[box type=’note’ fontsize=’16’] “’నేనంటే నేనే’ అనుకోవడం ఆత్మగౌరవాన్ని, తృప్తిని కలిగించి, వ్యక్తిత్వానికి ప్రత్యేక వన్నె తెస్తుంది. కానీ ఇతరులు నాకంటే తక్కువ అనుకోవటం అహంభావం, మూర్ఖత్వమే” అంటున్నారు జె. శ్యామల. [/box]
సూర్యుడు శుభోదయం చెప్పిన వేళ.
ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ.. అని పాడకపోయినా ముంగిట్లో నాకు వచ్చిన, నచ్చిన పద్మం ముగ్గు వేస్తుండగా మార్నింగ్ వాక్‌కు వెళ్తూ ఓ పెద్దమనిషి.. అతడితోపాటే ‘నేనె రాధ నోయి గోపాలా.. అందమైన ఈ బృందావనిలో, నేనె రాధనోయి..‘ పాట.. క్షణాల్లో ఆయన, ఆ పాట కనుమరుగు, చెవిమరుగు అయినా, అందులోని ‘నేను’ పదంపై నా ఆలోచన చిక్కుకుంది. పిలవకుండా వచన కవిత వచ్చేసింది. అయితే ఊహతో కాదు వాస్తవంతో..
చీపురు పట్టేది నేను.. ముగ్గు పెట్టేది నేను..
కాఫీ పెట్టేది నేను.. దోశె వేసేది నేను
అంట్లు తోమేది నేను.. వంట చేసేది నేను
ఉద్యోగం, సద్యోగం అన్నీ చేసేది నేను
ఇంత చేసి నాకు దక్కే పేరు ‘వేణ్నీళ్లకు చన్నీళ్లు’
ప్చ్ ‘నేను’..
పోన్లే.. ఎవరు గుర్తించినా, గుర్తించకున్నా ‘నేను నేనే’…
‘నేను’ రెండక్షరాల పదమే అయినా ఉనికి పట్టుకు మూలం అదే. ‘నేను’ లో ఏముంది అనుకుంటే ‘నేను’ లోనే అంతా ఉంది.
ప్రేమలో పడ్డ వారిలో ‘నేను’ భావన ఎలా ఉంటుందనే దానికి ‘మంచి మనుషులు’ చిత్రంలోని ఆత్రేయ గీతం చక్కటి ఉదాహరణ..
నీవు లేక నేను లేను.. నేను లేక నీవు లేవు
నేనే నువ్వు, నువ్వే నేను.. నేను నువ్వు
నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు…
ఇలాంటిదే ‘కొడుకు కోడలు’ చిత్రానికి ఆత్రేయ రాసిన పాట..
నువ్వు నేను ఏకమైనాము
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము
లోకమంతా ఏకమైనా వేరు కాలేము.. వేరు కాలేము..
‘గంగోత్రి’ చిత్రానికి చంద్రబోస్ అందించిన సుమధుర యుగళగీతం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని, నేన్నిన్ను ప్రేమించానని తెలిశాక
నువ్విక్కడుండి, నేనక్కడుంటే.. ఎంతో కష్టం
‘లక్షాధికారి’ చిత్రానికి సినారె అందించిన అందమైన గీతం
మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది..
ఈ గీతం చివరి చరణంలో..
‘నేనులో ఏముంది, నీవులో ఏముంది
నేనులో నీవుంది, నీవులో నేనుంది’ అంటారు ఎంతో అర్ధవంతంగా.
నేననీ, నీవనీ లేనేలేవు, లేనేలేవు తెరలు, అడ్డుతెరలు’ అంటూ
మనసు లొకటైన జంట పాడుకోవడం పరిపాటి.
