మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-3

3
6

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

తెలుగు నవలా చరిత్రలో ‘కొవ్వలి యుగం’

జులై 1వ తేదీ, కొవ్వలి గారి జన్మదినోత్సవ వేడుకలు (2020 కరోన ఆంక్షల వల్ల) అంతర్జాల వేదికలో ఉద్వేగంగా మాట్లాడుతూ ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర – “తెలుగుని ప్రేమించే వారు కొవ్వలి వారిని తప్పక ప్రేమించి తీరాలి. సాహిత్య వినీలాకాశంలో ధృవనక్షత్రం ఎవరంటే నిస్సందేహంగా కొవ్వలి గారు. నిస్వార్థంగా ధనాపేక్ష లేకుండా అసంఖ్యాకంగా నవలలు రాసి చరిత్ర సృష్టించి, తెలుగు సాహిత్యానికి అనంతమైన, అద్భుతమైన సేవ చేశారు. నవల పైన పేరు లేకపోయినా నాలుగు పేజీలు చదవగానే అది కొవ్వలి గారి రచన అని తెలియజేస్తుంది ఆ ప్రత్యేకమైన శైలి. ఆ సంభాషణలు చదువుతుంటే ఆయన ఎదురుగా కూర్చొని చెప్తున్నట్టు ఉంటుంది. స్త్రీల అభ్యున్నతి కొరకు ఎక్కువగా రాసిన వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొవ్వలి ఒకరే అన్న విషయం గుర్తుంచుకోవాలి” అన్నారు.

(‘భయంకర్’ రాసిన నవల ‘జగజ్జాణ’ పది సార్లు చదివినా, భువనచంద్రగారు చెప్పేవరకు ‘భయంకర్’ కలం పేరుతో రాసింది కొవ్వలిగారు అన్న విషయం నాకు తెలియదు. స్త్రీల సమస్యల గురించి, వారి మనోభావాల గురించి, సహ అనుభూతితో రాసిన కొవ్వలి పేరు వింటే భావోద్వేగంతో, అనర్గళంగా మాట్లాడతారు భువనచంద్ర. ఆయన ఆ వివరాలన్నీ చెప్పిన తర్వాత కొవ్వలి గారి గురించి పరిశోధన ప్రారంభించాను. కనుక మొదట భువనచంద్ర గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.)

తమ జీవిత సమస్యల్ని చర్చిస్తున్న కొవ్వలి పుస్తకాల పట్ల స్త్రీలు విపరీతంగా ఆకర్షింపబడ్డారు. ఇంట్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా చాటుమాటుగా వాటిని చదవటం మానలేదు. సినీ ప్రపంచంలో ప్రముఖులైన కన్నాంబ, భానుమతి రామకృష్ణ, సూర్యకాంతం, జమున వంటి వారు కొవ్వలి కథ అల్లిక పట్ల, సంభాషణల సొగసు పట్ల, నాటకీయ రచన పట్ల అంతులేని మక్కువ పెంచుకున్నారు. ఆ మక్కువ తోనే తమ సొంత ప్రొడక్షన్‌లో మొదటి సినిమాకి కథ కొవ్వలి గారే రాయాలని కన్నాంబ గారు కబురు చేశారు. సినీ ప్రపంచంలోని రాజకీయాలు విన్న కొవ్వలి ఆ ఆహ్వానానికి అంతగా ఆసక్తి చూపలేదు. కడారు నాగభూషణం గారు తన మిత్రులు హనుమాన్ టాకీస్ అధినేత వీణం నాగేశ్వరరావు, సరస్వతి మూవీస్ మేనేజింగ్ డైరెక్టర్ పారుపల్లి శేషయ్య గారు ద్వారా, వెంట ఉండి తీసుకురమ్మని బలవంతపెట్టడంతో కొవ్వలి మద్రాసు బయలుదేరారు.

