ఆదివారం.
తుషారకి స్కూల్లో స్పెషల్ క్లాసుండడంతో మేమిద్దరం పెందరాళే భోజనం చేసేసి సోఫాలో వాలాం. అమెజాన్ ప్రైమ్‌లో ఏదో కొత్త సినిమా పెట్టాడు శ్రీధర్. ఒకరి సాన్నిధ్యాన్ని ఒకరం ఆస్వాదిస్తూ సినిమా చూస్తుంటే కాలింగ్ బెల్ మోగింది.
శ్రీధర్ చిరాకుపడ్డాడు. నాకూ విసుగ్గానే అనిపించింది.
పొద్దున్న పదకొండింటికేదో ‘అసోసియేషన్ మీటిం’గుందనీ, తప్పకుండా రావాలనీ చెప్పడం గుర్తొచ్చింది. ఇప్పటికి అయిపోయి ఉండాలి.
అదే శ్రీధర్ కి చెప్తూ “ఏదో ఆఫీస్ బేరర్స్ ఉన్నారుగా. వాళ్లెలా పనిచేస్తున్నా మననించీ ఫిర్యాదులేవీ లేనపుడు అస్తమానూ ఈ మీటింగులేవిటో… మెయింటెనెన్స్ ఠంచనుగా కట్టిపడేస్తున్నా ఈ సుత్తి తప్పదు. తెరవకపోతే వాళ్లే పోతార్లే” అన్నా. ఒక నిముషం ఆగి మళ్లీ మోగింది.
ఆదివారం కదా, భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారేమో అనే ఆలోచనైనా లేదు. శ్రీధర్ కదలకపోవడంతో విసుక్కుంటూ లేచి వెళ్లాను. తలుపు తెరిచేసరికి ఎదురుగా పదేళ్ల పిల్ల నిలుచుని ఉంది.
నన్ను చూస్తూనే “ఆంటీ! మేం ఈ పక్క ఫ్లాట్ లోకి అద్దెకి వచ్చాం. నిన్ననే” అంది.
‘అయితే’ అన్నట్టు చూశాను, విషయం చెప్పమన్నట్టు.
చేతిలో చిన్న స్టీలుకప్పు చూపిస్తూ “తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగి తెమ్మంది మా అమ్మ” అంది. చిరాకు కనపడనీకుండా ఆ కప్పు తీసుకుని లోపలికొచ్చాను. ఎవరన్నట్టు చూశాడు శ్రీధర్.
“పక్కింట్లోకి అద్దెకొచ్చార్ట. తోడుకి పెరుగు కావాలని వచ్చింది” కప్పు చూపిస్తూ అన్నాను.
‘పాలూ పెరుగూ వెన్నా నెయ్యీ అన్నీ బజార్లో దొరుకుతూంటే ఇలా పక్కిళ్లలో అడుక్కోవడమెందుకో’ సణుక్కుంటూ ఫ్రిజ్ లోంచి పెరుగు గరిటతో తీసి కప్పులో వేసి ఇచ్చాను.
“థాంక్సాంటీ” అంటూ నవ్వబోయింది పక్కింటి పిల్ల.
ఈ పలకరింపులూ, చిరునవ్వులూ ఎక్కువైతే తర్వాత కట్ చేయడం కష్టం. అసలే తుషార పదో తరగతిలోకొచ్చింది. ఎవరి జోలికీ పోకుండా తన మానాన తను చదువుకుని క్లాసులో మంచి రాంకు తెచ్చుకుంటుంది. కొత్త పరిచయాలతో కొత్త మొహమాటాలూ ఇబ్బందులూ…
నా ఆలోచనలు ఎంతో కొంత మొహంలో, ముడిపడ్డ కనుబొమల్లో కనబడే ఉండాలి. అయినా కప్పు తీసుకుని వెళ్లిపోకుండా “ఆంటీ! దీదీ ఏం చేస్తోంది?” అడిగింది. తళుకుమంటున్న పిల్ల కళ్లని గమనిస్తూ “దీదీ లేదు. స్కూల్లో స్పెషల్ క్లాసుంది“ అన్నాను.
“సాయంత్రం కిందికొస్తుందా ఆడుకోడానికి?” అడిగింది.
