[dropcap]బ[/dropcap]తుకు బడిలో
అపుడే ఓనమాలు దిద్దేటప్పుడు
భవిష్యత్తు గురించి
అప్పుడప్పుడే ఊహ తెలుస్తూన్నప్పుడు
కనిపిస్తూ కవ్విస్తూ కాసింత దూరంలోనే
అందుబాటులో ఉన్నట్లు అగుపిస్తుండేది
అందుకోమంటూ అనుక్షణం ఊరిస్తూండేది
అందకుండా అలాఆలా ముందుకెళుతూండేది
మనశ్శరీరాలను ధృడంచేసి
శక్తియుక్తులను జోడించి
అలుపెరుగని పోరాటం చేసి, అందుకొని
అందిందని గర్వంగా మీసంమెలేసి చూస్తే
కనిపించేది గమ్యం, కాసింత దూరంలో
కొంటెగా చూస్తూ, కవ్వింపు కళ్ళతో ఎప్పట్లానే
కౌగిలిలో ఉందెవరాని చూస్తే
కనిపించేది నా విజయఫలం… ఓ మైలురాయి
అది చదువో, పదవో, ప్రేమో, పెళ్ళో…
ఆస్తో, ఐశ్వర్యమో, కీర్తికిరీటమో….
అందిందనుకున్నదేదీ గమ్యంకాదు
అందుబాటులోకొచ్చిన ఒక మైలురాయి మాత్రమే
గమ్యాన్ని చేరుకోవాలనే ఆరాటంలో
ఎడతెగని నిక్కచ్చి పోరాటం లో
నాలుగు రాళ్ళేమిటి, నలభై (మైలు)రాళ్ళనూ వెనకేశాను
ఎత్తులెన్నో వేశాను
దాన్నందుకోవాలనే ఆకాంక్షతో
జిత్తులమారి దెయ్యం
జారిపోతూండేది నాకందకుండానే
“బిగించిన గుప్పిట్లోని ఇసుకలా”
ప్రతీ అనుభవమూ వెళ్ళిపోతూనే ఉంది
అన్నో ఇన్నో అనుభూతుల్ని మిగిల్చి
సుమాల వాసనలు వెలువరించేవి కొన్నైతే
శవాల కంపును కుమ్మరించేవి ఇంకొన్ని
ఆరు ఋతువులు
ఒకదాన్ని మరోటి తోసుకుంటూ
చక్రభ్రమణం చేసుకుంటూ
గడుస్తున్న సంవత్సరాన్ని గతంలోకి విసిరేస్తూ
భవిష్యత్తులోనిదాన్ని బరబరా లాక్కొస్తూ
కనపడని కాలసర్పంతో నా జీవితంలోని
బాల్యం, యవ్వనాలను మింగేయిస్తూ
వృద్ధాప్యాన్ని విసర్జింపజేయిస్తూంటే
అనుభవం అందించిన
విజయాల వజ్రహారాల రాపిడితో
అపజయాల బండరాళ్ళ తాకిడితో
శరీరం క్రమక్రమంగా శైథిల్యం చెందుతోంటే
తెలుస్తోంది మెల్లమెల్లగా నా గమ్యమేమిటో
అది…
అది జీవించడమేనని !
అనుక్షణం జీవితమనే ప్రయాణాన్ని
కొనసాగించడమేనని !!
గెలుపోటముల మైలురాళ్ళను
దాటుకుంటూ సాగడమేననీ !
ఆనందవిషాదాల అనుభూతుల్ని
వెంటేసుకుని వెళ్ళడమేననీ !!
ఫలితం కాదు ముఖ్యం, ముఖ్యం పయనమేననీ!
గమ్యంకాదు ముఖ్యం, ముఖ్యం గమనమేననీ!!
గమ్యం!
అది నేనున్నంతవరకు నాకందదనీ!!
అది అందిందనుకున్నవేళ నేనుండననీ!!!