జ్ఞాపకాలు – వ్యాపకాలు – 36

1
3

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో పడిగాపులు:

[dropcap]2[/dropcap]002 సంవత్సరంలో నేను ఢిల్లీ దూరదర్శన్‍లో పని చేస్తున్నాను. వంగూరి చిట్టెన్‌రాజు ఆహ్వానం మేరకు డెట్రాయిట్‌లో జరుగుతున్న సభలకు హాజరు కావాలి. చికాగోలో ‘సప్నా’ అన్నమాచార్య ప్రాజెక్టు వారు (శ్రీమతి శారదాపూర్ణ నేతృత్వంలో) అన్నమయ్య ఉత్సవాలలో ప్రసంగానికి ఆహ్వానించారు. ప్రముఖ చిత్రకారులు డా. యస్.వి. రామారావు ఆహ్వానం ఎటూ వుంది. 25 రోజులు సెలవు పెట్టాను.

ముందుగా చికాగో కార్యక్రమం. లుఫ్తాన్సా ఎయిర్‌వేస్‌లో టికెట్ బుక్ చేశాను. ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం మారాలి. కనెక్టింగ్ ఫ్లయిట్‍లో చికాగో వెళ్ళాలి. ఏవో సాంకేతిక కారణాలతో అది నాలుగు గంటలు ఆలస్యమన్నారు. చివరకు క్యాన్సిల్ చేశారు. వాళ్ళే హోటల్ గది బుక్ చేశారు. టెలిఫోన్ కార్డ్ ఇచ్చారు. కిట్ ఇచ్చారు. ఆ రాత్రికి అక్కడే బస. రామారావుకు ఫోన్ చేశాను. మర్నాడు సాయంకాలానికి చికాగో చేరాను. విశాలమైన వాళ్ళ యింట్లోనే బస. ఆయన ప్రఖ్యాత చిత్రకారులు. తన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా తన పెయింటింగు గదిగా అమర్చుకున్నారు. వారి సతీమణి డాక్టరు. ఒక్కతే కూతురు, నృత్య కళాకారిణి.

చికాగోలోని ఇండియన్ ఎంబసీకి తీసుకెళ్ళారు. ఉన్నతాధికారులతో ముఖాముఖీ ఏర్పాటు చెశారు. ప్రముఖ వార్తాపత్రిక ట్రిబ్యూన్ విలేఖరి – జె. వి. లక్ష్మణరావును ఒక మధ్యాహ్నం లంచ్‌లో కలిశాము. అప్పుడు నేను కాశ్మీరు ఛానెల్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాను. ఆయన యథాలాపంగా సంభాషించారు. నాగూర్చి ఒక  పెద్ద వ్యాసం ప్రచురించారు. అది ఇంటర్వ్యూ వలె కాకుండా తాను నాతో సంభాషించినప్పుడు సేకరించిన సమాచారం ఆధారంగా కాశ్మీర్ ఛానెల్ పనితీరును తెలిపే విధంగా వ్రాశారు. మన దేశంలో అయితే ఆ హోదా గల వ్యక్తి నన్ను ఇంటర్వ్యు చేస్తే సవాలక్ష ప్రశ్నలు వేసి వుండేవారు. ఆయన భోజన సమయంలో నాతో పలు విషయాలు చర్చించారు. వాటిని సమగ్రంగా ప్రస్తావించారు.

శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో

చికాగో నగరమంతా చూశాను. వివేకానందుడు ప్రసగించిన సమావేశ మందిరం తదితర పర్యాటక ప్రదేశాలన్నింటినీ సందర్శించాను. మరునాడు డా. శ్రీరామ్ శొంఠి, శారదాపూర్ణ శొంఠిల ఆతిథ్యం. ఆ సాయంకాలం బహిరంగ సభ. మూడు వందల మంది దాకా ప్రముఖులు వచ్చారు. శ్రీరామ్ దంపతులు 30 ఏళ్ళుగా చికాగోలో అన్నమయ్య సంకీర్తనల ప్రచారం చేస్తున్నారు. ప్రసంగాలు, కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. శారదగారు అన్నమయ్య కీర్తనలపై పరిశోధనలు చేసి ప్రామాణిక గ్రంథం ప్రచురించారు.

