కొడిగట్టిన దీపాలు-19

0
3

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం. [/box]

37

[dropcap]వి[/dropcap]శాలగుప్తా కూడా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. అతను అప్పుడప్పుడు మాధవరావు గురించి ఆలోచిస్తాడు. ఛిన్నాభిన్నం అయిపోయిన అతని కుటుంబం గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడు. అతను ఎంత మంచివాడు? అతను మామూలు అర్హతలు, మామూలు సామర్థ్యాలు కలిగిన వాడయినప్పటికీ అతను ఎప్పుడూ తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నిరాశను దరికి రానియ్యలేదు. ఆత్మవిశ్వాసంతో నిరంతర కృషితో అడుగడుగునా ముందుకే అడుగువేసాడు.

మాధవరావు లాంటి వారు వ్యతిరేక పరిస్థితులలో సైతం తన లక్ష్యం నుండి చలించలేదు. అలాంటి మాధవరావు పరిస్థితి ఏఁటయింది? విధి చేతిలో చిత్తుగా ఓడిపోయి, ఈ లోకం నుండే దూరమయ్యాడు.

తమిద్దరి మద్యా ఏ రక్త సంబంధం లేదు. అయినా ఎంత ఆప్యాయత చూపిస్తూ తనని తోబుట్టువులా చూసుకునేవాడు. తను మాధవరావును ‘అన్నాయ్!’ అని పిలిచాడు. అతను కూడా తనని తమ్ముడులా భావించాడు.

అతను తనని నమ్మాడు. తను అతని నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తనకి తోచినంత సహకారం ఆ కుటుంబానికి అందచేశాడు. అవసరమయితే ఆర్థికంగా కూడా సహాయపడ్డాడు.

మాధవరావు మాత్రం తన సహాయానికి విలువ కట్టాడు. అది తనకి చాలా బాధ కలిగించింది. తను ఇచ్చిన డబ్బుకి ఇల్లు తన పేర రిజిష్టరు చేయించాడు. తను వద్దని వారించినా వినలేదు. అతని మాట కాదనలేక తను అంగీకరించాడు కాని ఎప్పటికీ ఆ ఇల్లు, ఖాళీ స్థలం అంతా వాళ్ళదే. తనున్న ఇల్లు తనకున్న ఆస్తిపాస్తులు తనకి చాలు, తనకి ఎలాగూ పిల్లా పాపా లేరు.

ఎవ్పటికేనా తన పేరున వ్రాయించిన ఇల్లు వాళ్ళకే ఇచ్చేయాలనుకున్నాడు. ఆ స్థిరాస్తి వాళ్ళకి సంబంధించింది. ఎప్పటికైనా వాళ్ళదే అని భావించాడు. ఎప్పుడయినా రాజశేఖరానికి ఇచ్చేయ్యాలి అనుకున్నాడు. అయితే దురదృష్టం రాజశేఖరం ఎక్కడున్నాడో? ఎమయ్యాడో తెలియకుండా పోయింది.

‘ఇప్పుడు ఆ కుటుంబ ఆస్తి ఆ కుటుంబ వ్యక్తులకే చెందాలి. ఆ కుటుంబంలో మనుష్యులు కళ్యాణి, శారదా ఉన్నారు. శారదకి ఎలాగూ పెళ్ళయిపోయింది కాబట్టి కళ్యాణికి చెందాలి. ఆ కుటుంబానికి శ్రేయోభిలాషి, రాజశేఖరానికి అత్యంత సన్నిహితమైన ఇష్టమైన మనిషి సుజాతకి ఈ విషయం చెప్పాలి’ విశాలగుప్త ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి.

తన ఆలోచన్లని కార్య రూపంలో పెట్టాడు. మనిషి పుట్టింది. తన చుట్టూ గిరిగీసుకుని కూర్చోడానికి కాదు, పరమార్థం కోసం. తను ఆనందపడి ఎదుటివానికి ఆనందం కలగచేయాలి. ప్రపంచంలో ఎదుటి వాళ్ళు ఆనందపడితే ఆ ఆనందం తన ఆనందం అని భావించాలి. వాళ్ళ దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం తన దుఃఖం అనుకునే స్వభావం గలవాడు విశాలగుప్త.

