లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్… లాక్‌డౌన్

2
5

[dropcap]‘వ[/dropcap]ద్దురా…’ అంటే వినకుండా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండే వంశీ, శ్రీధర్లు సాయంకాలం అయ్యిందంటే రాత్రి భోజనం చేసి… కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు…. చూడచక్కని అన్నదమ్ముల అనుబంధం. చూపరులను ఆశ్చర్యానికి గురిచేసే ఇష్టాఇష్టాలు… అందరూ తండ్రి సుదర్శన్‌ని ‘నీకేంటి అయ్యా ఇద్దరు కొడుకుల… రారాజువి’ అంటూంటారు..

బాల్యం ఏ విధంగా గడిచిపోయినప్పటికీ, పెద్ద చదువుల కారణంగా వంశీ, శ్రీధర్లు ఇద్దరూ వేరువేరు నగరాల్లో విద్యనభ్యసించి ఉద్యోగం చేస్తున్నారు… కాస్త పెద్దయ్యాక ఇద్దరి అభిరుచులు ఒకటే అయినప్పటికీ ఉద్యోగాల్లో వ్యత్యాసం కారణంగా ఒకరికి ఒకరు కొద్దిపాటి భేదాభిప్రాయాలతో అనుబంధాన్ని సాగిస్తూన్నారు.

తమ్ముడు శ్రీధర్ పూణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడు.. స్థానికంగా ఉండే కంపెనీలో ఉద్యోగం అవటం చేత తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే హైదరాబాద్ నగరంలోనే అన్నయ్య వంశీ .. అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాడు.

శ్రీధర్ పూణేలో బ్యాచిలర్ లైఫ్‌ని సినిమా స్టైల్లో అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు…

చిన్నప్పటి నుండి ఎప్పుడూ కలిసి ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా ఏకకాలంలో బ్యాచిలర్ జీవితం గడుపుతున్న సందర్భంగా ఉద్యోగంలో సొంతగా డబ్బులు సంపాదిస్తూ…. ప్యాంటు షర్ట్‌లూ బ్రాండెడ్ దుస్తులు ట్విల్స్….. పీటర్ ఇంగ్లాండ్…. బ్రాండెడ్ వాడుతూ అన్నయ్య వంశీతో “నేను బ్రాండ్… నువ్వు ఇంకా (జా. జ)” అంటాడు…

“ఏంటి రా…. జా. జ …. అని తెగ వాగుతున్నావు.. నాకు బిపి లేచింది అంటే నిన్ను ఇంటికి రాకుండా చేస్తా…” అంటూ కోపంగా మాట్లాడుతాడు. “ఇంతకీ అసలు ‘జా. జ’ అంటే ఏంటి రా…” అంటాడు వంశీ.

“నువ్వు డ్రెస్‌లు ఏడ కుట్టిస్తావురా….” అంటాడు శ్రీధర్.

“సత్తిబాబు.. దగ్గర…..”

‘ఇంతకీ సత్తిబాబు ఎప్పటి వాడు రా ‘జాఫర్ జమానా’” అంటూ ఎగతాళిగా నవ్వుతాడు శ్రీధర్.

ఆ తరుణంలో శ్రీధర్ పూణేలో రెంట్‌కి ఉంటున్న ఓనర్ కూతురు ‘దర్శిని’తో ప్రేమ కలాపాలు మొదలై చెట్టాపట్టాలుగా పూణే నగరమంతా తిరగటం మొదలుపెట్టాడు…..

‘దర్శిని’ ఓ అందాల రాశి. శ్రీధర్ అభిరుచులకు తగ్గట్టుగా హెయిర్, స్టైల్‌గా ఎప్పుడు బ్రాండెడ్ డ్రెస్సులతో మాడ్రన్ స్టై‍ల్‍గా శ్రీధర‌‍ను ఆకర్షించింది.

దర్శిని తండ్రి తన కూతురు చేస్తున్న ప్రేమ వ్యవహారాన్ని గమనించడు.

