[box type=’note’ fontsize=’16’] కౌరవ సభలో అన్యాయాన్ని ప్రశ్నించిన వికర్ణుడి గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]
[dropcap]రా[/dropcap]జ్యాధికారం కోసం దాయాదుల మధ్య సాగిన వివాదం చివరకు కురు వంశ వినాశనానికి కారణమైంది. ద్వాపరయుగం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివిధ పాత్రల ద్వారా వేదవ్యాసుడు మహాభారతములో తెలియజేశాడు. వీటిలో వికర్ణుడిది చాలా ప్రత్యేకమైన పాత్ర.
గాంధారి ద్రుతరాష్ట్రుల వందమంది సంతానంలో మూడవవాడు వికర్ణుడు. ఇంకొక కథనం ప్రకారము కౌరవులలో బలవంతులలో మూడవవాడుగా చెపుతారు. వికర్ణుడు అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. అది “వినా” మరియు “కర్ణ” అనే రెండు సంస్కృత పదాల కలయిక వల్ల ఏర్పడింది. వినా లేదా విశాల అంటే లేకుండా లేదా పెద్దది అని అర్ధము. అలాగే కర్ణ అంటే చెవి దీనిని బట్టి వినా అనే అర్ధము వచ్చేటట్లయితే చెవి లేకుండా. అంటే ఎవరిమాటా విననివాడు లేదా పెద్ద చెవులు ఉన్నవాడు అని అర్థము వస్తుంది. తన పెద్ద చెవులతో విని జ్ఞానాన్ని సంపాదిస్తాడు అని అర్థము వస్తుంది, లేదా తానూ ఎవరి మాట వినకుండా తనకు ధర్మము అనిపించింది చేస్తాడు అని కూడా చెప్పుకోవచ్చు.
మహాభారతంలోని కొన్ని పాత్రలు మాత్రం తరుచూ ప్రస్తావనకు వస్తాయి. వీటిలో కర్ణుడు పేరు తెలియనివారు ఉండరు. కానీ, కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తతమైన వ్యక్తి దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు.
నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే పాండవులతో సహా ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృపాచార్యులు చోద్యం చూసినా వికర్ణుడు ఒక్కడే దుర్యోధనుని చర్యను ఎదిరించాడు. ద్రౌపది వస్త్రాపహరణంలో తన సోదరుడు దుర్యోధనుడిని ప్రశ్నించకపోయింటే నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో. ద్రౌపదీ వస్త్రాపహరణం సమయానికి వెలుగులో వచ్చాడు. మాయా జూదంలో పాండవులను ఓడించిన దుర్యోధనుడు పణంగా పెట్టిన ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ తరుణంలో భీష్మ, ద్రోణ లాంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే ఒక్క వికర్ణుడు మాత్రం అలా చేయడం తప్పని వారించాడు. ముందు ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పమని భీష్ముడు లాంటి పెద్దలను నిలదీసాడు.
ధర్మరాజుకు ధర్మము చెప్పేంత వాళ్ళము కాము అని పెద్దలు అంతా తప్పుకున్నారు. ఈ చర్యల వల్ల కురువంశానికే మచ్చవస్తుందని కురు వంశ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించిన వికర్ణుడిని కర్ణుడు అడ్డుకున్నాడు. అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలవలేదు. అన్నదమ్ముల రక్త సంబంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు.
వికర్ణుని పాత్రను రామాయణ కాలము లోని విభీషణుడు, కుంభకర్ణుడి పాత్రలతో పోల్చవచ్చు ఎందుకంటే విభీషణుడు రాణాసురుడు చేస్తున్న పని అధర్మము అని చెప్పి వారించాడు. అన్న తన మాట వినకపోతే ధర్మము వైపు అంటే రాముడి పక్షాన చేరాడు కానీ కుంభకర్ణుడు అన్న చర్యను ఖండించినా, సోదర ధర్మము పాటిస్తూ రావణాసురుడి పక్షాన యుద్ధము చేసాడు. అలాగే వికర్ణుడు అన్న దుర్యోధనుడి చర్యలను బహిరంగముగా వ్యతిరేకించినా కురుక్షేత్ర యుద్దములో అన్న పక్షాన నిలబడి యుద్ధము చేసాడు.కాబట్టి వికర్ణుడికి కుంభకర్ణుడి పోలికలు ఉన్నాయి.