“రాదు. తనకి చాలా వర్కుంటుంది” అని, ఆ పిల్ల తల వేలాడేసుకుని అటు తిరగ్గానే తలుపేసేశాను. మళ్లీ సోఫాలో చేరేసరికి సినిమాలో కీలక సంఘటన జరిగిపోయింది. హీరోని పోలీసులు తీసుకుపోతున్నారు.
“…కాసేపు పాజ్ పెట్టచ్చుగా…” అని విసుక్కున్నా. శ్రీధర్ వివరణతో మళ్లీ సినిమాలో లీనమైపోయాం.
తర్వాత రెండు రోజులకి పక్కింటావిడ గుమ్మంలోంచి పలకరించింది. వాళ్లది గుంటూరుట. ఆయన ఏదో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ లెక్చరర్‌ట. ముక్తసరిగా మాట్లాడాను గాని రమ్మని పిలవలేదు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కుతూ తీరికలేకుండా ఉన్న శ్రీధర్‌కీ, పై చదువులకొస్తున్న పిల్లకీ, చిన్నదో చితకదో ఉద్యోగం సాగిస్తున్న నాకూ దొరికే కామన్ టైమ్ చాలా తక్కువ. మా చిన్ని కుటుంబంలో మాకు మేమే చాలు.
అర్థమయిందనుకుంటా. ఎపుడైనా కారిడార్లోనో, గేటు దగ్గరో ఎదురుపడ్డా ‘హలో’ అనో ‘బావున్నారా’ అనో పలకరించి, సాగిపోవడం అలవాటయింది వాళ్లకీ.
**
శనివారం సాయంత్రం. గోవాలో ‘బాగా’ బీచ్…. విశాలమైన సముద్ర తీరం జనంతో కళకళలాడుతోంది.
లోతు ఎక్కువ లేకుండా బల్లపరుపుగా చాలా దూరం విస్తరించిన సముద్ర తీరం, కెరటాల కింద నుంచి ఇసుకా గులకరాళ్లూ కనిపిస్తుంటే రారమ్మని పిలిచినట్టనిపించింది.
కుదురు లేక పరుగెత్తే కెరటాలమీద నీరెండ నిలవలేక జారిపోతోంది. కారణం లేకుండా వాకిట్లో అటునించిటూ ఇటునుంచటూ గంతులేస్తూ కేరింతలాడే అల్లరిపిల్లల్లా, తీరానికీ సముద్రానికీ మధ్య కెరటాలు నురుగులతో పరుగులు తీస్తున్నాయి.
ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో ఆడుతూంటే సమయం తెలియలేదు. ఇద్దరం తేలికైన టీషర్ట్స్, షార్ట్స్‌లో సాగరతీరాన పరుగులు పెడుతుంటే మళ్లీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి. శ్రీధర్‌తో ఉంటే అంతే. గంటలు నిముషాల్లా గడిచిపోతాయి. పదిహేనేళ్ల తుషార ఇంట్లో తిరుగుతూ ఉండకపోతే పెళ్ళై, ఇరవయ్యేళ్లయిందని గుర్తుకూడా ఉండేది కాదేమో!
పారా సెయిలింగ్ బావుంటుందనీ, ట్రై చెయ్యమనీ అడుగుతూ జాలరి వాళ్ళు విసిగిస్తుంటే నా అనుమతి కోసం చూడకుండా శ్రీధర్ రెండు టికెట్లు కొనేశాడు. అడక్కుండా కొనేశాడని కోపంగా చూస్తూ ‘నేను రా’నన్నాను.
“ఏయ్ పిరికీ! ఎంత బావుంటుందో తెలుసా? థ్రిల్ ఉండాలి లైఫ్‌లో!” తేనెరంగు కూలింగ్ గ్లాసెస్ వెనక అతని అల్లరికళ్లు కవ్వించాయి.
ఆఖరిరోజు కదా ఒక జ్ఞాపకంగా ఉండిపోయేదేదైనా చేస్తే బావుంటుందనిపించింది. మళ్లీ తుషార ఇంటర్మీడియేట్ పూర్తై ప్రొఫెషనల్ కోర్సులో చేరేవరకూ ఇలా హాలీడేస్ కుదరవు.
