. శాంత గారు రోజుకి ఒక్కసారే కాఫీ తాగేవారు. అయితే ఆవిడకి ఐస్ క్రీమ్ ఇష్టం. మా ప్రిడ్జ్ లో తరచుగా ఐస్క్రీమ్ ఉంచేదాన్ని. అలా వచ్చినపుడు “ఏమీ వద్దు నాగలక్ష్మీ! దా కబుర్లు చెప్పుకుందాం” అంటే “రావుగారికి కాఫీ, మీకు ఐస్ క్రీమ్” అనేదాన్ని.

“హు. ఐస్క్రీమ్ వద్దనడం ఎలా?” అని నవ్వుతూ తీసుకునేవారు.

సమయపాలనలో ఇద్దరూ నిరంకుశులు. వాళ్ల కాఫీ టైమ్, భోజనం టైమ్, మధ్యాహ్న భోజనం తర్వాత తీసుకునే అరగంట నిద్రా సమయం- అన్నీ నాకు అలవాటైపోయి, ఎపుడు ఫోన్ చేసినా వాళ్లకి ఇబ్బంది కలగకుండా చూసుకునే దాన్ని. మా అమ్మాయి వర్షిణి పాటంటే శాంతగారికి ఎంతో ఇష్టం. అపుడపుడు వర్షిణి నాతో వాళ్లింటికి వచ్చేది. అలా వెళ్లినప్పుడూ, లేదా వాళ్లు మా ఇంటికి వచ్చినపుడూ తప్పనిసరిగా తన చేత పాట పాడించుకునే వారు. కొన్ని పాటల పేర్లు చెప్పి అవి నేర్చుకో అనేవారు. తనని చూస్తున్నపుడు శాంత గారి కళ్లలో అవ్యాజమైన వాత్సల్యం కురిసిపోయేది. ‘స్వప్న’ పత్రికకోసం ‘వేసవి సెలవుల్లో ఏం చేస్తానంటే’ అనే శీర్షికతో ఒక చిన్న వ్యాసం రాయమని అడిగి, రాశాక శ్రద్ధగా చదివి మెచ్చుకుని, పత్రిక వాళ్లకి పంపించారు.

ఏటా జరిగే బుక్ ఎగ్జిబిషన్ కి మేం కలిసి వెళ్లేవాళ్లం. శాంతగారూ, రావుగారూ నడుస్తుంటే ఆ ప్రాంగణంలో ఎందరో సాహితీవేత్తలు వాళ్లని పలకరిస్తూ సంభాషిస్తూ వెంట నడిచేవారు. స్వతహాగా కల్పించుకుని మాట్లాడే స్వభావం కాకపోవడంతో నేను మౌనంగా వాళ్ల మాటలు వింటూ ఉండేదాన్ని. సాహిత్యం కానిదేదీ వాళ్ల మాటల్లో వినపడేదే కాదు. శాంతగారికీ, మా అమ్మకీ కేవలం నాలుగేళ్లే తేడా. ఇద్దరి దృక్పథాల్లో ఎంతో వ్యత్యాసం ఉన్నా మొదటి పరిచయంలోనే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడింది. మా నాన్నగారు పోయాక అమ్మని చూడాలని కే బీ లక్ష్మి, పొత్తూరి విజయ లక్ష్మి, మంథా భానుమతిలతో కలిసి ఒకరోజు పొద్దున్నే హఠాత్తుగా మా ఇంటికి వచ్చి, సాయంత్రందాకా మాతో గడిపి వెళ్ళారు శాంతగారు. పొత్తూరి రచనలే కాదు, రోజువారీ సంభాషణల్లో కూడా హాస్యం పొంగిపొరలుతుంది. ఆ రోజు మా ఇల్లంతా హాస్యపు జల్లులూ, నవ్వుల జడివానా.