శ్రీధర్ – దర్శనిల ప్రేమ వ్యవహారం తారాస్థాయికి చేరి ఓ నిర్ణయానికి వాళ్ళిద్దరువచ్చారు. దర్శిని అక్క శ్రీవల్లి…. శ్రీధర్ అన్న వంశీ వీళ్లిద్దరి పెళ్లిళ్లు అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. ఇంతలో అనుకోకుండా శ్రీధర్ అమెరికాలో జాబ్ వచ్చి అమెరికా వెళ్ళాల్సివచ్చింది… ఇక వాళ్ళిద్దరి మధ్య వీడియో కాలింగ్, చాటింగ్ ఇక చెప్పరానిదే…. గంటల తరబడి…ఎంత మాట్లాడినా తనివి తీరదే!!!!

ఒకరోజు శ్రీధర్‌కి వంశీ నుండి ఫోన్ వచ్చింది.

“అరే… ! …తమ్ముడు నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూద్దాం అంటున్నాడు. అమ్మాయి ఎలా ఉండాలి నువ్వే చెప్పాలి…..రా” అన్నాడు వంశీ

“నేను ఎలా చెప్పాలి రా… డైరెక్టుగా పెళ్లి లోనే దర్శించుకోవాలి రా.. …నేను ఆ వదినమ్మని..” నవ్వుతూ కొంచెం ఏదో అన్నయ్యను ఆట పట్టింటినట్లుగా అన్నాడు శ్రీధర్.

“అప్పుడే ప్రత్యక్షంగా చూడాలి రా” అంటాడు శ్రీధర్.

దానికి “ఓ అలాగే రా, అదే సస్పెన్స్‌లా ఉండాలి” అంటాడు వంశీ..

***

శ్రీవల్లి ఒక సాంప్రదాయ తెలుగింటి అమ్మాయిలాగా తన అందచందాలతో సాంప్రదాయంగా ఉంటుంది. అందర్నీ కనువిందుగా తెలుగుఇంటి ఆడపడుచులా ఆకర్షిస్తుంది.

దర్శిని వాళ్ళ అక్క శ్రీవల్లి “నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను”… అంటూ చాలా రోజుల నుండి పెళ్ళి విషయాన్ని వాయిదా వేయడం వల్ల తండ్రి రంగనాథంకు గుండె పోటు ఒక్కసారిగా రావటం వల్ల స్టంట్ వేయాల్సివచ్చింది. … అందరూ శ్రీవల్లిని ‘నీ వల్లనే మీ నాన్న గారికి గుండెపోటు వచ్చింద’ని దూషించారు.. ఎలాగైనా గాని తండ్రి కళ్ళ ముందు ఉండగా పెళ్లి చేసుకొని అమ్మానాన్నల దీవెనలు తీసుకోవాలని పెద్దలు ఇరుగు… పొరుగు వాళ్ళు ఎవరెంత చెప్పినా వినలేదు శ్రీవల్లి. పెళ్ళికి నిరాకరించింది. దాంతో ఇక విసిగి పోయారందరు. శ్రీవల్లిని బ్రతిమిలాడటం మానేశారు. ముందు పెళ్ళి శ్రీవల్లికి చేయడం మానేసి, ఆమె కర్మకు ఆమెని వదిలేసి దర్శిని పెళ్ళి చేసేయాలని నిశ్చయించారు.

“శ్రీవల్లి కాదంటే నాన్నకు గుండెపోటు వచ్చింది. నువ్వూ నిరాకరిస్తే ప్రాణం వదిలేస్తారు. ఆయన అకాల మరణానికి నువ్వే కారణమవుతావు” అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు.

దాంతో దర్శిని పెళ్ళి విషయంలో శ్రీధర్‌ను ఒత్తిడి చేయటం ఆరంభించింది.