చిన్ననాడే తల్లిని కోల్పోయిన కొవ్వలి తన మనసులోని భావాల్ని చేర్చి కూర్చి 10 రోజుల్లో రాసిన “తల్లి ప్రేమ” కథ కన్నాంబ దంపతులకు ఎంతో నచ్చింది. జ్యోతిష్ చంద్ర సిన్హా దర్శకత్వంలో కన్నాంబ, సీఎస్ఆర్ ముఖ్య పాత్రధారులుగా “రాజరాజేశ్వరి పిక్చర్స్” బ్యానర్ మీద తీసిన “తల్లిప్రేమ” (1941) సినిమాకి సంభాషణలు కూడా చేకూర్చి, హీరో సి.ఎస్.ఆర్.కి స్నేహితునిగా చిన్న పాత్రలో కనిపించారు కొవ్వలి. ఆ రోజులలో సినిమా షూటింగ్ సమయంలో దర్శక నిర్మాతలు రచయితను కూడా ఉండమని అడిగేవారు. అలా ఆరు నెలలు మద్రాసులో ఉన్నారు. చిత్రం విజయవంతమైంది. (బహుశా ఈ చిత్రం ఎక్కడా దొరకట్లేదు అనుకుంటాను).

ఆ సినిమా “ఫిలిం బాలే (ట్)” అవార్డు పొందింది. ఈ సందర్భంగా సినీ జగత్తులో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. తల్లి ప్రేమ చిత్రంలో 12 ఏళ్ళ పిల్లవాడి పాత్ర కోసం వెతుకుతున్న నిర్మాతల దగ్గరకు ఒక అందమైన 16 ఏళ్ల యువకుడు వచ్చాడు. సున్నితంగా ఆకర్షణీయమైన ముఖ కవళికలతో ఉన్నాడు. కానీ పిల్లవాడి పాత్రకు కొంచెం వయసు ఎక్కువ అనిపించింది. స్ఫురద్రూపి అయిన అతన్ని వదులుకోలేక, మరో చిత్రంలోనైన అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో ఆరు నెలలు మద్రాసులోనే ఉంచేశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఆ 16 ఏళ్ల కుర్రాడు ఆ తర్వాత కాలంలో తెలుగు సినీ సామ్రాజ్యాన్ని నటసామ్రాట్‌గా ఏలిన అక్కినేని నాగేశ్వరరావు.

ఆ రోజుల్లో ప్రముఖ రచయితలు నెల జీతానికి సినిమాల్లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసేవారు. కొవ్వలి గారి కెందుకో అది నచ్చలేదు. తన స్వేచ్ఛా స్వాతంత్రాలు పోతాయేమోనని భావించారు. కన్నాంబ దంపతులు మరో సినిమా తీయాలని, మాటలు రాయమని అడిగితే సున్నితంగా తిరస్కరించి ఏలూరు వచ్చేసారు. 1942లో వారి వివాహం జరిగింది దామరాజు లక్ష్మీదేవి గారితో. హాయిగా తన భావాలకు అనుగుణంగా నవలలు రాసుకుంటూ ఉండిపోయారు.

‘కొవ్వలి బుక్ డిపో అండ్ సన్స్’ పేరున కొన్ని నవలలు ప్రచురించారు. ఇద్దరు పిల్లలు (ఒక మగ, ఒక ఆడ) పుట్టి చనిపోవటం, ప్రచురణ రంగంలో అన్ని లెక్కలు చూసుకుంటే కష్టాలే మిగలటంతో, స్నేహితుల పిలుపు మేరకు దాదాపు పదేళ్ల తర్వాత 1950లో మద్రాసు వచ్చేసారు కుటుంబ సమేతంగా.