అంతా తలో పుస్తకం అమ్మకి ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు. కథో నవలో.. ఆహ్లాదం కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ, రచయిత్రుల పట్ల గొప్ప అభిమానం పెంచుకున్నమా అమ్మ శ్రీమతి పార్వతి, ఈ ప్రముఖ రచయిత్రులు తనకోసం ఇంటికివచ్చి, తన పేరు రాసి, శుభాకాంక్షలతో సంతకం చేసిచ్చిన పుస్తకాలు చూసుకుని మురిసిపోయింది. ఆవిడ ఈ సంవత్సరం జూన్ నెల 20 వ తారీకున అనూహ్యంగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. కేవలం రెండు రోజుల స్వల్ప అస్వస్థత.. అంతే. అప్పటికి శాంతగారికి బ్రెయిన్ ట్యూమర్ కి సర్జరీ జరిగి మూడు నాలుగు వారాలయింది. అమ్మ మరణవార్త విని ఆవిడ చాలా కుంగిపోయారని రావుగారు చెప్పారు. “అంతగా ఎఫెక్ట్ అవుతుందనుకోలేదు నాగలక్ష్మీ. లేకపోతే చెప్పేవాణ్ని కాదు” అన్నారు. శాంత గారు అంతే… ఎవరినైనా అభిమానిస్తే అంత గాఢంగా ఉంటుంది ఆ బంధం.

అవసరమైన నిర్ణయాలు తీసుకునేటపుడు ఆవిడ చాలా త్వరగా డిసైడ్ చేయగలిగేవారు.

“మనిషి కళ్లలోకి చూస్తూనే తెలిసిపోయింది నాగలక్ష్మీ, అతను నిజాయితీ గలవాడనీ, మంచివాడనీ” అనేవారు. సమయం వృధా చేయడం అంటే ఇద్దరికీ నచ్చేది కాదు. ఏ పనైనా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుపోయేవారు. అనవసర కాలయాపన వాళ్లకి తెలియదు. అలా అని పనే జీవితం అన్నట్టూ ఉండేవారు కాదు. ఉన్నతమైన సాహిత్యం, సంగీతం వాళ్లకి ఊపిరి. ఆఖరికి కాలక్షేపం కబుర్లు కూడా సాహితీ సుగంధాలు వెదజల్లుతూ ఉండేవి. మెరమెచ్చు మాటలు ఇద్దరికీ రావు.

భూమిక, లేఖిని సంస్థలు నిర్వహించిన విహార, సామాజిక యాత్రల్లో, పిక్ నిక్ లలో శాంతగారితో చాలా సార్లు ప్రయాణించాను. ఆవిడ తన కాలంకన్నా కనీసం ఇరవయ్యేళ్లు ముందున్నారని చెప్పగలను. తన పనీ, రోజువారీ అవసరాలూ తీరడానికి అవసరమైన టెక్నాలజీ నేర్చుకోవడం కోసం ఆవిడ శ్రద్ధపెట్టేవారు. రావుగారు డ్రైవ్ చేయడం కష్టమనిపించిన సందర్భాలలో ఓలా, ఊబర్ లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుని కాబ్స్ బుక్ చేసేవారు. మొదట్లో కొన్ని సందర్భాలలో నేనో, మా అమ్మాయో బుక్ చేసి పెడితే సంతోషించినా, తమకవసరమైనవి తనే నేర్చుకుని, ఇండిపెండెంట్ గా ఉండాలనుకునేవారు. కంప్యూటర్లో, ఫోన్లో టైప్ చేయడం, ఈమెయిళ్లు పంపడం అలాగే నేర్చుకున్నారు. పుట్టి పెరిగిన ఇంట్లో సాహితీ వాతావరణం సహజంగా ఆవిడని ప్రభావితం చేసింది. తర్వాత తనెన్నుకున్న రంగమూ అదే. హిందీ, ఇంగ్లీష్, తెలుగు సాహిత్యాలని నిరంతరం అధ్యయనం చేస్తూ, జీవిత భాగస్వామితో చర్చిస్తూ ఉండడం వల్ల సహజంగానే కుశాగ్రబుద్ధి అయిన ఆమె దృక్పథం విశాలమై, ఎల్లలు దాటి విస్తరించింది.

