“ఆగండి! అక్కడే ఆగండి! లోపలికి రావద్దు” గట్టిగా అరిచాడు అపార్ట్‌మెంట్ సెక్రటరీ రంగారావు.
“ఎందుకు అంకుల్? ఏమయింది?” అడిగాడు శ్రీరామ్. ఒక పక్కన నిద్రముంచుకొస్తూంది అతనికి.
“మీరు లోపలికి రాకూడదు అంతే!” కరాఖండిగా చెప్పేaశాడు రంగారావు.
“మేము ఏం తప్పు చేశామంకుల్?” అడిగాడు మురళి. అతని స్వరంలో ఆవేదన.
రంగారావు వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు.
“మల్లేషూ! వాళ్ళ బ్యాగ్‍లు తెచ్చి బయటపడెయ్యి” పురమాయించాడు వాచ్‍మెన్‍కి.
“ఊ! మీరు బయటకు వెళితే వాడు గేట్ తాళం వేసుకుంటాడు” అంటూ కోపంగా అరిచాడు.
వాళ్ళకి అంతా అయోమయంగా ఉంది. రంగారావుని చూస్తూ మౌనంగా బయటికి నడిచారు. వాళ్ళ వెనకే మల్లేషు గేటు మూసి తాళం వేశాడు.
అర్థరాత్రి ఒంటిగంట దాటింది. భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. ఇపుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు రానిస్తారు? ఇద్దరి మనసుల్లో ఒకటే ఆలోచన. బ్యాగ్‍లు చేతుల్లోకి తీసుకున్నారు.
“చుట్టూ ఎవరూ లేరురా! అయినా ఈ కర్ఫ్యూ టైంలో ఎవరుంటారు? మనకు తప్పదుగాని” శ్రీరామ్ స్వరంలో ఆవేదన.
“ఈ కల్లోలం మనకోసమే వచ్చినట్లుందిరా!” మురళి గొంతులో ఏడుపు జీర.
ఇంతలో హారన్ మోగించుకుంటూ జీపు ఆగింది వాళ్ళ ప్రక్కన. సబ్ ఇన్‍స్పెక్టర్ రామన్న దిగాడు.
“ఎవర్రా మీరు? ఈ టైంలో ఇక్కడ… కర్ఫ్యూ అని తెలియదా?” ఆయన స్వరంలో విసుగు.
“సార్! మేము…” అంటూ వెంటనే ఐడెంటిటీ కార్డులు చూపించారు.
“ఓహో! మీరా? ఇక్కడ నిలబడ్డారేమిటి? ఏం జరిగింది?” ఆశ్చర్యంగా అడిగాడు.
జరిగింది వివరంగా చెప్పాడు.
‘ఉష్’మని నిట్టూర్చి “పదండి. జీపు ఎక్కండి!” అన్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కారు. “డ్రైవర్! మన స్టేషన్‍కి పోనివ్వు” అని చెప్పాడు.
***
జీప్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. “బ్యాగ్‍లు తీసుకుని దిగండి” అనునయంగా చెప్పాడు.
బ్యాగ్‍లు తీసుకుని దిగారు. ఆయన వెనకే స్టేషన్‍లోకి నడిచారు.
“రమేష్! ఇలారా?” వాచ్‍మెన్‍ని పిలిచాడు.
“వీళ్లకి స్నానానికి ఏర్పాట్లు చెయ్యి. డెట్టాల్ వేసిన నీళ్ళు ఒక బకెట్ పెట్టు. ముందు శానిటైజర్ చేతుల్లో వెయ్యి” శానిటైజర్ చేతులలో వేశాడు రమేష్.
స్నానం చేసి లోపలికి వెళ్ళారు మురళి, శ్రీరామ్. సబ్ ఇన్‍స్పెక్టర్ చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు. ఫ్యాన్ గాలికి నిద్ర ముంచుకొస్తూంది. సుమారు పదిగంటల సేపు డ్యూటి చేసి అలిసిన వారి మనశ్శరీరాలు విశ్రాంతిని కోరుకుంటున్నాయి.
“ఏమిటయ్యా! నిద్ర వస్తుందా? పడుకోవచ్చుగాని… ముందు ఈ బిస్కట్లు తినండి” అందించాడు. ఈలోగా రమేష్ మూడు కప్పులతో టీ తీసుకువచ్చాడు.
టీ తాగి కుర్చీలోంచి పైకి లేచాడు. “నేను డ్యూటీకి వెళతాను. రేఫు ఉదయం మాట్లాడుదాము పడుకోండి” అనునయంగా భుజాలు తట్టాడు. అప్పటిదాకా ఆపుకున్న ఏడుపు ఈ ఆప్యాయతకి, ఆదరణకి తట్టుకోలేక పెల్లుబికింది.
“నా పిల్లలు లాంటివారురా మీరు! ఊరుకోండిరా!” అంటూ దగ్గరికి తీసుకున్నాడు. చెరొక భుజం మీద తలపెట్టి కరువు తీరా ఏడ్చారు.
రమేష్ ఈలోగా కుర్చీలు పక్కకి సర్ది చాపలు పరిచాడు. బ్యాగ్‍లు తెరిచి దుప్పట్లు తీసుకుని నిద్రకు ఉపక్రమించారు.
పి.పి.ఇ. కిట్లలో (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‍మెంట్) గంటల పాటు బందీలై, నీటికి… ఆహారానికి దూరమై… కరోనా పేషెంట్లకు సపర్యలు చేస్తున్న ఆ ఇద్దరు నగరంలోని ప్రముఖ వైద్య కళాశాలలో యం.బి.బి.యస్. నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.
అప్పటివరకు తమ వైద్యసేవలు అందుకున్న తోటి అపార్ట్‌మెంట్‌వాసుల చేతే బయటికి నెట్టివేయబడ్డారు.
“ఔను! వాళ్ళు రోడ్డున పడ్డారు. ఊహూ కాదు… కంటికి కనిపించని మానవాళి కర్కోటక శత్రువు కరోనా వారిని రోడ్డున పడేసింది”.