నేనేం చెయ్యాలి చెప్పండి?

0
3

[dropcap]న[/dropcap]లభై ఏళ్లయ్యింది… ఈ ఇంటికి కోడలుగా వచ్చి… చేతి నిండుగా గంపెడు బొమ్మల్ని పట్టుకుని – నాన్న ఎత్తుకొచ్చి వదిలి పెట్టాడే… అప్పుడు అమ్మ – ఆమే మా అత్తగారు – ఉన్నారు… అత్తకు అత్తగా అమ్మకు అమ్మగా… కన్నతల్లికి కూతురుగా ఉన్నది ఐదేళ్ల కాలమేగా!… మిగతా కాలానికి అత్తగారికి కోడలిగానేగా… వసారాలో నన్ను వదిలిపెట్టి పైపంచతో ముఖాన్ని మూసుకుని నాన్న ఎందుకేడ్చాడో ఇప్పటికీ నాకర్థం కాలేదు… ఇదిగో ఈ వాకిలి ముందు… ఆ ఇటుక నేలమీదే బొంగరం తిప్పాలని నాలుకను గిట్టకరుచుకుని తాడుచుట్టి బొంగరం తిప్పి నిలబడ్డారే, ఈయన నాకు ఇంటాయన అని, అర్థం కావటానికే చాలా రోజులు పట్టిందిగా… అందుకనీ ‘టప్పు టప్పు’ మంటూ వచ్చి తలమీద మొట్టటమా?… ‘పోరా’ అని ఒక రోజు బాగా తిట్టాను… వంటగదిలో పనిచేసుకుంటున్న ఆమె, పరుగెత్తుకొచ్చారు: “అయ్యయ్యో ఏంటే ఇదీ? వాడు… వీడంటూ… వాణ్ణి?” “వాడు మాత్రం నన్ను మొట్టొచ్చా?” అమ్మకు ఒకవైపు నవ్వు తన్నుకొస్తోంది… నన్ను గట్టిగా కౌగిలించుకుని మా అనుబంధం గురించి వివరించి చెప్పింది… అయితే, అన్నీ అర్థంచేసుకునే కాలం వస్తేనేగా అర్థమవుతాయి… ఆలోచించి చూస్తే, అంతా ఆశ్చర్యంగా ఉంది… నాకు ఈయన దగ్గర ఇంత భయం ఎలా కలిగింది? భయమంటే, అది ఆనందకరమైన భయం… మర్యాదతో కూడిన భయం. భయమన్నది కూడా సరికాదు… అదొక భక్తి అనిపిస్తోంది… ఎలాగో వచ్చేసిందే… ఊ ఊ!…. నలభై ఏళ్లకు పైనే అయ్యింది…

‘ఈ మనిషిని చేసుకుని నేనేం అనుభవించానని. ఒక అది ఉందా, ఒక ఇది ఉందా’ అని కోనేటికట్ట దగ్గర నుండి కోవెల ప్రాకారం వరకూ ఈసడించుకుంటూ, ఏడుస్తూ కొందరు అంగలారుస్తూ తిరుగుతారే, వాళ్లదంతా ఏం జన్మలో తల్లీ!

నాకు ఏ కొరతా లేదు… ఔను… ఏ కోవెల దగ్గరికొచ్చయినా నిలబడి, తడిబట్టల్ని కట్టుకుని చెబుతాను – నాకు బిడ్డలు లేరన్నది పెద్ద లోపంగా చెప్పారు… చెబుతున్నారు… నేనూ విన్నాను. ఎందుకూ… అబద్ధం చెబుతారా… నాకూ అలాంటి ఒక కొరత కొన్నాళ్లు వరకూ ఉండేది. అదెంత అజ్ఞానమో ఆ తర్వాతే అర్థమైంది… నాకే సొంతంగా ఏమీ అర్థం కాలేదు… ఆయన అర్థమయ్యేలా చేశారు. ఆయనవల్లే అది వీలవుతుంది. మాట్లాడ్డం మొదలు పెట్టారంటే ఎక్కణ్ణుండి ఆ సూత్రాలంతా చేతులు కట్టుకొచ్చి నిలబడుతాయో? శాస్త్రాలనుండీ, వేదాలనుండీ ఉదాహరణలిస్తూ… ఎలాంటి అనుమానాలనైనా సరే, ఏ విధమైన అజ్ఞాన సమస్యలనైనా సరే, ఆయన మాటలతోటే కొట్టి తరిమిగొట్టే సామర్థ్యం… అలాంటి ఒక వాక్బలం… అలాంటి ఒక జ్ఞానం… అది ఆయనకు మాత్రమే వస్తుంది… ఏదో, మా ఇంటాయన అని ఒకటే పొగిడేస్తున్నానని అనుకోకండి… ఆయన్ను పొగిడే స్థాయంత జ్ఞానం నాకు లేదు. అలాంటి విద్వాంసుడికి సరైన నిరక్షరకుక్షి సహధర్మచారిణిగా వచ్చి చేరాను చూడండి. దీని గురించి నేనే ఒకసారి ఆయన దగ్గర చెప్పాను. పెద్ద ప్రసంగమే చేశారు. ఆయనకు నేను సహధర్మచారిణిగా ఉండటం ఎంత సరియైనదో దాని గురించి… ఆయనకు… అందులో ఎంతటి ఆనందమో దాని గురించీ ఆయన నా దగ్గర చెప్పినదంతా నేనెలా చెప్పనూ? ఆయనకు సహధర్మచారిణిగా ఉండటానికి నాకు అర్హత ఉండటం; యథార్థంగానే ఉండనీ! అందుకని ఆయన్ను పొగిడే అర్హత నాకు వచ్చేసిందని అర్థమా?

