[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
భుజవన్ తరుచ్ఛాయాం యేషాం నిషేవ్య మహీజసాం జలధిరశనా మేదిన్యాసీదసావకుతోభయా।
స్మృతిమపి నతే యాన్తి క్ష్మాసా వినా యదనుగ్రహం ప్రకృతి మహతే కుర్మస్తస్మై నమః కవి స్మరణే॥
(కల్హణ రాజతరంగిణి, 46)
మహామహా రాజులు, ఎవరి భుజబలచ్ఛాయలో జలధివలయిత వసుమతీ చక్రము, తరుచ్ఛాయలో ఉన్నంత సుఖంగా, భద్రంగా ఉన్నదో, శత్రు రాజుల దాడుల భయం లేక ప్రశాంతంగా ఉందో, ఆ రాజులు కవుల ప్రశంస లభించకపోవటం వల్ల ఈనాడు విస్మృతిలో పడ్డారు. అంతటి అత్యద్భుతము, మహనీయము అయిన కవి శిల్పానికి నా నమస్కృతులు!
ఈ శ్లోకం కన్నా ముందు పలు శ్లోకాలలో కల్హణుడు కశ్మీరు గొప్పతనాన్ని, పవిత్రతను ప్రస్తావిస్తాడు. తన రచన కాల గణనకు ప్రాతిపదికను ఏర్పాటు చేస్తాడు. భారతీయ రచన సంప్రదాయాన్ని అనుసరిస్తూ సృష్టి ఆవిర్భావం నుంచీ కాలక్రమాన్ని ప్రస్తావిస్తాడు. భారతీయులకు చారిత్రక స్పృహ లేదని నమ్మేవారు, వాదించేవారు జాగ్రత్తగా గమనించి, అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది.
ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతం ప్రకారం కూడా ఈ విశ్వంలో ఏదైనా వస్తువు కానీ, సంఘటనను కానీ మనం గుర్తించాలంటే reference point కావాలి. స్థలం, కాలం లేనిదే వస్తువులను కానీ సంఘటనను గుర్తించలేము, ప్రస్తావించలేము. ఆ తరువాత దానికి నామం కావాలి, రూపం కావాలి. మనకు విశ్వావిర్భావానికి ‘బిగ్ బ్యాంగ్’ ఒక reference point. అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది , తరువాత ఏమి జరిగిందివంటివన్నీ ఆ ‘సంఘటన’ ఆధారంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. భారతీయ రచనలన్నింటిలోనూ అవి ఇతిహాసాలయినా, పురాణాలయినా, కావ్యాలయినా ఆరంభంలోనే ఈ reference point ఇవ్వటం తప్పనిసరిగా పాటించే సాంప్రదాయం.
‘కుమార సంభవం’ కావ్యం ఆధునిక ప్రమాణాల ప్రకారం చారిత్రక కావ్యం కాదు. అదొక పురాణం. మిథికల్ స్టోరీ. కానీ ఆరంభ శ్లోకంలోనే కవి జరుగుతున్న కథ స్థలాన్ని స్పష్టం చేస్తాడు.
అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజః।
‘ఉత్తరాన హిమాలయాలున్నాయి’ అంటూ ఆరంభమవుతుంది. స్థలం fix అయిపోయింది. కావ్యం ఆరంభమవుతుంది.
ఇది ఇతర కావ్యాలన్నింటిలోనూ గమనించవచ్చు.
‘వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణామ్‘
ఇది రఘువంశం ఆరంభ పరిచయ శ్లోకాలలో ఒకటి.
ఒకప్పుడు వైవస్వతుడి తనయుడు మనువు అనే మహనీయుడు ఉండేవాడు. అంటే ముందుగా స్థలమో, కాలమో లాంటి ఒక reference point ఇస్తూ కావ్యం ఆరంభించేవారు. ఇది కావ్యాన్ని అర్థం చేసుకోవటంలో, అధ్యయనం చేయటంలో ఉపయోగపడేది.