ఉద్యోగరీత్యా అమెరికా జీవితానికి అలవాటుపడి జీవితాన్ని బాగా అనుభవించాలని శ్రీధర్ తన పెళ్లిని ఎప్పుడూ వాయిదా వేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ వచ్చాడు. దర్శినికి సూటిగా సమాధానం ఇవ్వకుండా మాట ఎగ్గొడుతూ వచ్చాడు. చివరికి దర్శినితో మాట్లాడటం తప్పించుకోవటం ఆరంభించాడు.

దర్శినికి కోపం వచ్చింది. ఏడుపు వచ్చింది. విదేశాలకు వెళ్ళగానే ఇక్కడి ప్రేమలను మరచిపోయిన కథలెన్నో విన్నది. ఆమెకు భయం వేసింది. బాధ కలిగింది.

ఇంట్లో పెళ్ళి వొత్తిడి ఎక్కువయింది. ఇక చేసేదిలేక పెళ్ళికి వొప్పుకుంది. శ్రీధర్‌ను మరచిపోవాలని నిశ్చయించుకుంది. శ్రీధర్ ఎన్ని మార్లు చేసినా ఫోనుకు సమాధానం ఇవ్వకపోవటంతో మెసేజ్ ఇచ్చింది. తనకు సమాధానం ఇవ్వకపోతే తనను మరచిపొమ్మని నిర్మొహమాటంగా చెప్పింది.

శ్రీధర్ నుంచి సమాధానం రాలేదు.

ఇక చేసేదేమీలేక తన ప్రేమను అణచిపెట్టి తల్లితండ్రులు కుదిర్చిన సంబంధం చేసుకుంటానన్ని తన నిర్ణయం ఇంట్లోవాళ్ళకు చెప్పేసింది.

ఒక సంబంధం వచ్చింది. అందరికీ నచ్చింది. పెద్దలు పెద్దలు మాట్లాడుకున్నారు. నిర్ణయం తీసుకున్నారు.

జీవితం తనదికాదు, నిర్ణయం జరుగుతున్నది తనగురించి కాదు అన్నట్టు ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఉండిపోయింది దర్శిని.

హైదెరాబాదులో నాన్న పాత స్నేహితుడు శంకర్ ద్వారా వచ్చింది సంబంధం.

మే 15న ముహూర్తం నిర్ణయించారు. కరోనా కారణంగా 30మంది మించి పెళ్ళిలో వుండకూడదట..

ఎంతో వైభవంగా చేదామనుకున్నారు. చివరికి ఇలా ఎవరికీ తెలియకుండా, పిలవకుండా, రహస్యంగా, భయంతో బితుకు బితుకుమంటూ…పెళ్ళి చేయాల్సివస్తోంది…

పలురకాల మాటలు ఆమె చెవిన పడుతునాయి. కొన్ని అర్థమవుతున్నాయి.. కొన్ని కావటంలేదు… ఆమె మౌనంగా, కలలోవున్నట్టు, మేల్కొని నిద్రపోతున్నట్టు యాంత్రికంగా అన్నీ వింటోంది. చెప్పినట్టు చేస్తోంది.

అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి మామూలుగా జరుగుతోంది అని తలుచుకుంటూ బాధపడుతున్నారందరూ…

పెళ్ళికొడుకు అందంగా వున్నాడు. “నువ్వు ప్రేమిచిన శ్రీధర్‌కు అన్నలాగా వున్నాడు.. వాడి తల తన్నేట్టున్నాడు. అదృష్టవంతురాలివి నువ్వు..” అని అక్క గుసగుసగా చెప్తూంటే వింతగా చూసింది దర్శిని అక్కవైపు.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు….

***

తన పెళ్ళి నిశ్చయమైనట్టు వంశీ శ్రీధర్‌కి ఫోను చేశాడు.

“మే 15వ తారీఖున నా పెళ్లి రా ఏం చేద్దాం రా… మన ఇద్దరి మధ్య ఓ సస్పెన్స్ అయిపోయింది… అంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ..”

