జ్ఞాపకాల పందిరి-35

39
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అదొక గొప్ప సందర్భం..!!

[dropcap]వృ[/dropcap]త్తిపరమైన జీవన యానంలో ఎన్నో అనుభవాలు. వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మనస్సులో పదిలంగా నిక్షిప్తమై ఉంటాయి. అన్నీ కాకపోయినా కొన్నైనా స్థిరంగా నిలిచిపోతాయి. సంఘటనలు మంచివి కావచ్చు, ఇబ్బంది పెట్టినవి కూడా కావచ్చును. ఒక్కోచోట ఒకటికావచ్చు. మరెన్నో సంఘటనల తాలూకు జ్ఞాపకాలు సమయ సందర్భాలను బట్టి సింహావలోకనం చేసుకునే సందర్భాలు చోటు చేసుకుంటుంటాయ్. సున్నితమైయిన మనసు గల వారు మంచైనా చెడ్డైనా నిత్యం తలుచుకుంటూనే వుంటారు. అది సంతోషాన్ని అందించేదైనా, భయాన్ని గొలిపేదైనా జీవితాంతం అది మనసులో మెరుగుతూనే ఉంటుంది. వద్దనుకున్నా అలాంటి జ్ఞాపకాలు చుట్టుముట్టుతూనే ఉంటాయి. ప్రతి విషయాన్ని అతి తేలిగ్గా తీసుకునే వారికి ఎటువంటి సమస్యాలేదు. అలాంటి వారి గురించి ప్రత్యేకంగా చర్చించుకోవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రస్తావించుకోవలసింది సంతోషకరమైన విషయాలు. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా వాటికి సంబందించిన జ్ఞాపకాలు మనసులో మెదిలినప్పుడల్లా హృదయం ఆనంద డోలికల్లో తేలిపోతుంది. అలాంటి విషయాలు పక్కవారితోనూ, ముఖ్య స్నేహితులతోను పంచుకోవాలనిపిస్తుంది. ఆ ప్రయత్నమే ఈ చిన్ని వ్యాసం రాయడానికి పురిగొల్పింది, అదీ నా స్వంత గొడవ కాబట్టి కొంత ప్రత్యేకం అనుకోవాలి.

నా ఉద్యోగ పర్వంలో మొదటి అడుగు మహబూబాబాద్‌లో అయితే రెండో అడుగు జనగాం ప్రభుత్వ ఆసుపత్రి. అప్పుడు తాలూకా ఆసుపత్రి. ఇప్పుడు జిల్లా ఆసుపత్రి. నేను జనగాంలో అడుగు పెట్టిన కొద్దినెలల్లోనే అప్పటి ఎన్.టి.ఆర్ ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వం లోని ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులతో వైద్య విధాన పరిషత్ అనే కమిషనరేట్ (స్వయం ప్రతిపత్తి) నెలకొల్పి తద్వారా చాలా తాలూకా ఆస్పత్రులను వంద పడకల ఆసుపత్రులుగా మార్చే దిశలో జనగాం ఆసుపత్రికి కూడా ఆ అనుమతి లభించింది. అందుచేత వంద పడకల ఆసుపత్రికోసం పునాదిరాయి వేసే ఆనంద సమయాన్ని పాలుపంచుకునే అవకాశం నాకు కూడా లభించడం నేను చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి. మా కళ్ళముందే ఆ భవంతి నిర్మాణం జరిగి అందులో ఏర్పాటు చేసిన డెంటల్ బ్లాకులో నేనుకూడా కొంత కాలం పని చేయడం కూడా నేను చేసుకున్న అదృష్టమే! కొత్త బ్లాకులో పని చేసిన మొదటి దంతవైద్యుడిగా నా పేరు నమోదు అయింది.

1994 నుండి 2005 వరకూ నేను అక్కడ పనిచేసాను. నాల్గవ తరగతి ఉద్యోగులనుంచి డిప్యూటీ సివిల్ సర్జన్ వరకూ అందరితో చాలా మంచి సంబంధాలు కలిగి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే చిన్న కేడర్ ఉద్యోగుల తోనే ఎక్కువ దగ్గరగా ఉండేవాడిని. అందుచేత అందరూ నన్ను ఇష్టపడేవారు! బయటి ప్రజలు, నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడిని. నా పని నేను చేసుకుని వచ్చేసేవాడిని. లేదంటే రోజూ హనంకొండ నుండి జనగాం అప్ అండ్ డౌన్ చేస్తాడనే అపవాదును మాత్రం తప్పించుకోలేకపోయాను. దాని వల్ల నా వృత్తి ధర్మాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.

నిజానికి జనగాం అంటే తప్పులు వెదికి సాధ్యమైనన్ని రాళ్లు మీదికి విసిరే ప్రాంతం. అక్కడ పని చేయగలగడం కత్తిమీద సాము చెయ్యడమే! వార్తా పత్రికల వాళ్ళకి హాస్పిటల్ అంటే మరీ వేళాకోళంగా ఉండేది. స్టాఫ్ గురించి రోజూ ఏదో కథనం రాయడానికి ప్రయత్నం చేసేవారు. ఆసుపత్రి అభివృధ్ధికోసం ఎవరూ మాట్లాడేవారు కాదు.

నేను పనిచేస్తూ 2005లో బదిలీ అయ్యే సమయానికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా గైనకాలజిస్ట్ డా. కృష్ణమూర్తి గారు ఉండేవారు. ఇంకా డా. నాగేందర్, డా. శారద, డా. ఎం. శ్రీహరి, డా. గోపాలరావు, డా. కలువల రాజ్ కుమార్, డా. సుగుణాకర్, డా. రాజేశ్వరరావు, డా. సారంగం తదితరులు వున్నారు.