పురాణాలలో పలు సందర్భాలలో పొందుపరచిన ఖగోళ శాస్త్ర సంబంధిత అంశాలుకూడా అప్పటి కాలాన్ని గణించే వీలునిచ్చి మన పూర్వీకుల స్థల కాల స్పృహను చారిత్రిక దృక్పధాన్నీ ప్రదర్శిస్తాయి. ఇది ఆధునిక విజ్ఞానశాస్త్రానికి చెందిన కార్బన్ డేటింగ్ లాంటిది. ఇందులో ఒక ప్రాణిలోకానీ, పదార్ధంలోకానీ వున్న కార్బన్-14 పరిమాణాన్నిబట్టి అది ఎంత పాతదో లెక్కిస్తారు. భారతీయ ఖగోళ సమాచార ఆధారిత లెక్కలుకూడా ఇంతే వైజ్ఞానికం. తేడా అల్లా కార్బన్ డేటింగ్ ను మనం ఒప్పుకుంటాం. ఖగోళ విషయాలను కొట్టిపారేస్తాం. మనకు వైజ్ఞానిక, చారిత్రక దృక్పధం లేదని మనల్ని మనం తక్కువచేసుకుంటాం. నిజం కళ్ళెదుటే వున్నా వొప్పుకోం!
కల్హణుడు కూడా రాజతరంగిణిని సాంప్రదాయిక చారిత్రిక స్పృహ ప్రదర్శిస్తూ ఆరంభించాడు.
పురా సతీసరః కల్పారంభాత్రు ప్రభృతి భూరభూత్।
కుక్షౌ హిమాద్రేరణోభిః పూర్వా మన్వంతరణి షట్॥
అథ వైవస్వతీయే స్మిన్ ప్రాప్తే మన్వన్తరే సురాన్।
దృహిణో పేన్ద్ర రుద్రాదీనవతార్య ప్రజాసృజా॥
అత్యంత ప్రాచీన కాలంలో సతీ సరోవరం ఉండేది. భూమి కల్పారంభం నుంచి ఆరు మన్వంతరాల పర్యంతం ఇదంతా నీటిలో మునిగి ఉండేది. వైవస్వత మన్వంతరం ఆరంభంలో ప్రజాపతి కశ్యపుడు, దేవతలు దృహిణ, ఉపేంద్ర, రుద్ర, ఇంకా ఇతరులను భూమిపై అవతరింప చేశాడు.
కశ్మీరు ఆవిర్భావ సమయం తెలిసిపోయింది. ‘కల్పారంభం నుంచి ఆరు మన్వంతరాలు.’
ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేక కథన పద్ధతి ఉంటుంది. విశ్లేషకులు, విమర్శకులు ఈ స్థానిక ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ఆయా రచనలను విశ్లేషించాల్సి ఉంటుంది.
భారతదేశంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎంత ప్రత్యేకతను కలిగి ఉన్నదయినా, అన్ని ప్రత్యేకతలు ‘భారతీయ సంస్కృతి’ అన్న సముద్రంలో కలిసి పోతాయి. వాటి ఆవిర్భావం కూడా ఈ ‘భారతీయ సంస్కృతి’ అన్న భాండాగారం నుంచే.
భారతదేశంలో సంగీతం, సాహిత్యంతో సహా ప్రతి చర్య, ప్రతి పదం, ప్రతి కదలిక ఉద్దేశం భగవద్దర్శనమే. ముక్తి సాధననే. అందుకే ఇక్కడ ప్రతీదీ ఆధ్యాత్మిక భావనతో అలరారుతుంది. అది శృంగార రచన అయినా, రాజుల చరిత్ర అయినా, భౌగోళిక శాస్త్రం అయినా, రసాయన శాస్త్రం అయినా, వైద్యం అయినా, ఖగోళ, అంతరిక్ష శాస్త్రాలయినా ప్రతీదీ ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికతను చూసి, ఇది ‘పనికిరానిది’, ‘ఇది చరిత్ర కాదు’, ‘ఇది నా ప్రామాణికాలకు అనుగుణంగా లేదు కాబట్టి నేను ప్రామాణికంగా పరిగణించను’ అని అనటానికి వీలులేదు. అలా అంటే వారిది వైజ్ఞానిక దృక్పథం కాదు. అలాంటి అవైజ్ఞానిక దృక్పథంతో భారతీయ సాహిత్యాన్ని విశ్లేషించటంతో సమస్య వస్తుంది. రాజతరంగిణి రచన ఆరంభంలోనే కల్హణుడు తాను ఇతరులు రాసిన గాథలనే మళ్ళీ సరిచేసి రాస్తున్నానని ప్రకటించాడు. ఈ రాజతరంగిణి కావ్యంలో అలల్లాగా ఎగసిపడి అదృశ్యమయ్యే రాజుల గాథలు భవిష్యత్తులోని రాజులందరికీ గుణపాఠాలు చెప్పగలదని, వారి బాధలను, విషాదాలను మాన్పే ఔషధంలా ఉపయోగపడగలదని స్పష్టం చేశాడు. క్షణభంగురమైన ప్రాణుల జీవితాల గురించి చదివిన తరువాత వ్యక్తుల హృదయాలలో మిగిలేది ‘శాంతరసమే’ అని బల్ల గుద్ది మరీ చెప్పాడు. అంటే రాజతరంగిణి రచించటం వల్ల జీవితం క్షణభంగురం అన్న ఆలోచన వస్తుందన్న మాట. అది రావాలన్నదే కవి ఆశయం.
