జీవన రమణీయం-136

2
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]రా[/dropcap]హుల్‌ని అప్పటికే ‘అందాల రాక్షసి’ సినిమాలో చూసి వుండడం వల్ల నాయుడి గారి గదిలో కూర్చునుంటే గుర్తు పట్టాను. అతను నాకెంతో నచ్చాడు. మా పెద్ద అబ్బాయి వయసులా అనిపించాడు. గొంతు అచ్చు సిద్ధార్థ వాయిస్‍లాగే వుంది! చాలా మంచి అబ్బాయి. హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు డైరక్టర్ చెప్పి చేయించుకుంటే, నేను కథ చెప్పగానే పడిపోయాడు.

రాహుల్ రవీంద్రన్‌తో

నిజంగా ఫ్లాప్ అయినా నేనిప్పటికీ నా కథ గురించి గర్వంగానే ఫీల్ అవుతాను. చాలా మంచి మంచి కామెడీ సీన్స్ కూడా రాశాను. రఘుబాబూ, ఎల్.బి.శ్రీరాం గారూ, ఆలీ, వేణుమాధవ్, శివారెడ్డి అందరూ వున్నారు.

తన్వీ, రఘుబాబు, కాశీ విశ్వనాథ్ లతో అమ్మ

ప్రధాన తారాగణం సుమన్ అమ్మాయి తండ్రిగా, సన అమ్మాయి తల్లిగా, నానమ్మగా అన్నపూర్ణ, పిన్నిగా రజిత, పనిమనిషిగా రాగిణీ, రాహుల్ తండ్రిగా శరత్‌బాబూ, సవతి తల్లిగా ఆమనీ, చెల్లిగా ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ హీరోయిన్ గాయత్రీ… అందరూ కంప్లీట్ పాకేజ్.

అమ్మ, అన్నపూర్ణ, రాగిణి, సన, రజితలతో

ఇంక మిగిలింది ముఖ్యమైన పాత్ర… క్రిష్‌కి స్వప్న కావాలి… హీరోయిన్ పాత్ర! చాలామందిని చూసాం… రామానాయుడి గారికి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ బోలెడుమంది వచ్చి ఫోటోస్ అవీ చూపెట్టారు. చివరికి ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసారు. నేను సరిగా చూడలేదు… అదేం ఖర్మమో ఒక్క తెలిసిన ముఖమూ సెట్ కాలేదు!

నాయుడిగారి తొందర వల్ల ఓ అమ్మాయికి అడ్వాన్స్ కూడా పంపించేసారు… అప్పుడే సునీతా చౌదరీ అనే జర్నలిస్ట్ నాతో వున్న చనువు వల్ల నాకో మెసేజ్ పంపింది, ‘నేను కోఆర్డినేట్ చేస్తున్న హీరోయిన్స్‌ని పెట్టుకోకున్నా పర్లేదు… కానీ మీరు పెట్టుకున్న అమ్మాయి రాహుల్‍కి సూట్ అవదు, చూస్కోండి’ అని తనదైన శైలిలో.