మహా విద్వాంసులు శ్రీమాన్… అని చెబితే ఈ రాజధానికంతా తెలుసు. ఈయన ప్రఖ్యాతి చెన్నపట్నం ఏంటీ, కాశీ వరకూ ప్రాకి ఉంది… ఈయన దగ్గర చదువుకున్నవాళ్లు, ఈ ఇంట్లో నాక్కూడా పనులు చేసినవాళ్లు ఎంతోమంది కలెక్టర్లగానో పెద్ద పెద్ద ఉద్యోగాల్లోనే ఉన్నారు తెలుసా?

ఇదిగో, ఇప్పటికీ శంకర మఠం అరుగుమీద, ఎదురుగా వరుసగా పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆయన విద్యాభ్యాసం చెయ్యిస్తున్నారు… ఆయన కంఠం మాత్రం వేరుగా, గట్టిగా, గంభీరంగా నాభినుండి బయలుదేరి బయటికొస్తున్నదాన్ని వింటూంటే, ఒళ్లంతా పులకరిస్తుంది. తర్వాత ఆ పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా, భక్తితో మృదువైన గొంతులతో ఆయనలాగే చెప్పాలన్న ప్రయాసతో, ఆ స్థాయిని అందుకోవటానికి కడుపు బిగించి, రొమ్ముల మీద చేతుల్ని కట్టుకుని వల్లిస్తున్నారే… అది వచ్చి చెవుల్లో పడుతున్నప్పుడు, కడుపులో ఏమో చేస్తోందే, అది కన్నవాళ్లకు మాత్రమే జరుగుతుందా?

ఆయనే అంటారు…. “బిడ్డల్ని కనటమేమీ పెద్ద విషయం కాదు; అందుకు కడుపు మాడ్చుకుని పెంచటమూ పెద్ద పని కాదు. బుద్ధినీ పద్ధతిని ఇచ్చి వాణ్ణి జ్ఞానవంతునిగా చెయ్యటమే పెద్ద విషయం. మనమంతా సాధారణమైన పిల్లల్ని కన్నామన్న పేరుకన్నా ఇలాంటి జ్ఞానవంతుల్ని తయారుచేశామన్న పేరే శ్రేష్ఠమైనది…” ఇంకా ఏమేమో చెప్పేవారు. నాకెక్కడ వాటినంతా తిరిగి చెప్పటం చేతనవుతుందనీ?… అయితే, అది ఎంతటి సత్యమో మనసుకు అర్థమవుతోంది.

ఈయన దగ్గర చదువుకుని ఇప్పుడు పట్నంలో ఏదో కాలేజీలో సంస్కృత ప్రొపసరుగా ఉన్నాడే శీనివాసు… ఇప్పుడు పండిత శ్రీనివాస శాస్త్రులని పేరట… వింటూంటే ఏమిటో మనసుకు ఇంపుగా ఉంది… కంటేనే వస్తుందా?… కన్నది ఇక్కడే ఉంది… తన కొడుకు తనను సరిగ్గా చూసుకోవటం లేదని ఎప్పుడూ శపిస్తూ…

ఒక్కొక్కటిగా ఆయన చెబుతున్నప్పుడు, ఏంటో చమత్కారంగా తర్కంచేసి సాధించినట్టుగా అనిపించేది. ఉన్నట్టుండి, ఆరోజే ఆయన ఎంత సరిగ్గా చెప్పారోనని ఆలోచించేకొద్దీ ఆశ్చర్యపడే విధంగా ఒక్కొక్కటీ జరిగేవి.

ఆ రోజు గుడికెళ్లి వస్తున్నప్పుడు శ్రీనివాసు వాళ్ల అమ్మ, ఒక్కక్షణం ఆపి నిలబెట్టి, ఆ శీనివాసులు ఈమెను తిరిగి కూడా చూడకుండా అత్తగారిల్లే గతి అన్నట్టు వెళ్లిపోవటాన్నీ, అతణ్ణి పెంచటానికి చదివించటానికి ఆమె పడ్డ కష్టాలన్నింటినీ కాస్త కూడా కృతజ్ఞత లేకుండా అతను మరిచిపోవటాన్నీ చెప్పి గొణిగి, ఏడ్చి అతణ్ణి శపించిందే – అప్పుడు నాకనిపించింది – ఇలా అబద్ధాలాడనూ వొద్దు, ఇలా శపించటమూ వొద్దని… ఏదో ఆమె మనసును సమాధానపరచటం కోసం నేనూ తలూపుతూ ఉన్నానే కానీ, నాకర్థమయ్యింది: ఈ ముసల్ది అసూయలో కూరుకుపోయి రగిలిపోతోందోని… ముసల్దానికి ఇక్కడ ఏ కొరతా లేదు… సుఖంగానే ఉంది… ఉన్నప్పటికీ తాను కన్న బిడ్డవల్ల మిగతావాళ్లు ఇంకా సుఖపడిపోతున్నారేమోనన్న ఆత్రమూ, ముసల్దాని మనసును అతలాకుతలం చేస్తోంది…