చరిత్ర అన్నది రాజులు ఎప్పుడు పుట్టారు? ఏం చేశారు? ఏమేం కట్టించారు? ఎవరిని ఓడించారు? ఎలా చచ్చారు? ఏ వంశం ఎంతకాలం పాలించింది? ఏ వంశం తర్వాత ఏ వంశం రాజ్యానికి వచ్చింది? చెప్పాలన్నది ఆధునిక చరిత్రకారుల ఉద్దేశం. కానీ ఇవన్నీ మానవ జీవితాన్ని అంకెలకూ, సంఖ్యలకూ కుదించివేస్తాయి. ప్రాణంలేని విగ్రహంగా చరిత్రను మనముందు నిలుపుతాయి. చరిత్రలోని జీవం తొలగించిన తరువాత మిగిలిన ‘మమ్మీ’ లాంటిది ఈ చరిత్ర. చరిత్రను ఒక సామాన్య పరిజ్ఞానం ‘General Knowledge’ స్థాయికి దించి వేస్తున్నామన్న మాట.
భారతీయుల ఉద్దేశంలో చరిత్ర జీవం లేని అంకెలు, సంఖ్యలు కాదు. చరిత్ర జీవంతో తొణికిసలాడే మానవ సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అభివృద్ధి గాథ.
“All works of history are interim reports” అంటాడు అమెరికన్ చరిత్రకారుడు జాన్ నోబుల్ విల్‌ఫోర్డ్. ఇది పాశ్చాత్య దృక్పథం.
అయిదవ శతాబ్ది గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ తన పుస్తకారంభంలోనే “This is the publication of the researches of Herodotus of Halicarnassus, in order that the actions of men may not be affected by time” అని చెప్పాడు. అయిదవ శతాబ్ది పాశ్చాత్య చరిత్రకారులకు ఆధునిక చరిత్రకారులకు ‘చరిత్ర’ ఉద్దేశంలో ఎంతో తేడా వచ్చింది. పురాతన కాలం వారికి చరిత్ర ‘మానవ కార్యకలాపాలను కాలం తుడిపివేయకుండా భావి తరాలకు అందిస్తుంది’. అందువల్ల వారు ప్రాచీనుల పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఆధునిక చరిత్రకారుల చరిత్ర ఒక ‘నివేదిక’. ఒక రిపోర్టు. జీవంలేని రిపోర్టు. కానీ భారతీయులకు చరిత్ర ఒక రిపోర్టు కాదు. పొరపాట్ల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం కాదు. భారతీయులకు చరిత్ర ఒక సజీవ నది. జగతి నిర్మాణంలో భగవంతుడి ప్రణాళికను గ్రహించి, తద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవటం, చేరుకోవటం. ఈ లక్ష్యంతోనే భారతీయ జీవన విధానం నిర్మితమైంది. సాహిత్యం కూడా దీనిలో భాగం. అందుకే కల్హణుడు జీవితంలోని ‘క్షణభంగురత్వం’ గ్రహించి శాంతిరస ప్రాధాన్యం గ్రహించాలంటున్నాడు. తన రచనను రాజతరంగిణి అన్నాడు.
అధికారం, ఐశ్వర్యం, పదవులు, పొగడ్తలు అన్నీ అశాశ్వతాలు. ఈనాడు రాజ్యాధికారిగా ఉండి శాసించినవాడు రేపు బికారీలా మిగిలిపోవచ్చు. ఈరోజు ఎందుకూ పనికిరానివాడిగా కనిపించినవాడు రేపు సమాజోద్ధారకుడై అందరి మన్ననలందుకోవచ్చు. ఏది ఏమైవా ప్రపంచ రచనలో ప్రణాళిక ఉంది. జీవన గమనం కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను అనుసరిస్తుంది. మానవ జీవిత అధ్యయనం ద్వారా సాహిత్యం ఈ సూత్రాలను (ఋతం) ఆవిష్కరించి, భావితరాలకు అందిస్తుంది. అందుకే భారతీయులకు చరిత్ర ఒక రిపోర్టు కాదు. నిర్జీవమైన తేదీలు, శిలా ఫలకాలు కాదు. చరిత్ర అంటే మానవ జీవితం కాబట్టి, అందులోని సుఖదుఃఖాలు, ఆశలు, నిరాశలు, అద్భుతాలు, అయోమయాలు, అత్యున్నతము, అతి నీచము అన్నీ కలసి ఉంటాయి. వీటన్నిటినీ వర్ణిస్తూ ప్రపంచగతిని,జగతి రీతిని స్ఫురింపచేయటం ద్వారా వ్యక్తిలోని ఆధ్యాత్మిక భావనలు జాగృతం చేసేది,అవగాహన కలిగించేది చరిత్ర. అందుకే మన చరిత్ర రచనలు పాశ్చాత్యుల ప్రామాణికాలలోకి ఒదగవు. తమదైన స్వతంత్ర ప్రతిపత్తితో అలరాలుతూ మార్గదర్శనం చేస్తూంటాయి. ఇలా చరిత్రను సజీవం చేసి భావితరాలకు అందించేవాడు కవి.
