గొంతు విప్పిన గువ్వ – 18

38
3

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

తమసోమా జ్యోతిర్గమయా…

I am in the process of becoming the best version of myself…

ఇండియా వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా శ్రీశైలంలో బోళా శంకరుడి దర్శనం చేసుకోవటం ఆనవాయితీ.

నేను ఏ దేవాలయానికి వెళ్ళినా నా స్వార్థపు ప్రార్థనలు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్‌లో వుంటాయి..

అప్పట్లో నా ప్రార్థనల నిండా ఆయన, తమ్ముడు..

ఇప్పుడు ముందుగా అమ్మ, తరువాత పిల్లలు, ఆ పైన వాళ్ళ పిల్లలు.. 

ఇంకా ఆ పైన మనసుకు బాగా దగ్గరయిన ఎవరో ఒకరిద్దరు…

అంతకు మించి నాకు హృదయ వైశాల్యం లేదు.

స్వామివారి లింగం ముందు ఎక్కువసేపు నిలబడి విన్నపాలు చేసే అవకాశం వుండదు కనుక లైనులో వుండగానే కోరికల దండకం మొదలెట్టేస్తాను.

స్వామీ, అమ్మకు శతాయుః ప్రసాదించి జీవించి వున్నంత కాలం ఆనందంగా ఆరోగ్యంగా వుంచయ్యా. ఆయువు తీరినప్పుడు అమ్మకు సునాయాసమైన మరణం ప్రసాదించు తండ్రీ. నేను తన పక్కన లేనప్పుడు మటుకు తొందర పడకయ్యా…

పెద్దమ్మాయి మతాంతర వివాహానికి ప్రతిఫలంగా వాళ్ళకో కొంగ్రొత్త హైబ్రిడ్ పసిమొగ్గను ఇచ్చావు. వాళ్ళ కొత్త కాపురంలో కలతలు రేగకుండా నీ ముక్కంటితో కాయి శివయ్యా…

అమెరికాలో కోవిడ్ కేసులు కోట్లకు ఎగబ్రాకుతున్నాయి. మావారి గారాల బిడ్డ కుటుంబ సంరక్షణ భారం నీదేనయ్యా.

ఇంకేమున్నాయి నీ చల్లని చూపు ప్రసరించటానికి.

అన్నట్టు మరిచిపోయా…

నా మొద్దు బుర్రకు మంచి ఆలోచనలు తట్టి కలం పదును తేరేట్టుగా ఆశీర్వదించయ్యా.

ఇంకా…

ఇంకేముంటాయి… ఇంతవరకూ చాలులే.

అంతే.

గుట్టు చప్పుడు కాకుండా అవసరమైన వారికి నాకు తోచిన చిన్నా చితకా సాయం చేస్తా.. అది వేరే విషయం. కాని గర్భ గుడిలో భగవంతుని ముందు మోకరిల్లి ప్రార్థించే విషయంలో మటుకు నేను చాలా పీనాసిని.

ఎప్పుడూ నా, నా కుటుంబ పరిధిని ఒక్క అంగుళం కూడా దాటి పరోపకారపు ప్రార్థనలు చేయను. అసలు ఎవరైనా గర్భగుడిలో దేముని ముందు నిలబడి నా ఎదురింటి ఎల్లమ్మను చల్లగా చూడమని, పొరుగింటి పుల్లమ్మకు ఓ పాపను ప్రసాదించమని ఎలా ప్రార్థిస్తారో మరి..? అందుకు చాలా పెద్ద మనసు కావాలేమో. పైగా మరీ కోరికల చిట్టా పొడవైతే దేవుడు ఏమనుకుంటాడోనని నాకు కొంత మొహమాటం.

గుండెల మీద చెయ్యి వేసి చెప్పాలంటే నిజానికి నా కుటుంబ చట్రం దాటి కనీసం మొక్కుబడిగానైనా సర్వేజనాసుఖినోభవంతు అని ఆ భగవంతుని నా తోటి మానవుల శ్రేయస్సు కోసం ఎప్పుడూ మనసారా కాంక్షించింది లేదు.

నేనేనా ఇంత స్వార్థపరురాలిని. నాలా మరెవరైనా వుంటారా.

“నేనింకా ‘నా’ నుండి ‘మా’ వరకే రాలేదు ‘మన’ అనుకున్నప్పుడే కదా ముందడుగు” అన్నారు కాళోజీ.

నేను ‘మా’ లోనే పాతుకుపోయి వెనుక బడిపోయాను.