అన్నీ ఈయన చెప్పే నాకూ అర్థమవుతోంది… లేకపోతే ఈ ముసల్దానితో కలిసి నేనూ శీనివాసును ఆడిపోసుకుని వచ్చుండేదాన్ని. ఈయన అన్నింటినీ ఎలా కచ్చితంగా, సుదీర్ఘంగా తరచి చూస్తారో? అందువల్ల తనకు నష్టమా లాభమా అని కూడా ఆలోచించనంటారు. ఎంతమంది దాన్ని అంగీకరిస్తారు, ఎంతమంది అంగీకరించరు అని ఏమాత్రం దిగులు పడరు. ఆయన శాస్త్రానికి, తర్కానికి కలిసిరాని ఒక కార్యానికి లోకమే ఆయనమీద నింద మోపినా ‘థూ’ అంటూ పక్కకు నెట్టేస్తారు. అలా దాన్ని నెట్టేయటం ఎంత న్యాయమో, లోకాన్నే లాగి పట్టుకుని వాదించటానికి తయారుగా ఉంటారు. నేనూ ఇంతకాలంగా చూస్తున్నాగా… ఒక్కరైనా, “అదేంటో, మీరు చెప్పింది, సరికాదు స్వామీ” అని చెప్పి వెళ్లింది లేదు. అలా చెబుతూ వచ్చేవారు.

వాళ్లతో కలిసి అరుగుమీద కూర్చుని ఈయన మాట్లాడుతుంటే, నేను ఆయన వీపుకు వెనక గదిలో కూర్చుని వింటూండేదాన్ని. ఆయన మాటల్లో చాలా విషయాలు నాకర్థమయ్యేవే కావు. ఆయన ఎంత బాగా ఇంగ్లీషు మాట్లాడుతారు! నాకు తెలిసి ఇరవైఏళ్లకు పైగానే ఈయన ఇంగ్లీషు చదివారు. ఒకరికి సంస్కృతం పాఠం చెప్పిస్తూ – ఆయనకు ఈయనకన్నా వయస్సు కాస్త ఎక్కువే ఉంటుంది – ఆయన దగ్గర ఈయన ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఇక్కణ్ణిండి కుంబకోణానికి వెళ్లొస్తూ ఏంటేంటో పరీక్షలన్నీ రాశారు. ఇప్పుడు, ఈయన రాసిన పుస్తకాలన్నీ అక్కడ చదువుకుంటున్నవాళ్లకు పాఠాలుగా పెట్టున్నారట.

పదేళ్ల క్రితం కాశీలో ఏదో మహానాడు అంటూ ఈయన వెళుతుంటే, నేనూ వెంట వెళ్లాను. ఈయనకు ఏంటేంటో బిరుదులన్నీ ఇచ్చారు… నాకెంతో గొప్పగా అనిపించింది. నేను వెండి గోళం నిండుగా గంగా తీర్థాన్ని తీసుకొచ్చి, ఊళ్లో ఉన్నవాళ్లకంతా ఇచ్చాను. నాకేం తక్కువనీ?

అప్పుడే కాశీ నుండి తిరిగొస్తున్నప్పుడు చెన్నపట్నంలో శీనివాసు ఇంట్లో బసచేశాం. పట్నం రైల్ స్టేషనుకు, శ్రీనివాసు మోటార్‌ కారుతో వచ్చాడు. రైల్ స్టేషన్లో మమ్మల్ని నిలబెట్టి సాష్టాంగంగా నమస్కారం చేశాడు. సముద్రతీరాన్నంతా చుట్టి చూపించాడు. చెన్నపట్నంలో మోటార్‌ కారు లేకుండా ఏమీ కాదట. అప్పుడూ మునుపటిలాగానే ఈయన దగ్గరికొచ్చి చేతులు కట్టుకుని నిలబడి ఏమేమో సందేహాలన్నీ అడిగాడు. అయితే అతను కాలేజీకి వెళుతున్నప్పుడు అతణ్ణి చూడ్డానికి నాకే భయమనిపించింది. దొరలాగా ఏవేవో తగిలించుకున్నాడు. ఈయనేమో వాటిని చూసి ‘ఓహ్’ అంటూ నవ్వారు.

ఆ తర్వాత ఒక రోజు – ఈ ఇంటి ముందు పెద్ద కారొచ్చి ఆగింది. ఎవరెవరో పెద్ద మనుషులు – శ్రీనివాసు ప్రొఫసరుగా ఉన్నాడే ఆ కాలేజీకి సంబంధించినవాళ్లుట – అందరూ వచ్చి – ఈ ఇంటి అరుగుమీదే కూర్చున్నారు – శ్రీనివాసు మాత్రం సరాసరి వంటగదిలోకే వచ్చేశాడు. నేను వాడితో ‘అప్పుడప్పుడూ ఒక అడుగు ఇటొచ్చి తల్లిని చూసి వెళ్లకూడదూ’ అని అడిగాను… ‘నాకెక్కడ వీలవుతుంది… నాతో వచ్చేయమని పిలిచినా రానంటోందే’ అని చెప్పి బాధపడ్డాడు. తర్వాత వాడు వచ్చిన విషయాన్ని చెప్పాడు.