‘అహం బ్రహ్మస్మి’ అనే వాక్యం తరచు వింటుంటాం. ఇది సామవేదంలోని ‘ చాందోగ్యోపనిషత్తు’లోనిదట. ‘నేను బ్రహ్మ అగుగాక’ అని దీనర్థం. బ్రహ్మజ్ఞానం చేకూరాలని కోరుకోవటం. కానీ వాడుకలో ‘నేనే బహ్మ’ను అనే గర్వపూరిత భావనకు దీన్ని వాడటం పరిపాటి. అయితే ఇక్కడ బ్రహ్మ అంటే దైవాలైన త్రిమూర్తులలోని ‘బ్రహ్మ’ అని కాదని బ్రహ్మ అంటే ‘చైతన్యం’ అని కొందరు విజ్ఞులు చెపుతారు. ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడని నమ్మినపుడు ‘అహం బ్రహ్మ’ తప్పు కాదు. ‘దేవాలయం’ చిత్రంలో దీనికి సంబంధించి వేటూరి సుందరరామ్మూర్తిగారు అందించిన ఓ గొప్ప గీతం ఉంది అది..
దేహో దేవాలయో ప్రోక్తో.. జీవో దేవస్సనాతనః
దేహమేరా దేవాలయం.. జీవుడే సనాతన దైవం
నేనే బ్రహ్మ.. నేనే విష్ణువు..
నేనే శివుడై నిలబడితే..
ఏ అర్హత నాకుండాలీ?.. ఏ అధికారం కావాలి?
అహం బ్రహ్మాస్మి..అహం బ్రహ్మస్మి
దేహమేరా దేవాలయం..
కురుక్షేత్రానికి చేరుకున్న అర్జునుడు యుద్ధరంగంలో బంధు,హితులను చూసి, మనస్తాపం చెంది, తాను వారితో యుద్ధం చేయలేనని అస్త్రసన్యాసం చేయడంతో అప్పుడు శ్రీకృష్ణుడు లోకకల్యాణార్ధం అన్నీ చేయించేది తానేనని, అర్జునుడు నిమిత్తమాత్రుడేనంటూ గీతోపదేశం చేస్తాడు.
‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలోని గీతోపదేశం ఇలా…
తనువుతో కలుగు బాంధవ్యములెల్ల
తనువుతో నశియించి ధరణిలో గలయు
ఆత్మకు ఆదియు, అంతంబు లేదు..
అది గాలికెండదు, అంబుతో తెగదు,
నీట నానదు, అగ్నినీరై పోదు
కరుణా విషాదాలు కలిగించునట్టి
అహమును, మమకారమావలనెట్టి
మోహమ్ము వీడి ప్రబుద్ధుడవగుమా
ఒక్కడు చంపు, వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు
ఆ భ్రాంతి విడుము పురుషుల ఉత్తమ పురుషుండ నేనే
కనులకు దోచు జగమ్మును నేనే.. జగదాత్మయును నేనే..
జగము సృజించి, పోషించి, లయమును పొందింతు నేనే..
అంటూ అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు.
ఆధ్యాత్మిక పథంలో ‘నేను’ ఎంతో ప్రధానమైన అంశం. ‘నేనెవరు’ అనే ప్రశ్నతో కూడిన ఆలోచనతో, తమలోకి తామే అవలోకించుకుంటూ అన్వేషణకు ప్రయత్నించాలని భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆధ్యాత్మికాభిలాషులకు సందేశమిచ్చారు.
పోతనగారు భాగవత రచనకు సంకల్పించి, ఎంతో వినమ్రంగా,ఎంతో నిగర్వంగా ఇలా ప్రారంభించారు.
పలికెడిది భాగవతమట
పలికించెడు వాడు రామభద్రుండట
నే పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాధ పలుకగనేల..
నిమిత్త మాత్రతను మనసుకెక్కించుకున్న కవి భక్త పోతన.
పిల్లలను పెద్దయ్యాక ఏమవుతారని అడిగితే నేను డాక్టర్ నవుతా, నేను లాయర్ నవుతా, నేను టీచర్ నవుతా… ఇలా ఎన్నో చెపుతారు. అయితే పెద్దయ్యేకొద్దీ అభిరుచులు, ఆసక్తులు మారిపోవచ్చు. అది వేరు సంగతి.
