వేంపల్లి నాగ శైలజ మూడు మినీ కథలు

0
3

[dropcap]వేం[/dropcap]పల్లి నాగ శైలజ గారు రచించిన వైవిధ్యమైన మూడు మినీ కథలను అందిస్తున్నాము.

1. ప్రయత్నం

“మా ప్రభుత్వం తరపున మీ కోసం ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా?” ఓ ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం విచ్చేసిన ఎమ్మెల్యే గారు అడిగారు అక్కడి విద్యార్థులను.

“మాకూ ఓటు హక్కు కల్పించేలా చట్టం చేయండి సార్” విన్నవించాడు ఓ విద్యార్థి.

“మరీ చిన్న వయస్సు కదా, అంత తొందరెందుకు?” అడిగాడు ఎమ్మెల్యే.

“ఏం లేదు సార్, బావమరుదుల, బంధువుల పేర్లతో బినామీ కాంట్రాక్టులు దక్కించుకుని ఏమాత్రం నాణ్యత లేని నిర్మాణాలు చేయిస్తున్న మీలాంటివాళ్ళని ఓడించే ప్రయత్నం చేద్దామని” మాటలు తూటాల్లా వెలువడ్డాయి ఆ అబ్బాయి నోటి నుండీ.

2. నుదుటిరాత

“మనం తినే ప్రతి గింజ మీద మన పేరు తప్పనిసరిగా వుంటుంది”  చెప్పాడో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తను ప్రవచనాలు భోదిస్తున్న సందర్భంగా.

“అంతేకాదు స్వామీ, ఆరుగాలం ఎంతో శ్రమించి ఆ గింజల్ని పండించే ప్రతి రైతు నుదుటి మీద ఖచ్చితంగా అప్పులు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు అని కూడా రాసి వుంటుందని చెప్పండి” నిర్వేదంతో గొణుక్కున్నాడు టెలివిజన్‌లో స్వామివారి ప్రవచనాల్ని వింటున్న ఓ సామాన్య రైతు.

3. రుచి

“ఉప్పు ఎక్కువ వేయలేదంటున్నావు, అయినా ఏమిటయ్యా, ఈ అన్నం మరీ ఇంత ఉప్పగా వుందేంటి?” సర్వర్‌ని అడిగాడు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన గోదావరి జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి తిరుపతిలోని ఓ హోటల్‌లో భోంచేస్తూ.

“మరేంలేదు సార్, మా సీమ రైతు రోజూ తన చెమట చుక్క చిందిస్తే పండిన బియ్యంతో వండిన అన్నం సార్ అది” మనసులోని మాటని అలాగే మౌనంగా దిగమింగుకున్నాడు ఆ సర్వర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here