వాడు ఉద్యోగం చేసే కాలేజీలో ఈయన్ను ఏదో పెద్ద ఉద్యోగంలో పెట్టుకోవటానికి అనుమతి కోరనున్నారట. అయితే, ఈయన్ను అడగటానికి భయపడుతున్నారట. ‘నేను అడిగి ఆయన్ను ఒప్పిస్తానని’ ధైర్యమిచ్చి ఇతను వెంటబెట్టుకొని వచ్చాడట. ఇంకా ఏంటేంటో చెప్పాడు… నాక్కూడా చాలా కోరికగానే ఉంది.

ఈయన రాగానే, అందరూ అరుగుమీద కూర్చుని మాట్లాడారు, మాట్లాడారు, అంతగా మాట్లాడారు. నేను గదిలో కూర్చుని వింటూ ఉన్నాను. నాకు ఆయన మాట్లాడిన విషయాలేవీ అర్థం కాలేదు. అయితే, ఒకటి అర్థమైంది… వాళ్ల పంతం ఈయన ముందు పనిచెయ్యలేదు…

చివరకు, ఆ రోజు వాళ్లంతా వెళ్లిపోయాక నేనే అడిగేశాను: “మీరు ఈ ఉద్యోగానికి అంగీకరిస్తే ఏంటీ? అక్కడ చదువుకుంటున్నవాళ్లూ విద్యార్థులేగా? అక్కడ చెప్పిచ్చినా ఇదే పాఠమేగా?… మీకెందుకింత మొండితనం? పాపం! శ్రీనివాసు ఎంతో ఆశగా నమ్మకంతో వచ్చాడు!” నేను చెప్పినదాన్ని విని ఆయన నవ్వారు.

ఈయనకు ఇదొకటి… పుట్టుకతోటే వచ్చిందా నవ్వు. అందులోనూ ఈ నవ్వుందే నా ముందు మాత్రమే.

నవ్వుతూనే చెప్పారు: “శీనివాసు కట్టుకుని తిరుగుతున్నాడే ఆ విధంగా నాకూ వేషం వేయించి చూడాలని నీకు కోరికగా ఉన్నట్టుంది… విద్యాభ్యాసం చెయ్యించటానికి కూలీ తీసుకోకూడదని నీకు తెలీదా? గురువుకు కూలీ ఇచ్చేశాక విద్యార్థికి ఆయన దగ్గర ఏం మర్యాద ఉంటుంది? ఎలా మర్యాద ఉంటుంది? ఇతను కూలీ తీసుకునేవాడు అయిపోతాడుగా… కూలీ చాలదని జెండా పట్టుకుని గట్టిగా అరుస్తూ – నన్ను జెండా పట్టుకోవటానికి, గట్టిగా అరవటానికి పిలవకపోయినా – ఆ గుంపుకు నాయకుడిగా రమ్మంటారు… నాకివన్నీ అయ్యే పన్లేనా? నువ్వే చెప్పు” అన్నారు.

నేనేమని చెప్పేది?… మాట్లాడకుండా ఆయన మాట్లాడుతున్నదంతా నోర్మూసుకుని వింటూ ఉండిపోయాను.

ఈయన ఒంటిమీద చొక్కా వేసుకుని నిలబడ్డట్టుగా ఊహించుకున్నప్పుడు నాకు నవ్వు తన్నుకొచ్చింది. ఆ ఊహే సంబంధం లేకుండా ఉన్నదే… నేనూ ఆయనతో కలిసి నవ్వి, ఆ విషయాన్ని అంతటితో వదిలేశాను.

ఆయన గురించి తెలిసీ నేను వెళ్లి ఆయన్ను అడగటాన్ని ఊహించుకొని సిగ్గుపడ్డాను. అయినప్పటికీ ఈ నలభై ఏళ్లల్లో దద్దమ్మగానే ఉన్నాను… కొత్త కొత్తగా ఏదైనా తెలివిలేని పని చెయ్యటం, ఆయన నవ్వటమూ… అలాంటి ఒక జన్మ అయిపోయాను.

ఒక పదిరోజుల ముందు చూడండి… ఇలాగే – ఈయన దగ్గర చదువుకునే పిల్లవాడొకడు… ఏదో ఒక చీటీని తీసుకొచ్చి, “మామీ మామీ… ఇది గవురుమెంటు నడిపే లాట్రీ టిక్కెట్లో అదృష్ట టిక్కెట్లో… ఏంటో చెప్పి ఒక్క రూపాయే… తీసుకోండి… దొరకటమే కష్టం… మీకోసమే కలిపి నేను తీసుకొచ్చాను.” అని ఇచ్చాడు… నేనూ దాని గురించంతా పెద్దగా ఏమీ అనుకోకుండా, ఏదో బిడ్డ మనల్ని అనుకుని అక్కరగా తీసుకొచ్చాడని ఒక రూపాయిచ్చి తీసుకున్నాను.

ఆ పసివాడు దాని గురించి ఒక పెద్ద ప్రసంగమే చేశాడు – ఎంతోమంది అందులో బహుమతి వచ్చి లక్షాధికారిగా అయ్యారట… పేదవాళ్లకే అదీ కొడుతుందట… ఇంకా ఏంటేంటో చెప్పాడు… నేను ఊరకే ఒక సరదాకోసం కొన్నాను… అయితే… ఆరోజు సాయంత్రమే ఈయన అరుగుమీద కూర్చుని ఒక అయిదారుగురు ముందు ఈ లాటరీ టిక్కెట్టు గురించి చీల్చి చెండాడుతున్నాడే చూద్దాం.

