[dropcap]ము[/dropcap]డుతలు పడ్డ కాన్వాస్ ముఖచిత్రం
నా గుండెల్లో పదిలంగా భద్రపరచబడింది
అశుద్ధాన్ని శుభ్రం చేసిన చేతులు
ఆప్యాయంగా చెక్కిళ్ళు నిమిరిన గుర్తు
నీటి భాష్పీభవన ఉష్ణోగ్రతలు అటుఇటుగా
శరీరం మీద తాండవిస్తున్నపుడు
రెప్పవాలని కళ్ళు కాచినట్లు ఆలాపన
పాదాలు గుర్రాలై ప్రథమంగా నిలిచినపుడు
చెక్కిళ్ళ ఆనందభాష్పాలు మెరిసినట్లు భావన
పరాయమ్మ కన్నబిడ్డ కోడలై వస్తే
తన బిడ్డగా లాలించిన తీపి గురుతు
అవయవాలు క్రుంగి మూటగా మారి
ఒడి తలగడపై ముడుచుకున్న వేళ
చేతిని తడిపిన ఆమె కన్నీటి సంద్రం
తను పోతాననే బాధతో కాదట
నేనైమైపోతానో అనే దిగులుతోనట
కాలం చేసిన కాయం కనుచూపు దాటినా
వడలిన వదనం నాకు అందంగా
కోటి తారల వెలుగులా కనిపిస్తున్నది కంటికి
ఎందుకంటే ఆమె నాకు అమ్మ
నాకు ఉనికినిచ్చిన కొమ్మ