“నువ్వే పిరికి! నీ కంటే ముందు నేనే చేస్తా చూడు” అన్నాను.
మాతో పాటు ఇంకో జంటనెక్కించుకుని రెండు మూడు ఫర్లాంగుల దూరం సముద్రంలోకి దూసుకుపోయింది మోటారు పడవ. కెరటాలకి ఎదురెళ్తున్న బోటు ధడ్ ధడ్ అంటూ శబ్దాలు చేసింది.
ఎదురుగా నీలికెరటాలతో విస్తరించిన సముద్రం. పైన నీలాకాశం. నా భుజాలని చుడుతూ శ్రీధర్ చేయి. నింగిలోని వెండిమబ్బులాగే తేలిపోతున్న మనసు.
ఒక్కసారిగా బోటు వేగం తగ్గి దిశ మారింది. తీరం దూరంగా ఉండడంతో పైకి లేచి పడే చిన్న చిన్న అలలే గాని లాక్కుపోయే కెరటాలు లేవు. ప్రశాంతంగా ఉంది సముద్రం. ఇక్కడే చేయిస్తారు కాబోలు పారా సెయిలింగ్.
“ఆప్ పెహలే జాయేంగే సాబ్?” అంటూ శ్రీధర్‌ని అడిగాడు జాలరి అబ్బాయి. కళ్లెగరేస్తూ నావైపు చూశాడు శ్రీధర్ ‘ముందు వెళ్తానన్నావుగా’ అన్నట్టు. “ముందు నీకే చాన్స్ ఇస్తున్నాలే వెళ్లు” అన్నా నవ్వుతూ.
ఉత్సాహంగా వెళ్లి ఆ అబ్బాయి చూపించిన కుర్చీ లాంటి నవారు అల్లికలో కాళ్లు దూర్చి కూర్చున్నాడు శ్రీధర్. తాడు వదిలి, పారాషూట్ విప్పడంతో, వెడల్పుగా ఉన్న గొడుగులా అది ఆకాశం లోకి విచ్చుకుంది.
ఒక్కసారిగా దానికి జోడించి ఉన్న నవారు కుర్చీ దానితో పాటు పైకి లేచింది. పైనున్న తాళ్లని గట్టిగా పట్టుకుని, శ్రీధర్ ఆకాశంలోకి రివ్వున దూసుకెళ్లాడు. అతను కూర్చున్న కుర్చీ పడవకి కట్టి ఉండడం వల్ల, పైన గొడుగులా ఉన్న పారాషూట్‌తో సహా అది పడవతో పాటే సాగింది. ముందుకు పోతున్న మోటారు బోటుకి వెనక పైకి లేచిన పొడుగాటి తోకలా ఉంది పారాషూట్. అందులో కూర్చుని గాలిలో తేలుతూ పక్షిలా శ్రీధర్.
అనంత జలరాశి.. తీరం ఎంతో దూరంగా కనిపించింది సన్నని గీతలా. నాకో అతనికో ఏదైనా అయితే ఈ సముద్రంలో? శరీరంలో ప్రవహిస్తున్న అడ్రినలిన్‌ని అనుభూతిస్తూ, పక్కనే ప్రేమ పక్షుల్లా కువకువలాడుతున్న జంటని గమనిస్తూ, మధ్యమధ్యలో పైనున్న శ్రీధర్‌ని చూస్తూ కూచున్నాను. కాసేపటికి పారాషూట్‌ని దింపారు పడవలోకి. శ్రీధర్ మొహమంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. ఈ చెంపనించి ఆ చెంపదాకా సాగిపోయిన పెదవులతో నవ్వుతూ వచ్చి “కమాన్ .. క్విక్! యువర్ టర్న్ నౌ! సూపర్ ఎక్స్పీరియెన్స్” అన్నాడు.
కొద్దిగా భయం వేసింది. కూర్చుని తాళ్లు గట్టిగా పట్టుకున్న మరుక్షణమే ఆకాశంలోకి దూసుకుపోయింది పారాషూట్. ఏం జరిగిందో సరిగా అర్ధం కాకముందే గాలిలో ఉన్నాను, రెక్కల్లేని వింత పక్షిలా. నా చుట్టూ రివ్వున వీస్తున్నగాలి. కిందకి చూశాను. కనుచూపు మేరంతా నీలి ఆకుపచ్చరంగులో నీటి కెరటాలు. వాటిమీద సూర్యకాంతి ధగధగలు.