ఇక పాఠశాలల్లో విద్యార్థులకు ‘నేనే ప్రధానినయితే’, ‘నేనే రాష్ట్రపతినయితే’, నేనే సైంటిస్టునయితే’ వంటి అంశాలను విద్యార్థుల వ్యాసరచన పోటీలకు ఇవ్వటం తెలిసిందే. వారు ఎన్నెన్నో గొప్పపనులు చేస్తామని రాయటమూ మామూలే. విద్యార్థుల్లో దేశానికి, సమాజానికి మేలుచేసే ఆలో చనలను పెంచటమే ఇటువంటి అంశాలను ఇవ్వటం వెనుకగల ఉద్దేశం.
కొన్ని సందర్భాల్లో ఇతరుల చేతలను తక్కువ చేసి చూపుతూ ‘ఓస్ ఇంతేనా, అదే నేనయితేనా’ అంటూ ఏదేదో విరగబొడిచే వారమని కోతలు కోస్తూ ఉంటారు కొందరు.
కొంతమంది లోక విరుద్ధంగా, వింతగా ప్రవర్తిస్తూ ఎవరైనా అదేమిటంటే, ‘నేనింతే’ అని తిరుగులేని బదులిస్తుంటారు. మహాకవి శ్రీశ్రీ ‘జయభేరి’ కవితలో..
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం
విశ్వ సృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.. అంటూ కడకు
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను.. అంటారు.
నాటికి, నేటికీ, ఏనాటికీ కూడా ప్రపంచాభ్యుదయానికి పాటుపడే స్ఫూర్తి కలిగించే అనంతావేశ చైతన్య పూరిత జ్వలిత గీతిక.
లోకం పట్ల, బతుకు పట్ల విరక్తితో ఉండి
నేను పుట్టాను, లోకం ఏడ్చింది.
నేను నవ్వాను, లోకం నవ్వింది..
నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్.. అనుకునే రమ్ముదాసులెందరో.
ప్రేమ ఫలించని దేవదాసులు
నేనొక ప్రేమ పిపాసిని.. నీవొక ఆశ్రమవాసిని
నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది.. అని పాడుకోవడమూ సహజమే.
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే..
ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం
జోరువానలోన ఉప్పునైతి నేను
హోరుగాలిలోన ఊకనైతి నేనే
గాలిమేడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే..
సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే..
కళ్లలోన నేను కట్టుకున్న కోట..
నేడు కూలిపోయే ఆశతీరు పూట ..
‘విచిత్ర సోదరులు’ చిత్రంలో మూడడుగుల మరుగుజ్జు ‘అప్పు’ పాత్ర తాను ప్రేమించిన రూపిణి, ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహానికి, సాక్షి సంతకానికి పిలవగానే, పాడుకునే భగ్నగీతమిది. మనసు బరువెక్కించే ఈ వేదనాగీతం రాజశ్రీ విరచితం.
పాఠశాలలలో జాతీయగీతం పాడించడంతో పాటు ప్రతిజ్ఞ కూడా చేయిస్తుంటారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు విరచిత భారత జాతీయ ప్రతిజ్ఞ ‘నేను’తో కూడిందే. ఆ ప్రతిజ్ఞ ఇలా..
భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషిచేస్తాను.. అంటూ కొనసాగుతుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులకు ఎన్నికైనవారు ప్రమాణస్వీకారంలో.. (వారి పేరు) అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. చెప్పటం జరుగుతుంది. ‘భరత్ అనే నేను’ పేరుతో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం అనుకునే వారు కోకొల్లలు. కొన్ని ఇళ్లల్లో అయితే ‘సర్వం నేనే’ అనే ఇంటి యజమాని ఆధిక్యతకింద నలిగిపోతుంటారు మిగిలిన కుటుంబ సభ్యులు. ‘నేను’ అంశంపై హిందీలో చాలా సినిమాలు వచ్చాయి. మై బాప్, మై ఆవారా హూ, మై ఐసా హి హూ, మై చుప్ రహూంగీ, మై దీవానా హూ, మై హారి, మై హూనా, మై, మేరా పత్ని ఔర్ ఓ, మై సుందర్ హూ, మై తేరా దుష్మన్, మై తేరా హీరో, మై జీనా సీఖ్ లియా, మై నే ప్యార్ కియా, మై నే ప్యార్ క్యోం కియా… ఇలా ఎన్నెన్నో..
