[dropcap]ఏ[/dropcap]మో.. ఏమయిందో
నా హృదయమెందుకో స్పందించట్లేదు
చితికిన బాల్యం
చిందరవందర యౌవనపు గురుతులు
రాచపుండల్లే రక్తమోడుతున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
కలలుగన్న ప్రపంచం
కసిదీరా కాటువేసి
కన్నీటిధారల కానుకిస్తున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
అనురాగమనుకున్న
అహంకారపు కోరల అణగారిన
ఆశలు అరిచి అరిచి అలిసిపోతున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
బంధాలే బంధనాలై బిగిసి
ఊపిరాడక గింజుకుంటున్న
తన ఉనికి తన ఉసురు తీస్తున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
వింత పోకడల సమాజపు
వికృత చేష్టలకు విస్తుపోయి
గొంతెత్తి వివరమడగాలని గోల చేస్తున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
విలువల వలువలు వదిలిన
లోకుల నలుపు తెలుపుల
నగ్నత్వం హుంకరించి హేళనగ నవ్వుతున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
మృగవాంఛల బలయిన
బ్రతుకు మూల్యం మూలకు
చేరిందిదేమని మాటకు మాట ప్రశ్నించమంటున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
జీవనపోరాటంలో సమిధలైన
సుదతుల బానిసత్వపు
సంకెళ్ళ ఒరిపిడుల మంటలు మండుతున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
పరధర్మమును మెచ్చిన
కలి ధర్మం తప్పొప్పుల మాట మరచి
నిస్సిగ్గుగా కన్నుగీటి కవ్విస్తుంటే
నా హృదయమెందుకో స్పందించట్లేదు
ఆహ్లాదమిచ్చే ప్రకృతి
ఆగ్రహించి ఆయువు తీస్తుంటే
మానవ తప్పిదముల మన్నింపులడగమని మొత్తుకుంటున్నా
నా హృదయమెందుకో స్పందించట్లేదు
ఏమో.. ఏమయిందో
నా హృదయమెందుకో స్పందించట్లేదు