[box type=’note’ fontsize=’16’] ఇటీవల మృతి చెందిన ప్రముఖ రచయిత శ్రీ వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి ఈ వ్యాసం ద్వారా నివాళి అర్పిస్తున్నారు రజిత కొండసాని. [/box]
[dropcap]దీ[/dropcap]పావళి సంబరాలు ముగిసి కార్తీక లక్ష్మి అడుగుపెడుతున్న ఆనందంలో వున్న సాహితీలోకానికి ఈ వార్త ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒక కలం ఆగింది, కాలం క్షణ కాలం ఆగి గుండె దిటవు చేసుకుంది. అతను లేకపోయినా అతని అక్షరం ఎప్పటకీ వుంటుందన్న దైర్యంతో….
ప్రముఖ కవి,రచయిత, బాలసాహితీవేత్త అయిన వేంపల్లి రెడ్డి నాగరాజు గారి ఆకస్మిక మరణం (16/11/2020) సాహితీ లోకాన్ని శోకసంద్రంలో ముంచింది.
వేంపల్లి రెడ్డి నాగరాజు గారు కడపజిల్లా రాయచోటి సమీపంలోని సంబేపల్లెలో మిలటరీ ఆఫీసర్ అయిన కీ.శే శ్రీ వేంపల్లి కృష్ణమూర్తి రాజు, శ్రీమతి పద్మావతమ్మకు నాల్గవ సంతానంగా జన్మించారు.
వీరు ప్రాథమిక విద్యను సంబేపల్లె లోనే పూర్తి చేసారు. ప్రాథమికోన్నత విద్యను చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మొలకలచెరువులో పూర్తి చేసారు. మిగతా విద్యను దూరవిద్య ద్వారా అభ్యసించారు.
వేంపల్లి రెడ్డి నాగరాజు గారి భార్య వేంపల్లి నాగశైలజ. కుమార్తెలు వేంపల్లి రెడ్డి తేజశ్రీ, వేంపల్లి వైష్ణవి, కుమారుడు వేంపల్లి మహతీకృష్ణ వున్నారు. పెద్ద కుమార్తె వేంపల్లి రెడ్డి తేజశ్రీ వైద్య విద్యను అభ్యసిస్తూ 2017 జూలై 7న రోడ్డు ప్రమాదంలో మరణించారు.
వీరు మొదట ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేసారు. అనంతరం 29 సంవత్సరాల నుండి యల్.ఐ.సి.లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం యల్.ఐ.సి.లో పనిచేస్తూ నలబైతొమ్మిది సంవత్సరాల వయస్సులో కన్నుమూసారు.
వేంపల్లి రెడ్డి నాగరాజు గారు తన పద్దెన్నిమిదో యేటనే తన సాహితీ జీవితానికి పునాది వేసారు. వీరి కవితలు, కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అంతేకాక ఆకాశవాణిలో కూడా ఇతని రచనలు ప్రసారమయ్యాయి.
నేటి వచన కవిత్వంలోని అన్ని ప్రక్రియలలోనూ మంచి పట్టు వుంది. మినీ కవిత్వం రాయడంలో వీరు దిట్ట.
వీరు మట్టివాసన, ప్రవచనం అనే కవితాసంపుటాలు, బొమ్మా బొరుసు, నేను నాబాశాలి మాపిల్ల నాకొడుకు కథలు, నిచ్చెన మెట్లు, చివరి కోరిక, బహుమతి, పరిష్కారం కథా సంపుటాలను బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, బామ్మలు చెప్పని కమ్మని కథలు, గోరుముద్దలు, పాలబుగ్గలు పసిడి మొగ్గలు బాలల కథల సంపుటాలను బాలసాహిత్యంలో ప్రచురించారు.
రమణీయ కథలు, మా నాయన, కవన వీచికలు వంటి కవతా సంకలనాలకు ఇంకా అనేక కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.
ఈయన కథలపై కొన్ని యూనివర్సిటిలలో పి.హెచ్.డి పరిశోదనలు జరుగుతున్నవి. ఈయన రచించిన కథలు షార్ట్ ఫిలిమ్స్ గా రూపొందించబడి బహుళ జనాధరణ పొందుతున్నాయి.
కేవలం రూపాయికే ఒక్క కథ చొప్పున బాలల కథలను లక్షకు పైగా కాపీలను అందించి బాల సాహిత్యంలో విన్నూత ఒరవడిని సృష్టించారు.
కథలను భిన్న సామాజిక ఇతివృత్తాలతో క్లుప్తత, స్పష్టత ప్రధానాంశాలుగా పాఠకులు కేవలం ఒక్క నిముషంలోపే చదివేలా కొసమెరుపు కథల్ని రెండు వందలకు పైగా రాసి కథాసాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి స్వర్గీయ శ్రీమతి సుష్మాస్వరాజ్ గారి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
పలువురు సాహితీవేత్తల నుండి అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు. బాల సాహితీ మిత్ర, కథా సాహితీ సామ్రాట్ బిరుదులు పొందారు.
అంతేకాక తన కుమార్తె అయిన స్వర్గీయ డా వేంపల్లి రెడ్డి తేజశ్రీ పేరు మీద ప్రరతిష్ఠాత్మకంగా డా. వేంపల్లి రెడ్డి తేజశ్రీ జాతీయ సాహితీ పురస్కారం 2018లో స్థాపించి ప్రతి యేటా ఆ పురస్కారం మహిళలకు మాత్రమే అందిస్తున్నారు.
వేంపల్లి రెడ్డినాగరాజు అకస్మిక మరణం సాహితీ లోకానికి తీరని లోటు.
సహజమైన రాయలసీమ మాండలికంలో కొన్ని వేల చిన్న చిన్న కథలు(గల్ఫికలు) రాసిన ఘనత ఇతనిది. ప్రతి గల్పిక చివర ఒక ఝలక్ విసిరి అతి సునాయాసంగా సృజన చేయగల సమర్థుడు వేంపల్లి రెడ్డినాగరాజు గారు. అతని అకాల మరణానికి సంతాపం తెలుపుతూ…..
అక్షరానికి నివాళి…!