సభాసదులలో ప్రముఖులు:

చికాగో సభలో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అయిన డా. వై. వేణుగోపాల రెడ్డి ముందు వరుసలో కూర్చొని ప్రసంగాన్ని ఆసక్తిదాయకంగా విన్నారు. అప్పుడాయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరక్టరు. కడప జిల్లా వాసి. ఆ జిల్లా నందలూరు గ్రామం నుంచి ముగ్గురు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ఏ. ఉమాకాంతశర్మ బీహార్‌కు, జగత్పతి మధ్యప్రదేశ్‌కు, ఏ.వి.యస్.రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానాధికారులు. చికాగో సభలో తెలుగు కుటుంబలు చాలా పాల్గొన్నాయి.

చికాగో సభకు, డెట్రాయిట్ సభకు మధ్య 20 రోజుల వ్యవధి ఉంది. అందుకని నేను కొలంబస్‍లో మా అన్నయ్య కుమారుడు రామచంద్రరావు వద్దకు వెళ్ళాను. పది రోజులు అక్కడే వున్నాను. ఆ సమయంలో ప్రముఖ సాహితీవేత్త డా. జంపాల చౌదరి దంపతులను కలిశాను. డైటన్‌లోని విమానాల మ్యూజియం చూశాను. చికాగోలో వేంకటేశ్వర స్వామి ఆలయం బాగా అభివృద్ధి చేశారు. కొలంబస్‍లో కూడా ఆలయాల సముదాయం వుంది. శని, ఆదివారాలలో దక్షిణాది యువకులు తమ వృద్ధ తల్లిదండ్రుల్ని ఆలయాలకు తీసుకొస్తారు. మధ్యాహ్నం అక్కడ అన్న ప్రసాదాలు సేవించి కొంత కాలం గడిపి వెళ్తారు. కొలంబస్‌లో కూడా చాలా తెలుగు కుటుంబాలున్నాయి.

తెలుగు సాహిత్యంలో చమత్కారాలు:

డెట్రాయిట్‌లో మా పెద్దబ్బాయి రమేష్ చంద్ర బావమరిది ‘చక్రి’ ఉద్యోగిస్తున్నాడు. ఆయన కొలంబస్ వచ్చి నన్ను కార్లో డెట్రాయిట్ తీసుకెళ్ళాడు. వంగూరి చిట్టెన్‍రాజు రెండు రోజుల సాహిత్య సభలు ఏర్పాటు చేశారు. ఒక రోజు నేను ‘తెలుగు సాహిత్యంలో చమత్కారాలు’ అనే అంశంపై మాట్లాడాను. నా ప్రసంగానికి మంచి స్పందన లభించింది. రక రకాల పద్యాలు వర్ణించాను. సముచిత రీతిని సత్కరించారు. నా పుస్తకాలు కొన్ని విక్రయానికి పెట్టాను. ‘చక్రి’ తాను పని చేసే ఫోర్డు కంపెనీ చూపించాడు. వింటేజ్ కార్లు చాలా అందంగా మ్యూజియంగా ఏర్పాటు చేశారు. డెట్రాయిట్ సభలలో విశ్వనాథ అచ్యుత దేవరాయలు కలిశారు. వారు సత్యనారాయణ కుమారులు. దూరదర్శన్‌లో చీఫ్-ఇంజనీరుగా పనిచేసి రిటైరై చికాగోలో స్థిరపడ్డారు. విజయవాడ దూరదర్శన్ స్థాపనకు ప్రదేశాన్ని నిర్ణయించడానికి 1979లో వారు విజయవాడ వచ్చారు. అప్పుడు నేను వారిని ఇంటర్వ్యూ చేశాను. నాన్నగారి వలె పద్యం చదువుతారు. మంచి పండితులు.