“ఈ లాక్‌డౌన్ నిన్ను లాక్ చేసిందిరా”…

 “ఫ్లైట్స్ స్టార్ట్ కాగానే వెంటనే వచ్చెయ్ రా నీకు వదినమ్మని చూపించాలిగా!! నువ్వన్నట్టే అయింది…నేను పెళ్ళి చేసుకున్న తరువాతనే నువ్వు వదినను చూడాల్సివస్తోంది.”

 “ఏం చేద్దాం!!! విధి కరోనాను తెచ్చింది. నీ పెళ్ళి కరోనా సమయంలోనే నిశ్చయం కావాలా? కనీసం ఫోటో పంపవచ్చుగా?..”

“నీ మొహం. పెళ్ళికొడుకును నేను.. నీకు ఫోటో ఎందుకు పంపాల్రా?” కోపం నటిస్తూ అన్నాడు వంశి.

“అప్పుడే పొసెస్సివ్ అయిపోయావా?” వెక్కిరించాడు శ్రీధర్.

“పొసెస్సివ్ అవటానికి ఇంకా పొసెషన్లోకి రాలేదు కదా.. అమ్మవాళ్ళు నీకు పంపించామని చెప్పారు.”

“నిజమా?? నాకు అందలేదే??”

 శ్రీధర్‌కి ఫోటో అందనేలేదు. మే 15వ తారీకు రానే వచ్చింది.. ఇంకా ఫ్లైట్స్ ప్రారంభం కాకపోవడం వల్ల పెండ్లికి రాలేకపోయాడు శ్రీధర్… అన్నయ్య వంశీ పెళ్లి లైవ్ వీడియో చూద్దామని ఫోన్ తీస్తేడు… నెట్వర్క్ ఎర్రర్ రావడంతో ఓ అరగంట లేటుగా రికార్డెడ్ వీడియో చూస్తాడు…

ఆ వీడియోలో శ్రీధర్ తన అన్న వంశీకి రాబోయే యువరాణి, తన వదినమ్మను చూడాలనుకుంటాడు ఎంతో ఆతృతగా…!!!

వీడియోలో అన్నయ్య పక్కన వధువుగా కనిపించిన అమ్మాయిని చూసి స్టన్ అయిపోయాడు శ్రీధర్…..

ఆ వీడియోలో కనిపించింది… ‘దర్శిని’!!!!

తనే కావాలని దర్శిని దూరం పెట్టినా, ఆమె మెసేజీలకు సమాధానం ఇవ్వకపోయినా, ఆమె ఫోన్లు ఎత్తకుండా ఇగ్నోర్ చేసినా… శ్రీధర్‌కి ఎక్కడో ఏదో కోల్పోయిన భావన కలిగింది. అహం దెబ్బతిన్నాది. తను కాదన్న అమ్మాయి తన అన్ననే పెళ్ళి చేసుకోవటం… ‘అంతరంగం’ వెంటాడుతూనే ఉంది…‍

ఇప్పుడు.. దర్శినికి తన ముఖాన్ని ఎలా చూపించాలి…. !!!

దర్శిని తెలిసే తన అన్నని చేసుకుందా???? ఈ విషయం తెలిస్తే అన్న ఎలా భావిస్తాడు? అన్న సంసారం ఏమవుతుంది? ఈ విషయం చెప్పి వాళ్లిద్దరి జీవితాలని విడదీయాలా.???

…లేకుంటే ఆ అమ్మాయిని ఎప్పుడూ అన్నయ్య పక్కన చూస్తూ గతాన్ని తలచుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉండాలా..????

అర్థం కాని ఆవేదనతో సతమతమై పోతున్న శ్రీధర్ గుండె ఆవేదనకి అంతం లేకుండా పోయింది.. మరి ఎలా చేయాలి ఈ క్షణంలో నేను ఎలా భరించాలి.. ఓ పక్క మౌనంగా ఉంటే మనసు బాధ.. మరోపక్క అన్నయ్యకు మోసం చేసిన వాణ్ణి అవుతానా.. ఏం చేయాలి అనే సందిగ్ధంలో పడిపోయాడు శ్రీధర్….!!!