షూటింగ్‍ కూడా మొదలయిపోయింది. మొదటి రోజు… మేనేజర్ దగ్గర నుండి, తర్వాత డైరక్టర్ గారి దగ్గర నుండి, కోడైరక్టర్ దగ్గర నుండి ఆగకుండా ఫోన్‍లు వస్తూనే వున్నాయి నాకు. నేను బయలుదేరాను అని చెప్తున్నా కదా, ఎందుకబ్బా నాయుడు గారు ఇన్నిసార్లు ఫోన్లు చేయిస్తున్నారు అని కంగారుగా వెళ్తే, నాయుడుగారు కాదు ఫోన్లు చేయించినది… వీళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఆ వచ్చిన అమ్మాయి రాహుల్ పక్కన అస్సలు సూట్ కాలేదు. చాలా పెద్దగా వుంది… అదీ విషయం. తీరా ఆ అమ్మాయి మేకప్ కూడా వేసేసుకుంది. ఈ విషయం ఇప్పుడు చెప్తే మండిపడిపోతారు, చాలా కోపం వస్తుంది. ఎవ్వరికీ ఆ ధైర్యం లేదు. డైరక్టర్ గారికయితే చాలా కొత్త నాయుడిగారితోటి వ్యవహారం. అందుకని వాళ్ళు నన్ను పిలిపిస్తున్నారన్న మాట. విషయం విన్న తర్వాత రాహుల్ కూడా బాధ పడడంతో నేనింక కలగజేసుకోవలసి వచ్చింది. వెళ్ళి ఆయనకి నెమ్మదిగా చెప్పాను. చాలా మండిపడ్డారు, కోపం వచ్చింది. అయినా కూడా నేను చాలా స్మూత్‍గా, “సినిమా రిలీజ్ అయ్యాక అందరూ ఇలా అనుకుంటారు, అందులోనూ మీరు మామూలు కాదు, కరిష్మా కపూర్, దివ్యభారతి, మోనికా బేడీ లాంటి హీరోయిన్స్‌ని మీరు సెలెక్ట్ చేసారు ఇదివరకు. మీ రికార్డు అలాంటిది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే కనుక అందరూ చాలా డిజప్పాయింట్ అవుతారు” అని చెప్పడంతోటి, కర్ర విరక్కుండా పాము చావకుండా, మొత్తానికి ఆ అమ్మాయిని పిలిచి “అమ్మా, నీకు రిటర్న్ టికెట్ వేస్తున్నాము, మళ్ళీ తరువాత చేద్దాము, ఇప్పుడు కాదు, షూటింగ్ ప్యాకప్ చెప్తున్నాము కొన్ని కారణాల వల్ల” అని చెప్పాము. ఆ అమ్మాయికి అర్థమయిపోయింది, అందరూ గుసగుసలాడుకోవడం వల్ల సెట్‍లో. ఆ అమ్మాయి “నా డబ్బులు నాకిచ్చేయండి” అంది. డబ్బులిచ్చేసి, ఆ అమ్మాయిని పంపించేసి, అప్పుడు “మనం ముందే అనుకున్నాం కదా, రమణీకి కూడా నచ్చింది, పొడుగ్గా వుంది ఆ అమ్మాయి, మిస్ ఇండియా ఎర్త్ అవార్డు కూడా పొందింది” అని తన్వీ వ్యాస్‌కి ఫోన్ చేయగానే, ఆపద్ధర్మంగా వెంటనే వచ్చి, సినిమా ముహుర్తానికి అందుకుంది. షూటింగ్ రెజ్యూమ్ అయింది. ఆ కారణం వల్ల తన్వీకి, వాళ్ళమ్మకి కూడా నేనంటే ఇష్టం.

‘నేనేం చిన్నపిల్లనా?’ పూజ

అమ్మాయిల గురించి చెప్పేటప్పుడు వారి పర్సనాలిటీ, ఏజ్ గురించి నేను కామెంట్ చెయ్యను. అంతకు ముందు వచ్చిన వాళ్ళలో తన్వీ వ్యాస్ ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ 2008 విన్నర్! ఆమె నాకు బాగా నచ్చింది. అదృష్టం కొందరితో దొంగాట లాడ్తుంది. ఇప్పుడు నెంబర్ వన్‌గా వున్న తాప్సీ పన్నూ అదే కాంటెస్ట్‌లో రన్నరప్ కూడా కాదు! మూడో రౌండ్‌లోనే ఔట్! విన్నర్ అయిన తన్వీ తమిళ్‌లో 2012లో ‘ఎప్పడి మనసుక్కుల్ వంతాయ్’ అనేదీ, తర్వాత 2013లో ‘నేనేం చిన్నపిల్లనా?’ మూవీ తప్ప తర్వాత ఏం చేసినట్టు లేదు! చదివింది బరోడా, వడోదరాలో మహారాజా సయాజీరావు యూనివర్సిటీలో గ్రాఫిక్ డిజైనింగ్, అందులో డిగ్రీ వుంది. తండ్రి డాక్టర్, తల్లి విజయ హౌస్ వైఫ్. ఎప్పటిలానే, నాకూ విజయ మంచి ఫ్రెండ్ అయింది. రామానాయుడు గారు కారిస్తే సింహాచలం, అన్నవరం, రాజమండ్రీ, వైజాగ్ పరిసర ప్రాంతాలన్నీ తిప్పి చూపించాను ఆవిడకి. అక్కడ మేమిద్దరం స్నేహితురాళ్ళమయ్యాం. పులిహోర తిని ఆ రెసిపీ నన్ను అడిగి రాసుకుందావిడ.