సాధారణంగా ఇలాంటి వీడ్కోలు సభలకు డా. సుగుణాకర్ ముందుండి కార్యక్రమాలను జయప్రదం చేస్తుంటాడు. పైగా నేనంటే అతనికి చాలా ఇష్టం. అందుచేత నా వీడ్కోలు కార్యక్రమం అతనే చేస్తానని ముందుకు వచ్చాడు. ఐతే నన్ను ఎంతో గౌరవంగా చూసే డా. నాగేందర్ రావు (అప్పుడు గైనకాలజిస్ట్ – ఇప్పుడు జనరల్ సర్జన్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్) ఈ ఒక్క కార్యక్రమం తాను చేస్తానని సోదరుడు డా. సుగుణాకర్ దగ్గర మాట తీసుకున్నాడు. సుగుణాకర్ జనగాంలోనే ఉంటాడు. డా. నాగేందర్ రావు నాతోపాటు హనంకొండలో ఉండేవారు. రైలు ప్రయాణంలో అందరం రోజూ చాలా హ్యాపీగా గడిపేవాళ్ళం. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందడం వల్లనో ఏమో నేనంటే డా. నాగేందర్‌కి చాలా అభిమానమూ గౌరవమూ ఉండేది. అందుచేత నా వీడ్కోలు కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. మనస్ఫూర్తిగా చేశారు. పైగా ఆసుపత్రి సిబ్బందిలో 99శాతం నేనంటే చాలా ఇష్టపడేవారు.

డా. నాగేందర్  రావు

ఆ రోజు రానేవచ్చింది. నాకు డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ప్రమోషన్ రావడం వల్ల కౌన్సిలింగ్‌లో కరీంనగర్ ఎన్నుకున్నాను నేను. ఆ సందర్భంగానే ఈ బదిలీ, ఇంకా వీడ్కోలూను. ఆ రోజు వీడ్కోలు సభ చాలా ఘనంగా జరిగింది. అది కేవలం డా. నాగేందర్ వల్ల, ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందించడం వల్లనే అది విజయవంతం అయింది. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. నన్ను బాగా ఇష్టపడే రేడియోగ్రాఫర్ కె. సాంబయ్య చక్కగా మాట్లాడాడు. ఇతనికి సాహిత్యం మీద అభిరుచి ఉండడం కూడా ఒక కారణం. నేను కథలు వ్యాసాలూ రాసుకోవడానికి ఎక్స్‌రే ల పెకింగ్ తో వచ్చే పసుపు కాగితాలు నాకు ఇచ్చేవాడు.

నన్ను బాగా ఇష్టపడే రేడియోగ్రాఫర్ సాంబయ్య సందేశం.

నాకు గుర్తుగా ఒక బంగారం ఉంగరం బహూకరించారు. పూలదండలతో ముంచెత్తేసారు. ఆ అభిమానం అసలు మర్చిపోలేను. నాకు జరిగిన కార్యక్రమం లాంటి వీడ్కోలు సభ ఆ ఆసుపత్రిలో, గతంలో ఎప్పుడూ జరగలేదని, బహుశః భవిష్యత్తులో ఇక జరగకపోవచ్చని అక్కడి స్థానికులు వ్యాఖ్యానించడం నాకు చాలా సంతోషం అయింది.

మెడికల్ సూపరింటెండెంట్ డా. కృష్ణ మూర్తి వీడ్కోలు సందేశం
డా.పి.సుగుణాకర్ రాజు, ఆర్.ఎం.ఓ (ప్రస్తుతం) జిల్లా ఆసుపత్రి, జనగాం
డా.రాజ్ కుమార్ కలువల, రిటైర్డ్ సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, జనగాం
హెడ్ నర్స్ సిస్టర్ రంగనాయకమ్మ సందేశం

అక్కడ స్థానిక బి.ఎన్.మెడికల్ స్టార్ ఓనర్ శ్రీ రవీందర్ నన్ను బాగా ఇష్టపడేవాడు. అతను ప్రత్యేకంగా నా ఒక్కడికీ స్థానిక బార్ అండ్ రెస్టారెంట్‌లో మంచి పార్టీ ఇచ్చాడు. దానితో ఇక నాకు జనగాంతో సంబంధాలు తెగిపోయినట్లు అయింది. చాలా తృప్తిగా అక్కడినుండి బయలు దేరాను.

అయితే కొసమెరుపు ఏమిటంటే మరునాడు నన్ను డా. నాగేందర్, డా. రాజ్ కుమార్. డా. రాజేశ్వర రావు (ఇపుడు మన మధ్య లేరు) గార్లు కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లి నా జాయినింగ్ రిపోర్ట్ ఇప్పించి డెంటల్ డిపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లి, నా సీట్లో కూర్చోపెట్టి, ఫోటో తీసి తిరిగి హనంకొండకు తీసుకు వచ్చారు. వారి అభిమానం అంత గొప్పది, ఎన్నటికీ మరువరానిది.

నేను అక్కడికి వెళ్లేసరికి డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు దంతవైద్యులు వున్నారు. వాళ్లిద్దరూ పర్మనెంట్ ఉద్యోగులు కాదు. కాంటాక్ట్ బేసిస్‌లో పని చేసారు. డా. సుగుణాకర్, ఇంకా డా. మాధవి. అలా కొద్దికాలమే వారు పనిచేయగలిగారు. నాకు అక్కడ ఉండగానే సివిల్ సర్జన్‌గా పదోన్నతి లభించింది. ఏడు సంవత్సరాలు అక్కడే పనిచేసే అవకాశం నాకు కలిగింది. నేను చాలా.. చాలా.. ఇష్టపడ్డ ఆసుపత్రి -కరీంనగర్!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here