కొంత దూరంలో తాడు ద్వారా నాకు కనెక్ట్ అయి ఉన్న పడవ. నీలాకాశం, నీలి సముద్రం.. అంతే. ఇళ్లూ, రోడ్లూ, వాహనాలూ ఏవీ లేవు. దూరంగా అక్కడక్కడ కనిపిస్తున్న రంగు రంగుల మోటారు పడవలు. అలా గాలిలో తేలుతున్నట్టు ప్రయాణం కొంతసేపు సాగాక కిందికి దింపాడు పడవతను.
శ్రీధర్ పక్కన, చాచిన అతని చేతి వంపులో ఒదిగి కూర్చుంటే ఏదో అనిర్వచనీయమైన అనుభూతిని ఒడిసి పట్టుకున్నట్టనిపించింది. వ్యాపించిన నీలి వర్ణం మీద వజ్రాలపొడి చల్లినట్టు మెరుస్తున్న కెరటాలు, సాయం సమయపు ఆహ్లాదం, సహచరుడి సాన్నిహిత్యం…తిరిగి తీరం చేరేదాకా మౌనరాగం పరుచుకుంది మా చుట్టూ.
ఒడ్డుకి చేరగానే కెరటాల సయ్యాట మళ్ళీ మమ్మల్ని ఊరిస్తూ పిలిచింది.
ఆకాశం మెల్లిగా సంధ్యాకాంతులు సంతరించుకుంది. సముద్రం బంగారు పూత పూసుకుని మరింత జోరుగా మమ్మల్ని ముంచెత్తింది. రేపటితో మా వెకేషన్ అయిపోతుందంటే దిగులేసింది. ఇంకాసేపు బీచ్ లోనే ఉందామనిపించి, లాగేస్తున్న కెరటాలలో ఇసుకతో పాటుగా జారుతూ కేరింతలాడుతున్నాం. ఇంతలో నీళ్ళలో ఏదో వస్తువు శ్రీధర్ చేతికి దొరికింది. అతను పట్టుకుని పైకెత్తేలోగా చెయ్యిజారి మళ్లీ నీళ్లలో పడిపోయింది. అది కెరటంతో పాటుగా వెళ్ళిపోతుంటే చటుక్కున వంగి తీశా.
నా చేతిలో కూలింగ్ గ్లాసెస్ చూస్తూనే ‘హే!! రేబాన్ మనూ!’ అన్నాడు శ్రీధర్ సంతోషంగా. ఈ ట్రిప్ ఖర్చుతో పోలిస్తే ఎంత అని? అయినా ఏదో ఉత్సాహం! ‘నాకు దొరికింది… ఇది నాది’ అన్నాను.
“ముందు నేను పట్టుకున్నా… నాదే” అంటూ లాక్కోబోయాడు. నేను తీరం వెంట పరుగుతీశాను. అతను నావెంట పడ్డాడు గాలిలో తేలుతున్నట్టు. అక్కడంతా అలాంటి జంటలే.
ఆ పరుగుల్లో, సెల్ఫీ హడావుడిలో శ్రీధర్ ఫోను నీళ్లలో పడిపోయింది. ఎవరి గాగుల్సో మాకు తెచ్చిచ్చిన కెరటం అతని ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ని లోపలికి లాగేసుకుంది. ఎంతో వెతికాం…మళ్లీ కెరటాలతో వెనక్కి వస్తుందేమో అన్న ఆశతో. కమ్మేసిన చీకట్లలో అది దొరుకుతుందన్న ఆశ పూర్తిగా పోయాక వెనుదిరిగి బస చేరుకున్నాం.
**
ఆదివారం పొద్దున్నే ఇంక బీచ్‌కి వెళ్లాలనిపించలేదు.