వికర్ణుడు తన కౌరవ సోదరులతో హస్తినలో అల్లారుముద్దగా పెరుగుతూ సకల విద్యలను ఔపోసాన పట్టాడు. దుర్యోధనాదులలతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి వారివద్ద యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకోవటం ముగిసినాక ద్రోణుడు గురుదక్షిణగా పాంచాల రాజైన దృపదుడిని బందించి తీసుకురమ్మని కోరినప్పుడు వికర్ణుడు కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు యుయుత్సులతో యుద్దానికి వెళ్ళాడు కానీ ఆ ప్రయత్నమూ ఫలించలేదు. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు షరతు ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం పూర్తిచేశారు. అనంతరం తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటూ కృష్ణుడు, సంజయుడు ద్వారా సాగించిన రాయబారం విఫలం కావడంతో కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. ధర్మం పాండవుల పక్షాన ఉందని, తమకు ఓటమి తప్పదని వికర్ణుడు ముందే గ్రహించినా తన సోదరుడు దుర్యోధనుడినే అనుసరించడానికే సిద్ధపడ్డాడు. అలాగని నామమాత్రంగా యుద్ధం సాగించలేదు.
కురుక్షేత్ర మహాసంగ్రామం నడిచిన ప్రతిరోజూ అతని ప్రతిభ మార్మోగుతూనే ఉంది. విలువిద్యలో కర్ణుని తరువాత ఎన్నదగిన యోధుడు వికర్ణుడు. అందుకే భగవద్గీత తొలి అధ్యాయం ‘అర్జున విషాదయోగం’ ఎనిమిదో శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ’ అని ద్రోణాచార్యులతో దుర్యోధనుడు అంటాడు.
ద్రోణాచార్యులు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ లాంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడటం ఇందులో కనిపిస్తుంది. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అధర్మం పక్షాన నిలిచి పోరాడటంతో మృత్యువు తప్పలేదు.
కురుక్షేత్ర సంగ్రామంకు ముందు భీష్ముడు కౌరవుల పక్షాన ఉన్న యోధులలో వికర్ణుడి పేరు కూడా ప్రస్తావిస్తాడు. కురుక్షేత్ర యుద్దములో వికర్ణుడు కొన్ని ముఖ్యమైన ఘట్టాలలో పాల్గొంటాడు. 4 వ రోజు యుద్దములో అభిమన్యుడితో తలపడి అతనిని నిరోధించాలని చూస్తాడు. 5వ రోజున పాండవుల పక్షాన ఉన్న మహిష్మతి రాజు రక్షణ వలయాన్ని ఛేదించాలని ప్రయత్నిస్తాడు. 7వ రోజు యుద్దములో భీముడి ధాటికి తట్టుకోలేని తన సోదరులకు రక్షణగా నిలబడతాడు. 10వ రోజు అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముని చేరటాన్నిప్రతిఘటిస్తాడు కానీ ఈ ప్రయత్నన్నీ ద్రుపదుడు విఫలము చేస్తాడు.
13వ రోజు యుద్దములో అభిమన్యుడి వధలో అయిష్టముగానే పాల్గొంటాడు. 14 వ రోజు అర్జునుడు ద్రోణుడు ఏర్పాటు చేసిన చక్రవ్యూహాన్ని ఛేదించి సూర్యాస్తమయములోపు జయద్రదుడిని చంపాలని భీముని అండతో వస్తుండగా వికర్ణుడు భీముడిని ఎదుర్కొంటాడు. కౌరవులందరిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన భీముడు వికర్ణుడి మంచితనము, న్యాయబద్ధత తెలుసు కాబట్టి తప్పుకోమని సలహా ఇస్తాడు. కానీ వికర్ణుడు భీముడిని రెచ్చగొట్టి తనతో తలపడేటట్లు చేస్తాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మరణానికి భీముని మనసు సైతం భారమైపోయింది. యోధుడు అయినప్పటికీ ఇతని ప్రతిభ అధర్మము వైపు ఉండటం వలన బూడిదలో పోసిన పన్నీరు అయింది. అలా చివరి వరకూ తను నమ్మిన సోదర ధర్మానికి కట్టుబడి కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు.
గాయాలతో చనిపోవటానికి ముందు వికర్ణుడు భీమునికి అధర్మము తరుఫున పోరాడవలసివచ్చినందుకు క్షమాపణలు చెప్పి భీముడిని తన అంత్యక్రియలను నిర్వహించామని కోరి చిరునవ్వుతో ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మరణము భీమునికి కూడా కన్నీరు తెప్పిస్తుంది. అధర్మము వైపున పోరాటం చేస్తున్నప్పటికి తన సోదరుడి పట్ల బాధ్యత అని భావించ యుద్ధము చేస్తాడు. ఆ విధముగా వికర్ణుడికి రామాయణములో కుంభకర్ణుడికి పోలిక ఉంది. ఇద్దరు కూడా వారి సోదరులు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా వారించినా వినకపోవటం వల్ల యుద్దములో సోదరులకు అండగా పోరాడి ప్రాణాలను విడుస్తారు.