సభలు పూర్తి కాగానే నేను ఢిల్లీ తిరుగుముఖం పట్టాను.

రెండోసారి అమెరికా ప్రయాణం (2008):

2008లో నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్నాను. అమెరికాలోని ఆటా సంస్థ వారు సభలు న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నామని ప్రకటించి ఆహ్వానం పంపారు. అదే సమయంలో వంగూరి ఫౌండేషన్ వారు ఫ్రీమాంట్‍లో సభలు నిర్వహిస్తూ వర్తమానం పంపారు. చిట్టెన్‌రాజు గారు సౌజన్యమూర్తి. వారు సాహితీ ప్రియులు. రెండు సభలను పురస్కరించుకొని నెల రోజులు సెలవు పెట్టాను.

మా అమ్మాయి శైలజ సూచన మేరకు దంపతులం ఇద్దరం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకొన్నాం. మా కుటుంబీకులు పది మంది దాకా అమెరికాలో భిన్న ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారు తిరుపతి వచ్చి, “స్వామి దర్శనం బాగా చేయించారు. ఒకసారి అమెరికా రండి” అని మాటవరుసకు పిలిచారు. ‘తగదునమ్మా!’ అని మేము బయలుదేరాం. సభల నెపంతో అందరి ఇళ్ళల్లో ఆతిథ్యం స్వీకరించాం. సునీత, శ్రీనివాసమూర్తి దంపతులు ఆప్యాయంగా ఆదరించారు.

ఆప్యాయతకు మారుపేరు మా ‘చంద్ర’:

మా కరవది బాబాయి కుమారుడు చంద్రశేఖర్, రాధారాణి దంపతులు న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. నా మీద వారికి అభిమానం. 2008లో ఆటా సభలకు బయలుదేరి తిరుపతి నుండి న్యూయార్క్ చేరుకున్నాం. అక్కడ మూడు రోజులు ‘ఆటా’ సభలు. ఒకరోజు వంగూరి చిట్టెన్‌రాజు ఆధ్యక్షతన సాహితీసభ. అందులో గొల్లపూడి మారుతీరావు, బలభద్రపాత్రుని రమణి, ఈటీవీ సుమన్ తదితరులతో పాటు నేనూ ప్రసంగించాను. ఆటా సభలను చినజియ్యర్ స్వామి ప్రారంభించారు. రాళ్ళబండి కవితాప్రసాద్ అవధానం చేశారు. వారం రోజులు న్యూయార్క్ నగరం అంతా తిరిగి చూశాం.

కవితాప్రసాద్ ప్రసంగం:

న్యూయార్క్ నుండి పిట్స్‌బర్గ్ బస్సులో వెళ్ళాం. అక్కడ దేవాలయంలో ఆ సాయంత్రం కవితాప్రసాద్ ప్రసంగం. ప్రసంగానికి ముందు నేను పది నిముషాలు ప్రసంగించాను. ఆలయ ప్రాంగణంలో సభ. అక్కడ మల్లాది సూరిబాబు యువతీయువకులకు నెల రోజులుగా సంగీత పాఠాలు చెబుతున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధం. సభానంతరం మా రాము వచ్చి మమ్మల్ని కొలంబస్ తీసుకువెళ్ళాడు. ఫ్రీమాంట్ సభకు వ్యవధి 10 రోజులుంది. అక్కడే బస చేశాం. చికాగోలో శారదాపూర్ణ శొంఠి ఆహ్వానం మేరకు అన్నమయ్య రచనలపై ప్రసంగించి వారి ఆతిథ్యాన్ని దంపతులం స్వీకరించాం. సురేష్ మమ్మల్ని కలిసి చికాగో నగరమంతా చూపించటం విశేషం.