శ్రీధర్‌కి నీళ్లంటే పిచ్చి. ఈత అన్నా వాటర్ స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. గోవా అంటేనే సముద్రతీరాల నగరం. ఇంతకు ముందు చూసిన ఊరే అయినా అన్ని బీచ్‌లూ చూడకపోవడం వల్ల ఊరంతా పూర్తిగా చూసిన భావన కలగకే మళ్లీ వచ్చాం. వచ్చేముందే అనుకున్నాం, ఈసారి కేవలం బీచ్‌లు మాత్రమే చూడాలని. పొద్దున్న సూర్యోదయం వేళకీ, సాయంత్రం నాలుగ్గంటలకీ, రోజుకి రెండు చొప్పున! మధ్యాహ్నం షాపింగ్ కోసం పెట్టుకున్నాం. శ్రీధర్ మాటల్లో చెప్పాలంటే, తిరిగి వెళ్ళేసరికి బీచ్ అంటే ‘ఇంక చాలు’ అనిపించాలిట.
వాతావరణం మబ్బుగా ముసురు పట్టినట్టుంది. సాయంత్రం ప్రయాణం. తుషార ఎలా ఉందో రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసి కనుక్కోకుండా ఉండలేడు శ్రీధర్. నిన్న బీచ్‌కి వెళ్లే ముందు రెండుసార్లు చేస్తే ఎంగేజ్ వచ్చింది. అంతమంది పిల్లల తల్లిదండ్రులు రోజూ ఫోన్ చేస్తే టీచర్లకీ కష్టమే.
ఈ ఏడు హాఫియర్లీ పరీక్షలు ముందుగానే పెట్టేశారు తుషారకి. పదోతరగతి కదా. పరీక్షలవుతూనే అయిదురోజులపాటు ఎక్స్‌కర్షన్ ఏర్పాటు చేశారు స్కూలు వాళ్లు. ‘ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు కదా… వద్దులేమ్మా’ అన్నాడు శ్రీధర్. నిజానికి తనని మేం ఎక్కడికీ పంపం.
“ప్లీజ్ నాన్నా! ఈ ఇయర్‌తో నా స్కూల్ డేస్ అయిపోతాయి. మళ్లీ లైఫ్‌లో ఇలాంటి అవకాశం రాదు. నాకు చాలా చాలా వెళ్లాలనుంది. ప్లీజ్ నాన్నా! ఐ ప్రామిస్ యూ, ఐ విల్ డూ రియలీ వెల్ ఇన్ ది ఎగ్జామ్స్!” అంటూ అది ఒకటే బతిమాలింది.
శ్రీధర్‌కి కూతురంటే పంచప్రాణాలు. ఇప్పటికీ దాని పక్కమీద ఒక్క ముడత ఉన్నా సరిచేస్తాడు. పది నిముషాలు నడిస్తే స్కూల్ బస్టాప్ వస్తుంది. అయినా కార్లో దింపుతాడు. ఏమాటకామాట… నేనన్నా అంతే శ్రద్ధ!
బతిమాలుతున్న తుషార కళ్లలోకి చూస్తూ కాదనలేక ‘సరే’ అన్నాడు శ్రీధర్.
“థాంక్యూ నాన్నా!” అంటూ ఎగిరి గంతేసి, శ్రీధర్ మెడ చుట్టూ చేతులేసి, చెంప మీద ముద్దు పెట్టుకుంది. అతని మొహం వెలిగిపోయింది.
“అంతేలే…నీకు నాన్నంటేనే ఎక్కువిష్టం” నేను అలక నటించా. నవ్వులొలికిస్తూ నన్ను హత్తుకుని బుగ్గమీద ముద్దులు కురిపించింది.
ఆవేళ రాత్రి శ్రీధర్ అన్నాడు, “మనూ, మనం కూడా ఎటైనా వెళ్దామా? మళ్లీ పాపాయి పరీక్షలయే దాకా ఎక్కడికీ వెళ్లలేం కదా!” అని. తుషారని ఇప్పటికీ పాపాయి అనే అంటాడు శ్రీధర్. అప్పటిదాకా మేం అనుకోలేదు ఇలా వద్దామని.
అతనితో ప్రయాణానికి నేనెప్పుడూ సిద్ధమే. అతనికే సెలవు పెట్టడం కష్టం. ప్రమోషన్లు వచ్చిన కొద్దీ ఉద్యోగబాధ్యతలు ఎక్కువైపోవడంతో మా సరదా ప్రయాణాలు తగ్గిపోయాయి.