గదిలో కూర్చుని వింటుంటే – నన్ను అలాగే చెవులు పట్టుకొని చెళ్లు చెళ్లుమని చెంపలపై చరిచినట్టుగా అనిపించింది.

అందులోనూ ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే, అది సాధారణంగా ఎప్పుడూ చేస్తారే ఆ విధంగా నిదానంగా, వాదనలా లేదు, ఈ లోకాన్నే శపించటానికి బయలుదేరినట్టుగా ఆవేశంతో అరిచారు.

ఎందుకు ఈయనకు ఇందులో ఇంతగా కోపం ముంచుకొస్తోందో నాకర్థం కాలేదు.

“ఈ దేశంలో ఇది జరగొచ్చా అంటున్నాను… జూదగాడు జూదమాడనీ. వ్యభిచారి వ్యభిచరించనీ… రాచరికం చేసేవాడూ, లోక పరిపాలన చేసేవాడూ దీన్ని చెయ్చొచ్చా అంటున్నాను… కలియుగం అంతమై, మనం నాశనమైపోవటానికి ఇదే ఆనవాలు. ధర్మం తప్పకుండా రాజ్య పరిపాలన చేసిన ధర్మరాజు ఎలా నాశనమయ్యాడు?… ఆలోచించండి… ధర్మరాజే జూదం వల్లేగా నాశనమయ్యాడు… జూదంలో గెలిచినవాడూ బతకలేడు, ఓడినవాడూ బతకలేడన్న సత్యాన్ని కదా అయ్యా, మహాభారతం చెబుతోంది… జూదానికీ ఒక ధర్మం ఉంది, వినూ… సమ అంతస్తులో ఉన్నవాళ్లే జూదమాడవచ్చు… అదీ పాపమే… ఆ పాపానికీ ఒక హద్దు పెట్టున్నాడు… రాచరికం చేసేవాడూ, రాజ్య పరిపాలన చేసేవాడూ పామర జనాలనంతా ఇలా మాయాజాలం చేసి జూదమాడుతున్నాడే, ఇది సహించేదేనా? అయిపోయింది… అంతా అయిపోయింది. ఇకపై ఈ జన సమూహంలో ఏ వ్యవస్థా ఉండదు… ఓయ్ పేదరికంతో నాశనమవ్వటం కన్నా జూదంవల్లే ఈ జన సమూహమే నాశనమై పోతుంది. తిరువళ్లువరకు వీధివీధికీ విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తే సరిపోతుందా… ఆయన జూదం అన్న విషయంపై ఒక అధ్యాయమే రాసి పెట్టారుగా…” అంటూ ఆ పది పాటలనూ ఉదహరించి చెప్పారు. అర్థమూ చెప్పారు… మహాభారతం నుండి పద్యాలను పాడారు. ‘బాగు పడరు… బాగు పడనే పడరు’ అంటూ తల కొట్టుకున్నారు.

నాకు కడుపులో దేవినట్లైంది… ఎందుకురా, ఈ శనిదాణ్ణి ఒక రూపాయిచ్చి కొన్నామని అనిపించింది. అయినా ఎందుకీయన దీనికోసం ఇంతగా ఆవేశం తెచ్చుకుంటున్నారో అర్థం కాలేదు. ఈయన చొక్కా తొడుక్కోవటం లేదు; అందుకని లోకమే ఈయనలాగే చొక్కాలేకుండా, పిలక పెట్టుకుని, పంచాంగం చూసి క్షవరం చేసుకోవాలని చెబుతున్నారేనని – నేను చేసిన పనికి సౌకర్యంగా మనసులోనే, ఎదురు వాదం చేసుకున్నాను.

ఆ టిక్కెట్టును కొని పెట్టుకోవటం వల్ల ఇప్పుడు నష్టమేమిటని నాకు నేను సమాధానపరుచుకున్నా, ఉన్నట్టుండి మన పోగాలం ఒక వంద రూపాయలు కొట్టిందనుకోండి… ఊరంతా ఇదే అగుడు అయిపోదూ!…

అందులోనూ ఈయన ఈ రకంగా మాట్లాడుతుంటే… నేను కొని అది బహుమతి కొట్టిందంటే, ఈయన యోగ్యతను అందరూ అనుమానిస్తారేమోనని నా మనసు తొలుస్తూనే ఉంది…

ఆ బిడ్డ – వాడే టిక్కెట్టు ఇచ్చినవాడు – చెప్పిందేంటంటే; పత్రికలవాళ్లందరూ ఫోటో తీసేవాణ్ణి వెంటబెట్టుకుని ఏ పల్లెటూరు వాడైనప్పటికీ వెతుక్కుంటూ వచ్చేస్తారట… చెన్నపట్నంలో దీనికోసమని గొప్ప సంబరం చేసి, చాలా పెద్ద పెద్ద వాళ్లచేతుల మీదుగానే దీన్ని ఇస్తారుట… అరె కష్ట కాలమే!…