తన్వీ వ్యాస్‌తో

అసలు నాకు నాయుడుగారు కానీ, సురేష్ బాబు గారు కానీ ఆ కాంపౌండ్‍లో చాలా గౌరవం ఇస్తారు. అమ్మని తీసుకుని ఆ ముహూర్తానికి వెళ్ళినప్పుడు “అమ్మా, రమణీ ముందుకి రా… నీ చేత్తో కొబ్బరికాయ కొట్టు, బొట్టు పెట్టుకో, స్క్రిప్ట్ పట్టుకో… పూజలో పెట్టు” అంటూ నాయుడుగారూ, చిన్న నాయుడు గారూ అని నేను పిలుచుకునే ఆయన మనవడు అభిరామ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు!

అమ్మ “’రేపల్లెలో రాధ’కీ, ‘ఎవరే అతగాడు’కీ, ‘మధుమాసం’కీ, ‘అందరి బంధువయా’కీ, ‘నేనేం చిన్నపిల్లనా?’కీ – నీ తల్లిగా, నీకు జరుగుతున్న మర్యాదలు చూసే అదృష్టం కలిగించావ్, అదే పదివేలమ్మా… ‘ఓనాడు నిన్ను సినిమా కథ రాయవే అంటే,… అమ్మా అవన్నీ సాధ్యం కావు… ఆడవాళ్ళని అంత తేలిగ్గా రానియ్యరు అక్కడ, కలలు కనకు అన్నావ్!'” అంది ఆనందంగా.

అమ్మ నా ప్రతి విజయంలోనూ వెంటనే వుంది. అలాగే అపజయాలప్పుడు వెన్ను నిమిరి, ధైర్యం చెప్పడానికి కూడా… 2020 కోవిడ్‌తో పాటు, లాక్‌డౌన్‌తో పాటు నా భర్త అనారోగ్యం పేరుతో వచ్చిన కష్టంలో కూడా అమ్మ నాతో వుండి, మా వారినీ, నన్నూ గట్టెక్కిం చేసిది. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా వున్నారు. ఎనిమిది నెలలు పాటు మాత్రం నేను మానసికంగా పడిన నరకం అంతా ఇంతా కాదు! చెడు రోజులని ఎక్కువ తలచుకోను. నిద్రలో శరీరానికి ఏ జ్ఞాపకమూ అంటనట్టే, వేకువ కలిగించిన జ్ఞాపకాలే నాతో వుంటాయి. అమ్మ నాతో వుండడమే నాకు పెద్ద వరం.