తుషార మరీ చిన్నపిల్లగా ఉన్నపుడు కూడా అతనికి ఊళ్లు వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. ‘పాపాయికి మంచిది కాదు, రకరకాల నీళ్ళూ వాతావరణం’ అంటూ నా ఉత్సాహాన్ని నీళ్లు కార్చేసేవాడు. ఆఫీసు పని మీద అతను వేరే ఊరు వెళ్ళినా, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ఇన్నాళ్లకి అతనే ఇలా అనేసరికి నా మనసు గాల్లో తేలినట్టయింది.
ఒకత్తే కూతురవడం, మేమూ నలుగురితో అంతగా కలవని మనస్తత్వం కావడంతో తుషారకి పదిమందితో కలిసి తిరిగే అలవాటూ, అవకాశమూ తక్కువే.
మేం లేకుండా ఎప్పుడూ ఏ ఊరూ వెళ్లని పిల్ల కావడంతో తన తోటి పిల్లలతో కలిసి చేసే ఈ ప్రయాణం అంటే తెగ ఉత్సాహపడిపోయింది. ఏవేవో రాగాలు తీస్తూ రోజంతా తన గదిలో ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకుంది. సూట్కేసులో బట్టలు సర్దుకుంటూ, ఐపాడ్‌లో పాటలు వింటూ తన గదిలో గంతులేస్తున్న దాన్ని చూస్తుంటే కొత్తగా అనిపించింది.
సాయంత్రం దాన్ని ట్రైనెక్కించి మర్నాడు పొద్దున్నే విమానంలో మేమిద్దరం గోవా వెళ్లేలా, మళ్లీ తుషార తిరిగొచ్చే రోజుకి ముందురోజు సాయంత్రానికే మేం వెనక్కి వచ్చేలా ఏర్పాటు చేశాడు శ్రీధర్.
మేం రైల్వే స్టేషన్ చేరేసరికి వీళ్ళ బోగీ దగ్గర స్కూలు పిల్లలూ టీచర్లతో అంతా హడావుడిగా ఉంది. పిల్లని ట్రైనెక్కిస్తుంటే కడుపులో ఉండకట్టినట్టు ఏదో ఆందోళన. గట్టిగా దాన్ని హత్తుకున్నాను. కళ్లు చెమర్చాయి. తుషార మాత్రం ‘బై అమ్మా, బై నాన్నా’ అంటూ మిగిలిన పిల్లల్లాగే బోగీలోకి ఎక్కి, తన సీట్లో కూర్చుంది.
లోపలంతా టీచర్ల సూచనల్తో, సర్దుబాట్లతో, లిస్టు ప్రకారం చేస్తున్న సామాన్ల చెకింగ్‌తో హడావుడిగా ఉంది. కిటికీ పక్కన నిలుచుని చెప్పాలనుకున్నజాగ్రత్తలన్నీ చెపుతుంటే ‘అమ్మా! ప్లీజ్ డోంట్ మేకె సీన్’ అంది సిగ్గుపడుతూ.
వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోవడం తనకింకా తెలీదు. అన్నీ అందరికీ ఇచ్చేస్తుంది. తన బాక్‌పాక్‌లో పెట్టిన మంచినీళ్లూ, స్నాక్స్, అత్యవసర పరిస్థితి కోసం లోపల విడిగా పెట్టిన ఒక చిన్న మంచినీళ్ల సీసా, బిస్కెట్స్ … అన్నీ గుర్తుచేశాను. తెచ్చుకున్నవన్నీ తోటివాళ్లతో పంచుకోనక్కరలేదనీ, ఎవరి గురించి వాళ్ళు జాగ్రత్త పడాలనీ, పడతారనీ చెప్తుంటే ‘సర్లే అమ్మా… ఇక ఊరుకో’ అంది విసుక్కుంటూ. ట్రైన్ కదిలింది.