మేము శ్రీనగర్ కాలనీ నుంచి గచ్చిబౌలికి మారిన కొత్తల్లోనే వాళ్లు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర్లో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కుని అమీర్ పేట నుంచి కొత్త ఇంటికి మారారు. ఆ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయని రోజూ పొద్దున్నే వాకింగ్ కి వెళ్లేవారు. మా ఇళ్ల మధ్య దూరం నాలుగైదు కిలోమీటర్లు మాత్రమే కావడంతో తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఆ రోజుల్లోనే వరూధిని గారిని ఒక వృద్ధాశ్రమంలో పెట్టి, పిల్లలు అరుణ, సత్య దగ్గరకి ఒక ఆర్నెల్ల పాటు వెళ్లివచ్చారు. అపుడు అరుణ చిత్రలేఖనంలో ఎమ్మే పూర్తిచేసి ఫ్రీలాన్స్ చిత్రకారిణిగా గొప్ప గొప్ప చిత్రాలు వేస్తూ పేరు తెచ్చుకుంటోంది. ఆమెతో ఉండి, రావు గారు ఆర్ట్ గురించి ఎన్నో పోస్టులు ఫేస్ బుక్ లో పెడుతూ వచ్చారు. ఆయా పెయింటింగ్స్ ని అంతకు ముందు ఎన్నోసార్లు చూసిన వాళ్లకి కూడా తెలియని కొత్త విషయాలెన్నో ఆ పోస్టుల ద్వారా తెలిసేవి. అదే సమయంలో శాంత గారు, నా కథల్లో తనకు నచ్చిన వాటిని ఎన్నుకుని అనువదించి నాకు ఈమెయిల్లో పంపారు. హిందీ సంపాదకులు అలోక్ ప్రకాశన్ గారితో మాట్లాడి పుస్తక ప్రచురణకు ఏర్పాటు చేశారు. హిందీలోకి ఆమె అనువదించిన కథలతో 2018 లో ‘బోలతీ తస్వీర్’ అనే కథా సంపుటి వెలువడింది. ఆ కథా సంపుటి చదివిన హిందీ సాహితీ, పాఠక మిత్రులు అందించిన స్పందనను ఆమె చాలా సంతోషంగా నాతో పంచుకున్నారు. ఆ అనువాదాలు చేసినందుకు ఒక్క రూపాయి కూడా ఆమె తీసుకోలేదు. ఆమె పుట్టినరోజున ఒక మైసూరు క్రేప్ చీర, స్వీట్లూ, పళ్లూ, ఐస్ క్రీమ్ తీసుకెళ్తే, “నువ్వేవేవో తెచ్చినట్టున్నావు. నేను తీసుకోను” అన్నారు.

 “మీకోసమే తెచ్చాను ప్లీజ్” అని బతిమాలి, పాకెట్ తీసి చూపిస్తే, “నేనెప్పటినుంచో ఒక మైసూరు క్రేప్ చీర కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ మెటీరియల్ నాకు చాలా ఇష్టం” అని సంతోషంగా ఆ చీర తీసుకుని కట్టుకున్నారు. 

కిందటేడు నవంబర్ లో ఢిల్లీ తెలుగు అకాడెమీ వారు ఏర్పాటు చేసిన దుబాయ్ ట్రిప్ కి వాళ్లూ మేమూ వెళ్లాం. కొద్దిమంది సాహితీ మిత్రులు కూడా వచ్చారు. అయిదురోజుల ఆ యాత్ర లో మరెందరో సన్నిహితులయ్యారు. డెజర్ట్ సఫారీతో సహా అన్నిటిలో శాంత గారూ, రావుగారూ పాల్గొన్నారు. దుబాయ్ చేరినప్పటి నుంచి తిరిగి వెనక్కి వచ్చే ఫ్లైట్ ఎక్కేదాకా ఒకే లగ్జరీ బస్సులో ప్రయాణించడం వల్ల అంతా ఒక కుటుంబంలాగా కబుర్లూ, నవ్వులూ పంచుకున్నాం.  ఎప్పటికీ మరిచిపోలేని మధుర స్నేహానుభూతులు సొంతం చేసుకుని అంతా క్షేమంగా వెనక్కి వచ్చాం.