సరే. ఏంటో కొనేశాను; ఇదంతా ఏంటీ పనికిమాలిన ఊహలని ఆయన దగ్గర ఈ విషయంగా నేనొక మాట కూడా చెప్పలేదు… కావాలనే ఆ రోజు ఆయనకు అన్నం వడ్డిస్తున్నప్పుడు నేనే మాటల్ని కదిపాను…

“ఏంటది? ఏంటో ప్రైజు టిక్కెట్టట… ఒక రూపాయిచ్చి కొన్నవాళ్లకు ఒక లక్ష రూపాయలు దొరుకుతాయట… గవురుమెంటోడే జరపటం వల్ల అబద్ధం, మోసం ఏవీ ఉండవట. నిజాయితీగా జరుగుతుందట. పక్కింటి అమ్మాయి పది రూపాయలకు ఒకేసారి కొనేసిందట. అదేంటది?…” అని అడిగాను.

“అది మనింటి వంటగది దాకా వచ్చేసిందా? అది రాజ్యాంగం జరిపే జూదం – అంతే. వాంతులూ బేదులూ లాగా జనాలను వెంటబడి వెంటబడి పట్టుకుంటుందది. వాంతులూ బేదులూ రాకుండా అడ్డుకునే కార్యాన్ని చేసే గవర్నమెంటోడే దీన్నీ చేస్తున్నాడు. అందుకని వాళ్లకు డబ్బు లభిస్తుందట. పేదలు లక్షాధిపతులు అవుతారట… ఎలాగైనా పోనీ, నువ్వూ నేనూ లక్షాధిపతులు కాలేదనా ఏడుస్తున్నాం? మనకెందుకు దాని గురించి?” అన్నారు.

“ఒక లక్షను తీసుకొచ్చి మీ దగ్గరిస్తే, వొద్దని చెప్పేస్తారా?” అన్నాను.

ఈయన నన్ను చూసి నవ్వారు. నాకు అవమానంగా అనిపించింది. సిగ్గుతో ముడుచుకుపోయాను.

“నలభై ఏళ్లు నాతో జీవించిన నీకా, ఇలాంటి ఒక అనుమానం వచ్చింది” అని అడుగుతున్నట్టుగా ఉంది ఆ నవ్వు… నేను తల దించుకున్నాను. “మీరు వొద్దనే చెబుతారు; అది నాకు తెలుసు. ఎందుకలా చెప్పాలని అడుగుతున్నాను?… మీ ముత్తాతకు మాన్యంగా దక్కిన ఈ ఇంటికి, ఈ ఉత్తర దిక్కులో మూడేళ్లుగా గోడకు పగుళ్లిచ్చి, వర్షం పడుతున్నప్పుడు ఒకటే కాలవలుగా పారుతోందే – దాన్ని సరిచెయ్యటానికి దారిలేక ఉన్నామే – మనకు డబ్బు అవసరం ఉందిగా… ఎందుకు అదృష్టలక్ష్మిని అలక్ష్యం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. అది తప్పా?” అని అడిగాను.

“ఓ! నువ్వు మాట్లాడటం చూస్తుంటే నీకు ఆ టిక్కెట్టు కొనాలని ఒక కోరిక ఉన్నట్టుంది; అంతేగా?” అని అడిగారు. నేను మాట్లాడకుండా ఉండిపోయాను. “మొద్దూ…మొద్దూ… కోరికే మానానికి శత్రువు. దానికి బహుమతి రాదని నేను దాన్ని తప్పని చెప్పటం లేదు. వచ్చినా అది అధర్మంగా వచ్చిన, ఎంతో మందిని కడుపు మండించి సంపాదించే డబ్బని చెబుతాను. రుజు మార్గంలో సంపాదించకుండా వచ్చే సంపద, పాపంతో కూడినదంటే… నువ్వు చెప్పావే మా ముత్తాత గురించి… వాళ్లంతా భిక్షాటనం చేసే మహా మేధావులుగా ఉన్నారు… నాకు బాగా గుర్తుంది… నాన్నగారు, ఇదే శంకర మఠంలో పగలంతా విద్యాభ్యాసం చెయ్యించేవారు… సాయంకాలం కాలక్షేపం చేసేవారు. ఉదయం భిక్షాటనానికి వెళ్లేవారు… రెండో పూటకి మిగలకుండా ఉండేంతగా ఆ పాత్రలు ఉండేవి. శ్లోకాలను వల్లెవేస్తూ ఆయన నడివీధిలో నడిచేవారు… ఇంట్లో నుండి ఆ ఇంటి పసిబిడ్డ చేతిలో ఒక పిడికెడు బియ్యం కొలతగా తీసుకొచ్చి నడివీధిలో వచ్చి ఆయనకు భిక్ష వేసేది… ఎందుకో తెలుసా పసిబిడ్డ చేతిని కొలతగా తీసుకుంటే?… పెద్దవాళ్ల చెయ్యి కొలతైతే నాలుగిండ్లతో పాత్రలు నిండిపోయేవి. మిగతావాళ్లు ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటారుగా, ఆ భిక్షను కాదన్న పాపం, ఎక్కువగా వేసినవాళ్లకు వచ్చెయ్యదూ?…అందుకే. అలాంటి పాత్ర నిండిపోయినా ఎవరైనా తీసుకొస్తే, దాన్ని స్వీకరించరు. భిక్ష వెయ్యటానికి వచ్చిన వాళ్లు తలమీద రెండు అక్షితలను ఈయన పాత్రలోనుండి వేసి ఆశీర్వాదం చేసి వచ్చేవారు… ఆ వంశంలో వచ్చిన పుణ్యమే ఈ జ్ఞానం అబ్బింది. దీన్ని మించిన అదృష్టం ఇంకేముంటుందని నాకు తెలియటం లేదు… ఈ ప్రశాంతతను, ఈ మనశ్శాంతిని, ఎన్ని లక్షలు ఇవ్వగలుగుతుంది?… జూదంలో, డబ్బుతో లక్షాధిపతులను ఈ ప్రభుత్వం రూపొందించవచ్చు. ఒక జ్ఞానవంతుణ్ణి, ఒక చతుర్వేద పండితుణ్ణి రూపొందించమని చెప్పూ, చూద్దాం” అని ఆరోజంతా, అటుఇటు వెళ్లొచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదంతా జరిగి పదిరోజులకు పైగానే అయ్యింది… ఆ టిక్కెట్టు విషయాన్నే నేను మరిచిపోయాను…