మర్నాడు మధ్యాహ్నానికి మేమూ గోవా చేరాం. అంతా సజావుగా జరిగింది కానీ నిన్న శ్రీధర్ సెల్ ఫోన్ పోవడం, ఎక్స్‌కర్షన్ నిర్వహిస్తున్న స్కూల్ టీచర్ల నంబర్లన్నీ అందులోనే ఉండడం వల్ల కొంచెం ఇబ్బందయింది. రోజూ పాపాయితో మాట్లాడి అది క్షేమంగా ఉందని నిర్ధారించుకోకపోతే అతనికి స్థిమితం ఉండదు. ‘ఎలాగూ సాయంత్రం వెళ్ళిపోతున్నాం కదా శ్రీధర్? పాపాయి కూడా రేపు సాయంత్రానికి వెనక్కి వచ్చేస్తుంది’ అంటే సరేనని ఇక ఊరుకున్నాడు.
షాపింగ్‌కి వెళ్ళి తుషారకి ఏవో బట్టలూ, పూసల గొలుసులూ తీసుకున్నాం. మధ్యాహ్నభోజనం సమయానికి పెద్ద వర్షం మొదలై కుండపోతగా కురిసింది. ఫ్లైట్ కాన్సిల్ అయింది. అతని ఫోన్ పోవడం, ఇలా ఫ్లైట్ కాన్సిల్ అవడంతో మనసు చికాగ్గా తయారైంది.
సెలవు అయిపోతోందే అని దిగులుపడ్డా గాని ఒకరోజు పొడిగించాల్సి వచ్చేసరికి గంటసేపు కూడా స్థిమితంగా ఉండలేకపోయాను. పొద్దుటి ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరి, ఇల్లు చేరేసరికి పన్నెండయింది.
హమ్మయ్య, సమయానికి వెనక్కి రాగలిగామని సంతోషించాం. సాయంత్రం స్కూలు బస్, పిల్లల్ని అలవాటైన స్టాప్స్‌లో దింపుతుంది కనక స్టేషన్ కి వెళ్ళక్కరలేదని ఊపిరి పీల్చుకున్నాం.
ఎయిర్పోర్ట్ లోనే తినేసి వచ్చాం కనక బట్టలు మార్చుకుని విశ్రాంతిగా కూర్చునే సరికి బెల్ మోగింది.
తలుపు తెరిస్తే మళ్లీ పక్కింటి పిల్లే.
“ఏమిటి?” అన్నా విసుగ్గా.
“దీదీ..” అంటూ ఏదో చెప్పబోయింది. “దీదీ లేదు. సాయంత్రం వస్తుంది. తనకి టైముండదు నీతో ఆడుకుందుకు” అన్నా మధ్యలోనే కట్ చేస్తూ.
“కాదు ఆంటీ, దీదీకి జ్వరమొచ్చింది. మా ఇంట్లో ఉంది” అంది.
నాకు షాక్ తగిలినట్టయింది.
ఇద్దరం పక్కింటికి పరుగెత్తాం. ఆ పిల్ల మాతో కూడా వచ్చి తన గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ మంచమ్మీద వడిలిపోయిన మొహంతో నిద్రపోతోంది తుషార.
“కంగారేం లేదండీ. మా తమ్ముడు డాక్టర్ లెండి. నిన్న వెంటనే వచ్చి చూశాడు. అక్కడ టీచర్ గారు ఏదో టాబ్లెట్స్ వేశారుట. వచ్చేటప్పటికి అంత జ్వరం లేదు గాని రాత్రికి పెరిగింది. భయపడిందేమో రాత్రంతా కలవరిస్తూ ఉండింది. ఏమీ తోచక వాడికి ఫోన్ చేస్తే తెల్లవారుజామునే మళ్లీ వచ్చి మందులు మార్చి ఇచ్చాడు. జ్వరం కాస్త జారడంతో ఇంత క్రితమే నిద్ర పట్టింది. హాల్లో కూర్చుందురు గాని రండి” అంది పక్కింటావిడ.
ఏమనడానికీ తోచక హాల్లోకొచ్చి కూర్చున్నాం. ఆయన కాలేజికి వెళ్ళినట్టున్నారు.