తర్వాత రెండేళ్ల క్రితం తెల్లాపూర్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఒక విల్లా కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇల్లూ పరిసరాలూ ఎంతో ప్రశాంతంగా ఉన్నా, సాహితీ సమావేశాలకి చాలా దూరమైపోయింది. ఏ కార్యక్రమానికైనా నేనూ శర్మ గారూ వెళ్తుంటే, తమ కారు మా ఇంటిదగ్గర పెట్టుకుని మాతో వచ్చేవారు. వెనక్కి వచ్చాక తమ కారులో ఇంటికి వెళ్ళిపోయేవారు.

ఇలా జీవితం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతుంటే మార్చిలో కరోనా కర్కశ కాలం మొదలైంది. ఎవరిళ్లలో వాళ్ళు బందీలైపోయాం. తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నాలుగు రోజులకి సత్యవతి గారు ఫోన్ చేసి శాంతగారికి ఏమయింది అనడిగితే తెల్లబోయాను. తరువాత తెలిసింది అనుకోకుండా ఆవిడ అస్వస్థతకి గురయ్యారనీ, పరీక్షల్లో బ్రెయిన్ ట్యూమర్ అని తేలిందనీ. అ దుష్ట ఘడియలు అలా ప్రారంభమై ప్రముఖ సర్జన్ చేసిన సర్జరీ ఎంతో బాగా జరిగినా బయాప్సీ రిపోర్ట్ లో కాన్సర్ అని తేలడం, అది త్వరగా తిరిగి పెరగడం జరిగి, నాలుగు నెలల్లోనే ఆమె కోమాలోకి జారిపోయారు. రేడియో థెరపీ, కీమో థెరపీ ఏవీ పెద్దగా ఉపయోగపడలేదు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉండడం, కరోనా కారణంగా వాళ్లు రాలేని స్థితి- రావుగారే అన్నివిధాలా ఆవిడని శ్రద్ధగా చూసుకున్నారు. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లోనూ, దానిపక్కనే ఉన్న ఉచ్ఛ్వాస్ కేంద్రంలోనూ శాంతగారి చికిత్స సాగి, ఇక ఏ చికిత్సా పనిచెయ్యని స్థితి ఏర్పడింది. అమెరికా నుంచి అరుదుగా వస్తున్న ఫ్లైట్స్ లో ఒకదానిలో అమె పెద్ద కుమార్తె అరుణ, ఆమె భర్తా వచ్చారు. శాంతగారి క్షీణిస్తున్న ఆరోగ్య స్థితివల్ల కుంగిపోయి ఉన్న రావుగారికి చిన్నపాటి ఆసరా దొరికింది, సుమారు ఏడువారాలపాటు. దసరా, దీపావళి పండుగలు చేసుకునే మిత్రులకి అడ్డురాకుండా దసరా వెళ్లి దీపావళి వచ్చేలోపు ఇంక సెలవంటూ నవంబర్ 11 వ తేదీ నాటి రాత్రి 8.22 కి మనందరికీ శాశ్వతంగా వీడ్కోలు చెప్పేశారు శాంత సుందరి గారు. ఆమె మనమధ్య లేకపోయినా ఆమె అనుసృజించి అందించిన 75 పుస్తకాలూ, అంతకు మించిన సంఖ్యలో విడి కథలూ, కవితలూ ఆమెని సాహితీ ప్రియుల మనసుల్లో చిరస్థాయిగా నిలుపుతాయి.

ఆ అద్భుత ప్రతిభా శాలికి, నిరాడంబర ప్రేమ మూర్తికి నా నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here