భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 27

0
3

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 27” వ్యాసంలో పెనుగొండ పరిసరాల లోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

పెనుగొండ

జులై 6వ తారీకు 2007. మేము దిగిన హోటల్‌లో రెస్టారెంట్ లేదు. ఎదురుగా బస్ స్టాండ్‌లో టిఫెన్ బాగుంటుందంటే ఉదయం 9 గంటలకి వెళ్ళి అక్కడ ఇడ్లీ తిన్నాము. 9-40 కి బస్ ఎక్కి వెనక్కి పెనుగొండ వచ్చాము. అక్కడ కోట చూడాలని మా ఉద్దేశం. ఆటోలో కోట దాకా చేరుకున్నాముగానీ కొండ పైకి ఎక్కలేక పోయాము, నిన్న గుత్తి అలసట ఇంకా తీరలేదు, కాళ్ళ నొప్పులు తగ్గలేదు.

కింద రాయలవారి మహల్ ఒకటి వున్నది. అక్కడ గైడ్ వున్నాడు. గైడ్‌ని తీసుకుని చిన్నదే కదాని అది చూశాము. అమ్మో మెట్లు ఎంత ఎత్తుగా వున్నాయో ఇదివరకు వాళ్ళు ఆ మెట్లు ఎలా ఎక్కి దిగేవాళ్ళో అనిపించింది. రాయలవారి వేసవి విడిదిగా దీనిని ఉపయోగించేవారుట. కొండమీద శిథిలాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వున్నాయట. గుత్తికొండకన్నా పెద్దదిట. ఎక్కలేమనుకుని వదిలేశాం. పేలస్ గురించి గైడ్ చాలా చెప్పారుగానీ నాకు అప్పుడీ రాతకోతల వుద్దేశం లేదు గనుక అన్నీ నోట్ చేసుకోలేదు.

అక్కడే కాళేశ్వరరావు అనే ఆయన చాలా అందంగా, ఆధునాతనంగా షిర్డీసాయి గుడి కట్టించారు. పొద్దున్నే దర్శకులను అదంతా చూడటానికి అనుమతిస్తారుట. మేము వెళ్ళినపుడు నో ఎంట్రీ అన్నారు. విదేశీయులు చాలామంది వచ్చి అక్కడే వుండి గుళ్ళోనే మెడిటేషన్ చేసుకుంటారుట. అందుకని వాళ్ళ ధ్యానానికి భంగం కలగకుండా దర్శకులను ప్రత్యేక సమయాల్లో మాత్రమే అనుమతిస్తారు. ఇది తర్వాత ఏదో గోలల్లో పడ్డట్లుంది. నేను పట్టించుకోలేదు.

తర్వాత కుంభకర్ణుడి గార్డెన్స్‌కి వెళ్ళాం. ఒక చిన్న తోటలో కుంభకర్ణుణ్ణి నిద్ర లేపే సీన్ విగ్రహాలు పెట్టారు. అందుకే దాని పేరు కుంభకర్ణుడి గార్డెన్ అయింది. చాలా పెద్ద విగ్రహం. ఆ తోట పక్కనే చిన్న ఆంజనేయస్వామి ఆలయం వుంటే దర్శంచుకున్నాం.

మధ్యాహ్నం 1 గంటకి బస్ స్టాండ్‌కి వచ్చి బస్ ఎక్కి 2-40కి హిందూపురం చేరుకున్నాము. అక్కడనుంచి ఆటోలో లేపాక్షి వెళ్ళి వచ్చాము. లేపాక్షి గురించి ఇదివరకే చెప్పానుగనుక ఇప్పుడు చెప్పటం లేదు.

అదే ఆటోలో సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి హిందూపురం హోటల్‌కి వచ్చాము. 7గంటలకి హైదరాబాద్ బస్‌కి రిజర్వు చేసుకున్నాము. దానిలో తిరిగి హైదరాబాద్.

ఇవి అనంతపురం జిల్లాలో మేము చూసిన ఆలయాలు. ఇంకా చాలా మిగిలిపోయి వుండవచ్చు. మాకు తెలిసినంత మటుకు చూశాము. దీనితో అనంతపురం జిల్లా యాత్ర ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here