విశాలగుప్తా నోటి వెంబడి అతని కోరిక విన్న సుజాత మొదట విస్మితురాలయింది. ఆ తరువాత అతని ఉదారతకి జోహార్లు అర్పించింది. ఇంత మంచి మనుష్యులు ఇంకా ఈ కాలంలో కూడా ఉన్నారా? అని అనిపించింది.

రాజశేఖరం కుటుంబంతో విశాలగుప్తాకున్న అనుబంధం రాజశేఖరం ద్వారా వింది సుజాత. అందుకే అతని మాటలకి ఆశ్చర్యపోలేదు సుజాత.

“నా ఉద్దేశం మంచిదే. మీలాంటి మనుష్యులు ఇప్పుడు అరుదుగా ఉంటారు.”

“దీంట్లో నా గొప్పతనం ఏఁటి అమ్మాయి? ఆ ఇల్లు ఆ ఖాళీ స్థలం నా కష్టార్జితం కాదు. అది రాజశేఖరం తండ్రి ఆస్తి. అందుచేత ఆ ఆస్తి ఆ కుటుంబానికి చెందడం న్యాయం. నాకు ఎలాగూ పిల్లలు లేరు. నా ఇల్లు, ఆస్తిపాస్తులు కూడా నీవు నడుపుతున్న ఆశ్రమానికే వ్రాయాలని నా ఉద్దేశం సుజాతమ్మా!” విశాలగుప్త అన్నాడు.

సుజాత విశాలగుప్తా వేపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.

“ఒక మాట చెప్పనా?”

“చెప్పమ్మా!”

“మీరు ఎలాగూ పెద్దవాళ్ళు అయిపోయారు. మీ దంపతులిద్దరూ వచ్చి మా ఆశ్రమంలో ఉండకూడదూ!”

“అంత మాట అన్నావు. అదే చాలు. అదే పదివేలు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక్క విషయం మా శరీరంలో శక్తి ఓపిక ఉన్నన్నాళ్ళూ ఉంటాం. ఆ తరువాత మీ ఆశ్రమానికి తప్పకుండా వస్తాం,” విశాలగుప్తా అన్నాడు.

సుజాత విశాలగుప్తాకి కళ్యాణి వ్రాసిన ఉత్తరంలోని విశేషాలు చెప్పింది. ‘కళ్యాణి’ తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకునే స్థాయికి ఎదిగిందా అని ఆశ్చర్యపోయాడు. ‘డాక్టరు కోర్సు చదివిందా?’

“ఇదంతా నీ చలవేనమ్మా!” అతను సుజాతతో అన్నాడు.

“నా చలవ ఏఁటి? ఇదంతా కళ్యాణి కృషి, పట్టుదల” అంది సుజాత.

“ఒక్క విషయం. మీరు ఎలాగూ రాజశేఖరం గారి ఇల్లు ఆ కుటుంబానికే అప్పగించాలనుకుంటున్నారు కదా?”

“అవును.”

“కళ్యాణి డాక్టరు కోర్సు పూర్తి చేసింది. రాజేష్ కూడా కోర్సు పూర్తి చేశాడు. ఇద్దరికీ పెళ్ళయిన తరువాత మీ గ్రామంలో ఆ ఇంట్లో ఉంటారు. ఆ కుటుంబ సభ్యులకే ఆ ఇల్లు లభించినట్లవుతుంది. ఆ ఖాళీ స్థలంలో నర్సింగ్ హోమ్ కట్టుకుంటారు,” సుజాత అంది.

“నీది మంచి ఆలోచనమ్మాయ్! వాళ్ళకి ఇష్టం అయితే అలాగే చేద్దాం.”