అన్నయ్యకు మోసం చేసిన తమ్ముడిగా నిలవాలా…?

లేక నిజం దాచిపెట్టి తన మనసులో అనుక్షణం బాధపడుతూ ఉండాలా’ అంటూ ఏమీ అర్థం కాని సందిగ్ధంలో ఉన్నాడు శ్రీధర్.. !!

***

పెళ్ళయిన తెల్లారి “నువ్వింత వరకూ నా తమ్ముడిని చూడలేదు కదా?” అంటూ తామిద్దరూ వున్న ఫోటో చూపించాడు వంశీ.

ఒక్కసారిగా నోరు తెరిచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దర్శిని ఉండిపోయింది…..

“ఏమయింది అలా అయిపోయావు? వీడు నీకు ముందే తెలుసా? పూనాలోనే వుండేవాడు”..నవ్వుతూ అడిగాడు వంశీ..

“లేదు.. అచ్చు మీలాగే వున్నాడు”….లేని నవ్వు తెచ్చుకుంటూ అంది దర్శిని.

అంతలో దర్శిని సెల్ మోగింది.

శ్రీధర్ నంబర్ చూడగానే గుర్తుపట్టింది.!!!

ఏం చేయాలో తెలియలేదు.. రిజెక్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే వుంటాడు…

ఫోను బందు చేసే వీలులేదు. ఎదురుగా వంశీ వున్నాడు.. ఎందుకని అని అడిగితే??? నంబర్ చూస్తే??? ఆమెకు చెమటలు పట్టేశాయి..

ఇన్నిరోజులు ఫోను చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? అన్నని పెళ్ళిచేసుకున్నందుకు అభినందించటానికా? బెదిరించటానికా? నిజం చెప్పి తన జీవితాన్ని ఆరంభంలోనే ఆపదలోకి నెట్టటానికా???

అలానే సెల్‌ఫోన్ పట్టుకొని చూస్తూ నిలబడ్డ దర్శినిని దగ్గరికి తీసుకోబోతూ సెల్ ఫోన్ తీసుకోబోతాడు వంశీ…. హఠాత్తుగా నిద్రనుంచి మేల్కొన్నట్టు ఉలిక్కిపడుతుంది దర్శిని.. ఆమె చేతిలోంచి సెల్ జారిపడి భళ్ళున పగిలిపోయింది……

“ఏమయింది? ఎందుకలా ఉలిక్కిపడ్డావు?”

అంతలో కళ్ళు తిరిగి పడిపోయింది దర్శిని హఠాత్తుగా…

“దర్శిని నీకు ఏమైంది….” పెద్దగా అరిచి ఒక్క అంగలో ఆమెని చేరుకున్నాడి వంశీ

***

“దర్శినీ!!!” ఫోనెత్తి ఆత్రంగా పిలిచాడు శ్రీధర్..

“శ్రీధర్ నాకు పెళ్ళయింది.”.

“తెలుసు.. అన్ననే చేసుకున్నావనీ తెలిసింది.. తెలిసి చేసుకున్నావా? తెలియకుండా చేసుకున్నావా?”

“అదంతా ఇప్పుడు అనవసరం… ఇప్పుడు నేను నీకు వదినను.. వదిన తల్లితో సమానం…”

“అదంతా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు… నువ్వు ఎంత కాదన్నా మనం ఒకప్పుడు ప్రేమించుకున్నాం… ప్రేమ లేకపోతే మళ్ళీ ఫోనుచేస్తావా?” వంకరగా నవ్వాడు శ్రీధర్.

“నేను నీకు ఫోను చేసింది ప్రేమతో కాదు… నేను నీకు వదిననని చెప్పటానికి. ఈసారి ఇండియా వచ్చినప్పుడు అన్న, వదినదగ్గరకు రమ్మని ఆహ్వానించటానికి..”