అలా సునీల్ కుమార్ రెడ్డి గారి డైరెక్షన్‌లో రాహుల్, తన్వీతో షూటింగ్ మొదలయింది. హైదరాబాద్ నానక్‍రామ్‌గుడాలో ఒక షెడ్యూల్ అయ్యాకా, వైజాగ్ వెళ్ళాం. అక్కడ రామానాయుడి గారి స్టూడియోలో, మధ్యలో ఒక మెయిన్ బిల్డింగ్ వుంటుంది. అందులో ఆయనా, నేనూ, రాహుల్ వున్నాం. దూరం దూరంగా వుండే కాటేజెస్‌లా వున్న వాటిలో డైరక్టర్,  హీరోయిన్, మిగతా వాళ్ళు వున్నారు. స్టూడియోని నాయుడుగారు నాకు దగ్గరుండి చూపిస్తూ, ఎలా తనకి శాంక్షన్ అయిందీ, అప్పటి కలెక్టర్ తనకు ఎప్పటికీ హక్కులుండేటట్లు, లీజ్ కాకుండా ఎలా రాయించిందీ, అన్నీ స్వంతవాళ్ళకి వివరించి చెప్పినట్టు వివరించడమే కాకుండా, స్వయంగా నాకు చాలా ఫొటోస్ తీసారు. అందరూ నాకు ఆయన ఇచ్చే గౌరవం వల్ల అగ్గగ్గ లాడేవారు! ఒక రకంగా నేను హీరోయిన్‌లు పొందే స్పెషల్ అటెన్షన్ పొందేదాన్ని! ఏదీ అనుభవిస్తున్నప్పుడు దాని విలువ తెలీదు… నెమరు వేసుకుంటుంటే మనని అంత గొప్పగా చూసారా? అది మనమేనా… ఎన్ని మధుర ఘట్టాలూ? అనిపిస్తుంది. మా అమ్మ కూడా నాతో బాటు ఆ గౌరవాలని పొందేది. మానిటర్ ముందు డైరక్టర్‌తో బాటు కుర్చీ, కాఫీనా, కొబ్బరినీళ్ళా అని అడిగే ప్రొడక్షన్ బాయ్‌లూ, భోజనాలప్పుడు, నాకూ నాయుడుగారికీ, డైరక్టర్‍గారికీ, హీరో హీరోయిన్‌లకీ స్పెషల్‌గా టేబుల్, మధ్య మధ్యలో నాయుడు గారే “ఇది తిను… బావుంటుంది” అని వడ్డించడం… ఓహ్ ఆ మర్యాదలు నా పూర్వ జన్మ పుణ్యఫలం… ఒక్క నాయుడు గారే కాదు; ‘అందరి బంధువయా’ అప్పుడు మా చంద్రసిద్ధార్థా, ‘బాస్’, ‘రెయిన్‌బో’ అప్పుడు వి.ఎన్.ఆదిత్యా, ‘ఎవరే అతగాడు’ అప్పుడు కె.ఎస్. రామారావు గారూ అలాగే చేసేవారు! చివరికి ‘అనగనగా ఓ అమ్మాయి’, ‘ఊయల’ సినిమాలప్పుడు నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు కూడా నేనూ, ఆయనా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారూ ఒక చోట కూర్చుని భోం చేసేటట్లు ఏర్పాటు చేసారు. ఈనాటికీ టీ.వీ. సీరియల్ అయినా మా డైరక్టర్లూ, నిర్మాతలు నన్ను స్పెషల్‍గానే చూస్తారు. ‘పద్మవ్యూహం’, ‘తూర్పు వెళ్ళే రైలు’కి డైరక్టర్ అనిల్‌కుమార్ గారూ, ‘సీతామహాలక్ష్మి’కి నాగబాబు గారూ, భోజనాలప్పుడు నాకు వడ్దిస్తూ, జోక్స్ వేస్తూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు! నాకు మా సినిమామెస్ వాళ్ళ భోజనం తర్వాతే ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ అయినా. చిత్రంగా మా హీరోయిన్ తన్వీ కూడా ఇదే మాట అంది “నాకు మీ తెలుగు సినిమా వాళ్ళ మెస్ ఫుడ్ అంటే ప్రాణం!” అని.

వైజాగ్ షూటింగ్‍లో, బ్రేక్‌ఫాస్ట్ మా మెయిన్ బిల్డింగ్‍లో చేసేవాళ్ళం… లంచ్ మాత్రం శరత్‌బాబు గారు, రఘుబాబూ, మిగతా కమేడియన్స్‌తో సందడి సందడిగా చేసేవాళ్ళం. ఆంధ్రా అంటేనే ఫుడ్ కదా! అరటి తోటల్లో షూటింగ్. పచ్చని చెట్ల మధ్య పసుపు రంగు గెలలతో మంచి టైమ్‍లో పెట్టారు షూటింగ్! ఎంత సేపూ తిండి గురించేనా అనుకుంటారేమో… కథ విషయం కూడా చెప్తాను. నాకెంతో ఇష్టమైన సీన్స్ ఈ సినిమాలోనే కోకొల్లలుగా రాసాను… మచ్చుకి ఒకటి రెండు చెప్తాను. 

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here