“రేపు కళ్యాణి, రాజేష్ వస్తున్నారు రేపు. వాళ్ళని రిసీవ్ చేసుకోడానికి స్టేషనుకి వెళ్ళాలి. మీకు వీలయితే ఉండండి. కళ్యాణిని చూసి వెళ్తురుగాని,” సుజాత అంది.

“లేదు. ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కరే ఉంది. మరో పర్యాయం మేము ఇద్దరం కలిసి వస్తాం. లేకపోతే నీవే వాళ్ళిద్దర్నీ తీసుకుంది మా ఇంటికి వద్దువు గానివి,” వెళ్ళడానికి లేస్తూ అన్నాడు విశాలగుప్తా.

***

రైల్వే స్టేషను చాలా కోలాహలంగా ఉంది. ఇసక వేసినా రాలనంత ఇరుకుగా ఉంది ప్లాటుఫారం జనాలతో. ఎక్కడ చూసినా జనాలే. ప్లాటుఫారం అమ్మకందార్ల కేకల్తో, పిల్లల అరుపులు – కేకల్తో మహా సందడిగా ఉంది.

బండి కొద్ది క్షణాల్లో వస్తుందని ఎనౌన్సుమెంటు వినిపించింది. సుజాతలో ఆత్రుత కుతూహలం కూడా. ఎంత తొందరగా కళ్యాణిని చూద్దామన్న అత్రుత. ‘కళ్యాణి ఇప్పుడు అలాగే ఉందా? లేకపోతే ఒళ్ళు చేసిందా?’ అని కుతూహలం. బండి కోసం నిరీక్షణ చేస్తోంది. ఆ నిరీక్షణ చంద్రుని రాక కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షిలా, స్వాతి వాన కోసం ఎదురు చూస్తున్న ముత్యపు చిప్పలా, నీటి బిందువు కోసం మేఘుడు వేపు ఆశగా ఎదురు చూస్తున్న చాతక పక్షిలా ఉంది.

దడదడ శబ్దం చేస్తూ రైలు వచ్చి ప్లాటు ఫారం మీద అగింది. రిజర్వేషను కంపార్టుమెంటు వేపు వడివడిగా అడుగు వేసింది సుజాత కళ్యాణి – రాజేష్‌ని రిసీవ్ చేసుకోడానికి.

“వదినా!”

పరిచత కంఠం విని వెనక్కి తిరిగి చూసింది సుజాత. ఎదురుగా కళ్యాణి. ఆమె వేపే తదేకంగా చూస్తోంది సుజాత. కళ్యాణి ముఖం సంతోషంతో కళకళలాడుతోంది. కొంచెం ఒళ్ళు చేసింది. బొద్దుగా ఉంది. మిసమిసలాడున్న కళ్యాణి కేసి చేయి జాచింది. సుజాత చేతుల్లో ఇమిడిపోయింది కళ్యాణి. ఓ తల్లి తన కూతుర్ని ఆప్యాయతగా హృదయానికి హత్తుకుని తన మాతృప్రేమను పంచి ఇస్తున్నట్లు సుజాత కళ్యాణి తలని గుండెల్లో దాచుకుంది. ఆ సమయంలో వారు పరిసరాలను కూడా పట్టించుకోలేదు. మాతృప్రేమను చవి చూస్తున్నట్లు తన్మయత్వంగా అలా కళ్ళు మూసుకుంది కళ్యాణి సుజాత పరిష్వంగంలో.

“కళ్యాణీ! చాలా అన్యాయం. నీవు నీ ధ్యాసలోనే ఉన్నావు కాని మీ వదిన్ని నాకు పరిచయం చేయలేదు” రాజేష్ అన్నాడు. ఆడవాళ్ళిద్దరూ ఉలిక్కిపడి వేరయ్యారు. శబ్దం వచ్చిన వేపు చూసింది సుజాత. వారి ఎదురుగా వినయం ఉట్టిపడ్తూ మంచి మనస్సుతో స్ఫురద్రూపి అయిన యువకుడు నిలబడియున్నాడు. చురుకైన చూపులు అతనివి. ఆ కళ్ళల్లో విజ్ఞానం, వివేకం పోటీ పడ్తున్నట్లు వెలిగిపోతున్న రాజేష్ వదనాన్ని తేరిపారా చూసిన సుజాత తన మనస్సులో ‘కళ్యాణి నీది బెస్ట్ సెలక్షన్,’ అని అనుకుంది.