నిన్న ఆ బిడ్డ – టిక్కెట్టు తీసుకొచ్చి ఇచ్చాడే – ఒక పేపరును తీసుకొచ్చి ‘ప్రైజ్ కొట్టిన నెంబర్లన్నీ వచ్చున్నాయి… మీ టిక్కెట్టును తీసుకు రండి చూద్దాం’ అని ఉత్సాహంగా అరుచుకుంటూ పరుగెత్తుకొచ్చాడు. మంచి కాలం! ఆ సమయానికి ఆయన ఇంట్లో లేరు.

నాకు కడుపులో ఏదో అయ్యింది. ‘ఈశ్వరా. నన్ను పట్టించెయ్యకు’ అని వేడుకుంటుంటే, ఒక ఆలోచన వచ్చింది.

“దాన్ని ఎక్కడ పెట్టానో కనిపించటం లేదురా నాయినా” అని వాడితో చెప్పేశాను… అందులో ఏదైనా నెంబర్ వచ్చి సచ్చిందంటే, ఊరే ఇక్కడికొచ్చి గుమికూడదూ? ఆ బిడ్డకు అట్టే ముఖం వాడిపోయింది.

కోపగించుకుంటున్నట్టుగా చూసి ఆ పేపర్‌ను అక్కడే పడేసి వెళ్లిపోయాడు.

వాడు వెళ్లాక నేనే ఆ పేపర్‌ను తీసుకుని గదిలోకి వెళ్లి, పక్కన పెట్టుకుని చూశాను.

నాకు చదువు రాకపోయినా అంకెలు తెలుసు. ఆ అంకెలకు ముందు ఏవో అక్షరాలున్నాయి. అదేంటో తెలియటం లేదు. అయితే, అదే మాదిరి ఈ టిక్కెట్టులో ఉందాని వెతికి చూశాను…

భగవంతుడా! చూడగానే మొట్టమొదటగా అదే విధంగా రెండు అంకె… తర్వాత అదే విధంగా మూడు… ఏడు, సున్న… ఒకటి… ఒకటీ… ఆరు!…

అంటే, ఒక లక్ష రూపాయలు నాకే అదృష్టం వరించిందా?… అయ్యయ్యో… ఇప్పుడు నేనేం చేసేది? మధ్యాహ్నం ఆయన వచ్చినప్పుడు, టిక్కెట్టును తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెట్టి “నన్ను క్షమించండి” అంటూ ఏడ్చాను.

“నేను సరదాగా ఆ బిడ్డ బలవంతం చేశాడని కొనేశాను. దీని గురించి మీరింత కోపంగా ఉన్నారని తర్వాతే తెలిసింది… మనకెక్కడ కొట్టబోతుందని పరాకుగా ఉండిపోయాను… ప్రైజ్ కొట్టగూడదని స్వామినీ వేడుకున్నాను… ఇప్పుడు ఈ విధంగా అయిపోయిందే… క్షమించి దీన్ని నన్నూ అంగీకరించే తీరాలి” అని ఏడ్చాను.

ఆయన అదే విధంగా నవ్వారు. నవ్వుతూ నన్ను పైకి లేవదీశారు. ముఖంలో నవ్వు మారకుండా చెప్పారు:

“ఒసేయ్!… నువ్వు ఇప్పుడు లక్షాధికారివి అయిపోయావు… శెభాష్!…. ఇది నాకు సంబంధం లేకుండా నువ్వే వెతుక్కున్న సంపద. ఎందుకు నా పాదాల దగ్గరకు తీసుకొచ్చి పెట్టి ఈ పాపాన్ని నా తలకు చుట్టటానికి ప్రయత్నిస్తున్నావు! నాకు లక్ష వొద్దని చెప్పింది సరదా కోసం కాదు… నిజంగానే నాకు వొద్దు. నాకున్న దిగులంతా మునుపటిలా – ఒక ఇరవై ఏళ్లకు మునుపు ఉన్నట్టు కాకుండా… ఇప్పుడు రాన్రానూ వేదాభ్యాసం చేసేవాళ్లు తగ్గిపోతూ వస్తున్నారే అన్నదే… ఇంకా ఒక పదిమంది పిల్లలు ఇందుకు దొరికితే చాలు… డబ్బుతో వాళ్లు రాలేరు… డబ్బుకోసమూ రాకూడదు. ఇది నీకు అర్థం కాదు. సరే, ఇది నీ సమస్య. నేనెప్పుడూ భిక్షావృత్తి చేసే బ్రాహ్మణుణ్ణే. నా తండ్రి, తాత – అందరూ వచ్చిన దారి అదే. లక్షాధికారికి భర్తగా ఉండే అర్హత అంతస్తు, ఏదీ నాకు లేదు…” అని మాట్లాడుతూ ఉండిపోయారు ఆయన.

