[dropcap]క[/dropcap]నుల వర్షం కురుస్తున్నా
స్మృతుల జడిలో తడుస్తున్నా
కటిక శిలలా కదలవెందుకో
స్ఫటికమల్లే కరుగవెందుకో
కనురెప్పల మడతలలో
నిన్నలై కరిగిన క్షణాలు జలజలలో
కనుగవ జారి కదిలింది కాలమిలా
కలవరాన్ని మోసుకొచ్చివాలిన
సీతాకోకలా….
నిజంకాని మరీచికలా
నిలిచి కవ్విస్తుంటే
నీరెండలా
కదిలి నవ్వేస్తుంటే
అడుగులలో అడుగేస్తున్నట్టే
వెన్నంటే వస్తుంటే
కుదురుగావుండేది ..ఎలా ఎలా
నేటి నిజంలా
రేపటి ఆశలా
వాస్తవాల వాకిట కువకువ
వేకువ కిరణమై వాలవెందుకో యిలా..
మసకలైన మనసు అద్దం కాననంతదూరం
వెనుక్కి మరలిపోరాదా…కాదంటే
హాయి పల్లకిని మోసిన
అద్భుత క్షణాల బోయీవై
బతుకు మలుపులో
మళ్లీ తిరిగి రారాదా
దిక్కుల మధ్యన వేలాడే చుక్కల్లా
శిథిల జ్ఞాపకాలు సాక్షుల్లా మిగలిపోవాలా?
నాటి ఉల్లాసాలు చిమ్మిన
సల్లాపాల ఇంద్రధనస్సుపై
బాల్యక్రీడల సామీప్యానుభూతుల్లో
సజీవమైన సంభ్రమంలో
క్షణకాలం నిలిచిపో!