కల్హణుడికి 52 మంది రాజుల వివరాలు దొరకలేదు. ఎందుకంటే వారిని కవులు సజీవంగా భావితరాల ముందు నిలపలేదు. ఆ రాజులు గొప్పవారయి ఉంటారు. ఎన్నెన్నో ధార్మిక కార్యాలు చేసి ఉంటారు. ప్రజలను చల్లగా పాలించి ఉంటారు. వారి పాలనలో భూమి సుఖంగా ఉండి ఉంటుంది. ‘భూమి’ అంటే భూమిపై ఉన్న ప్రజలు. లేదా వారు మహా ధూర్తులయి ఉంటారు. ప్రజలను బాధపెట్టి ఉంటారు. వారి చర్యలకు భూమి ఎంతగానో కష్టపడి ఉంటుంది. అందుకే అలాంటివారి గురించి రాసి తమ కావ్యాన్ని అమలినపరుచుకోలేదేమో కవులు! లేదా, వారు రాసిన కావ్యాలు మిగలకూడదని భగవంతుడు వాటిని నశింపజేశాడేమో! ఫలితంగా ఆ రాజులు, వారి చరిత్ర, వారి వంశాలు విస్మృతిలో పడ్డాయి! ఇక్కడ కవి గొప్పతనం తెలుస్తోంది అని ఆ గొప్పతనానికి వందనాలు అర్పిస్తున్నాడు కల్హణుడు.
మనిషికి తన జీవితం అశాశ్వతం అని తెలుసు. కానీ ఈ అశాశ్వతంలోనే శాశ్వతత్వం సాధించాలని ఆరాటపడతాడు. చిరంజీవిగా మిగలాలని తపన పడతాడు. దీనికి కొందరు తపస్సును ఆశ్రయిస్తే, మరికొందరు కళను ఆశ్రయిస్తారు. ఒక మానసికశాస్త్ర సిద్ధాంతం ప్రకారం ‘కళాసృజన’ మనిషిలోని శాశ్వతత్వ సాధన వాంఛ ఫలితం. గోడలపై బొమ్మలు గీయటం అనే ఆదిమానవుడి చర్య నుంచి సినిమాలు, రికార్డు బుక్కులు, ఫోటోలు, చిత్రపటాలు భద్రపరచటం, చిప్పులలో సమాచారం నిక్షిప్తం చేసి అంతరిక్షంలోకి వదలటం వంటివన్నీ మానవుడిలోని ఈ ‘చిరంజీవత్వ’ సాధన తపన ఫలితాలే. ఇది భారతీయులకు తెలుసు. అందుకే కావ్యాల ద్వారా వారు ప్రాచీన గాథలను సజీవంగా అందించారు. కవులతో పాటు వారు ఎవరి గురించి రాశారో, వారినీ చిరంజీవులను చేశారు. మర్త్యులను అమరులు చేయగల అద్భుత కళాకౌశలానికి నీరాజనాలర్పిస్తున్నాడు. కవుల ఈ గొప్ప నైపుణ్యం కల్హణుడు అర్థం చేసుకొని, నీరాజనాలు అర్పిస్తున్నాడు. రాజతరంగిణి రచన ద్వారా తానీ వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక బాధ్యతను నెరవేరుస్తున్నడనీ తెలుసు. అందుకే ఈ శ్లోకాల తరువాత రచించినవి పరమాద్భుతమైన శ్లోకాలు. మనం పాఠ్యపుస్తకాలలో చదువుకునే, 1818లో ‘షెల్లీ’ రాసిన ‘ఒజిమాండియస్’ని తలదన్నే శ్లోకాలు. వాటి గురించి వచ్చే వారం.
(ఇంకా ఉంది)