జీవన రమణీయం-135

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]రా[/dropcap]మానాయుడి గారి గురించి చెప్పాలంటే, ఒక గ్రంథమే రాయచ్చు. ఎవరొచ్చి వేషం అడిగినా, బోళా శంకరుడిలా ఆయన “రమణీ… మన స్క్రిప్ట్‌లో ఈయనకేమైనా చూడు! ఈ అమ్మాయికి చూడు…. మన కంపెనీ ఆర్టిస్టులూ” అనేవారు. అలాగే కొంచెం పేరున్న ఆర్టిస్టులు కూడా రెండు నిమిషాలు కనిపించే సీన్‍లో కూడా సురేశ్ ప్రొడక్షన్స్ అయితే చాలు, నటించేవారు. ఎప్పుడూ ఆయన మాతో చెప్పే మాట “ఒకరి పొట్ట మీద కొట్టకూడడు… కావాలంటే ఒకరి మీద కోపమొస్తే వీపు మీద కొట్టి, వెంటనే ఆ కోపం మర్చిపోవాలి” అనేవారు. ఆయన డ్రైవర్స్‌తో, ఆఫీస్ బోయ్స్‌తో కూడా చాలా దయగా వుండేవారు. అమ్మాయిలు కనిపిస్తే పరిహాసాలు ఆడ్తుండేవారు. నన్ను కూడా “కవి గారూ” అనీ; “మా సినిమాలో నటించచ్చుగా, ‘వెల్‌కమ్ ఒబామా’లో నటించారుగా” అనీ; అప్పుడప్పుడు వంట చేసుకురమ్మని నానక్‌రామ్‌గుడా నుండి వంకాయాలూ, గోంగూరా తీసుకొచ్చి డ్రైవర్‌తో “కార్‌లో పెట్టరా, మేడంకి” అనీ అనేవారు. వారంలో శుక్రవారం కానీ శనివారం కానీ ప్రివ్యూ థియేటర్‌లో అప్పుడే రిలీజ్ అయిన కొత్త సినిమా తెప్పించి షో వేయించేవారు. అప్పుడు నడుము నెప్పి వలన సాయంకాలానికి చార్జ్ అయిపోయి, నెప్పి స్టార్ట్ అయినా నేను వెళ్ళిపోతాను అనడానికి మొహమాటపడేదాన్ని! ఆయనకి అప్పుడు ఆయనతో పని చేస్తున్న డైరక్టరూ, రైటరూ పక్కన వుండాలి, అందులో నచ్చిన పాయింట్లు, నచ్చని పాయింట్లూ విడమర్చి చెప్తుండేవారు. ఆయన భార్య రాజేశ్వరి గారూ, కోడళ్ళు లక్ష్మిగారూ, నీరజగారూ కూడా వచ్చేవారు. ఎప్పుడైనా వెంకటేష్ బాబు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవారు! నన్ను చూస్తే చాలా అభిమానంగా “బావున్నారా రమణీగారూ!” అని వెంకటేష్ పలకరించేవారు. “మధుమాసం చాలా మంచి కథ. నాన్న ఆగి వుంటే నేను చేసి వుండేవాడిని” అని కూడా అన్నారు.