రాజరాజేశ్వరి పిక్చర్స్‌లో కడారు నాగభూషణం వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన డి.ఎల్. నారాయణ తర్వాత పెద్ద నిర్మాతగా ఎదిగి ‘వినోదా పిక్చర్స్’ పేరున ప్రముఖ బెంగాలీ నవల ‘దేవదాసు’ని వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రితో సినిమా తీస్తున్నారు. కొవ్వలి గారిని చూడగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా “ఏదైనా కథ ఇవ్వండి. దేవదాసుని కొన్ని రోజులు ఆపి అయినా సినిమా తీస్తాను” అన్నారు. కొవ్వలి కథ పట్ల ఆయనకు అంత నమ్మకం. తయారుగా ఉన్న (హానెస్ట్ రోగ్) ‘మెత్తని దొంగ’ కథని ఇచ్చారు కొవ్వలి. దాన్నే నెల రోజుల్లో ‘శాంతి’ అనే సినిమాగా తీశారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే కొవ్వలి నిర్వహించారు. దేవదాసు చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక వర్గమంతా దీనికి పనిచేశారు. రామచంద్ర కాశ్యప హీరో. హీరోయిన్ సావిత్రి. గోవిందరాజుల సుబ్బారావు మరో ముఖ్య పాత్ర పోషించారు. జర్నలిస్ట్ వేషం వేసిన పేకేటి శివరాంకి ఇది మొదటి సినిమా. తల్లి ప్రేమ సినిమాలో చిన్న పాత్ర వేసిన కొవ్వలి ఈ చిత్రంలో కూడా జడ్జిగా చిన్న వేషం వేశారు. ధనవంతులు పేద వారిని ఎలా దోచుకుంటారో చెప్పే సామ్యవాద భావాలతో నిండిన సంభాషణలు ఉన్న ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. డి ఎల్. నారాయణ ఢిల్లీ వెళ్లి సెన్సార్ బోర్డు నుంచి అనుమతి తెచ్చు కున్నారు. ఇది కూడా విజయవంతమైన చిత్రమే. పారితోషికంగా వచ్చిన 1500 రూ.లతో (ఆ రోజుల్లో ఎక్కువ మొత్తం) పడమటి మాంబళంలో స్థలం కొనుక్కున్నారాయన. తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఇంట్లో ఆయన పెద్ద కుమారుడు కొవ్వలి నాగేశ్వర్రావు, భార్య గాయత్రి, ఇద్దరు మగ పిల్లలతో ఉంటున్నారు.

తర్వాత విక్రమ్ ప్రొడక్షన్స్‌లో బి.ఎస్.రంగా (కన్నడ వ్యక్తి. ఆయనకి మొదటి సినిమా) తీసిన ‘మా గోపి’ సినిమాకి కొవ్వలి కథ, మాటలు రాశారు. మాస్టర్ వెంకటేశ్వర్లు అనే బాలుడితో, చిన్న పిల్లవాడు ప్రధాన పాత్రగా తీసిన ఈ సినిమా బాగా విజయవంతమైంది. ఈ సినిమా కూడా ఎక్కడా దొరకటంలేదు. జెమిని టీవీ వారి వద్ద ఉన్నట్లు ఇటీవలి భోగట్టా.

1955లో హెచ్.ఎమ్. రెడ్డి గారి దర్శకత్వంలో(తెలుగులో తొలి టాకీ చిత్రం తీసిందీయనే) వచ్చిన రోహిణి వారి ‘బీదల ఆస్తి’ చిత్రానికి కథ మాటలు రాశారు కొవ్వలి. కాంతారావు హీరో. కానీ అది నిర్మాణంలోనే సగంలో ఆగిపోయింది.

‘ఆంధ్రపత్రిక’ వార పత్రికలో శివలెంక శంభుప్రసాద్ గారు కొవ్వలి గారి ‘సిపాయి కూతురు’ కథని సీరియల్‌గా 14 వారాలు వేశారు. ప్రతి బుధవారం ఆ సీరియల్ కోసం పాఠకులు ఉత్కంఠగా ఎదురు చూసేవారు. డి.యల్. నారాయణ ‘సిపాయి కూతురు’ కథని చందమామ బేనర్‌పై చెంగయ్య దర్శకత్వంలో అదే పేరుతో 1956లో సినిమాగా తీశారు. మాటలు, స్క్రీన్ ప్లే కొవ్వలి వ్రాశారు. ప్రధాన పాత్రధారిణి జమున ఆ సినిమా కోసమే గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. హీరోగా కైకాల సత్యనారాయణ వేశారు. ఇదే ఆయన మొదటి చిత్రం. యల్. విజయలక్ష్మికి నర్తకిగా ఇదే మొదటి సినిమా. సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. సిపాయి కూతురు నవలని నాలుగు సార్లు పునర్ముద్రించడం జరిగింది కూడా. నవల, సినిమా కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి.