“వదినా…! ఈయన…!”

కళ్యాణి మాటలు పూర్తి చేయకుండానే “తెలుసు ఇతనే రాజేష్ కదూ!” నవ్వుతూ అంది సుజాత. కళ్యాణి కూడా నవ్వేసింది.

రాజేష్‌కి సుజాతను పరిచయం చేయబోయింది కళ్యాణి. “తెలుసు ఈవిడే మీ వదిన సుజాత కదూ!” పకపక నవ్వుతూ అన్నాడు రాజేష్. “చాలా తెలివైన వాడివే!” సుజాత కూడా నవ్వుతూ అంది.

“మీ గురించి కళ్యాణి నాకంతా చెప్పింది.”

“ఏఁటి చెప్పిందేంటి?” వస్తున్న నవ్వును బలవంతాన్న ఆపుకుంటూ అంది సుజాత.

“నేను విన్నదాన్ని బట్టి మీలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మనుష్యులు అరుదుగా ఉంటారు. అంతే కాకుండా మీ పవిత్రమైన ప్రేమ గురించి కూడా విన్నాను. అంత ఉదాత్తమైన – పవిత్రమైన ప్రేమ రాజశేఖరానిది – మీది. మీది అలాంటి ఆదర్శమైన ప్రేమ. అందుకే ఇప్పటి వరకూ మిమ్మల్ని మీ ప్రేమని ఆదర్శంగా చెప్పుకుంటున్నారు అందరూ. మీ ఇద్దరి పవిత్ర ప్రేమకి మా ధన్యవాదాలు,” సుజాతను ప్రశంసలు జల్లులో ముంచెత్తుతూ అన్నాడు రాజేష్

“సర్! మా వదినకి పొగడ్తలంటే గిట్టవు. ఆపండి ప్లీజ్,” ఇబ్బందిగా ముఖం పెట్టి అంది కళ్యాణి.

“నిజం కళ్యాణి! నేను మీ వదిన్ని పొగడ్డం కాదు. ఆవిడలో ఉన్న మంచి గుణాల్ని పొగుడుతున్నాను” చిన్నగా నవ్వుతూ అన్నాడు రాజేష్,

నిర్వికారంగా ఎటో చూస్తూ ఉండిపోయింది సుజాత. తమ మాటలు ఆమెలో మరుగుపడిన పాత జ్ఞాపకాల్ని కెలికినట్టుందని గ్రహించారు కళ్యాణి, రాజేష్,

“చూశారా రాజేష్ – అన్నయ్య ప్రస్తావన వల్ల ఆ జ్ఞాపకాలు ఆమెను ఎంత కలవరపాటుకి మనస్తాపానికి గురి చేస్తున్నాయో?” రాజేష్ చెవిలో గుసగుసలాడుతూ మెత్తగా మందలించినట్లు అంది కళ్యాణి.

తను జాగ్రత్తగా మాట్లాడవల్సివుంటే బాగుండేదేమో. తన మాటలు ఆమెకి బాధను కలిగించాయి అని అనుకున్న రాజేష్ నొచ్చుకున్నాడు.

“సారీ! సుజాతగారూ! పొరపాటువశాన్న మీకు బాధ కలిగించే పాత జ్ఞాపకాల ప్రస్తావన తెచ్చినందుకు క్షమించండి,” రాజేష్ నొచ్చుకుంటూ అన్నాడు.