అనుకోని ఆతిథ్యం:

ఫ్రీమాంట్‌లో వంగూరి ఫౌండేషన్ సభలలో నా ప్రసంగము, నేను ప్రచురించిన అవధాన పద్మ సరోవర గ్రంథావిష్కరణలు జరిగాయి. ముందురోజు కొలంబస్ నుండి విమానంలో ఫ్రీమాంట్ వెళ్ళాం. అక్కడ సత్యనారాయణస్వామి ఆలయంలో మారేపల్లి వెంకటశాస్త్రి నా ప్రసంగం ఏర్పాటు చేశారు. భక్తి తత్వం గూర్చి, సత్యనారాయణ వ్రత మాహాత్యం గూర్చి ప్రసంగించాను. ఆ రోజు వెంకట శాస్త్రి గారి ఇంట్లో బస. ఎంతో ఆదరంగా ఆతిథ్యం ఇచ్చారు. గుడిలో ఒక వేద పండితులు శని, ఆదివారాలలో యువకులకు వేదం నేర్పించడం విశేషం.

సభలో

మా ఆవిడను కథారచయిత్రిని చేసిన వంగూరి:

వంగూరి వారి సభలలో బలభద్రపాత్రుని రమణి వ్రాసిన ఒక కథకు ముగింపు వ్రాయమని సభాసదులకు పోటీ పెట్టారు. రేపు ఉదయం ప్రతి ఒక్కరు ముగింపు వ్రాసుకు రావాలని నియమం పెట్టారు. నా శ్రీమతి శోభాదేవి ముగింపు వ్రాసి కథా రచనకు అరంగేట్రం చేసింది. ఆమె అన్నమాచార్య కీర్తనలపై రెండేళ్ళు సాంస్కృతిక శాఖ వారి ఫెలోషిప్‌లో పరిశోధన చేసి నాలుగు పుస్తకాలు ప్రచురించింది. చిట్టెన్‌రాజు సభాముఖంగా ఆమెను ప్రశంసించి వంద డాలర్లు బహుమతి ప్రకటించారు. ఆ సభలో నేను భిన్న ప్రాంతాలలో చేసిన అవధాన పద్యాల పుస్తకం గొల్లపూడి మారుతీరావు ఆవిష్కరించారు. గొల్లపూడి ఆత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా’ గూర్చి నేను 10 నిమిషాలు మాట్లాడాను.

శానోసేలో బస:

ఈ 40 రోజుల పర్యటనలో మా దంపతులకు ఎందరో మిత్రులు, బంధువులు ఆతిథ్య సత్కారాలు నిర్వహించారు. శానోసేలో రామబ్రహ్మం కుమార్తె యింటికీ, మిత్రులు విశ్వనాధం కుమారుడు జగన్నాధం, కుమార్తె గాయత్రి యిళ్ళకు వెళ్ళగలిగాము. అమెరికాలోని తెలుగువారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, అలవాట్లు బాగా గమనించాము. తెలుగుదనం మరిచిపోకుండా కాపాడుతున్నారు. ప్రతీ ఊళ్ళో ఒక ఆలయ సముదాయం కట్టి పూజలు నిర్వహిస్తున్నారు. మేము వేంకటేశ్వరుని సన్నిధి నుంచి వచ్చామని తెలిసి గౌరవంగా చూశారు. స్వామి సేవలు చూడలేకపోయామనే బాధ మా ఆవిడకి లేకుండా, ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఏదో ఉత్సవం జరిగేది. ప్రతి నెలా నాకు తిరుమలలో రెండు రోజులు ఏకాంత సేవ డ్యూటీ వుండేది. ఆ నెలలో తప్పిపోయిందనుకొని బాధపడుతుంటే లివర్‍మూర్ దేవాలయానికి మేము వెళ్ళిన సమయంలో ఏకాంత సేవ నిర్వహిస్తున్నారు. అక్కడ స్థిరపడ్డ యువకులలో చాలామందికి ఇండియా తిరిగి రావాలని ప్రగాఢ వాంఛ. ఇళ్ళూ,వాకిళ్ళు ఏర్పర్చుకొని స్థిరపడ్డారు. పిల్లల చదువులు, రాలేరు. వాళ్ళు మమ్మల్ని సలహా అడిగారు. “మీకు గల దేశాభిమానానికి సంతోషం” అన్నాం. మేము ఊబిలో దిగబడిన వారిలా బయటకు రాలేకపోతున్నామని కొందరు బాధపడ్డారు.