రామాయణంలో లేకపోయినా వీధి నాటకంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ‘రామాంజనేయ యుద్ధం’ కథని సినిమాగా ‘నమ్మాళ్వార్’ దర్శకత్వం వహించారు. కొవ్వలి కథ, మాటలు రాస్తుండగా- ఆంజనేయుని పాత్రకి అనుకున్న జంధ్యాల గౌరీనాథశాస్త్రి కారణాంతరాల వల్ల మానుకున్నారు. మరో నటుని అనుకోగా అతను మరణించారు. సెంటిమెంట్లు అధికంగా ఉండే సినీ లోకంలో ఆ పాత్ర వేయడానికి ప్రముఖులు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడప్పుడే చిన్న వేషాలు వేస్తున్న రాజనాల కాళేశ్వరరావు కొవ్వలి గారిని కలిసి, తను ఆ వేషం వేస్తానని, నిర్విఘ్నంగా కొనసాగటానికి సలహాలు ఇమ్మని అడిగారు. వాయుపుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయుని పాత్ర వేయాలంటే శాకాహారం చేయాలని, బ్రహ్మచర్యం పాటించాలని చెప్పారు కొవ్వలి. అదే మాట పాటించారు రాజనాల. అయితే నిర్మాణంలో మరో ఆటంకం కలిగింది. అదే ముఖ్యమైన ‘డబ్బు’. ఫైనాన్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ ఎం.ఎస్.నాయక్ వద్దకు వెళ్లగా ఆయన ధన సహాయం చేశారు. వారి అమ్మాయి చంద్రకళ కూడా బేబీ ఆర్టిస్ట్‌గా యయాతి కూతురు వేషం వేసింది. సినిమా అత్యంత విజయవంతమైంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో రాజనాలే హనుమంతుడి వేషం వేయాలి – అన్నంత పేరు కూడా వచ్చింది ఆయనకి.

సిపాయి కూతురు తర్వాత ‘దక్షయజ్ఞం’ సినిమాకి మాటలు వ్రాశారు కొవ్వలి. దక్షప్రజాపతిగా ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు గారు వేస్తున్నారు. భారీ నటుడి కోసం మరింత భారీగా డైలాగ్స్ పెంచమని నిర్మాత అడిగారు. ఎస్.వి.రంగారావు గొప్ప నటుడే కావచ్చు కానీ దక్షుడి పాత్రకి అంతకంటే ఎక్కువ సంభాషణలు రాయటం సమంజసం కాదని నిరాకరించారు కొవ్వలి. నిర్మాత పట్టుదలకు పోయి అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న మరో రచయిత చేత సంభాషణలు పూర్తి చేయించారు. అందుకే టైటిల్స్‌లో కొవ్వలి పేరు ఉండదు.

తర్వాత 2, 3 చిత్రాలకి కథ మాటలు రాశారు కొవ్వలి. రాయటం అన్నది ఆయనకున్న ఆసక్తి. అంతేగాని కేవలం ధనార్జన ఆయన ధ్యేయం కాదు. అందుకే నిర్మాత ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. కొన్నిసార్లు అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలూ ఉన్నాయి.

(చిత్ర విచిత్ర సినిమారంగంలో కొవ్వలి ఇంకా ఏమేమి చిత్రాలకు కథలు రాశారు? ఇంకా ఎవరెవరికి life ఇచ్చారు, break ఇచ్చారు – అనే విశేషాలు వచ్చేవారం)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here