“అయ్యెయ్యో! అలాంటిదేం లేదు. నేనేఁ బాధపడటం లేదు. బాధపడ్డం నాకు క్రొత్తేం కాదు. బాధపడ్డం నా జీవితంలో ఓ భాగమయి పోయింది. పదండి జనాలందరూ మనల్నే చూస్తున్నారు. ఇలా ప్లాటుఫారం మీదే అన్ని విషయాలు మాట్లాడేసుకుంటున్నాం,” అంటూ ముందుకు దారి తీసింది సుజాత. ఆమెను అనుసరించారు కళ్యాణి, రాజేషు.

38

అది సాయంకాల సమయం. దినమంతా తన ప్రతాపాన్ని చూపించిన దినకరుడు పడమట దిక్కు వేపు ప్రయాణం సాగిస్తున్నాడు. సూర్యుని అస్తమయ కిరణాలు వసుందర వేపు దూసుకొస్తున్నాయి. పచ్చని ఆ కిరణాలు భూమి మీద ప్రసరింపబడి ప్రకృతికి వింత సౌందర్యాన్ని ప్రసాదిస్తున్నాయి.

అటువంటి సంధ్యా సమయాన్న సుజాత ఆశ్రమంలో ఉన్న ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరి కష్టాలు జీవితంలో వారు అనుభవించిన వేదనలు వింటోంది. వారిని ఓదారుస్తోంది. వారికి ధైర్యం చెప్తోంది.

అందరిదీ ఒకటే కథ. అందరిదీ ఒకే జీవితం. కన్నవారి చేత నిరాదరణకి గురయిన వాళ్ళే. మరికొంత మంది ఆడవాళ్ళు జీవితంలో మోసపోయి బాట తప్పిన బ్రతుకులుగా మిగిలిపోయినవారు.

అలా కన్నవాళ్ళ నిరాదరణకి గురయిన వాళ్ళని. బాట తప్పిన బ్రతుకుల్ని ఒక దగ్గరికి చేర్చి వారికి తన ఆశ్రమంలో స్థానం కల్పించి వారి జీవితాలకి అసరాగా నిలబడింది సుజాత. ఆమె వదనంలో ఎటువంటి భావాలూ లేకుండా నిర్మలంగా ఉంది.

ఆశ్రమంలో ఉండే పూల మొక్కలకి ఆమె గొప్పులు త్రవ్వుతూ ఉంటే ఆశ్రమవాసులు కొందరు నీరు తెచ్చి ఆ పూల మొక్కలకి పోస్తున్నారు.

“లెండమ్మా! మీరు చేయడమేంటి ఈ పన్లు. మేమంతా లేమా? మీరు అలా కూర్చోండి. చెప్పి మీరు మా చేత పని చేయించాలే కాని ఇలా మీరు ఈ పని చేయడం మాకిష్టం లేదమ్మా!” ఓ ఆశ్రమ స్త్రీ అంది. “అవునవును,” మిగతా కంఠాలన్నీ ఒకే మారు పలికాయి.

“ఈ ఆశ్రమంలో అందరం సమానమే. దయ చేసి ఎవరూ భేదభావాలు పెట్టకండి. మనలో ఏ ఒక్కరూ ఎక్కువా కాదు, తక్కువా కాదు. మరో పర్యాయం చెపుతున్నాను అందరూ సమానమే. ఈ సమతావాద సిద్ధాంతం పాటించడమే నేను ఇష్టపడతాను,” సుజాత అంది.

అలాంటి సమయంలో నీరెండలో కూర్చుని ఆ దృశ్యాన్ని చూస్తున్న కళ్యాణికి సుజాతలో ఉన్న ఈ సమతావాద సిద్ధాంతం నచ్చింది. వదిన ఎంతో మంచిది. ఎంతమందిలో ఉంటుంది. ఇలాంటి సమతావాద భావన. వదినది కపటం, కల్మషం లేని తెల్లని మల్లెపూవులాంటి నిర్మలమైన మనస్సు, ఆమెకి ఆమే సాటి. ఆమెకి సాటిరాగలిగే వారు ఉన్నారా అని అనిపిస్తోంది.

