[box type=’note’ fontsize=’16’] కాలుష్య కారక ఉద్గారాలను నియంత్రించడానికి ఒక అవగాహనకు వచ్చిన అనంతరం కుదిరిన ‘క్యోటో’ ఒప్పందం గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]
‘క్యోటో’ ప్రోటోకోల్:
[dropcap]క్యో[/dropcap]టో సదస్సులో యుద్ధ ప్రాతిపదికన ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయం తీసుకోబడింది. కాలుష్య కారక ఉద్గారాలను నియంత్రించడానికి ఒక అవగాహనకు వచ్చిన అనంతరం కుదిరిన ఈ ‘క్యోటో’ ఒప్పందంపై పారిశ్రామిక దేశాలన్నీ సంతకం చేశాయి. అప్పటికీ జనాభాపరంగా చిన్నదేశమే అయినా అమెరికాయే గ్రీన్‍హౌస్ వాయువుల విడుదలలో అగ్రస్థానంలో ఉంది. 25% గ్రీన్‍హౌస్ వాయువులను వాతావరణంలోకి యదేచ్ఛగా వదులుతున్న అమెరికా 5% ఉద్గారాలను తగ్గించడానికి మాత్రమే అంగీకరించింది. ఎర్త్+5లో సైతం అమెరికా అంటీ ముట్టనట్టే వ్యవహరించింది. 2010 నాటికైనా 15% ఉద్గారాలను నియంత్రించాలని లక్ష్యం నిర్దేశించిన సందర్భంలోనూ అమెరికా నోరు మెదపలేదు. పర్యావరణ పరిరక్షణ ఒప్పందాల పేరిట దేశంలోని అనేక పరిశ్రమలు మూతపడటం అమెరికాకు ఇష్టం లేకపోవటమే దానికి కారణం.
ఈ ఒప్పందం తరువాత ఉద్గారాల కాలుష్యరహిత ‘యంత్రాంగం’ ఏర్పడింది. అమెరికా సంతకం చేయలేదు కాని మిగిలిన పారిశ్రామిక దేశాలన్నీ సంతకం చేశాయి. ఒప్పందం అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉద్గారాలను తగ్గించగలిగిన దేశాలకు ‘దృవీకృత ఉద్గారాల తగ్గింపు పత్రం’ లభిస్తుంది. ఈ పత్రాన్ని CER (కార్బన్ ఎమిషన్ రిడక్షన్) సర్టిఫికేట్ లేదా ‘కార్బన్ క్రెడిట్’ అంటారు. ఒక టన్ను ఉద్గారాలను నియంత్రించగలిగితే ఒక CER సర్టిఫికేట్ లభిస్తుంది. ఈ సర్టిఫికేట్‍కు నగదులోనికి మారకపు విలువ కూడా ఉంటుంది.
క్యోటో ఒప్పందంలోని సభ్యదేశాలు నగదు రూపంలో విలువను చెల్లించడం ద్వారా ఈ సర్టిఫికేట్లను కొనుక్కోవచ్చు. వివిధ రకాలుగా వెలువడే ఉద్గారాలను నియంత్రించడం ద్వారాగాని, కార్బన్ శోషణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గాని పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసినవారికి ఇది పరోక్ష ప్రయోజనం.
అయితే క్యోటో ఒప్పందం నాటికే, పారిశ్రామిక దేశాల్లో సింహశాతానికి కారణంగా ఉన్నాయి. అమెరికా మొదటి స్థానంలో ఉండగా వరుసగా చైనా, రష్యా, జపాన్, జర్మనీలు 2,3,4,5 స్థానాలలో ఉన్నాయి. ఆ కారణంగా ఉద్గారాల నియంత్రణ బాధ్యత 2000 సంవత్సరాల వరకు సంపన్న దేశాలదేగా నిర్ణయించబడింది. ఈ నేపధ్యంలో ఉద్గారాలను నియంత్రించే దిశగా చిత్తశుద్ధితో పనిచేసే దేశాలనుండి కార్బన్ సర్టిఫికేట్లను కొనుగోలు చేసి తాము మాత్రం బాధ్యతారహితంగా ఉద్గారాలను విడుదల చేస్తూ పోయే అవకాశం లేకుండా “ఏ దేశమైనా 75% ఉద్గారాలను నియంత్రించగలిగినప్పుడే 25% ఉద్గారాలకు సంబంధించి కార్బన్ సర్టిఫికేట్లను కొనుగోలు చేయగలదు” అన్న నిబంధన విధించబడింది. ఇది ఎకాఎకి సంపన్న దేశాలకు గురిపెట్టబడిన నిబంధన. ఆర్థికంగా బలహీనంగా ఉన్నదేశాలను ప్రలోభపెట్టి వాటినుండి సర్టిఫికేట్లను కొనుగోలు చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా తమకున్న బాధ్యత నుండి తప్పించుకునే అవకాశాన్ని ఈ నిబంధన అడ్డుకుంటుంది. ఈ కార్బన్ సర్టిఫికేట్ల లావాదేవీలన్నీ అన్‍లైన్లో జరుగుతాయి. అప్పటి అవసరాల రీత్యా ఒక్కొక్క సర్టిఫికేట్ ధర మన కరెన్సీలో 1500 రూపాయలు వరకు ఉండేది.
ఈ నేపధ్యంలో చైనా Clean Development Mechanism (C.D.M) సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ పోతోంది.
భారతదేశం సైతం 2010లో 1 లక్షా 30,000 కోట్ల విలువైన C.D.M ప్రాజెక్టులు చేపట్టి 17కోట్ల టన్నులు ఉద్గారాలను తగ్గించగలిగింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలన్నీ ఈ కోవలోనివే.
సమస్య తీవ్రతను గుర్తించిన మరికొన్ని దేశాలు సైతం ఉద్గారాల నియంత్రణ దిశగా దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం, సంపన్న దేశాలు కూడా ఆ బాట పట్టడం ‘క్యోటో’ ఒప్పందం అనంతర పరిణామంలో చెప్పుకోదగిన అంశం.