అయితే ఈ సందర్భంలో అంతా ‘మన’ అనుకునే ఓ సర్వ జన శ్రేయోభిలాషి గురించి ఇక్కడ చెప్పాలి.

అతను వృత్తిలో దంతవైద్యులు. ప్రవృత్తిలో సాహిత్య ప్రియులు.

‘సహృదయ’ సంస్థ సేవకులు, సాహిత్య వారధులు.

కె ఎల్వీ ప్రసాద్ నామధేయులు.

ఈ రోజుకీ నా రచన ఏదయినా ప్రచురణ అయినా, నా రచనలకు సంబంధించిన సమీక్ష ఏదయినా వచ్చినా, నేను నా ఆనందాన్ని పంచుకునే తొలి సహృదయ వ్యక్తి, సాహిత్య మిత్రులు వారే.

స్వయంగా తానొక మంచి రచయిత.

ముఖ్యంగా నా కథలు కవితలకు చక్కటి శీర్షికలను సూచిస్తారు. నేను చేసిన చాలా రచనలకు నామకరణం వారే చేసారు.

రెండేళ్ళ క్రితం ఒక సారి నేను రాసిన ఒక కవితకు స్పందన రూపంలో వారి పరిచయ భాగ్యం కలిగింది. వరుసగా నేను పోస్ట్ చేసిన కవితలు చదవటం, కమెంటటమే కాకుండా నా కవితలు పత్రికలలో ప్రచురణకి పంపించమని నాకు వివిధ పత్రికల అడ్రసులు, మెయిల్ ఐడిలు పంపేవారు.

వివిధ పత్రికల్లో అచ్చయిన నా కవితలకు, కథలకు ప్రోద్బలం వారిదే.

నేను ఎంతో కొంత బాగానే రాస్తానని మిత్రులంటారు. మరి నాకెందుకో నేను బాగా రాస్తానన్న నమ్మకం ఇప్పటికీ కుదరదు. హనుమంతునికి తన శక్తి తనకు తెలియనట్లు నా పైన నాకు నమ్మకం లేకపోవటమో లేక అద్భుతంగా రాయటమంటే ఏమిటో బాగా తెలిసుండటమో… ఏది ఏమైనప్పటికీ నేనింకా రచనా వ్యాసంగంలో తొలి దశలోనే వున్నానని నా ప్రగాఢ విశ్వాసం.

నేను ఏమి రాసినా వారు మటుకు ‘మహాద్భుతం’ అంటారు.

నా దృష్టిలో బాగా రాసే కొందరి రచనలను నా రచనలతో పోల్చి చూపించి నా రచనలు ఎంత పేలవంగా వున్నాయో చూడమంటాను నేను.

వారేమో ఓ మోస్తరుగా రాసే రైటర్ల రచనలు చూపించి నేనెంత ఉన్నతంగా రాస్తానో నిరూపించి ఉత్సాహపరుస్తుంటారు.

అసలైతే వారు పోలిక వద్దంటారు. అంతగా పోల్చుకోవాలనే దుగ్ధ ఎక్కువగా వుంటే తాటిచెట్ల పక్కన నిలబడి చిన్నబోయే కన్నా బోన్సాయ్ పక్కన నిలబడి గర్వపడమంటారు.

నేను నూటికి మేటి అయిన పది మందితో పోల్చుకుంటే తను మిగతా తొంభై మందితో పోల్చి నేను ప్రామాణికంగా చూపెట్టిన పదిమందిలో నేనున్నానని నాలో నమ్మకాన్ని పెంపొందిస్తుంటారు.

అయినా నేను కన్విన్స్ కాలేను. 

ఒక్కో సారి వారు నాపైనున్న వ్యక్తిగత అభిమానంతో నన్ను మెచ్చుకుంటున్నారేమోనని అపోహ పడుతుంటాను.

కాని వారు నన్ను మాత్రమే కాకుండా నాలాంటి చాలా మంది వర్ధమాన కవులను రచయితలను వయోలింగ భేదం లేకుండా వారి రచనలను ఆదరించి ప్రోత్సాహించటమే కాకుండా తనకున్న పలుకుబడితో పత్రికల వారికి ప్రచురణ కోసం నిస్వార్థంగా రెకమండ్ చేయటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ సాహిత్య రంగంలో పాతుకు పోయిన సీనియర్ల సపోర్టు లేనిదే త్వరగా రాణించలేరని ఈ మధ్యే నాకు అర్థమయ్యింది. అయితే ఏ లాభాపేక్ష లేకుండా నిష్ణాతులైన సీనియర్లు నిష్కల్మష హృదయంతో ఇతరులకు పుష్ ఇవ్వటం చాలా అరుదు.

