దిగులు

6
8

[dropcap]”ప[/dropcap]ని పాటా యిడసి పెట్టి ఆడ కూకొని ఏమి చేస్తా వుండావురా?” అంటా అన్న అడిగె.

“దిగులు పడaతా వుండానా” అంట్ని.

“ఏమి! ఇంగో కిత (సారి) చెప్పు”

“అదేనా దిగులు పడతా వుండా, సావంటే నాకి శానా దిగులునా” ఇంగా దిగులు పడతా అంట్ని.

“చేసే పని చెట్లకి చెప్పి, రావే ముండ రచ్చ తాకి పోదాము అన్నెంట వాడెవడో గుగ్గునాయాలు, అట్లుందిరా నీ కత”

“అదేమినా! అట్లనిస్తివి?”

“నీ మాటలకి ఇంగెట్లనాలరా? నువ్వు పుట్టి, పెరిగి, బాగా నక్కి నాకినబుడు, జనాలని ఏమారిచ్చి దుడ్డు కాసు సంపారిచ్చినబుడు, సోకులు చేసుకొని తిరిగినబుడు లేని దిగులు ఇబుడెట్ల వచ్చెరా?”

“అది బదుకు, ఇది సావు కదనా?”

“ఓ… అయితే నువ్వు సాయకుండా యీడే శిలయేసుకొని కూకొంటానంటావ్, దిగులు పడితే సావు నిన్ని చూసి దిగులు పడుతుందంటావ్?” అంటూ నా పక్క చూసే.

నేను ఏమీ మాట్లాడకుండా అన్ని పక్కలు చూస్తిని.

“రేయ్! నిన్ని ఒగ మాట అడగనారా?” అన్న అనె.

“దానికేం బాగ్యం” అంట్ని.

“మీ తాతలు, ముత్తాలు, వాళ్ల తాతలు, ముత్తాతలు నీ మాద్రిగానే సావుకి దిగులు పడి వాళ్ల పని వాళ్లు చేయకుండా వున్నింటే  నువ్వు ఇబుడు ఇట్ల బూమ్మీద పారాడేకి అయితా వున్నా చెప్పరా” అనె.

“లేదు” అని తల అడ్డం తిప్పితిని.

అబుడు అన్న తిరగా మాట్లాడేకి సురువు చేసే.

“రేయ్! ఈ అన్నంత ప్రకృతిలా నువ్వు, నేను అందరూ బాగమై పుట్టి, పెరిగి, యిరిగి పోవాల్సిందేరా. అబుడే కొత్తది వచ్చేకి అయితుంది, అది మానైనా, మనిషి యైనా. మనము ఈ బూలోకములో మనకి తెలీకుండానే పుడితిమి అట్లే చస్తాము కూడా, కానీ ఈ అనంత సృష్టి కార్యంలా మనం బాగం అయిండాము అనేది మాత్రం మనం మరికూడదు. దీనికి మనము సంతోషము పడాలే కాని సావు గురించి తెలుసుకొని దిగులు పడకూడదురా. చచ్చేగంటా కూడా మన పని మనం చేస్తాపోవాలరా” ఇలావరిగా చెప్పె అన్న.

అన్న మాటలకి నాలాని దిగులు ఎగిరి ఏటిలా పడే. నేను లేసి పని చేసేకని తోటలాకి పోతిని.

***

దిగులు = భయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here