[dropcap]నీ[/dropcap] లేత అర చేతులు ఆకాశాన్ని చూసినపుడు
చుక్కలు చిరునవ్వులు చిందించాయి!
చందమామని తెచ్చి దుప్పటి కప్పి
మా పక్కనే బజ్జోపెట్టుకోవడం ఎంత గర్వకారణం!
ప్రేమ నుండి ప్రేరణ పొందడం,
ప్రాణం నుంచీ ప్రాణం మొలవడం
సృష్టి రహస్యమని నిన్ను చేతుల్లోకి
తీసుకున్నప్పుడే తెలిసింది!
నీ లేత బుగ్గల్లో లాలిత్యం,
నా గుండెని తాకినప్పుడు
తియ్యని సంగీతమేదో
నా కళ్ళల్లో చెమ్మగా ప్రవహించింది.
నువ్విచ్చే చిరునవ్వు కానుకల్ని
నీ పెదవుల్లో విచ్చుకున్న రోజాపూల కాంతుల్ని
ఆ మృదుత్వాన్ని అమృతత్వాన్ని
అమరత్వంగా మార్చమని
నిన్ను సృష్టించిన వాణ్ణి ప్రార్థిస్తాను!!