తనకి తెలియదు కాని వదిన స్వాతంత్ర్య పోరాట సమయంలో తన రచనలో విప్లవ శంఖాన్ని పూరించి అందర్నీ చైతన్యవంతుల్ని చేసేదిట. అలాంటి విప్లవాన్ని తీసుకువచ్చే విప్లవకారిణి. స్వార్థరహితమైన పవిత్ర భావాలు కలిగిన ఈమె ప్రేమను పొందిన అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టాన్ని అందుకోకుండానే అతడ్ని దురదృష్టం వెంటాడుతూ వచ్చింది.

ఈ విషయాలేవీ తనకి తెలియవు. ఆ శేషు చెప్పే వరకూ. శేషు గుర్తుకు రాగానే ఆనాటి సంఘటనలు ఒకొక్కక్కటి జ్ఞప్తికి రాసాగాయి.

రాజేష్ స్నేహితుడు శ్రీధర్. అతను కూడా ఈ మధ్యనే ప్రాక్టీసు పెట్టి ఇప్పుడిప్పుడే పైకి వస్తూ మంచి పేరు సంపాదిస్తున్న మంచి డాక్టరు. రాజేష్ తనూ తమకి తీరిక దొరికినప్పుడల్లా అతని నర్సింగ్ హోమ్‌కి వెళ్ళి శ్రీధర్‌కి సహాయపడేవారు. దీనిలో తమ స్వార్థం ఉంది. శ్రీధర్ స్వార్థం కూడా ఉంది. మాకు ఇలా శ్రీధర్ నర్సింగ్ హోమ్‌లో రోగులకి ట్రీట్మెంట్ ఇస్తూ అతనికి సహాయపడుతూ ఉంటే మాకూ ప్రాక్టీసు అవుతుంది. వర్కు నేర్చుకొని అనుభవం గడించచ్చు అనేది మా భావన. తనకి సహాయపడుతూ తన భారం కొంత తగ్గిస్తున్నారు అని శ్రీధర్ అనుకునేవాడు. అయినా శ్రీధర్ మా చేత ఊరకే పని చేయించుకోలేదు. మాకు వద్దు వద్దంటూన్నా డబ్బు ఇచ్చేవాడు.

ఓ రోజు రాజేష్ తనూ నర్సింగ్ హోమ్‌కి వెళ్ళారు. రాజేష్ తన గురించి ఇక్కడ కొద్దిగా చెప్పుకోవాలి. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సమయంలో తామిద్దరికీ పరిచయమయిన పరిచయం స్నేహంగా, ఆ స్నేహం అలా అలా ఆరాధనగా, ప్రేమగా మారి ఒకరికి మరొకరు చేరువయ్యారు. ఈ చేరువయ్యారు అని అంటే శారీరకంగా కాదు. మానసికంగా వదిన పెంపకంలో పెరిగిన తను ఇటువంటి లైంగికానందాల కోసం అర్రులు జాచే చంచల స్వభావురాలు మాత్రం కాదు. పెద్దల అనుమతి తీసుకుని జీవితాంతం దాంపత్య జీవితం అనే సూత్రంలో బందీలవుదామని కూడా దైవ సన్నిధిలో తామిద్దరూ అనుకున్నారు.

ఓ రోజు శ్రీధర్ నర్సింగ్ హోమ్‌లో డ్యూటీలో ఉన్న రాజేష్‌తో మాట్లాడ్డానికి తను వెళ్ళింది. తను వెళ్ళేప్పటికి రాజేష్, శ్రీధర్ దేని గురించో తీవ్రంగా ముచ్చటించుకుంటున్నారు. లోపలికి వెళ్ళబోతున్న తను లోనికి వెళ్ళకుండా తలుపు దగ్గరే ఆగిపోయింది.

“రండి కళ్యాణి గారూ – రండి,” శ్రీధర్ లోనికి పిలిచాడు.

“మీరు దేని గురించో మాట్లాడుతున్నట్టుంది.”