“ఎందుకిలాగంతా వేరుచేసి మాట్లాడుతున్నారు?… ఇప్పుడు నేను ఈ విషయంలో ఏం చెయ్యాలో చెప్పండి… నేను చేస్తాను… నేనిలా జరుగుతుందని అనుకోనిది; జరిగిపోయింది… ఇకపై నేనేం చెయ్యాలి” అని ఆయన్ను మళ్లీ మళ్లీ అడిగాను… కొంచెం కూడా మనసులో తడి లేకుండా నన్ను చూసి ఆయన నవ్వుతున్నారు.

చివరకు ఆయనకు పాఠశాలకు వెళ్లేందుకు సమయమైందట… వెళుతున్నప్పుడు అదే విధంగా నవ్వుతూ చెప్పి వెళ్లారు: “ఈ అదృష్ట టిక్కెట్టును ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటే అది నీ ఇష్టం. సరాసరి వెళ్లి ఫోటో తీసుకుని పత్రికలో ఫోటో వెయ్యించుకుని జామ్మంటూ నువ్వు బ్రతకొచ్చు… నేను పలానా ఆయన సహధర్మచారిణి అంటూ చెప్పుకోకూడదు… ఊ, నీ తృప్తికి ఆ అబద్ధాన్ని చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చుకో. లేకుంటే – ఈ మాయ వలలో నేను పడను; నాకు ఇది వద్దని ఆ దరిద్ర టిక్కెట్టును చించి పడేయ్. ఔను చించి పడేసేయ్. ఇంకెవరి దగ్గరైనా ఇచ్చి దానికి వడ్డీ తీసుకున్నా ఒకటే. కృతజ్ఞతలను తీసుకున్నా ఒకటే. జూదం మనసుకు అవన్నీ తోస్తాయి. వాటికంతా బలి కాకుండా ఏ రకంగానూ ఆ జూదానికి లొంగకుండా దాన్ని చించి పడేశెయ్. రెండూ నీ ఇష్టమే. అది పాపమా, భాగ్యమా అని నిర్ణయించుకోవలసింది నువ్వు; నాకు సమయమౌతోంది!” అని చెప్పేసి వెళ్లిపోతూ ఉన్నారే!

దీనికి నేనేం చెయ్యను, చెప్పండి. దేవుడా! ఒక లక్ష! ఈ ఒక లక్షను, అదృష్ట లక్ష్మిని, నిర్దాక్షిణ్యంగా చించి పడెయ్యటమా? ఆయన చేతికిస్తే, చించి పడేస్తారు, ఆయనలాంటి జ్ఞానులకు అది సులభం.

మనలాంటి అజ్ఞానులకు అది అయ్యే కార్యమా, చెప్పండి? ఎన్నో లక్షలకన్నా ఈయన గొప్పవారే. నేను కాదనటం లేదు. ఆ లక్షలను గడ్డిపోచగా తలుస్తున్నారే, ఈ మహా పురుషుడు భిక్షావృత్తి చేశారంటే ఈయనకు ఏ లోటూ రాదు. ఇలాంటి వ్యక్తులతో సంసారం చేస్తే, ఆ భిక్షావృత్తి జీవితంలోనూ నాకు గౌరవం ఉంటుంది. డబ్బు గొప్పదా, జ్ఞానం గొప్పదా అన్నదంతా నాకు తెలియదు. అయితే, డబ్బు – అది ఎంత ఎక్కువైనా ఎలా స్థిరంగా ఉండదో అదే విధంగా మనుషులూ ఎంత గొప్ప జ్ఞానులుగా ఉన్నా జీవితం శాశ్వతం కాదే!

ఇలా అనుకోవటమో చెప్పటమో మహా పాపం. అయితే ఈ కాలంలో ఎలాంటి పతివ్రతైనా సహగమనం చెయ్యటం లేదే! ఈయన తర్వాత ఒకవేళ నేను ఉండాల్సి వచ్చిందంటే… శివ శివా!….

భిక్షావృత్తి చెయ్యటంలో నాకేంటి గొప్ప! అందరూ బిచ్చగత్తె అని అంటారు. ‘కట్టుకున్నదాన్ని బిచ్చగత్తెగా వొదిలేశాడు’ అని ఈ మహాజ్ఞాని గురించీ మాట్లాడుతారు.

ఆయన చించి పడేయొచ్చు. నేను అలా చెయ్యొచ్చా? అయితే, ఆయన అలా చెప్పేసి వెళ్లిపోయారు. నేను చేతిలో టిక్కెట్టును పట్టుకుని నిలబడ్డాను. బరువనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి – చెప్పండి?

తమిళ మూలం: జయకాంతన్

అనువాదం: జిల్లేళ్ల బాలాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here