విక్టరీ వెంకటేష్‌తో

నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ‘నా జోలెలో పడే రొట్టెముక్క మీద నా పేరు రాసి పెట్టి వుంటుంది’! కె.ఎస్. రామారావు గారు నాతో “ఆ కామినేని ప్రసాద్ దగ్గర ఎడ్వాన్స్ తీసుకోకపోతే ‘మొగుడే రెండో ప్రియుడు’ అద్భుతమైన హిట్ అయివుందేది మీకు” అంటూ వుంటారు. ఇదే అంతే! మరి రకరకాల పదవులూ, అవార్డులూ నన్ను వరించాయి. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా, బెంగుళూరు ఇంటర్నేషనల్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా, సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, మా రైటర్స్ అసోసియేషన్ చైర్‌పర్సన్‌గా… ఇవన్నీ నేను అడిగానా? ఆ పరమాత్ముడు ఏ పైరవీలూ చెయ్యకుండానే పిలిచి ఇవ్వలేదా? చేసిన మూడో సినిమాకే ఉత్తమ కథా రచయిత్రిగా నంది అవార్డు రాలేదా? అలాగే చేతి దాకా వచ్చిన సినిమాలూ, అవకాశాలూ, తప్పిపోయినప్పుడు కూడా ‘నాకు ప్రాప్తం లేదు కాబోలు’ అనే ఒక్క మాటతో నేను మరిచిపోతాను. ఈ మధ్య ఒక వెబ్ ఛానెల్‍లో కూడా నా స్క్రిప్ట్‌ని వంక పెట్టిన వాళ్ళకి తెలుగు సరిగ్గా చదవడం, మాట్లాడ్డం కూడా రాదనే బాధతో వాళ్ళు తర్వాత మళ్ళీ వేరే పనులకి పిలిచినా వెళ్ళలేదు. కొన్నిసార్లు ‘ఈగో’ ప్రాబ్లెం లక్షలు పోగొట్టింది. మళ్ళీ అదే చెప్పుకుంటాను ‘నా డబ్బు కాదు… అందుకే పోయింది!’. డబ్బులు పోతే బాధ పడను… మాట అన్నారంటే చాలా బాధ పడ్తాను. కానీ కామెడీ కాలం రాసి, నన్ను బాధ పెట్టిన వాళ్ళ మీద, మరిచిపోతాను. ప్రథమ కోపం, ఈగో నాలో చెడ్డ గుణాలని మా అమ్మ అంటూ వుంటుంది. “ఎవరినీ తీసి పారేసి మాట్లాడకూడడు… తక్కువ చేయకూడదు!” అని ఇప్పటికీ నేను ఎవరి ఫోన్ అయినా తియ్యకపోతే నాకు బుద్ధి చెప్తూ వుంటుంది. గుడిలో కలిసారనీ, షిర్డీలో కలిసారనీ అందరికీ ఆవిడ నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తూ వుంటుంది!

ఈ మధ్యే మా మేనల్లుడు చాయ్ బిస్కట్ శరత్ తీస్తున్న సినిమాలో ఏక్ట్ చెయ్యడానికొచ్చిన ఒక ఆర్టిస్ట్‌కి నా నెంబర్ ఇచ్చింది. ఆవిడ నా పేరు ఫలానా అని చెప్పి వాట్సప్‌లో మెసేజ్ పెట్టి, “మీ నెంబర్ మీ అమ్మగారు ఇచ్చారు” అంది. “నైస్ టు నో” అన్నాను. ఆ తర్వాత ఆవిడ వరుసగా మెసేజెస్ పెట్టి, ఫొటోలు పంపుతూనే వుంది, అవకాశాల కోసం. ఎంతో బిజీగా వున్న నేను, అప్రయత్నంగా ఆవిడ్ని బ్లాక్ చేసాను. మరీ డిస్టర్బ్ చేస్తే ఇలా బ్లాక్ చెయ్యడం ‘అల్లు అరవింద్’ గారిని చూసి నేర్చుకున్నాను. “మన టైం విలువైనది… అవతలి వాడు ఏమనుకుంటాడూ అని ఆలోచించడం కన్నా మన మనశ్శాంతినీ, మన టైంనీ కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి” అని నాతో చెప్పారు. నేనూ అప్పటి నుండీ, నా వల్ల భరించడం కాకపొతే కొందర్ని, ముఖ్యంగా ‘జిడ్డు’ స్వభావం వున్న మగవారిని, అలా బ్లాక్ చేస్తూంటాను. మరునాడు ఆ ఆర్టిస్ట్ నాకు మెసేజ్‍లు…

“మీరు ఫేస్‍బుక్‌లో ఒక పేసూ, ఇక్కడొక ఫేసూ చూపిస్తున్నారు… ఇంత మీన్ మైండెడ్ అని లోకానికి చెప్తాను… మీ బతుకు బజారు పాలు చేస్తాను” టైప్‍లో మెసేజ్‍లు పెట్టింది. అక్కడా ఫిల్టర్ పెట్టాను. అప్పుడు కూడా అమ్మతో చెప్తే, “పాపం! ఎంత హర్ట్ అయి వుండి అందో” అంది.