“నో… నో…! రాజేష్ వస్తే ఏవో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నాం. ఇన్నాళ్ళకి మాట్లాడుకోడానికి అవకాశం చిక్కింది. మన డాక్టర్ల వృత్తే అంతే. రోగులు – మందులు ఇదే మన జీవితం. అయితే ఒక్క విషయం కళ్యాణి గారూ! ఈ వృత్తి అంటే నాకెంతో ప్రాణం, గౌరవం. కొంత మంది రోగులయితే మనల్నే దేవుడంటారు. కంటికి కనిపించిన దేవుఁడు మీరు అంటారు. ‘ప్రాణం పోయడమేనా – తీయడమేనా మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు దేఁవుడు. ఎందుకు కాదు బాబూ!’ అని ఎదురు ప్రశ్న వేస్తారు. వారి ఆ ప్రశ్నకి ఏం సమాధానం ఇయ్యాలో తోచని పరిస్థితి,” శ్రీధర్ కళ్యాణితో అన్నాడు.

“ప్రాణం పొయ్యడం వరకూ సరే! దురదృష్టవశాన్న మన చేతుల్లో రోగి ప్రాణాలు పోయాయి అనుకో! వాళ్ళ రియాక్షను మరో విధంగా ఉంటుంది. అంతవరకూ డాక్టర్ని దేఁవుడన్న వాళ్ళు అదే డాక్టర్ని రాక్షసుడు అంటారు. దుర్మార్గుడంటారు. దూషిస్తారు. కొంతమందయితే చేయి చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వచ్చినా కష్టమే. చెడు వచ్చినా కష్టమే.” రాజేష్ నవ్వుతూ అన్నాడు.

కళ్యాణికి ఇద్దరి మాటలు నిజమే అనిపించాయి. శ్రీధర్ అన్నట్టు రోగుల సేవలో మనస్సుకి ఎంతో తృప్తి కలుగుతుంది. ఆ దేవుడు కనిపించని వాడయితే కనిపించే దేవుడు మీరు అంటారు కొందరు. వారి మాటలు ఆనందంతో పాటు ఆత్మ సంతృప్తి కలిగిస్తాయి.

“ఏఁటి ఆలోచిస్తున్నావు కళ్యాణి?” రాజేష్ అన్నాడు.

“మీరిద్దరూ అన్న మాటల గురించే.”

“మా మాటల్లో నిజం లేదా?” శ్రీధర్ అన్నాడు.

“నిజం ఉంది కనకనే ఆలోచిస్తున్నాను.”

“కళ్యాణీ మనం మాట్లాడుకుని పక్షం రోజులు అయింది కదూ!” రాజేష్ అన్నాడు.

“అంత కన్నా ఎక్కువ రోజులే.”

“ఈ మధ్య బొత్తిగా రోగుల్తో రాజేష్‌కి తీరిక లేకుండా ఉంది కళ్యాణి గారూ! అందుకే కొంతమంది ఆడవాళ్ళు డాక్టరు భర్తగా వద్దు బాబోయ్ అని అంటారు.” శ్రీధర్ నవ్వుతూ అన్నాడు.

శ్రీధర్ మాటలకి పకపకా నవ్వాడు రాజేష్.

“మా ఇద్దరికీ ఆ సమస్యే లేదు.”

“అంటే?”

“మేమిద్దరం డాక్టర్లమే. కాబట్టి ఈ వృత్తిలోని ఉన్న సాధక బాధకాలు ఇద్దరికీ తెలుస్తాయి. అందుకే సర్దుబాటు జీవితానికి అలవాటు పడిపోతాం,” రాజేష్‌ అన్నాడు శ్రీధర్‌తో.

“డాక్టర్ అన్నవాడికి కావల్సింది ముందర సేవాగుణం. అదే ముఖ్యమని భావించిననాడు కొన్ని సుఖాలు వదులుకోక తప్పదు శ్రీధర్ గారూ!” కళ్యాణి అంది.

“బాగా చెప్పారు,” ఆమె వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు శ్రీధర్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here