“మీ పాప నిన్న సాయంత్రం చీకటి పడే వేళకి వచ్చింది. బెల్ కొడుతుంటే ఎంతకీ తీయలేదని ఏడుపు మొహం పెట్టుకుని ఉంది. మా ఇంట్లోకి పిలిస్తే వచ్చింది… బయట తిండి ఏదో సరిపోలేదేమో వాంతి చేసుకుంది పాపం. మీరు బయటికి వెళ్లారేమో కాసేపటికి వస్తారని చూసింది. మీరు ఊరెళ్లినట్టున్నారు”
“అవునండీ.. పాప ఇవాళ సాయంత్రానికి రావాలి. నిన్ననే ఎందుకు వచ్చేశారో తెలీదు”
“అవును చెప్పింది… ఒక టీచర్ గారి తండ్రికి చాలా సుస్తీ చేసిందిట. ఆవిడ ఫ్లైట్‌లో వచ్చేస్తుంటే మీ పాపకి జ్వరంగా ఉందని ఆవిడతో పంపించారుట. ఫోన్లో మీతో మాట్లాడాలని ప్రయత్నించారుట. మీరు దొరకలేదని చెప్పారు”.
ఏం జరిగిందో, నిన్న సాయంత్రమే రావలసిన మేం ఒక రోజు ఆలస్యంగా ఎందుకొచ్చామో చెప్పాం. తుషారని ఎత్తుకుని తీసుకెళ్తానని శ్రీధర్ అంటే “మెలకువ వచ్చాక తీసుకెళ్తే మంచిదండీ. మంచి నిద్రలో ఉన్నపుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు” అందావిడ.
అక్కడే తిరుగుతూ ఉన్న పిల్లని చూస్తూ “నీ పేరేమిటి?” అనడిగాను.
“మీనా”
“నీకు స్కూలు లేదా?”
“ఉందీ…” అంటూంటే వాళ్ళమ్మ అందుకుని “ఇవేళ ఇంట్లో ఉండమని నేనే మాన్పించానండీ. అది కూడా స్కూలుకెళ్లిపోతే మీ పాప బెంబేలెత్తుతుందేమో అని” అంది. ఆవిడ కళ్లలోకి చూడలేకపోయాను.
శ్రీధర్ నావైపు చూశాడు. “మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాం…” నట్టుకుంటూ ఏదో చెప్పబోయాను.
“భలేవారే… మాకేం ఇబ్బంది లేదండీ…ఇరుగూపొరుగన్నాక ఆ మాత్రం చేసుకోవడం పెద్ద విషయమా?”
ఏమనడానికీ తోచలేదు. కాసేపాగి “సరే అయితే… మేం వెళ్తామండి. మెలకువ రాగానే చెప్పగలరా?… వచ్చి తీసుకు వెళ్తాం” అన్నాను నవ్వుతూ. నా నవ్వు నాకే పేలవంగా అనిపించింది.
‘కాఫీ తాగి వెళ్దురు గాని’ అని కమ్మని కాఫీ తెచ్చిచ్చి, తాగేదాకా ఊరుకోలేదావిడ.
మా ఫ్లాట్‌కి వచ్చి సోఫాల్లో కూలబడ్డాం. శ్రీధర్ ఏదో సినిమా పెట్టాడు. ఆ పిల్ల ..అదే మీనా వచ్చి బెల్ కొట్టడం కోసం ఎదురుచూస్తూ అన్యమనస్కంగా టీవీ చూస్తూ ఉన్నాం. పావుగంట గడిచింది. మళ్లీ వెళ్లి చూద్దామా అనిపించింది గాని వాళ్లని ఇబ్బంది పెట్టడం అవుతుందేమో అనుకున్నాం.
అరగంట గడిచింది… గంట…గంటన్నర… కాలింగ్ బెల్ మోగడం కోసం ఇంతగా మేమెప్పుడూ ఎదురుచూసింది లేదు. రెండు గంటలు దాటాక బెల్ మోగింది. ఒక్కుదుటున వెళ్ళి తెరిచాను.
ఎదురుగా “ఆంటీ.. అక్క ఇప్పుడే లేచింది” అంటూ తుషార చెయ్యి పట్టుకుని నిలబడింది మీనా. శ్రీధర్ తుషారని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లాడు.
“లోపలికి రా పాపా” అన్నాను మృదువుగా.
తల అడ్డంగా ఊపి “అమ్మ వెంటనే రమ్మంది” అంటూ రివ్వున వెళ్ళిపోయింది మీనా.
చిన్నబోయి నిలబడిపోయాను.
*