రామానాయుడు గారు హీరో రోల్‌కి ‘నేనేం చిన్నపిల్లనా’లో ప్రిన్స్‌ని అనుకున్నారు మొదట! ప్రిన్స్‌ని ‘నీకూ నాకూ మధ్య డాష్’ అనే సినిమాకి ఆడిషన్స్ చేసేటప్పుడు నేనూ వున్నాను డైరక్టర్ తేజా గారితో. ఆ సినిమాకి నేను స్క్రిప్ట్ వర్క్ చేసాను. హీరోయిన్ కోసం, హీరో కోసం చాలా ఇంజనీరింగ్ కాలేజెస్‌కి వెళ్ళాం, మా చిన్నవాడు చదివిన శ్రీనిధీ ఇంజనీరింగ్ కాలేజ్‍తో సహా! హీరోయిన్ అందులో నందిత… ఈ అమ్మాయి కూడా మా ‘అందరి బంధువయా’ హీరోయిన్ పద్మప్రియ లాగే ఆర్మీ ఆఫీసర్ కూతురు కావడం వలన మా సైనిక్‌పురీ ఏరియాలోనే వుండేది. వాళ్ళమ్మతో నాకు ఆ కొద్ది కాలంలోనే మంచి స్నేహం అయింది.

రాహుల్ రవీంద్రన్‌తో

అప్పుడే నేను వెంకటేష్ కుడుముల అనే అబ్బాయిని తీసుకెళ్ళి, తేజాకి అప్పగించి, “మా అబ్బాయి లాంటి వాడు, మీ దగ్గర అసిస్టెంట్‍గా పెట్టుకుని, ఏదైనా వేషం కూడా ఇవ్వండి.. కామెడీ టైమింగ్ వుంది. నాతో పని చేసాడు” అని చెప్పాను. ఆ అబ్బాయి ఇప్పుడు ‘ఛలో’ సినిమాతో, నితిన్‍తో ‘భీష్మ’ సినిమాతో పెద్ద డైరక్టర్ అయ్యాడు. తేజా దగ్గర నుండి త్రివిక్రమ్ దగ్గరకి వెళ్ళాడు. ఏ ఇంటర్వ్యూలో అయినా మా అనిల్ రావిపూడి లాగే “బలభద్రపాత్రుని రమణీ మేడం మొదట నాలో రైటర్‍ని పసిగట్టి, తేజా సార్‌కి ఇంట్రడ్యూస్ చేసారు” అని చెప్తుంటాడు! నేను వెంకీ కుడుములని తేజా, బోయపాటి శ్రీనూ, వక్కంతం వంశీల దగ్గరకి తీసుకువెళ్ళాను. బోయపాటి శ్రీను “నా దగ్గర కొచ్చి మేడం పేరు చెప్పు. ‘రమణిగారు’ అను చాలు! నేను ఎంత బిజీగా వున్నా నీతో మాట్లాడ్తా” అన్నాడు. అలాగే వక్కంతం వంశీ నన్ను చాలా గౌరవిస్తాడు. తేజా అయితే అసిస్టెంట్ డైరక్టర్‍గా అంత సులభంగా పెట్టుకోని వాడు, నేను చెప్పగానే పెట్టుకున్నారు, మారు మాట్లాడకుండా. వెంకీ “మీ మాటంతే ఎంత వేల్యూ వుంది మేడం ఇండస్ట్రీలో” అని ఆశ్చర్యపోయాడు. అలా ప్రిన్స్ పరిచయం. నేనే సెన్సార్ కూడా చేసా ఆ సినిమాకి. మా సెన్సార్ ఆఫీసర్‍కీ నాతో పెద్ద గొడవ కూడా అయింది ఆ సినిమాకి నేను పేరు పడకుండా పని చేసానని తెలిసి! అలా చాలా సిట్టింగ్స్‌కి వెళ్ళేదాన్ని అప్పట్లో అంటే వినలేదు!

డైరక్టర్ వెంకీ కుడుములతో
శరత్ మరార్, అనిల్ రావిపూడితో
అడవి శేష్‌తో మా అన్నయ్య కుటుంబం

ప్రిన్స్‌కీ, నందితాకీ తేజా గారితో ‘బాండ్’ వుంది మూడు సినిమాలకి. అక్కడ నాయుడిగారితో రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో, ప్రిన్స్ ఏమీ చెయ్యలేని పరిస్థితి! ‘బస్ స్టాండ్’ హిట్ ఇచ్చి వున్నాడు అప్పుడే. అప్పుడు ‘రాహుల్ రవీంద్రన్’ పేరు సునీల్ కుమార్ రెడ్డిగారు సూచించారు. రాహుల్‍కీ నాకూ చాల అనుబంధం ఏర్పడింది మొదటి రోజు నుండే. 

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here