నీ తవికను కవితగా రూపుదిద్దుతాను.. మరి నాకేమిటి

నీ కథకు మంచి కొస మెరుపునద్దుతాను.. మరి నాకేమిస్తావు

నా పత్రిక/వెబ్ పత్రికలో నీ రచన వేస్తాను.. మరి నువ్వేం చేస్తావు

నీ రచనా వ్యాసంగం పైన మంచి సమీక్ష రాస్తాను.. బదులుగా ఏం ఇస్తావు

ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఇక్కడందరిదీ “అయితే నాకేమిటట” వ్యవహారమే.

ముఖ్యంగా లేడీ రైటర్స్‌కి ఇది కత్తి మీద సామే. ఓ సాహితీవేత్త సాహచర్యమో, ఓ గురువుగారి కృపాకటాక్షమో, ఓ సహృదయ స్పాన్సరో, మంచి మిత్రులైన ఓ పత్రికానిర్వాహకులో వుంటే తప్ప స్వయంప్రభతో రాణించటం చాలా కష్టం.

ఇలాంటి సాహిత్య వాతావరణంలో పత్రికల వారితో తనకున్న సత్సంబంధాలను ఉపయోగించుకుని తనకన్నా బాగా రాస్తారని చెప్పి ఇతరుల రచనలను ప్రచురణ చేయించేందుకు శాయశక్తులా ప్రయత్నించే ప్రసాద్ గారు నాకెప్పుడూ అబ్బురమే.

నేను గమనించినది ఏమిటంటే ప్రసాద్ గారి ప్రొద్బల సహకారాలతో పైకెదిగిన కొందరు రచయితలు, కవులు వారిని తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోవటం.

ఆశ్చర్యంగా అందుకు వారు బాధపడరు.

“నా పరిధిలో నేను చేయగల సాయం చేసాను… వాళ్ళ ప్రతిభతో వాళ్ళు పైకి ఎగబ్రాకారు” అంటారు.

అలా కీర్తి శిఖరం అధిరోహించాక కనీస కృతజ్ఞత చూపనవసరం లేదా అన్నదే నా బాధ.

ఒక కవయిత్రి తొలి దశలో ప్రసాద్ గారి సలహా సంప్రదింపులతో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని సైతం అందుకుని ఆ తరువాత అసలు వారెవరో తెలియనట్లు ప్రవర్తించారని విన్నాను.

మరొకరు ప్రసాద్ గారి సాహిత్య సహాయం పొందీ వారు ఆహ్వానింపబడిన ఒక సాహిత్య సభలో కనీసం పలకరించకుండా అవమానించారని తెలిసింది.

ఇంకొకరు అక్షరాలు దిద్దించి సాహిత్య అరంగ్రేటం చేయించిన గురుతుల్యులైన వారిని పూర్తిగా మరిచి ఇప్పుడు మాటాడటమే మానేసారని తెలిసి జీర్ణించుకోవటం కష్టమైంది.

ఈ చేదు అనుభవాలను పాఠాలుగా గ్రహించకుండా ఇప్పటికీ వారు సాహిత్య సేవ పేరుతో ఇంకా ఇంకా వయోలింగ బేధం లేకుండా కొత్త రైటర్లకు తనదైన పద్దతిలో చేయూతనిస్తూ తోచిన సాయం చేస్తూనే వున్నారు.

ఈ సాహిత్య ప్రపంచంలో ఒకరిని చూసి ఒకరు అసూయ పడుతూ ఎవరినెలా తొక్కేయాలాని ఆలోచించే కుత్సిత బుద్ధుల మధ్య, ప్రతి రైటరును వివిధ పత్రికల ఎడిటర్లకు పరిచయం చేస్తూ తనకన్నా బాగా రాస్తారని చెప్పటంలో వారి హృదయ వైశాల్యం తెలుస్తుంది.

తాను రాస్తున్న పత్రికకే తనను మించిన మరో రైటరును పరిచయం చేసి తనకే పోటీని కొని తెచ్చుకోవటం వారి అమాయకత్వమో లేక వారి మితిమీరిన సాహిత్యాభిమానమో నాకిప్పటికీ అర్ధం కాదు. 

వారిని చూసైనా ఇప్పుడిక నన్ను నేను సవరించుకోవాలి.

సర్వేజనాసుఖినోభవంతు అని గొంతెత్తి మనసారా కోరుకోగలిగేంతగా నేను ఎదగాలి.

నాలోని చీకటిని తొలగించుకుని వెలుతురులోకి పయనించాలి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here