ఈ ప్రపంచంలో ఎందరెందరో ‘నేను’లు.. ఆ ‘నేను’లకు ఎన్నెన్నో భావనలు.. ‘గుమ్‌నామ్’ చిత్రంలో ‘నేను నల్లగా ఉంటే ఏం, నేను మనసున్నవాణ్ని’ అని అర్థమిచ్చే పాట, ఇప్పటికీ అందరి పెదవులపై నర్తించే పాట.. అయితే ఇక్కడ శైలేంద్ర ‘నేను’కు ‘మేము’ అనే గౌరవవాచకం వాడారు. ఆ పాట ఇలా..
ఖయాలోం మె, ఖయాలోం మె, ఖయాలోం మె, ఖయాలోం మె
జై హంగామా కహా భాగ్ రహీ హై తుమె
క్యా హువా కాలే సే డర్‌గయ్ క్యా
హమ్ కాలే హైతో క్యా హువా దిల్ వాలే హై..
హమ్ తేరె తేరె తేరె చాహ్‌నె వాలే హై..
రఫీ గొంతులోని హుషారు శ్రోతలో సైతం హుషారు పెంచి గొంత కలిపేలా చేస్తుంది.
సూపర్ హిట్ పిక్చర్ ‘డాన్’ లో ఎంతో పాపులర్ అయిన పాట..
అరె దీవానో, ముఝె పెహచానో
కహాఁసె ఆయా మై హూ కౌన్.. మై హూ కౌన్.. మై హూ కౌన్
మై హూ మై హూ మై హూ కౌన్
డాన్ డాన్ డాన్ డాన్ డాన్
మై హూ డాన్, మై హూ డాన్
మై హూ, మై హూ, మై హూ డాన్..
ప్రతి ‘నేను’ సమాజ మంచి చెడులకు బాధ్యత వహించాలి. ఎందుకంటే ‘నేను’ సమాజంలో భాగం కాబట్టి. కానీ చాలా మంది మంచి మార్గానికి మళ్లీ విషయంలో ‘ఆఁ నేను ఒక్కడ్నీ మారితే సరిపోతుందా?’ అని తప్పించుకునే ధోరణిలో ఉంటుంటారు.
ప్రతి ‘నేను’ అలాగే భావిస్తే ఏ మార్పు అయినా ఎలా సాధ్యం? వీధుల్లో చెత్త అంశమే తీసుకుంటే ‘నేనొక్కడ్నేనా, అందరూ వేస్తున్నారు. అలాగే నేను. నా ఒక్కడికేనా నీతులు వర్తించేది’ అనే భావ ప్రకటనలు తరచు వినిపిస్తుంటాయి. మాట్లాడే విధానమే తీసుకుంటే ముందుగా ఫలాని మాటకు ‘నేను ఎలా ఫీలవుతాను’ అని యోచించుకోవాలి. ‘నేను ‘ఏరా’ అంటాను, నన్ను మాత్రం ‘మీరు’ అనా’లన్నట్లుగా ఉంటుంది కొందరి ధోరణి. ఆఫీసుల్లో అయితే ‘బాసిజం’ బాధలు అందరికీ అనుభవైకవేద్యమే. అసంబద్ధమైన పనైనా ‘నేను చెప్పాను, నువ్వు చేసి తీరాలి’ అనే ధోరణి. దాన్ని ‘అహం ‘బాస’ స్మి అనుకోవచ్చు. పముఖ అమెరికన్ కవి, వాల్ట్ విట్‌మన్ రాసిన ఓ కవిత..
సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్
ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ అండ్ సింగ్ మై సెల్ఫ్
అండ్ వాట్ ఐ ఎజ్యూమ్ యు షల్ ఎజ్యూమ్
ఫర్ ఎవ్విరి ఆటమ్ బిలాంగింగ్ టు మి
యాజ్ గుడ్ బిలాంగ్స్ టు యు
ఐ లోఫ్ అండ్ ఇన్‌వైట్ మై సోల్
ఐ లీన్ అండ్ లోఫ్ ఎట్ మై ఈజ్
అబ్జర్వింగ్ ఎ స్పియర్ ఆఫ్ సమ్మర్ గ్రాస్..
క్రీడ్స్ అండ్ స్కూల్స్ ఇన్ అబెయన్స్
రిటైరింగ్ బ్యాక్ ఎ వైల్ సఫైస్డ్ ఎట్ వాట్ దే ఆర్,
బట్ నెవర్ ఫర్‌గాటెన్
ఐ హార్బర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్,
ఐ పర్మిట్ టు స్పీక్ ఎట్ ఎవ్విరి హజార్డ్,
నేచర్ వితౌట్ చెక్ విత్ ఒరిజనల్ ఎనర్జీ!.. అంటారు.
రచనల్లో ‘నేను’ అంటూ రచయిత తన పరంగా కథను చెప్పటం ఓ పద్ధతి. అది ఎంతో పాపులర్ కూడా. దాన్నే ఉత్తమ పురుషలో నడిచిన కథ అంటారు.
‘నేను, నాది’ అనే భావనే మంచిది కాదనే అతివాదులు కొందరు. కానీ అసలు ‘నేను, నాది’ అనే భావనే ఏ కార్యసాధనకైనా ఆసక్తి పెంచేది. ‘నేను’ నేనుగా ఉండాలని చాలామంది ఫీలవుతుంటారు. అది ఆత్మగౌరవ భావన. అంటే తమ ప్రత్యేకతను నిలుపుకోవాలనే అభీష్టం. ‘నేను ఎవరికీ తీసిపోను, నేను ఎవరికంటే తక్కువకాదు’ భావనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అయితే ఆ భావనలు హద్దులు దాటిపోతే స్వార్థంగా పరిణమిస్తాయి. విజయాలు సొంతమయ్యాక, జీవితంలో పై స్థాయికి వెళ్లాక చాలామంది నేను అందరికంటే ఎక్కువ, నాది పైస్థాయి’ అనుకుంటూ అతిశయాన్ని, గర్వాన్ని పెంచుకుంటారు. వారు ఇతరుల ప్రతిభను గుర్తించడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఆ గర్వంతో స్నేహాలు, బంధుత్వాలు కూడా దూరమవుతుంటాయి. ‘నేను’ భావన వ్యక్తిగత ఉన్నతికి, సమాజ ఉన్నతికి కూడా తోడ్పడేదిగా ఉండాలి. నేనే ఎక్కువ, నాదే పై చేయి, నాకు సాటి ఎవరూ లేరు, నేనే నంబర్ వన్’ వంటి భావనలు వెంటనే ప్రతికూల ఫలితాలకు దారితీయక పోయినా, ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బ తగిలేలా చేస్తాయి. ‘నేనంటే నేనే’ అనుకోవడం ఆత్మగౌరవాన్ని, తృప్తిని కలిగించి, వ్యక్తిత్వానికి ప్రత్యేక వన్నె తెస్తుంది. కానీ ఇతరులు నాకంటే తక్కువ అనుకోవటం అహంభావం, మూర్ఖత్వమే. ఈ మధ్య తరచు వినిపించే విలువైన మాట ‘అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి’. అందరి బాగును కోరుకుంటూ తన బాగును కోరుకోవటం ఉన్నతమైన తలంపు కదా.. ఇలా ఆలోచిస్తూంటే ఫోన్ మోగటంతో ‘నేను’ మనసులో తెరమరుగైంది. చూస్తే తెలియని నంబర్. గొంతు మాత్రం ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా..
ఎవరూ అనడిగితే.. ‘నే నెవరో చెప్పుకో’!