ఇరుక్కుపోయిన దంపతులం:

అమెరికా నుండి తిరుగు ప్రయాణానికి మూడు నెలల ముందే టికెట్లు ఇద్దరికీ బుక్ చేశాం. ఆటా సభలకు, వంగూరి సభలకు మధ్య వ్యవధి వుండడం వల్ల 25 రోజులు ఎక్కడో ఒకచోట బస చేయాల్సి వచ్చింది. బ్రంట్‌వుడ్‌లో మా ఆవిడ కజిన్ డా. చంద్ర, రమ దంపతులు స్థిరపడ్డారు. వారు తిరుపతి దర్శనాలకు – ఉదయాస్తమన సేవలకు – ఏటా వచ్చి మాకూ ఆ భాగ్యం కలిపించారు. ఆ 25 రోజులు బ్రంట్‌వుడ్‌లో వారి ఆతిథ్యం ఆనందదాయకం.

ఆ మూడు వారాలు ఆ చంద్ర మాకు గుడులు, గోపురాలు, పర్యాటక ప్రాంతాలు విస్తృతంగా కార్లో తిప్పి చూపాడు. దంపతులిద్దరూ సౌజన్యమూర్తులు. వారి వద్ద వుండగా ఒక షష్టిపూర్తి దంపతులు మాకు దంపతి సత్కారం చేశారు. గోల్డెన్ గేట్ వగైరా ప్రాంతాలు సందర్శించాం.

గుడిలో ఆబ్దికం:

మా వియ్యంకులు సత్యనారాయణ తమ్ముడు కృష్ణమూర్తి కంకార్డ్ (అమెరికా)లో స్థిరపడ్డారు. బ్రంట్‌వుడ్ నుండి వారి వద్దకు వెళ్ళి రెండు రోజులున్నాం. ఆగస్టు నెలలో శ్రావణ శుద్ధ షష్టి మా నాన్నగారి ఆబ్దికం. అక్కడ గుడిలోనే ఆ సంవత్సరం ‘మమ’ అనిపించాం.

చిన్నజియ్యర్ స్వామి వారి హస్తాలతో చిరు సత్కారం

40 రోజుల అమెరికా ప్రయాణం వింతలు, విశేషాలు, ఆప్యాయతలు, ఆదర సత్కారాలతో ఘనంగా పూర్తయింది. తిరుగుప్రయాణానికి శానోసే విమానాశ్రయానికి చేరుకొన్నాం. విమానం క్యాన్సిల్ అయింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో కనెక్టింగ్ విమానం. దిగాలు పడ్డాం. భగవదనుగ్రహంతో కొద్ది గంటల వ్యవధిలో మరో విమానం ఎక్కించారు. ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం మైళ్ళ పొడుగున వుంటుంది. చెన్నై వెళ్ళే విమానం అందుకోవడానికి పరుగులు తీసి గట్టెక్కి కూచొన్నాం. మరుసటి రోజు తెల్లవారు ఝామున 4 గంటలకు చెన్నై మీనంబాకం విమానాశ్రయం చేరుకొని మా బావమరిది పూర్ణచంద్రరావు ఇంటికెళ్ళి జె‌ట్ లాగ్ తీర్చుకొన్నాం. మర్నాడు తిరుపతి చేరుకొని డ్యూటీలకు యథావిధిగా అందుకొన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here