పెద్దగా నవ్వాడు శ్రీధర్..”ఇదేమన్నా సినిమా అనుకున్నావా?”… ఇంకా ఏదో అనబోతున్న అతని మాటకు అడ్డొచ్చింది దర్శిని

“సినిమా కాదు, ఇది జీవితం అని నువ్వు విదేశాలకెళ్ళగానే నేను నీకు అడ్డు అయినప్పుడే అర్థమయింది. నీకు ఒక విషయం తెలుసో తెలియదో, మళ్ళీ నువ్వు అందరిముందూ అభాసు పాలుకాకముందే చెప్పాలని ఫోనుచేశాను. ఎంతయినా నా మరిదివి కాబట్టి, నీ పరువు, కుటుంబ పరువు కాపాడటం నా బాధ్యత కాబట్టి ఫోనుచేశాను.”

“అబ్బో ఏమిటో అది”వ్యంగ్యంగా అనాడు శ్రీధర్

“నేను పెళ్ళికి ముందు మనిద్దరం ప్రేమించుకున్న సంగతి విదేశాలకెళ్ళగానే నీ అభిప్రాయం మారిన సంగతి మీ అన్నకు ముందే చెప్పాను.”

“ఏమన్నాడు?”

“వాడికి అదృష్టం లేకపోతే వాడేం చేస్తాడు… వజ్రం విలువ అందరికీ తెలియదు. ఆ అదృష్టం అందరికీ వుండదు అన్నారు. పిచ్చివేషాలు వేసినా, గొడవ చేయాలని ప్రయత్నించినా నష్టం నీకీ…బయ్…ఇండియా వచ్చినప్పుడు అన్న వదినల ఇంటికి రావటం మరచిపోవద్దు… ఇంకోసారి ఫోనుచేస్తే మరిదిలా మాత్రమే ఫోను చెయ్యి… గుడ్ లక్” ఫోను పెట్టేసి, ముఖంపైని చెమటను తుడుచుకుంది దర్శిని.

ఆమెకు తెలియకుండా కిటికీ దగ్గరనుంచి ఒక వ్యక్తి నీడలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు…

***

ఆరోజు తరువాత మళ్ళీ శ్రీధర్ దర్శినికి ఫోను చేయలేదు. అమెరికాలోనే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాడు. ఇండియా రాలేదు.

దర్శిని వంశీనే జీవితంగా సంపూర్ణంగా అతనికి అంకితం అయిపోయింది..

అప్పుడప్పుడు “మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా?” అని దర్శిని, వంశీని అడుగుతూంటుంది..

దానికి సమాధానంగా వంశి ఆమెని దగ్గర తీసుకుని చెప్తాడు..”నువ్వు కలవకముందు స్త్రీ అంటే శరీరమే అన్న భావన వుండేది.. కానీ, లాక్‌డౌన్ సమయంలో నా హృదయం నీతో లాక్ అయినప్పటినుంచీ నాకు స్త్రీ శరీరంలో ఒదిగిన అనంత సాగర స్వరూపం రేఖామాత్రంగా తెలుస్తోంది.. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవటానికి ఒక జీవితకాలం సరిపోదనిపిస్తోంది.”

“నేను అడిగిందొకటి, మీరు చెప్తున్నదొకటి.” అంటుంది దర్శిని బుంగమూతి పెట్టి..

“నా జీవితాన్ని మార్చి నాకొక దృష్టినిచ్చావు… ఒకరకంగా చెప్పాలంటే దేవతలా నాపై దయావర్షాన్ని కురిపిస్తున్నావు. నేను నిన్ను ప్రేమించటమా?? ఆరాధిస్తున్నాను..పూజిస్తున్నాను”…అంటాడు..

ఆమె అతని కౌగిలిలో ఒదిగిపోతూ… “లాక్ డౌన్ అనకండి మనది కరోనా ప్రేమ అనుకుంటారు” అంటుంది..

“మనది కరోనా ప్రేమ కాదు.. లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ లాక్‌డౌన్.” అంటాడు మరింత దగ్గరగా హత్తుకుంటూ…

ఇది వారు తరచు ఆడుకునే “లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ లాక్‌డౌన్” ఆట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here